
న్యూఢిల్లీ: నక్సల్స్‌తో పోరాడుతూ వీరమరణం పొందిన ఒడిశా పోలీసు అధికారి ప్రమోద్‌కుమార్ సత్పతికి కేంద్రం అశోకచక్ర అవార్డు ప్రకటించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌ఓజీ) అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేసిన సత్పతి 2008, ఫిబ్రవరి 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. సత్పతి ధైర్యసాహసాలు గుర్తిస్తూ ఆయనకు మరణానంతరం అశోకచక్రను ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఆదివారం వెల్లడించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రాణత్యాగం చేసిన పోలీసుల జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక స్థూపంపై సత్పతి పేరును కూడా చేర్చనున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21న ఈ స్మారకాన్ని ఆవిష్కరించనున్నారు.
నాడు నక్సల్స్ వీరంగం..
2008, ఫిబ్రవరి 15న సుమారు 500 మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు ఒడిశాలో వీరంగం సృష్టించారు. నయాగఢ్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసు శిక్షణ కేంద్రం, సమీపంలో ఉన్న మరో రెండు పోలీస్ స్టేషన్లు, నయాగడ్ ఔట్‌పోస్ట్, గంజాం జిల్లాలోని ఒక ఔట్‌పోస్ట్, పోలీస్ స్టేషన్‌లపై ఏకకాలంలో దాడికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్‌ల నుంచి వచ్చిన నక్సలైట్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొని 1200కు పైగా అధునాతన ఆయుధాలను కొల్లగొట్టారు.
వారిని నిలువరించే క్రమంలో 14 మంది పోలీసులు, ఒక పౌరుడు చనిపోయారు. ఆ తరువాత మావోయిస్టులు పోలీసుల వాహనాల్లోనే సమీపంలోని గంజాం, ఫూల్బాని అడవుల్లోకి పారిపోయారు. అనంతరం, ఎస్‌ఓజీ, ఒడిశా స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్, సీఆర్‌పీఎఫ్ బృందాలు.. మావోయిస్టులు దాక్కున్న ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. సత్పతి నేతృత్వంలోని బృందం మావోలపై దాడిని తీవ్రతరం చేసింది. కానీ నక్సల్స్ వద్ద ఉన్న ఆయుధాల ముందు భద్రతా దళాలు నిలవలేకపోయాయి. ఇరువర్గాల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో సత్పతి మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment