Odisha police
-
హిడ్మా ఎక్కడ? ఏదైనా వ్యూహం ఉందా?
సాక్షి, అమరావతి/ఏటూరునాగారం: మావోయిస్టు పార్టీలో మరో అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ–1 కమాండర్ హిడ్మా దండకారణ్యం దాటి బయటకు వచ్చారన్న సమాచారంతో మూడు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన అనారోగ్యానికి గురై వైద్యం కోసం వచ్చారని భావిస్తున్నా.. దీని వెనుక మరేదైన వ్యూహం ఉందా అన్న కోణంలోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా పోలీసులు ఆరా తీస్తున్నారు. కరోనా సోకడంతో ఆయన చికిత్స కోసం తెలంగాణలోని ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు అడవుల్లోకి వచ్చి చికిత్స పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏజెన్సీలోని పోలీసులు ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో అడవులబాట పట్టారు. హిడ్మా ఏజెన్సీలోని అడవుల్లో, గొత్తికోయగూడేల్లో తలదాచుకొని చికిత్స పొందుతున్నారనే కోణంలో ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులతోపాటు గ్రేహౌండ్స్ బలగాలు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నాయి. హిడ్మా ఆచూకీ కోసం జాగిలాలు, డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపాయి. ఈ ఏడాదిన్నరలో కరోనా, తదనంతర అనారోగ్య సమస్యలతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు హరిభూషణ్, పూర్ణేందు ముఖర్జీలతోపాటు ఇటీవల ఆర్కే మృతిచెందారు. ఇప్పుడు హిడ్మా అనారోగ్య సమస్య మావోయిస్టు పార్టీని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఏదైనా వ్యూహం ఉందా? దండకారణ్య ప్రాంతంలో ఆరు నెలలుగా హిడ్మా కదలికలపై ఎలాంటి సమాచారం లేదు. ఆపరేషన్ సమాధాన్లో భాగంగా దండకారణ్య ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసు బలగాల దృష్టి మళ్లించేందుకు హిడ్మా బయటకు వచ్చారా.. ఎక్కడైనా మెరుపుదాడి చేసి ఉనికి చాటుకోవాలని భావిస్తున్నారా.. ఆర్కే మృతి తరువాత ఏవోబీలో మావోయిస్టు పార్టీని మళ్లీ బలోపేతం చేసే సన్నాహాల్లో భాగంగా వచ్చారా.. ఇలా పలు కోణాల్లో పోలీసులు విశ్లేషిస్తున్నారు. -
శిక్షణకొచ్చి చిక్కారు!
సాక్షి, అమరావతి, కొయ్యూరు, పాడేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో క్యాడర్‌కు శిక్షణ తరగతులు నిర్వహించి పట్టు సాధించేందుకు మావోయిస్టులు రూపొందించిన వ్యూహం విఫలమైంది. ఒడిశాలో మూడు రోజుల నుంచి మొదలైన కూంబింగ్, ఎదురు కాల్పులు ఏపీలో ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యులు సందే గంగయ్య, రణదేవ్‌లతోపాటు మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. నిస్తేజంగా ఉన్న క్యాడర్‌ను ఉత్సాహపరిచేందుకు ఏవోబీ పరిధిలోని మల్కనగిరిలో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు మావోయిస్టులు ప్రణాళిక రూపొందించినట్లు ఏపీ, ఒడిశా పోలీసులకు పక్కా సమాచారం అందడంతో కూంబింగ్ చేపట్టారు. ఒడిశాలో తప్పించుకుని... మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్‌తోపాటు కొందరు అగ్ర నేతలు శిక్షణా తరగతులకు హాజరు కానున్నట్టు సమాచారం అందడంతో మూడు రోజుల క్రితం మల్కనగిరి, కొరాపుట్ జిల్లాల్లో ఒడిశా కోబ్రా పోలీసులు, బీఎస్పీ దళాలు కూంబింగ్ చేపట్టాయి. సోమవారం నుంచి విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. ఏవోబీ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన పోలీసు బలగాలకు కులబెడ గ్రామంలో మావోయిస్టులు తారసపడ్డారు. కొద్దిసేపు ఎదురు కాల్పులు అనంతరం మావోయిస్టులు తప్పించుకున్నారు. సంఘటన స్థలంలో ఇన్సాస్ రైఫిల్, ఏకే–47 మ్యాగజైన్, ఇన్సాస్ మ్యాగజైన్, డిటోనేటర్లు, బ్యాటరీలు, ఐఈడీ బాంబుల తయారీ పదార్థాలు లభ్యమయ్యాయి. దీంతో అటు ఒడిశా ఇటు ఏపీలోనూ పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. మన్యం అడవుల్లోకి సరుకులు తరలిస్తూ.. ఒడిశాలో ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్న మావోయిస్టుల్లో కొందరు ఏపీలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో పెద్ద ఎత్తున సరుకులు కొనుగోలు చేసి అటవీ ప్రాంతంలోకి తరలిస్తుండటాన్ని గుర్తించారు. కూంబింగ్ చేపట్టిన గ్రేహౌండ్స్ బలగాలకు కొయ్యూరు మండలం తీగలమెట్ట ప్రాంతంలో గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. యు.చీడిపాలెం పంచాయతీ తీగలమెట్ట–పి.గంగవరం మధ్యనున్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు సందే గంగయ్య అలియాస్ డాక్టర్ అశోక్, రణదేవ్ అలియాస్ అర్జున్, ఏరియా కమిటీ సభ్యుడు సంతు నచిక, మావోయిస్టు పార్టీ సభ్యులు లలిత, పైకే చనిపోయిన వారిలో ఉన్నట్లు గుర్తించారు. మరో మహిళా మావోయిస్టును గుర్తించాల్సి ఉంది. ఘటనా స్థలంలో ఏకే–47తోపాటు తపంచా, నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి, మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బలిమెల ప్రాంతంలో డీసీఎంగా పనిచేసిన రణదేవ్ కూడా మృతుల్లో ఉన్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం హెలికాఫ్టర్‌తో గాలింపు చేపట్టారు. గాయపడి తప్పించుకున్న మావోయిస్టులు లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని విశాఖ రూరల్ ఎస్సీ బి.కృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి.. ఒడిశాలో ఎదురు కాల్పుల ఘటనలో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్ ఉన్నట్లు భావిస్తున్నారు. ఒడిశాలో ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి మావోయిస్టులు రెండు వర్గాలుగా విడిపోయి తప్పించుకున్నట్లు సమాచారం. వీరిలో ఏపీ వైపు వచ్చిన మావోయిస్టులు కొయ్యూరు మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు. తప్పించుకుని ఒడిశాలో మరోవైపు వెళ్లినవారిలో ఉదయ్‌తోపాటు మరికొందరు అగ్రనేతలు ఉండవచ్చని భావిస్తున్నారు. వారి కోసం ఒడిశా పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
బాలికపై పోలీస్ లైంగికదాడి.. గర్భస్రావం
బోయవాడి వేటుకు గాయపడిన కోయిలలా..గాలి వాన బీభత్సానికి వణికిపోయిన చిగురుటాకులా..పులి పంజాకు చిక్కిన జింకలా..రక్షక్ష భటుల వికృత చేష్టలతో ఓ బాలిక విలవిల్లాడింది. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే కంచే చేను మేసిందన్న చందాన వ్యవహరించడంతో ఓ అమాయక బాలిక వారి కబంధ హస్తాల్లో చిక్కుకుని గిలాగిలా కొట్టుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ అమానుష సంఘటన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా, భువనేశ్వర్: సుందరగడ్ జిల్లాలోని బీరమిత్రపూర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జి ఆనంద చంద్ర మఝి, ఇతర పోలీస్ సిబ్బంది 13 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి, గర్భస్రావం చేయించిన విచారకర సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలికపై లైంగికదాడికి పాల్పడి అనంతరం గర్భస్రావం చేయించిన నేరారోపణ కింద బీరమిత్రపూర్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జి ఆనంద చంద్ర మఝిపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్ర డీజీపీ అభయ్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు సస్పెన్షన్ విధించినట్లు పశ్చిమ రేంజ్ డీఐజీ కవిత జలన్ తెలిపారు. బీరమిత్రపూర్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జి, సబ్ఇన్స్పెక్టర్లకు వ్యతిరేకంగా శిశు సంక్షేమ కమిటీ చేసిన ఫిర్యాదు ఆధారంగా మహిళా డీఎస్పీ ఆధ్వర్యంలో బాధిత బాలిక వాంగ్మూలం నమోదు చేశారు. ఈ విచారకర సంఘటనలో బాలిక పెంపుడు తండ్రి, ఇద్దరు మిత్రులు కూడా భాగస్వాములని వాం గ్మూలంలో బాలిక వెల్లడించింది. (ఇక భరించలేను.. ఉండలేను! ) లాక్‌డౌన్‌తో చిక్కులు జాతర చూసేందుకు గడిచిన మార్చి 25వ తేదీన బాలిక బీరమిత్రపూర్ విచ్చేసింది. లాక్డౌన్ ప్రకటించడంతో రవాణా సౌకర్యాలు లేక ఇంటికి చేరుకోలేక చిక్కుకుంది. స్థానిక బస్టాండ్‌లో ఒంటరిగా తిరుగుతున్న తరుణంలో పహారా కాస్తున్న పోలీసుల కన్ను ఆ బాలికపై పడింది. రక్షణ కల్పిస్తామని నమ్మబలికి బాలికను పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. స్టేషన్ పై అంతస్తులో బాలికకు విడిది ఏర్పాటు చేశారు. స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జి ఆనంద చంద్ర మఝి తొలి రోజున బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మర్నాడు బాలికను ఆమె ఇంటికి చేర్చారు. 3 నెలల పాటు క్రమం తప్పకుండా స్టేషన్లో హాజరుకావాలని ఆదేశించారు. వచ్చిన ప్రతిసారి పై అంతస్తులో విడిది కల్పించి స్టేషన్లో సిబ్బంది వంతుల వారీగా బాలిక పట్ల లైంగికదాడికి పాల్పడ్డారు. ఆరోగ్యం అనుకూలించక పోవడంతో ఈ నెల 16వ తేదీన బీరమిత్రపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించడంతో గర్భం దాల్చినట్లు వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. పోలీసు అధికారం ప్రయోగించి బాలికకు గర్భస్రావం చేయించారు. బాలికకు రూ. 2 వేలు నగదుతో పాటు ఒక డ్రెస్ ఇచ్చి ఇంటికి పంపించారు. రౌర్కెలా ఆస్పత్రిలో బయటపడిన విషయం ఇంటికి చేరిన మర్నాడు బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో రౌర్కెలా ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం కుటుంబసభ్యులు, బంధువులు తరలించారు. ఆరోగ్య పరీక్షల సందర్భంగా అక్కడి వైద్యులు నిలదీయడంతో గర్భస్రావం పూర్వాపరాలు బంధువులకు తెలిశాయి. దీంతో బాధిత బాలిక బంధువులు శిశు సంక్షేమ సంస్థ (చైల్డ్ హెల్ప్ లైన్) సహాయం కోసం అభ్యర్థించారు. దీంతో జిల్లా శిశు సంరక్షణ అధికారి రాయిబాగా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో బీరమిత్రపూర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్చార్జి ఆనంద చంద్ర మఝి, సబ్ఇన్స్పెక్టర్ దొలొమొణి నాయక్, ఇద్దరు యువకులు, బాధిత బాలిక పెంపుడు తండ్రిని నిందితులుగా పేర్కొన్నారు. బాలికకు గర్భస్రావం చేసిన బీరమిత్రపూర్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం వైద్యుడిని కూడా ఫిర్యాదులో నిందితుడిగా పేర్కొన్నారు. అయితే వైద్యుడు పరారీలో ఉన్నాడు. -
బాలిక హత్య కేసులో..నిందితుల అరెస్ట్
ఒడిశా, జయపురం: నవరంగపూర్ జిల్లాలోని కొశాగుమడలోని గుముండల గ్రామ బాలిక హత్య సంఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. తొలుత బాలికను ఎవరో గుర్తు తెలియని దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడి, అనంతరం హత్య చేశారన్న ఆరోపణలు బాగా వినిపించాయి. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, బాలికపై ఎవరూ లైంగి కదాడి చేయలేదని, కేవలం హత్య మాత్రమే చేశారన్న విషయం బయటపడింది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఇదే కేసుకు సంబంధించి శుక్రవారం ఇద్దరు నింది తులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో కొరాపుట్ జిల్లాలోని కొట్‌పాడ్ సమితిలో ఉన్న పొనకగుడ గ్రామవాసి ఖాడి భొత్ర(18), గుముండల గ్రామానికి చెందిన బొలి మఝి(20) ఉన్నారు. ప్రస్తుతం నిందితులను కోర్టుకు తరలించినట్లు నవరంగపూర్ ఎస్పీ నితిన్‌కుశలాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో సంఘటన జరిగిన 20రోజులైనా నిందితులను పట్టుకోవడంలో విఫలమైన పోలీ సుల తీరుకు నిరసనగా కొ«శాగుమడ క్రిస్టియన్ సమాజ్ శనివారం చేపట్టాలనుకున్న బంద్ విరమించుకున్నట్లు తెలిసింది. -
ఒడిశా పోలీసుకు అశోకచక్ర
న్యూఢిల్లీ: నక్సల్స్‌తో పోరాడుతూ వీరమరణం పొందిన ఒడిశా పోలీసు అధికారి ప్రమోద్‌కుమార్ సత్పతికి కేంద్రం అశోకచక్ర అవార్డు ప్రకటించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేసిన సత్పతి 2008, ఫిబ్రవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. సత్పతి ధైర్యసాహసాలు గుర్తిస్తూ ఆయనకు మరణానంతరం అశోకచక్రను ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఆదివారం వెల్లడించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రాణత్యాగం చేసిన పోలీసుల జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక స్థూపంపై సత్పతి పేరును కూడా చేర్చనున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21న ఈ స్మారకాన్ని ఆవిష్కరించనున్నారు. నాడు నక్సల్స్ వీరంగం.. 2008, ఫిబ్రవరి 15న సుమారు 500 మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు ఒడిశాలో వీరంగం సృష్టించారు. నయాగఢ్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసు శిక్షణ కేంద్రం, సమీపంలో ఉన్న మరో రెండు పోలీస్ స్టేషన్లు, నయాగడ్ ఔట్‌పోస్ట్, గంజాం జిల్లాలోని ఒక ఔట్‌పోస్ట్, పోలీస్ స్టేషన్లపై ఏకకాలంలో దాడికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్‌ల నుంచి వచ్చిన నక్సలైట్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొని 1200కు పైగా అధునాతన ఆయుధాలను కొల్లగొట్టారు. వారిని నిలువరించే క్రమంలో 14 మంది పోలీసులు, ఒక పౌరుడు చనిపోయారు. ఆ తరువాత మావోయిస్టులు పోలీసుల వాహనాల్లోనే సమీపంలోని గంజాం, ఫూల్బాని అడవుల్లోకి పారిపోయారు. అనంతరం, ఎస్ఓజీ, ఒడిశా స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్, సీఆర్పీఎఫ్ బృందాలు.. మావోయిస్టులు దాక్కున్న ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. సత్పతి నేతృత్వంలోని బృందం మావోలపై దాడిని తీవ్రతరం చేసింది. కానీ నక్సల్స్ వద్ద ఉన్న ఆయుధాల ముందు భద్రతా దళాలు నిలవలేకపోయాయి. ఇరువర్గాల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో సత్పతి మరణించారు. -
పద పదవే వయ్యారి.. పావురమా..!
ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు హవా సాగుతున్న ప్రస్తుత తరుణంలోనూ ఒడిశా పోలీసులు రాజుల కాలం నాటి పాత పద్ధతి కనుమరుగుకాకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే పావురాళ్లతో సందేశాలు, వర్తమానాలు పంపించడం... మొఘల్ రాజుల కాలంలో ఈ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించారు. యుద్ధక్షేత్రాలతో పాటు అంతఃపురాల్లోకి రహస్యసమాచారాన్ని చేరవేసేందుకు ఈ పద్ధతిని పాటించారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) భువనేశ్వర్ సహకారంతో ఒడిశా పోలీసులు ఇటీవల ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. చారిత్రక వారసత్వ పరిరక్షణకు సంబంధించిన సందేశాలు పంపించేందుకు ఈ ప్రయోగం చేశారు. దీని కోసం భువనేశ్వర్ నుంచి 25 కిలోమీటర్ల దూరమున్న కటక్‌కు 50 పావురాళ్లను పంపించారు. గంటలోపే ఇవన్నీ గమ్యస్థానం కటక్ చేరుకున్నాయి. అయితే ఒడిశాకు ఓ ప్రత్యేకత ఉంది. వైర్లెస్, టెలిఫోన్ లింక్‌లు లేని ప్రాంతాల్లో సమాచార వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు 1946లో 200 పావురాళ్లతో కూడిన ‘ఒడిశా పావురాళ్ల సర్వీసు’ ను పోలీసుసిబ్బందికి సైన్యం అందజేసింది. మొదట కొండలతో కూడుకున్న కోరాపుట్ జిల్లా లో దీనిని ప్రారంభించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో పాటు దీనిని విశ్వసనీయమైనదిగా భావించడంతో ఆ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 700 బెల్జియన్ హోమర్ పావురాళ్లతో సందేశాలు పంపించే డ్యూటీని కొనసాగించారు. కొన్నేళ్ల పాటు మారుమూల ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల మధ్య సంబంధాలు, సమాచార మార్పిడికి ఈ విధానం ఉపయోగపడింది. ఒక చిన్న కాగితం ముక్కపై రాసిన సందేశాన్ని ఓ ప్లాస్టిక్ క్యాప్సుల్‌లో పెట్టి ఈ పావురాళ్ల కాళ్లకు కట్టేవారు. ఇవి 15 నుంచి 25 నిమిషాల్లోనే 25 కి.మీ దూరం ప్రయాణిస్తాయి. ఈ రకం పావురాళ్ల జీవితకాలం 20 ఏళ్ల వరకు ఉండేది. 1982లో వరదల్లో బాంకీ పట్టణం చిక్కుకున్నపుడు, 1999లో సూపర్ సైక్లోన్, వరదల సందర్భంగా కూడా కటక్ కేంద్రంగా ఈ సర్వీసు ఉపయోగించారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఒడిశాలో ఓ ఖాకీ ఓవరాక్షన్
-
టీఆర్ఎస్ నేత అరెస్టుకు ఒడిశా పోలీసులు
హైదరాబాద్: ఒడిశా వ్యాపారి కిడ్నాప్ కేసులో టీఆర్ఎస్ నేత సతీష్‌రెడ్డిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. భువనేశ్వర్‌కు చెందిన వ్యాపారి సుభాష్ అగర్వాల్‌ను కిడ్నాప్ చేసినట్టు సతీష్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు సైతం బెయిలు మంజూరును రద్దుచేసింది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో సతీష్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఒడిశా పోలీసులు శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. -
'ఆర్కే కాళ్లకు గాయాలు.. లొంగిపోతే మంచిది'
-
'ఆర్కే కాళ్లకు గాయాలు.. లొంగిపోతే మంచిది'
మల్కన్‌గిరి: ఇప్పటికైనా మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే లొంగిపోయి సరైన వైద్యం చేయించుకోవాలని ఒడిశా పోలీసులు కోరారు. వైద్య సేవలు అందించేందుకు ఒడిశా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. అక్టోబర్ 24న జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఆర్కే గాయపడ్డారని, ఆయన కాళ్లకు గాయాలయ్యాయని, ఇప్పటికైనా లొంగిపోయి శస్త్ర చికిత్సలాంటివి చేయించుకోవచ్చని మల్కన్ గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్ర చెప్పారు. ప్రస్తుతం ఆయన ఒడిశా -ఆంధ్ర సరిహద్దులోని ఏదో గుర్తు తెలియన వైద్య శిబిరంలో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిసిందని అన్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ఆస్పత్రులన్నింటిలో అప్రమత్తత ప్రకటించినట్లు సమాచారం. ఏక్షణమైనా వైద్యం కోసం ఆర్కే వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అలా రాకుంటే ఆయనకు మెరుగైన వైద్యం అందే అవకాశం లేదని కూడా చెబుతున్నారు. కీలక సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం నాటు వైద్యం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఆర్కే తన కుమారుడు మున్నా, ఇతర బృందం మధ్యలో ఉన్నాడని, చాలా చాకచక్యంగా తప్పించుకున్నారని మహాపాత్ర తెలిపారు.