వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఉగ్రవాదానికి వంతపాడుతున్న పాకిస్తాన్‌కు అమెరికా మరోమారు హెచ్చరికలు జారీచేసింది. పాక్‌కు ఏటా భారీగా ఇస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12.66 వేల కోట్లు) భద్రతా సాయంలో కోతతోపాటుగా మిలటరీ సామగ్రి సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అఫ్గానిస్తాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో సహా పలు ఉగ్రవాద సంస్థలను అడ్డుకోవటంలో, పాక్‌లో వారి స్థావరాలను నిర్వీర్యం చేయటంలో విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు్ల ప్రకటించింది. అమెరికా కోరుకుంటున్నట్లు ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటే సాయం మళ్లీ మొదలవుతుందని సూచించింది. అయితే.. అమెరికా, అంతర్జాతీయ సమాజం కోరుకున్నట్లే వ్యవహరిస్తున్నామని పాక్ పేర్కొంది. భద్రత సాయం నిలుపుదలపై అమెరికా ప్రభుత్వాధికారులతో మాట్లాడుతున్నామని వెల్లడించింది.
అలా చేస్తే మళ్లీ సాయం: అమెరికా
‘మేం పాకిస్తాన్‌కు జాతీయ భద్రత సాయాన్ని నిలిపివేస్తున్నాం. పాక్ ప్రభుత్వం అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకోనంతకాలం ఇది కొనసాగుతుంది. ఈ ఉగ్రవాద సంస్థలు అమెరికన్లను లక్ష్యంగా చేసుకోవటంతోపాటు దక్షిణాసియా ప్రాంతంలో అశాంతి చెలరేగేందుకు కారణమవుతున్నారు. అందుకే వీరిని నిర్వీర్యం చేయటంలో విఫలమవుతున్న పాక్‌కు మేం భద్రతాపరమైన సాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హీతర్ నార్ట్ పేర్కొన్నారు. ఈ నిధుల నిలుపుదలలో .. 2016 సంవత్సరానికి విదేశీ మిలటరీ నిధి రూపంలో ఇవ్వాలనుకున్న 225 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,425 కోట్లు), 2017 సంవత్సరానికి సంకీర్ణ మద్దతు నిధి రూపంలో ఇవ్వాలనుకున్న 900 మిలియన్ డాలర్ల (రూ.5.7వేల కోట్లు) సాయం ఉన్నాయి.
అమెరికా నిర్ణయాన్ని గౌరవించనంతకాలం పాకిస్తాన్‌కు మిలటరీ పరికరాలను, సంబంధింత నిధులనూ నిలిపేస్తున్నట్లు ఆమె తెలిపారు. ‘ట్రంప్ కొంతకాలంగా దీనిపై స్పష్టమైన సూచనలు చేస్తున్నారు. టిల్లర్‌సన్, మాటిస్‌లు పాక్ ప్రభుత్వాన్ని కలిసి మరీ తమ ఆందోళన తెలియజేశారు. ఇది శాశ్వతంగా సాయాన్ని నిలిపేయటం కాదు. మేం చెప్పినట్లు చేస్తే (ఉగ్రవాదంపై చర్యలు) నిలిపేసిన సాయం మళ్లీ వారికే అందుతుంది’ అని నార్ట్ స్పష్టం చేశారు. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను విడుదల చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికీ.. తాజాగా సాయం నిలిపివేతకు ఎటువంటి సంబంధం లేదని కూడా నార్ట్ ప్రకటించారు.
మేం చేయాల్సింది చేస్తున్నాం: పాక్
‘అస్పష్ట లక్ష్యాలు, ఏకపక్ష నిర్ణయాల వల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోలేము’ అని అమెరికా తీరుపై పాకిస్తాన్ అసంతృప్తిని తెలియజేసింది. తాజా నిర్ణయాల నేపథ్యంలో భద్రతాపరమైన సాయంపై అమెరికా అధికారులతో మాట్లాడుతున్నట్లు పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ సమాజం, అమెరికా భద్రత ప్రయోజనాలకు అనుగుణంగానే పాకిస్తాన్ వ్యవహరిస్తోందని.. ఉగ్రవాదంపై పోరును కొనసాగిస్తోందని ప్రకటించింది. ‘అల్‌కాయిదా సహా ఇతర ఉగ్రవాద గ్రూపులను నిర్వీర్యం చేయటంలో అమెరికాకు సాయం చేశాం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవటంలో, అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య రాజకీయ పరిస్థితులు నెలకొనేలా చొరవతీసుకున్నాం’ అని పాక్ పేర్కొంది. అమెరికా 15 ఏళ్లుగా పాకిస్తాన్‌కు ఏటా భారీ స్థాయిలో భద్రతా సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.
మిలటరీ సాయం నిలిపేస్తున్నాం
Published Sat, Jan 6 2018 1:27 AM | Last Updated on Thu, Apr 4 2019 3:49 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment