Special Operations Group
-
రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం
సియోల్: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం చేస్తోంది. ఇప్పటికే 1,500 మంది సైనికులను రష్యాకు పంపిందని దక్షిణ కొరియా నిఘా సంస్థ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసు (ఎన్ఐఎస్) శుక్రవారం వెల్లడించింది. స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్‌కు చెందిన 1,500 సైనికులను ఈనెల 8 నుంచి 13 వరకు రష్యాకు పంపిందని తెలిపింది. రష్యా తీరప్రాంత నగరం వ్లాదివోస్టోక్‌కు వీరు చేరుకున్నారని పేర్కొంది. ఉత్తరకొరియా సైనికులకు రష్యా సైనిక దుస్తులను ఇచ్చారని, ఆయుధాలను అందజేశారని, నకిలీ ధ్రువపత్రాలను సమకూ ర్చారని ఎన్ఐఎస్ వెల్లడించింది. ఉత్తర కొరి యా మరింత మంది సైనికులను రష్యాకు పంపనుందని వివరించింది. నిఘా సమాచా రం మేరకు 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొననున్నట్లు తనకు తెలిసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించడం గమనార్హం. ఉత్తరకొరియా మొత్తం 12 వేల మందిని కదనరంగానికి పంపనుందని దక్షిణకొరియా మీడియా తెలిపింది. ఉత్తరకొరియా చోంగ్జిన్ పోర్టులో రష్యా నావికాదళం నౌకలు మొహరించడం, ఉసురియిస్క్, ఖబరోస్క్లలో ఉత్తరకొరియా సైనికులు గుమిగూడిన ఉపగ్రహ చిత్రాలను ఎన్ఐఎస్ తమ వెబ్సైట్లో పొందుపర్చింది. విదేశీయుద్ధంలో ఉత్తరకొరియా నేరుగా పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాల్లో ఉత్తరకొరియా ఒకటి. మొత్తం 12 లక్షల మంది సైన్యం ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కింగ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల్లో దేనిపై దాడి జరిగినా.. మరో దేశం సైనికంగా సాయపడాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యోల్ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భద్రతపై సమీక్షించారు. అంతర్జాతీయ సమాజం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు చేరొచ్చు: జెలెన్స్కీబ్రస్సెల్స్: పదివేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా సైన్యంలో చేరవచ్చని తమకు నిఘా సమాచారం ఉందని ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. వీరిని రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో మొహరించనున్నారని తెలిపారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధంలో మూడోదేశం జోక్యం చేసుకుంటే అది ప్రపంచయుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. -
ఒడిశా పోలీసుకు అశోకచక్ర
న్యూఢిల్లీ: నక్సల్స్‌తో పోరాడుతూ వీరమరణం పొందిన ఒడిశా పోలీసు అధికారి ప్రమోద్‌కుమార్ సత్పతికి కేంద్రం అశోకచక్ర అవార్డు ప్రకటించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేసిన సత్పతి 2008, ఫిబ్రవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. సత్పతి ధైర్యసాహసాలు గుర్తిస్తూ ఆయనకు మరణానంతరం అశోకచక్రను ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఆదివారం వెల్లడించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రాణత్యాగం చేసిన పోలీసుల జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక స్థూపంపై సత్పతి పేరును కూడా చేర్చనున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21న ఈ స్మారకాన్ని ఆవిష్కరించనున్నారు. నాడు నక్సల్స్ వీరంగం.. 2008, ఫిబ్రవరి 15న సుమారు 500 మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు ఒడిశాలో వీరంగం సృష్టించారు. నయాగఢ్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసు శిక్షణ కేంద్రం, సమీపంలో ఉన్న మరో రెండు పోలీస్ స్టేషన్లు, నయాగడ్ ఔట్‌పోస్ట్, గంజాం జిల్లాలోని ఒక ఔట్‌పోస్ట్, పోలీస్ స్టేషన్లపై ఏకకాలంలో దాడికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్‌ల నుంచి వచ్చిన నక్సలైట్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొని 1200కు పైగా అధునాతన ఆయుధాలను కొల్లగొట్టారు. వారిని నిలువరించే క్రమంలో 14 మంది పోలీసులు, ఒక పౌరుడు చనిపోయారు. ఆ తరువాత మావోయిస్టులు పోలీసుల వాహనాల్లోనే సమీపంలోని గంజాం, ఫూల్బాని అడవుల్లోకి పారిపోయారు. అనంతరం, ఎస్ఓజీ, ఒడిశా స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్, సీఆర్పీఎఫ్ బృందాలు.. మావోయిస్టులు దాక్కున్న ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. సత్పతి నేతృత్వంలోని బృందం మావోలపై దాడిని తీవ్రతరం చేసింది. కానీ నక్సల్స్ వద్ద ఉన్న ఆయుధాల ముందు భద్రతా దళాలు నిలవలేకపోయాయి. ఇరువర్గాల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో సత్పతి మరణించారు. -
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
-
కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో బుధవారం ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగంలో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌వోజీ)కు చెందిన మొహమ్మద్ యూసుఫ్, దీపక్ పండిట్లతో పాటు ఆర్మీలోని 160వ బెటాలియన్‌కు చెందిన మొహమ్మద్ అష్రఫ్, నాయక్ రంజిత్ సింగ్, మరో జవాన్ ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినట్లు ఆ రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాలతో పాటు పారా కమెండోలు కూడా పాల్గొన్నారన్నారు. బుధవారం రాత్రివరకూ సాగిన ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చామనీ, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మృతులంతా విదేశీయులేనని ఆయన స్పష్టం చేశారు. ఘటనాస్థలం నుంచి ఏకే–47 తుపాకులతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నియంత్రణ రేఖ(ఎల్వోసీ) దాటి కుప్వారాలోని హల్మత్పొరా ప్రాంతానికి మంగళవారం చేరుకున్న ఉగ్రవాదులు అక్కడ మద్దతుదారులతో కలసి విందులో పాల్గొన్నారన్నారు. అనంతరం వీరు కుప్వారా పట్టణానికి బయలుదేరుతుండగా పోలీస్ గస్తీ బృందం ఎదురుపడిందన్నారు. దీంతో ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారని వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరుపుతూ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారన్నారు. -
కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్
నలుగురు ఉగ్రవాదుల హతం ► అమరులైన ఇద్దరు సైనికులు కుల్గాం: దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా నాగ్బల్ గ్రామంలో ఆదివారం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా, ఇద్దరు జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మరణించారు. మరో ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ఆర్మీ, పోలీస్, పారా మిలటరీ బలగాలు ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు నాగ్బల్ గ్రామాన్ని చుట్టుముట్టి ప్రతి ఇంటిని క్షుణ్నంగా తనిఖీ చేశాయి. కానీ ఉగ్రవాదుల ఆచూకీ లభించలేదు. అనంతరం రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాన్లతో పాటు పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ మళ్లీ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక ఇంటి పై భాగం అనుమానాస్పదంగా ఉండటాన్ని గుర్తించారు. ఇంతలో జవాన్లు తమని గుర్తించారని భావించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో లాన్స్ నాయక్ రఘువీర్ సింగ్, లాన్స్ నాయక్ గోపాల్ సింగ్ బదోరియాలు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు మరణించగా, మరో ముగ్గురు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. మరణించిన ఉగ్రవాదుల్లో ముగ్గుర్ని ముదసిర్ అహ్మద్ తాంత్రే, ఫరూక్ అహ్మద్, అజహర్ అహ్మద్‌గా గుర్తించారు. మరో ఉగ్రవాదిని గుర్తించాల్సి ఉంది. కాగా, ఘటనాస్థలి నుంచి నాలుగు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై జమ్మూకశ్మీర్ డీజీపీ స్పందిస్తూ.. హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో విజయం సాధించామని చెప్పారు. స్థానికులైన ఉగ్రవాదులు మరణించారనే విషయం తెలియడంతో కుల్గాం జిల్లాలో జవాన్లపై అల్లరిమూకలు రాళ్లు రువ్వాయి. జవాన్ల కాల్పుల్లో 15 మంది గాయపడ్డారు. వీరిలో ఒక వ్యక్తి అనంత్‌నాగ్‌లోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.