
సాక్షి, అమరావతి/ఏటూరునాగారం: మావోయిస్టు పార్టీలో మరో అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ–1 కమాండర్ హిడ్మా దండకారణ్యం దాటి బయటకు వచ్చారన్న సమాచారంతో మూడు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన అనారోగ్యానికి గురై వైద్యం కోసం వచ్చారని భావిస్తున్నా.. దీని వెనుక మరేదైన వ్యూహం ఉందా అన్న కోణంలోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా పోలీసులు ఆరా తీస్తున్నారు. కరోనా సోకడంతో ఆయన చికిత్స కోసం తెలంగాణలోని ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చినట్లు ప్రాథమిక సమాచారం.
తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు అడవుల్లోకి వచ్చి చికిత్స పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏజెన్సీలోని పోలీసులు ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో అడవులబాట పట్టారు. హిడ్మా ఏజెన్సీలోని అడవుల్లో, గొత్తికోయగూడేల్లో తలదాచుకొని చికిత్స పొందుతున్నారనే కోణంలో ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.
స్పెషల్ పార్టీ పోలీసులతోపాటు గ్రేహౌండ్స్ బలగాలు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నాయి. హిడ్మా ఆచూకీ కోసం జాగిలాలు, డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపాయి. ఈ ఏడాదిన్నరలో కరోనా, తదనంతర అనారోగ్య సమస్యలతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు హరిభూషణ్, పూర్ణేందు ముఖర్జీలతోపాటు ఇటీవల ఆర్కే మృతిచెందారు. ఇప్పుడు హిడ్మా అనారోగ్య సమస్య మావోయిస్టు పార్టీని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఏదైనా వ్యూహం ఉందా?
దండకారణ్య ప్రాంతంలో ఆరు నెలలుగా హిడ్మా కదలికలపై ఎలాంటి సమాచారం లేదు. ఆపరేషన్ సమాధాన్‌లో భాగంగా దండకారణ్య ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసు బలగాల దృష్టి మళ్లించేందుకు హిడ్మా బయటకు వచ్చారా.. ఎక్కడైనా మెరుపుదాడి చేసి ఉనికి చాటుకోవాలని భావిస్తున్నారా.. ఆర్కే మృతి తరువాత ఏవోబీలో మావోయిస్టు పార్టీని మళ్లీ బలోపేతం చేసే సన్నాహాల్లో భాగంగా వచ్చారా.. ఇలా పలు కోణాల్లో పోలీసులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment