ఇప్పటికే 1,500 మంది సైనికులను పంపిన ఉత్తర కొరియా
మొత్తం 12 వేల మందిని పంపొచ్చని అంచనా
సియోల్: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం చేస్తోంది. ఇప్పటికే 1,500 మంది సైనికులను రష్యాకు పంపిందని దక్షిణ కొరియా నిఘా సంస్థ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసు (ఎన్‌ఐఎస్) శుక్రవారం వెల్లడించింది. స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్‌కు చెందిన 1,500 సైనికులను ఈనెల 8 నుంచి 13 వరకు రష్యాకు పంపిందని తెలిపింది.
రష్యా తీరప్రాంత నగరం వ్లాదివోస్టోక్‌కు వీరు చేరుకున్నారని పేర్కొంది. ఉత్తరకొరియా సైనికులకు రష్యా సైనిక దుస్తులను ఇచ్చారని, ఆయుధాలను అందజేశారని, నకిలీ ధ్రువపత్రాలను సమకూ ర్చారని ఎన్‌ఐఎస్ వెల్లడించింది. ఉత్తర కొరి యా మరింత మంది సైనికులను రష్యాకు పంపనుందని వివరించింది. నిఘా సమాచా రం మేరకు 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొననున్నట్లు తనకు తెలిసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురువారం ప్రకటించడం గమనార్హం.
ఉత్తరకొరియా మొత్తం 12 వేల మందిని కదనరంగానికి పంపనుందని దక్షిణకొరియా మీడియా తెలిపింది. ఉత్తరకొరియా చోంగ్‌జిన్ పోర్టులో రష్యా నావికాదళం నౌకలు మొహరించడం, ఉసురియిస్క్, ఖబరోస్క్‌లలో ఉత్తరకొరియా సైనికులు గుమిగూడిన ఉపగ్రహ చిత్రాలను ఎన్‌ఐఎస్ తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. విదేశీయుద్ధంలో ఉత్తరకొరియా నేరుగా పాల్గొనడం ఇదే తొలిసారి.
ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాల్లో ఉత్తరకొరియా ఒకటి. మొత్తం 12 లక్షల మంది సైన్యం ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కింగ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల్లో దేనిపై దాడి జరిగినా.. మరో దేశం సైనికంగా సాయపడాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యోల్ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భద్రతపై సమీక్షించారు. అంతర్జాతీయ సమాజం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు చేరొచ్చు: జెలెన్‌స్కీ
బ్రస్సెల్స్: పదివేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా సైన్యంలో చేరవచ్చని తమకు నిఘా సమాచారం ఉందని ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. వీరిని రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో మొహరించనున్నారని తెలిపారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధంలో మూడోదేశం జోక్యం చేసుకుంటే అది ప్రపంచయుద్ధంగా మారుతుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment