military aid
-
రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం
సియోల్: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం చేస్తోంది. ఇప్పటికే 1,500 మంది సైనికులను రష్యాకు పంపిందని దక్షిణ కొరియా నిఘా సంస్థ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసు (ఎన్ఐఎస్) శుక్రవారం వెల్లడించింది. స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్‌కు చెందిన 1,500 సైనికులను ఈనెల 8 నుంచి 13 వరకు రష్యాకు పంపిందని తెలిపింది. రష్యా తీరప్రాంత నగరం వ్లాదివోస్టోక్‌కు వీరు చేరుకున్నారని పేర్కొంది. ఉత్తరకొరియా సైనికులకు రష్యా సైనిక దుస్తులను ఇచ్చారని, ఆయుధాలను అందజేశారని, నకిలీ ధ్రువపత్రాలను సమకూ ర్చారని ఎన్ఐఎస్ వెల్లడించింది. ఉత్తర కొరి యా మరింత మంది సైనికులను రష్యాకు పంపనుందని వివరించింది. నిఘా సమాచా రం మేరకు 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొననున్నట్లు తనకు తెలిసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించడం గమనార్హం. ఉత్తరకొరియా మొత్తం 12 వేల మందిని కదనరంగానికి పంపనుందని దక్షిణకొరియా మీడియా తెలిపింది. ఉత్తరకొరియా చోంగ్జిన్ పోర్టులో రష్యా నావికాదళం నౌకలు మొహరించడం, ఉసురియిస్క్, ఖబరోస్క్లలో ఉత్తరకొరియా సైనికులు గుమిగూడిన ఉపగ్రహ చిత్రాలను ఎన్ఐఎస్ తమ వెబ్సైట్లో పొందుపర్చింది. విదేశీయుద్ధంలో ఉత్తరకొరియా నేరుగా పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాల్లో ఉత్తరకొరియా ఒకటి. మొత్తం 12 లక్షల మంది సైన్యం ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కింగ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల్లో దేనిపై దాడి జరిగినా.. మరో దేశం సైనికంగా సాయపడాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యోల్ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భద్రతపై సమీక్షించారు. అంతర్జాతీయ సమాజం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు చేరొచ్చు: జెలెన్స్కీబ్రస్సెల్స్: పదివేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా సైన్యంలో చేరవచ్చని తమకు నిఘా సమాచారం ఉందని ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. వీరిని రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో మొహరించనున్నారని తెలిపారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధంలో మూడోదేశం జోక్యం చేసుకుంటే అది ప్రపంచయుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. -
హమాస్, లెబనాన్‌తో యుద్ధం.. ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం!
జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తున్న వేళ ఇజ్రాయెల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మిలటరీలో పని చేస్తున్న ప్రతీ పురుషుడు మూడేళ్ల పాటు పని చేయాలన్న నిబంధనను తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సెక్యూరిటీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు వార్త సంస్థ వైనెట్ కథనంలో తెలిపింది.కాగా, ఓ వైపు హమాస్, మరోవైపు లెబనాన్ దాడులు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు ప్రతీ పురుషుడు 34 నెలల పాటు తప్పనిసరిగా మిలటరీలో పని చేయాలన్న నిబంధన ఉండగా.. దీన్ని మూడేళ్లకు పెంచినట్లు సమాచారం. ఈ మేరకు సెక్యూరిటీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక, తాజా నిబంధనలు మరో ఎనిమిదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉంది. సెక్యూరిటీ కేబినెట్ నిర్ణయాలను ఆదివారం నిర్వహించబోయే పూర్తిస్థాయి కేబినెట్ సమావేశంలో ఓటింగ్‌కు పెట్టనున్నారు.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్.. హమాస్, లెబనాన్‌పై ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తే మిలటరీ ఎక్కువ సంఖ్యలో ఉండాలన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ పూర్తి మద్దతు ఉంది. వారిని ఎదుర్కోవాలంటే కచ్చితంగా భారీ సంఖ్యలో సైన్యం ఉండాలి. అందుకే ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. హమాస్‌తో యుద్ధంలో తాము దాదాపుగా విజయానికి చేరువైనట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఉక్రెయిన్‌కు మరో విడత అమెరికా మిలటరీ సాయం
వాషింగ్టన్: ఉక్రెయిన్ ఈశాన్య ప్రాంతంలోని ఖర్కీవ్‌పై రష్యా తీవ్రస్థాయిలో దాడులకు తెగబడుతోంది. శుక్రవారం రష్యా జరిపిన దాడుల్లో రైలు పట్టాలు, రైల్వే ఆస్తులు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అమెరికా మరో విడత సైనిక సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.‘‘తమ దేశం కోసం ధైర్యం వహిస్తున్న ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా ఆయుధాలు, సామాగ్రి అందించడానికి అమెరికా మరో విడత సైనిక సాయాన్ని ఉక్రెయిన్ అందించనున్నట్లు ప్రకటించింది. రష్యా దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు 275 మిలియన్ డాలర్ల సైనిక సామాగ్రి సాయం అందించనున్నాం. ఇంతకు ముందు విడుదల చేసని మలిటరీ సాయం యుద్ధ రంగంలో ఉపయోగిస్తున్నారు. తాజాగా ప్రకటించిన మిలిటరీ సాయం సాధ్యమైనంత తొందరగా అందజేస్తాం’’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తెలిపారు.గత నెల ప్రకటించిన 61 బిలియన్ డాలర్ల మిలటరీ సాయం అందటంలో ఆలస్యం కావటంతో ఉక్రెయిన్ సైన్యం యుద్ధభూమిలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రష్యా దాడుల నేపథ్యంలో ఖర్కీవ్ ప్రాంతంలోని చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా రష్యా దాడుల్లో భవనాలు కూడా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 10 నుంచి ఖర్కీవ్ ప్రాంతంపై రష్యా విరుచుకుపతున్న విషయం తెలిసిందే. రష్యా దాడులను నుంచి తప్పించుకోవడానికి అప్పటి నుంచి 11 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంతో కుదేలైన ఉక్రెయిన్‌కు శుక్రవారం రష్యా చేసిన దాడుల్లో.. రైల్వే నెట్వర్క్ ధ్వంసంతో మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. గురువారం జరిగిన రష్యా దాడుల్లో సైతం ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. -
రగులుతున్న క్యాంపస్‌లు!
గాజాలో ఇజ్రాయెల్ అమానుష హత్యాకాండ మొదలైనప్పటినుంచీ అమెరికన్ విద్యాసంస్థల్లో అలుముకున్న అశాంతి ఈ వారం తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న విశ్వవిద్యా లయాలు విద్యార్థి ఉద్యమాలతో అట్టుడుకుతున్నాయి. వియత్నాంను వల్లకాడు చేస్తున్న అమెరికా సైనిక దురాక్రమణకు వ్యతిరేకంగా 1968లో తిరుగుబాటు జెండా ఎగరేసిన విద్యార్థుల పోరాటాన్నీ, 1980ల్లో దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం నెల్సన్ మండేలాను దీర్ఘకాలం చెరసాలలో బంధించటాన్ని నిరసిస్తూ సాగిన ఉద్యమాలనూ గుర్తుచేస్తున్నాయి. అప్పటిమాదిరే ఈ ఉద్యమాలు అట్లాంటిక్ మహా సముద్రం ఆవలితీరాల్లోని యూనివర్సిటీ క్యాంపస్‌లకు సైతం విస్తరించాయి.ఫ్రాన్స్, బ్రిటన్ తదితర దేశాల్లో మాత్రమేకాదు... పశ్చిమాసియాలోని బీరూట్, కువైట్, లెబనాన్, ట్యునీ సియా యూనివర్సిటీలు కూడా రగులుతున్నాయి. లాఠీచార్జిలు, బాష్పవాయు గోళాలు ఎవరినీ భయపెట్టడం లేదు. వేలాదిమంది విద్యార్థులను అరెస్టుచేస్తూ ఉద్యమాలను చల్లార్చాలని పోలీసులు ప్రయత్నిస్తున్నా సాగటం లేదు. వీటి తీవ్రత పెరుగుతున్నదే తప్ప తగ్గటం లేదు. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి ప్రవచనాలు చెప్పే అమెరికా తన క్యాంపస్‌లను ప్రస్తుతం పోలీసు శిబిరాలుగా మార్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200మంది పౌరులను కాల్చిచంపి, దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిన ఉదంతాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరూ తీవ్రంగా ఖండించారు. స్వతంత్ర పాలస్తీనా కోసం సాగుతున్న ఉద్యమాలను ఇలాంటి దుందుడుకు చర్యలు బలహీనపరుస్తాయని హెచ్చరించారు. దాన్ని సాకుగా తీసుకుని ఇజ్రాయెల్ గత ఆర్నెల్లుగా సాగిస్తున్న మారణహోమం తక్కువేమీ కాదు. ఇంతవరకూ 35,000మంది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ సైనిక దళాల దాడుల్లో మరణించారని చెబుతున్నారు.ఇందులో అత్యధికులు నిరాయుధులైన స్త్రీలు, పిల్లలే. చివరికి బాంబుదాడుల్లో శిథిలమైన జనావా సాల్లో బాధితులకు అండగా నిలబడుతున్న ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను సైతం ఇజ్రాయెల్ సైన్యం వదిలిపెట్టడం లేదు. కావాలని ఉద్దేశపూర్వకంగా వారిని కాల్చిచంపుతూ పాలస్తీనా పౌరులకు బాసటగా నిలబడాలన్న సంకల్పంతో వచ్చేవారిని భయభ్రాంతుల్ని చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోపక్క అనేకమంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టా మని చెప్పుకుంటోంది. ఇజ్రాయెల్‌కు ఎడాపెడా మారణాయుధాలు సరఫరా చేస్తూ, భద్రతామండలి వంటి అంతర్జా తీయ వేదికలపై అది సాగిస్తున్న నరమేథాన్ని నిలువరించే అన్ని రకాల ప్రయత్నాలకూ మోకా లడ్డుతూ మద్దతుగా నిలబడుతున్న అమెరికా అప్పుడప్పుడు కోమానుంచి నిద్రలేచిన రోగి మాదిరిగా శాంతి వచనాలు వల్లిస్తోంది. ఇది సబబేనా? నిరాయుధ సాధారణ పౌరులను కాల్చిచంపటం ప్రపంచమంతా మౌనంగా వీక్షిస్తూ ఉండాల్సిందేనా? ఈ ప్రశ్నలే విశ్వవిద్యాలయాల విద్యా ర్థులను కలవరపరిచాయి. తాము మూగసాక్షులుగా మిగిలిపోలేమంటూ ఆ విద్యార్థులు గొంతెత్తటం వెనకున్న నేపథ్యం ఇదే. జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ఏంజెలస్ (యూసీఎల్ఏ), కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వగైరా ఉన్నతశ్రేణి విద్యాసంస్థలు నినాదాలతో మార్మోగుతున్నాయి. పేరెన్నికగన్న హార్వర్డ్, బర్క్లీ, యేల్ వర్సిటీలు సైతం రణక్షేత్రాలయ్యాయి. అమెరికా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నాయి. ఈ విశ్వవిద్యాల యాలు సాధారణమైనవి కాదు. పేరెన్నికగన్న ప్రపంచశ్రేణి సంస్థలు. ఉదాహరణకు యూసీఎల్ఏ 16 మంది నోబెల్ బహుమతి గ్రహీతలను తయారుచేసింది. ఆ సంస్థనుంచి ఇంతవరకూ 15 మంది మెక్ఆర్థర్ ఫెలోషిప్లను అందుకున్నారు. అసాధారణ ప్రతిభాపాటవాలున్నవారికి ఈ ఫెలోషిప్‌లు ఇస్తారు. ఇక్కడి పట్టభద్రుల్లో క్రీడల్లో రాణించి ఒలింపిక్స్‌లో పతకాలు అందుకున్నవారెందరో! ఎన్నో దేశాలు అందుకునే పతకాల సంఖ్యతో పోలిస్తే ఈ యూనివర్సిటీ పట్టభద్రులు సాధించే పతకాలే ఎక్కువంటారు. ఇలాంటిచోట చదువుకునే పిల్లలు సమాజ పరిణామాలపట్ల ఇంతగా కలవరపడటం బహుశా మన దేశంలో చాలామందిని ఆశ్చర్యపరిచి వుండొచ్చు. విద్యార్థి ఉద్యమ కేంద్రాలుగా ముద్రపడిన ఢిల్లీలోని జేఎన్‌యూ, జమియా మిలియా, కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సి టీలను ఛీత్కరించటం అలవాటు చేసుకున్న మర్యాదస్తులకు ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయాల వర్త మాన పోకడలు మింగుడుపడకపోవచ్చు. అయోమయానికి గురిచేయవచ్చు. కానీ అమెరికా తదితర దేశాల విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు ఎప్పుడూ ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తూనే వున్నాయి. ఇప్పుడు సాగుతున్న విద్యార్థి ఉద్యమాలతో ప్రొఫెసర్లు సైతం గొంతు కలపటం, అరెస్టుకావటం యాదృచ్ఛికం కాదు. ఈ నిరసనలను యూదు వ్యతిరేక ఆందోళనలుగా చిత్రించి అధికారుల, రిపబ్లి కన్ పార్టీ శ్రేణుల ప్రాపకంతో పోటీ ఉద్యమాలను నిర్వహిస్తున్న విద్యార్థులు లేక పోలేదు. పాలస్తీనా సంఘీభావ ఉద్యమకారులపై వారు దాడులకు కూడా వెనకాడటం లేదు. ఇది విచారకరం.పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగుతూ ఎవరూ చూడటంలేదని భ్రమపడుతుంది. అమెరికా ప్రభుత్వం ఈ ధోరణిని విరమించుకోవాలి. తన ఆయుధ పరిశ్రమ లాభార్జనకు తోడ్పడుతున్నా యన్న ఏకైక కారణంతో ఇజ్రాయెల్, ఉక్రెయిన్ తదితర దేశాలకు అమెరికా భారీగా సైనిక సాయం అందించటం అనైతికం, అమానుషం. విద్యార్థి ఉద్యమాలు పంపుతున్న సందేశాన్ని సక్రమంగా అర్థం చేసుకుని ప్రపంచశాంతికి దోహదపడటం అగ్రరాజ్యంగా తన బాధ్యతని ఇప్పటికైనా ఆ దేశం గుర్తించాలి. లేకుంటే మున్ముందు ఈ ఉద్యమాలు మరింత విస్తరిస్తాయి. -
USA: ఉక్రెయిన్ను $250 మిలియన్ల మిలిటరీ సాయం
రష్యా-ఉక్రెయిన్ మధ్య 673 రోజుల నుంచి యుద్ధ వాతావరణం కొనసాగుతునే ఉంది. ఈ క్రమంలో మరోసారి అగ్రరాజ్యం అమెరికా తన భాగస్వామ్య దేశమైన ఉక్రెయిన్‌కు $250 మిలియన్ డాలర్ల మిలిటరీ ఆర్థిక సాయం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు, పలు రక్షణ పరికరాలు ఈ ప్యాకేజీ ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఏడాది ఉక్రెయిన్‌కు ఆమెరికా అందించే చివరి మిలటరీ సాయమని వైట్‌హౌజ్ వర్గాలు పేర్కొన్నాయి. ‘తమ భాగస్వామ్య దేశమైన ఉక్రెయిన్ స్వాతంత్రం, స్వేచ్ఛ కోసం రష్యాతో పోరాడుతోంది. ఈ సమయంలో తాము ఉక్రెయిన్‌కు సాయం అందిస్తున్నాం’ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఓ ప్రకటనలో తెలిపారు. తమ దేశ భద్రతలో భాగంగా ఉక్రెయిన్ దేశ భావిష్యత్తును దృష్టితో పెట్టుకొని మిలటరీ ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. 2022 ఫిబ్రవరి ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అప్పటీ నుంచి ఉక్రెయిన్‌కు ఆమెరికా సుమారు $44.3 బిలియన్ డాలర్ల మిలిటరీ ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. చదవండి: Russia-Ukraine Conflict: పుతిన్ పిలిచారు.. ఉక్రెయిన్ సంక్షోభానికి తెర పడ్డట్లేనా? -
ఉక్రెయిన్‌కు జర్మనీ భారీ సాయం
బెర్లిన్: ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు, విమాన విధ్వంసక వ్యవస్థలు, మందుగుండు సామగ్రి సహా సుమారు రూ.24 వేల కోట్ల విలువైన అదనపు సైనిక సాయం అందించాలని జర్మనీ నిర్ణయించింది. ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో తాము నిజాయితీతో ఉన్నామని రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ తెలిపారు. రష్యాతో యుద్ధం మొదలయ్యాక మొట్ట మొదటిసారిగా జెలెన్స్కీ ఆదివారం జర్మనీకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే జర్మనీ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం. రష్యా ఇంధనంపై ఆధారపడిన జర్మనీని ఉక్రెయిన్ మొదటి నుంచి అనుమానిస్తోంది. అయితే, ఎంజెలా మెర్కెల్ స్థానంలో ఒలాఫ్ షోల్జ్ చాన్సెలర్‌గా బాధ్యతలు చేపట్టాక ఉక్రెయిన్–జర్మనీల మధ్య సంబంధాలు బలపడుతూ వస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. -
Ukraine-Russia war: మాకు మరిన్ని ఆయుధాలు కావాలి
బ్రస్సెల్స్: రష్యాను ఎదుర్కొనేందుకు తమకు మరింత సైనిక సాయం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొమిదిర్ జెలెన్స్కీ కోరారు. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కలిసి యూరప్ బద్దవ్యతిరేకి అయిన రష్యాతో తలపడుతున్నాయని చెప్పారు. గురువారం ఆయన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని ఈయూ పార్లమెంట్‌నుద్దేశించి ప్రసంగించారు. ‘మనం కలిసి ఉన్నంత కాలం, మన యూరప్‌ను కాపాడుకున్నంత కాలం, మన యూరప్ జీవన విధానాన్ని పరిరక్షించుకున్నంత కాలం యూరప్ యూరప్‌గానే నిలిచి ఉంటుంది’అని జెలెన్స్కీ చెప్పారు. యూరప్ జీవన విధానాన్ని నాశనం చేయాలని రష్యా కోరుకుంటోంది. కానీ, మనం అలా జరగనివ్వరాదు’అని చెప్పారు. అంతకుముందు ఈయూ ప్రతినిధులు ఆయనకు పార్లమెంట్ భవనంలోకి ఘనంగా స్వాగతం పలికారు. ప్రసంగం పూర్తయిన అనంతరం, ప్రొటోకాల్ ప్రకారం ఉక్రెయిన్ జాతీయ గీతం, యూరోపియన్ గీతం వినిపించారు. ఆ సమయంలో జెలెన్స్కీ ఈయూ జెండాను చేబూనారు. అనంతరం యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు రొబెర్టా మెట్సోలా మాట్లాడుతూ.. లాంగ్ రేంజ్ క్షిపణి వ్యవస్థలను, యుద్ధవిమానాలను సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్‌కు అందించే విషయం పరిశీలించాలని సభ్య దేశాలను కోరారు. ఉక్రెయిన్‌కు రష్యాతో ఉన్న ముప్పునకు తగ్గట్లే చర్యలుండాలని సూచించారు. ఇది ఉక్రెయిన్ అస్తిత్వానికి సంబంధించిన విషయమన్నారు. ఈనెల 24వ తేదీతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి ఏడాదవుతోంది. ఈ సందర్భంగా దాడులను మరో విడత తీవ్రతరం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అదనపు సైనిక సాయం కోసం జెలెన్స్కీ మిత్ర దేశాల్లో పర్యటనలు చేస్తున్నారు. అంతకుముందు ఫ్రాన్సు పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు మేక్రాన్ ఆయన్ను లీజియన్ ఆఫ్ హానర్‌తో సన్మానించారు. బ్రస్సెల్స్‌లో ఈయూకు చెందిన 27 దేశాల నేతలతో జెలెన్స్కీ సమావేశమయ్యారు. -
ఉక్రెయిన్‌కు అమెరికా 375 కోట్ల డాలర్ల సాయం
వాషింగ్టన్: రష్యా దండయాత్రతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి భారీ సాయం ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 375 కోట్ల డాలర్ల మిలటరీ సాయాన్ని అందిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి టోని బ్లింకెన్ శుక్రవారం వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ నుంచి వెను వెంటనే 285 కోట్ల డాలర్ల మిలటరీ సాయం అందుతుందని చెప్పారు. విదేశాంగ శాఖ నుంచి అందే 22.5 కోట్ల డాలర్లు ఉక్రెయిన్ మిలటరీ ఆధునీకరణకు, దీర్ఘకాలంలో ఆ దేశం సాయుధ సంపత్తి పెంచుకోవడానికి కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ సారి అందించే సాయంతో ఇప్పటివరకు అమెరికా ఉక్రెయిన్ చేసిన సాయం 2 వేల కోట్లకు పైగా డాలర్లకు చేరుకుంది. అమెరికా ఈ స్థాయిలో ఏ దేశానికి ఇప్పటివరకు సాయం అందించలేదు. ఉక్రెయిన్‌కు తొలిసారిగా 50 ఎం2–ఏ2 బ్రాడ్లీ సాయుధ వాహనాలను అందిస్తోంది. ఈ సాయుధ వాహనాల్లో పదాతిదళ బెటాలియన్‌కు పూర్తి స్థాయి రక్షణ కవచాలు , యాంటీ ట్యాంకు క్షిపణులు, 2,50,000 రౌండ్ల 25ఎంఎం మారణాయుధాలు ఉంటాయని పెంటగాన్ వెల్లడించింది. అంతేకాకుండా 100ఎం–113 సాయుధ సిబ్బందిని తీసుకువెళ్లే వాహనాలు, 50 మైన్–రెసిస్టెంట్స్, మెరుపుదాడుల్ని ఎదుర్కొనే వాహనాలు కూడా ఉంటాయని వివరించింది. -
జో బైడెన్‌తో జెలెన్స్కీ భేటీ.. భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన అమెరికా
వాషింగ్టన్: ఉక్రెయిన్‌కు అమెరికా మరో భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించింది. 180 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం అందజేయనుంది. ఇందులో ఒక బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, 800 మిలియన్ డాలర్ల నిధులున్నాయి. పేట్రియాట్ క్షిపణులు, ఉక్రెయిన్ యుద్ధ విమానాల కోసం అత్యంత కచ్చితత్వంతో కూడిన గైడెడ్ బాంబులను తొలిసారిగా ఉక్రెయిన్‌కు ఇవ్వనుంది. ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు ముమ్మరం చేస్తోంది. డ్రోన్లు ప్రయోగిస్తోంది. వాటిని తిప్పికొట్టడానికే కొత్త ఆయుధాలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం అమెరికాకు చేరుకున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత జెలెన్స్కీ మరో దేశంలో అధికారికంగా పర్యటిస్తుండడం ఇదే తొలిసారి. -
జెలెన్స్కీ తీరుపై బైడెన్ అసహనం.. అత్యాశకు పోతే అంతే!
వాషింగ్టన్: రష్యా దాడిని తప్పుపడుతూ ఎప్పటికప్పుడూ ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్‌కు అడగక ముందే ఆర్థికంగా, ఆయుధాల సాయం అందించారు. అలాంటిది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరుపై జో బైడెన్ అసహనం వ్యక్తం చేశారంటే నమ్ముతారా? అది నిజమే.. జో బైడెన్ అసహనం వ్యక్తం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జూన్‌లో ఇరువురి మధ్య ఫోన్ సంభాషణ నడుస్తుండగా ఆయుధాల విషయంపై బైడెన్ అసహనం వ్యక్తం చేసినట్లు ఎన్బీసీ న్యూస్ సోమవారం వెల్లడించింది. జూన్ 15వ తేదీన 1 బిలియన్ డాలర్ల మానవీయ, సైనిక సాయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడికి బైడెన్ ఫోన్ చేశారు. ఈ క్రమంలో బైడెన్ వివరాలు చెప్పటం ముగించాక.. ఉక్రెయిన్‌కు ఇంకా కావాల్సిన ఆయుధాల జాబితాను జెలెన్స్కీ చెప్పటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అసహనానికి గురైన బైడెన్ స్వరం పెంచి.. ‘కొంచెం కృతజ్ఞత చూపించండి’ అని వ్యాఖ్యానించారు. అయితే, అలాంటిదేమి లేదని బుకాయించేప్రయత్నం చేశారు జెలెన్స్కీ. సాయం చేసినందుకు బైడెన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియో సందేశాన్ని పంపారు. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ రిపోర్టు ప్రకారం.. 2022లో అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు ఉక్రెయిన్‌కు వచ్చాయి. అమెరికా ఇచ్చిన ఆయుధాల్లో హైమొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్స్, స్టింగర్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్, జావెలిన్ క్షిపణులు, ఎం-17 హెలికాప్టర్లు ఉన్నట్లు పెంటగాన్ నివేదికలు చెబుతున్నాయి. ఇదీ చదవండి: ఉక్రెయిన్ ఎఫెక్ట్: వికీపీడియాకు భారీ జరిమానా -
Russia-Ukraine War: ఉక్రెయిన్ వెన్నంటే..
కీవ్: ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తామని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, రొమేనియా అధినేతలు మరోసారి స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ వెంటే ఉంటామని ఉద్ఘాటించారు. వారు గురువారం అనూహ్యంగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈయూలో చేరాలన్న ఉక్రెయిన్‌కు ఆకాంక్షకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ ఉజ్వల భవిష్యత్తు కోసం తాము చేయాల్సిందంతా చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ హామీ ఇచ్చారు. నాలుగు దేశాల అధినేతలు తొలుత రైల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకున్నారు. శివారులోని ఇర్పిన్లో పర్యటించారు. రష్యా దాడుల్లో ఇర్పిన్లో జరిగిన విధ్వంసాన్ని చూసి చలించిపోయారు. రష్యా రాక్షసకాండను ఎవరూ మర్చిపోలేరని జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి యూరప్ దేశాలు సాయం అందిస్తాయని ఇటలీ అధినేత మారియో డ్రాఘీ చెప్పారు. ఈ మానవీయ విషాదాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదని రొమేనియా అధ్యక్షుడు క్లౌస్ ఐయోహన్నిస్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కీవ్‌లో నేతలు హోటల్లో ఉండగా బయట ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించడం గమనార్హం. వారి పర్యటనతో నైతిక స్థైర్యం పెరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. యుద్ధక్షేత్రం సెవెరోడొనెట్స్క్ డోన్బాస్లోని సెవెరోడొనెట్స్క్ సిటీ వద్ద భీకర పోరు సాగుతోంది. నగరాన్ని 90 శాతం రష్యా సేనలు ఆక్రమించాయి. అజోట్ కెమికల్ ప్లాంట్‌లో 500 మంది పౌరులు, ఉక్రెయిన్ సైనికులు తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి అందుతున్న ఆయుధాలు, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం దాడులు సాగిస్తోంది. మరోవైపు పశ్చిమ లెవివ్‌లో జొలోచివ్ శివారులో నాటో దేశాలు సరఫరా చేసిన ఆయుధాల డిపోను లాంగ్–రేంజ్ క్షిపణులతో ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ ప్రకటించారు. రెండేళ్ల దాకా ఉక్రెయిన్ ఉంటుందా? కేవలం ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకోవడమే తమ లక్ష్యం కాదని, ఒకదేశంగా ఉక్రెయిన్ను పూర్తిగా తెరమరుగు చేయాలన్నదే అసలు ఉద్దేశమని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ చెప్పారు. పశ్చిమ దేశాల నుంచి సహజ వాయువు కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలని ఉక్రెయిన్ కోరుకోవడం, రెండేళ్లలో డబ్బు చెల్లించాలని భావిస్తుండడంపై మెద్వెదేవ్ స్పందించారు. రెండేళ్లలో ప్రపంచ పటంపై ఉక్రెయిన్ ఉంటుందని ఎవరు చెప్పగలరని ప్రశ్నించారు. మరిన్ని ఆయుధాలు: నాటో ఉక్రెయిన్‌కు సైనిక సాయం విషయంలో రష్యా హెచ్చరికలను నాటో దేశాలు లెక్కచేయడం లేదు. మరిన్ని లాంగ్–రేంజ్ ఆయుధాలు అందజేస్తామని తాజాగా ప్రకటించాయి. అదనంగా బిలియన్ డాలర్ల సైనిక సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అదనపు సాయానికి జర్మనీ కూడా అంగీకారం తెలిపింది. యుద్ధ రంగంలో తమ సేనలు వీరోచితంగా పోరాడుతున్నాయని జెలెన్స్కీ ప్రశంసించారు. 112 రోజులుగా సాగుతున్న యుద్ధంలో శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంటున్నాయని చెప్పారు. -
Russia Ukraine war: అమెరికా భారీ ‘సైనిక’ సాయం!
వాషింగ్టన్: రష్యాపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి భారీ స్థాయిలో సాయం అందనుంది. 1 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సాయం చేసేందుకు అమెరికా సిద్ధమైంది. శతఘ్నులు, మందుగుండు సామగ్రి, తీరప్రాంత రక్షణ వ్యవస్థలు ఇలా పలు విధాల సైనికఅవసరాలు అమెరికా తీర్చనుంది. మరోవైపు, నాటో కూటమి పంపిన ఆయుధాలు ఉంచిన ఆయుధాగారంపై రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. పశ్చిమ ఉక్రెయిన్‌లోని లివివ్ ప్రాంతంలోని ఆయుధాగారాన్ని నేలమట్టంచేశామని రష్యా తెలిపింది. కాగా, సివిరోడోనెట్సŠక్లో ఇరుదేశాల పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కార బాధ్యతలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. బుధవారం ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో సంభాషించారు. అయితే, ఉక్రెయిన్, రష్యాలకు చైనా మధ్యవర్తిత్వం వహిస్తుందా లేదా అనేది జిన్‌పింగ్ చెప్పలేదు. మరోవైపు ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆ దేశంలో పర్యటిస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చెప్పారు. కీవ్‌లో పర్యటించాల్సిన సమయం ఆసన్నమైందని రొమేనియాలో మీడియాతో అన్నారు. కాగా, రష్యాలో తమ వ్యాపారాన్ని తగ్గించుకుంటామని ఐకియా సంస్థ తెలిపింది. కాగా, యుద్ధం కారణంగా ఈ సీజన్లో 24 లక్షల హెక్టార్లలో పంటలు పండించబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. -
Russia- Ukraine war: కీలక దశలో దేశ రక్షణ!
రష్యా దురాక్రమణ నుంచి తన దేశాన్ని రక్షించుకోవడం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో అమెరికా మరింత సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ పార్లమెంట్‌నుంచి కొందరు సభ్యుల బృందం అమెరికాను సందర్శించి మరింత సహాయం అందించాలని కోరింది. తమకు మరిన్ని ఆయుధాలు, ఆర్థిక సాయం అవసరమని పేర్కొంది. ఇదే విషయాన్ని అమెరికా అధిపతి బైడెన్‌కు జెలెన్స్కీ నేరుగా వెల్లడించారు. తాము స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామని, తమకు సాయం కోరే హక్కు ఉందని ఆయన తాజాగా విడుదల చేసిన వీడియోలో చెప్పారు. కీవ్‌లోని అధ్యక్ష కార్యాలయం వెలుపల రాత్రి సమయంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. యుద్ధం మొదలై ఐదువారాలు ముగుస్తున్నవేళ ఉక్రెయిన్ నుంచి దాదాపు 40 లక్షలమంది విదేశాలకు శరణార్ధులుగా తరలిపోయినట్లు ఐరాస అంచనా వేసింది. రూబుల్స్‌లో వద్దు రష్యా గ్యాస్‌కు యూరోపియన్ కంపెనీలు రూబుల్స్‌లో చెల్లించాల్సిన అవసరం లేదని రష్యా నుంచి హామీ పొందినట్లు జర్మనీ తెలిపింది. తమ వద్ద గ్యాస్ కొనుగోళ్లను రూబుల్స్‌లో జరపాలని ఇటీవల రష్యా అల్టిమేటం జారీ చేయడం యూరప్ దేశాల్లో కలకలం సృష్టించింది. మరోవైపు ఈ ఏడాది చివరకు రష్యా దిగుమతులపై ఆధారపడడాన్ని ఆపివేస్తామని పోలండ్ ప్రకటించింది. టర్కీలో జరిగిన చర్చల్లో కొంత పురోగతి కనిపించినా రష్యా, జెలెన్స్కీ ప్రకటనలతో సంధిపై ఆశలు అడుగంటాయి. తమపై రష్యా దాడి కొనసాగిస్తూనే ఉందని కీవ్ తదితర నగరాల మేయర్లు ఆరోపించారు. ఉక్రెయిన్ ఇంధన డిపోలను, స్పెషల్ ఫోర్స్ కేంద్రకార్యాలయాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. రష్యా సైనికులు ఆజ్ఞలు పాటించడం లేదు! ఉక్రెయిన్‌లోకి పంపిన రష్యా సైనికులు తమకిచ్చిన ఆజ్ఞలు పాటించేందుకు తిరస్కరిస్తున్నారని బ్రిటన్ ఇంటెలిజెన్స్ చీఫ్ జెరెమీ ఫ్లెమింగ్ చెప్పారు. పై అధికారుల మాట వినకపోవడమే కాకుండా సొంత ఆయుధాలనే ధ్వంసం చేస్తున్నారని, ఈ ప్రక్రియలో అనుకోకుండా ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా కూల్చేశారని గురువారం జెరెమీ చెప్పారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణను పుతిన్ తక్కువగా అంచనా వేశారని ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రజల నుంచి ఇంత ప్రతిఘటన వస్తుందని పుతిన్ ఊహించలేదని, ఆంక్షల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులను అంచనా వేయలేదని, సొంత మిలటరీ శక్తిని ఎక్కువగా అంచనా వేసుకొని వేగంగా విజయం సాధిస్తామని భావించారని చెప్పారు. ప్రస్తుతం రష్యా సైనికులు నైతిక స్థైర్యం కోల్పోయి ఆజ్ఞలు తిరస్కరిస్తున్నారన్నారు. -
పాక్‌పై మళ్లీ భగ్గుమన్న ట్రంప్
వాషింగ్టన్ : పాకిస్తాన్‌కు అందిస్తున్న భారీ సైనిక సాయాన్ని నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్ధించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్తాన్ చేసిందేమీలేదని దుయ్యబట్టారు. పాక్ ప్రభుత్వం తమ భూభాగంలో అల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ నివసించేందుకు సహకరించిందని ట్రంప్ ఆరోపించారు. పాక్‌లో లాడెన్ తలదాచుకున్న నివాసం ఎలాంటిదో మీకు తెలుసని ఫాక్స్ న్యూస్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. 2011లో అమెరికన్ నావల్ స్పెషల్ వార్ఫేర్ దళాలు 2011లో హెలికాఫ్టర్ దాడుల్లో లాడెన్ నివాసాన్ని చుట్టుముట్టి ఆయనను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్లో సైనిక అకాడమీ పక్కనే లాడెన్ నివసించారన్నది పాక్‌లో ప్రతిఒక్కరికీ తెలుసన్నారు. పాకిస్తాన్‌కు తాము ఏటా వందల కోట్ల డాలర్ల నిధులు ఇచ్చామని, అయినా పాక్ అమెరికాకు ఎంతమాత్రం సహకరించకుండా లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిందని మండిపడ్డారు. పాక్ దుశ్చర్యలతో ఆ దేశానికి సైనిక సాయం నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. గత ఏడాది ఆగస్ట్‌లో ట్రంప్ దక్షిణాసియా విధానం వెల్లడించిన అనంతరం అమెరికా, పాక్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. -
అమెరికా మిత్ర దేశం కాదు!
వాషింగ్టన్: అమెరికా ఇక తమకు ఎంతమాత్రం మిత్రదేశం కాదని పాకిస్తాన్ తేల్చిచెప్పింది. మిత్రదేశంగా వ్యవహరించాల్సిన తీరు ఇది కాదంటూ అగ్రరాజ్యాన్ని ఘాటుగా విమర్శించింది. ఉగ్ర స్థావరాల నిర్మూలనలో విఫలమైందంటూ పాక్‌కు అమెరికా సైనిక సాయం నిలిపివేసిన నేపథ్యంలో పాక్ స్పందించింది. ప్రముఖ దినపత్రిక ‘వాల్ స్ట్రీట్ జర్నల్’తో పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా అసిఫ్ మాట్లాడుతూ.. అమెరికాతో మైత్రి ముగింపు దశకు చేరుకుందన్నారు. ‘మా మధ్య ఎలాంటి సత్సంబంధాలు లేవు. మిత్ర దేశాలు ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదు’ అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలకు విరుద్ధంగా... అమెరికాతో స్నేహ సంబంధాలు కొనసాగుతాయని పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జంజువా పేర్కొనడం గమనార్హం. దక్షిణాసియాపై తీవ్ర ప్రభావం చూపగల అగ్రదేశం కావడంతో అమెరికాతో వీలైనంత వరకూ సత్సంబంధాలు కొనసాగించాలన్నదే పాకిస్తాన్ అభిమతమన్నారు. పాక్‌లోని ఉగ్ర స్థావరాల్ని నిర్మూలించేలా.. ఆ దేశాన్ని మిత్ర దేశమైన చైనా ఒప్పించగలదని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. ఉగ్ర సంస్థలపై ఉక్కుపాదం మోపడం చైనా జాతీయ విధానమైందున.. ఆ దేశం స్పందించాలని వైట్‌హౌస్ అధికారి సూచించారు. పాక్ లో ఉగ్ర స్థావరాల ధ్వంసంతో దక్షిణాసియాలో సుస్థిరత సాధ్యమవుతుందన్నారు. -
మిలటరీ సాయం నిలిపేస్తున్నాం
వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఉగ్రవాదానికి వంతపాడుతున్న పాకిస్తాన్‌కు అమెరికా మరోమారు హెచ్చరికలు జారీచేసింది. పాక్‌కు ఏటా భారీగా ఇస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12.66 వేల కోట్లు) భద్రతా సాయంలో కోతతోపాటుగా మిలటరీ సామగ్రి సరఫరాను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. అఫ్గానిస్తాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో సహా పలు ఉగ్రవాద సంస్థలను అడ్డుకోవటంలో, పాక్‌లో వారి స్థావరాలను నిర్వీర్యం చేయటంలో విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు్ల ప్రకటించింది. అమెరికా కోరుకుంటున్నట్లు ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటే సాయం మళ్లీ మొదలవుతుందని సూచించింది. అయితే.. అమెరికా, అంతర్జాతీయ సమాజం కోరుకున్నట్లే వ్యవహరిస్తున్నామని పాక్ పేర్కొంది. భద్రత సాయం నిలుపుదలపై అమెరికా ప్రభుత్వాధికారులతో మాట్లాడుతున్నామని వెల్లడించింది. అలా చేస్తే మళ్లీ సాయం: అమెరికా ‘మేం పాకిస్తాన్‌కు జాతీయ భద్రత సాయాన్ని నిలిపివేస్తున్నాం. పాక్ ప్రభుత్వం అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకోనంతకాలం ఇది కొనసాగుతుంది. ఈ ఉగ్రవాద సంస్థలు అమెరికన్లను లక్ష్యంగా చేసుకోవటంతోపాటు దక్షిణాసియా ప్రాంతంలో అశాంతి చెలరేగేందుకు కారణమవుతున్నారు. అందుకే వీరిని నిర్వీర్యం చేయటంలో విఫలమవుతున్న పాక్‌కు మేం భద్రతాపరమైన సాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హీతర్ నార్ట్ పేర్కొన్నారు. ఈ నిధుల నిలుపుదలలో .. 2016 సంవత్సరానికి విదేశీ మిలటరీ నిధి రూపంలో ఇవ్వాలనుకున్న 225 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,425 కోట్లు), 2017 సంవత్సరానికి సంకీర్ణ మద్దతు నిధి రూపంలో ఇవ్వాలనుకున్న 900 మిలియన్ డాలర్ల (రూ.5.7వేల కోట్లు) సాయం ఉన్నాయి. అమెరికా నిర్ణయాన్ని గౌరవించనంతకాలం పాకిస్తాన్‌కు మిలటరీ పరికరాలను, సంబంధింత నిధులనూ నిలిపేస్తున్నట్లు ఆమె తెలిపారు. ‘ట్రంప్ కొంతకాలంగా దీనిపై స్పష్టమైన సూచనలు చేస్తున్నారు. టిల్లర్సన్, మాటిస్‌లు పాక్ ప్రభుత్వాన్ని కలిసి మరీ తమ ఆందోళన తెలియజేశారు. ఇది శాశ్వతంగా సాయాన్ని నిలిపేయటం కాదు. మేం చెప్పినట్లు చేస్తే (ఉగ్రవాదంపై చర్యలు) నిలిపేసిన సాయం మళ్లీ వారికే అందుతుంది’ అని నార్ట్ స్పష్టం చేశారు. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను విడుదల చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికీ.. తాజాగా సాయం నిలిపివేతకు ఎటువంటి సంబంధం లేదని కూడా నార్ట్ ప్రకటించారు. మేం చేయాల్సింది చేస్తున్నాం: పాక్ ‘అస్పష్ట లక్ష్యాలు, ఏకపక్ష నిర్ణయాల వల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోలేము’ అని అమెరికా తీరుపై పాకిస్తాన్ అసంతృప్తిని తెలియజేసింది. తాజా నిర్ణయాల నేపథ్యంలో భద్రతాపరమైన సాయంపై అమెరికా అధికారులతో మాట్లాడుతున్నట్లు పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ సమాజం, అమెరికా భద్రత ప్రయోజనాలకు అనుగుణంగానే పాకిస్తాన్ వ్యవహరిస్తోందని.. ఉగ్రవాదంపై పోరును కొనసాగిస్తోందని ప్రకటించింది. ‘అల్‌కాయిదా సహా ఇతర ఉగ్రవాద గ్రూపులను నిర్వీర్యం చేయటంలో అమెరికాకు సాయం చేశాం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవటంలో, అఫ్గాన్‌లో ప్రజాస్వామ్య రాజకీయ పరిస్థితులు నెలకొనేలా చొరవతీసుకున్నాం’ అని పాక్ పేర్కొంది. అమెరికా 15 ఏళ్లుగా పాకిస్తాన్‌కు ఏటా భారీ స్థాయిలో భద్రతా సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. -
పాకిస్తాన్‌కు అమెరికా ఝలక్
వాషింగ్టన్: ఉగ్రవాదంపై పోరు కోసం పాకిస్తాన్‌కు అందిస్తున్న నిధుల్లో కోత విధించాలని ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. సంకీర్ణ కూటమి నిధుల్లో(సీఎస్ఎఫ్) 100 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.645 కోట్లు) మేర కోత విధించాలని నిర్ణయించింది. తదుపరి ఆర్థిక సంవత్సరం 900 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.5,800 కోట్లు)కు బదులు 800 మిలియన్ డాలర్ల(దాదాపు 5,160 కోట్లు)ను మాత్రమే ఇవ్వాలని బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఉగ్రవాదంపై పోరాడే మిత్రపక్ష దేశాలకు అమెరికా ప్రభుత్వం కొన్నేళ్లుగా సాయమందిస్తూ వస్తోంది. అలా అమెరికా నుంచి సాయం పొందుతున్న దేశాల్లో పాక్ ముందు వరుసలో ఉంది. 2002 నుంచి ఇప్పటివరకూ పాక్‌కు అమెరికా 14 బిలియన్ డాలర్లు(రూ.90 లక్షల కోట్లు) అందజేసింది. అయితే గత రెండు సంవత్సరాల్లో యూఎస్ కాంగ్రెస్ ఈ నిధులపై పలు ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో పలు దేశాలకు అందిస్తున్న సాయంలో ట్రంప్ సర్కార్ కోత విధిస్తోంది. కాగా, అమెరికా రక్షణ విభాగ ప్రతినిధి(పాక్, అప్ఘానిస్తాన్, మధ్య ఆసియా) ఆడమ్ స్టంప్ మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ పాక్‌కు సీఎస్ఎఫ్ నిధి కింద 800 మిలియన్ డాలర్లు అందించాలని ప్రతిపాదనలు రూపొందించినట్లు చెప్పారు.