Agency Zones
-
హిడ్మా ఎక్కడ? ఏదైనా వ్యూహం ఉందా?
సాక్షి, అమరావతి/ఏటూరునాగారం: మావోయిస్టు పార్టీలో మరో అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ–1 కమాండర్ హిడ్మా దండకారణ్యం దాటి బయటకు వచ్చారన్న సమాచారంతో మూడు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయన అనారోగ్యానికి గురై వైద్యం కోసం వచ్చారని భావిస్తున్నా.. దీని వెనుక మరేదైన వ్యూహం ఉందా అన్న కోణంలోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా పోలీసులు ఆరా తీస్తున్నారు. కరోనా సోకడంతో ఆయన చికిత్స కోసం తెలంగాణలోని ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతాల్లోకి వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపురం, వాజేడు అడవుల్లోకి వచ్చి చికిత్స పొందుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏజెన్సీలోని పోలీసులు ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం నేతృత్వంలో అడవులబాట పట్టారు. హిడ్మా ఏజెన్సీలోని అడవుల్లో, గొత్తికోయగూడేల్లో తలదాచుకొని చికిత్స పొందుతున్నారనే కోణంలో ఆయా ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. స్పెషల్ పార్టీ పోలీసులతోపాటు గ్రేహౌండ్స్ బలగాలు అడుగడుగునా తనిఖీలు చేస్తున్నాయి. హిడ్మా ఆచూకీ కోసం జాగిలాలు, డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపాయి. ఈ ఏడాదిన్నరలో కరోనా, తదనంతర అనారోగ్య సమస్యలతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు హరిభూషణ్, పూర్ణేందు ముఖర్జీలతోపాటు ఇటీవల ఆర్కే మృతిచెందారు. ఇప్పుడు హిడ్మా అనారోగ్య సమస్య మావోయిస్టు పార్టీని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఏదైనా వ్యూహం ఉందా? దండకారణ్య ప్రాంతంలో ఆరు నెలలుగా హిడ్మా కదలికలపై ఎలాంటి సమాచారం లేదు. ఆపరేషన్ సమాధాన్లో భాగంగా దండకారణ్య ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసు బలగాల దృష్టి మళ్లించేందుకు హిడ్మా బయటకు వచ్చారా.. ఎక్కడైనా మెరుపుదాడి చేసి ఉనికి చాటుకోవాలని భావిస్తున్నారా.. ఆర్కే మృతి తరువాత ఏవోబీలో మావోయిస్టు పార్టీని మళ్లీ బలోపేతం చేసే సన్నాహాల్లో భాగంగా వచ్చారా.. ఇలా పలు కోణాల్లో పోలీసులు విశ్లేషిస్తున్నారు. -
అంగన్వాడీ పోస్టుల్లో అక్రమాలు
విశాఖపట్నం: జిల్లాలో లింక్వర్కర్పోస్టుల భర్తీ తీవ్ర దుమారం రేపుతోంది. పలు మండలాల్లో ఈ పోస్టుల నియామకాల్లో అంతులేని అక్రమాలు జరిగాయంటూ ఇటు ప్రజావాణి, అటు జిల్లా మహిళా,శిశు అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. డుంబ్రిగుడ, ముంచంగిపుట్ మండలాల్లో అర్హులను పక్కనపెట్టి దొడ్డిదారిన నియామకాలు చేపట్టారంటూ జిల్లాకలెక్టర్‌కు పలువురు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈమేరకు అసిస్టెంట్ కలెక్టర్ శుక్లాను విచారణ అధికారిగా నియమించారు. జిల్లాలో 11ఏజెన్సీ మండలాలు, నర్సీపట్నం, కోటవురట్ల,కశింకోట,వి.మాడుగుల ఐసీడీఎస్ ప్రాజెక్టులకు 1800 లింక్‌వర్కర్ పోస్టులు మంజూరయ్యాయి. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో ఆర్డీఓ కార్యాలయాల్లో ఆర్డీవో, జిల్లా మహిళా,శిశు అభివృద్ధి సంస్థ ఏపీడీ జి.చిన్మయిదేవి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సీడీపీవో, అదనపు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి సభ్యులుగా గల కమిటీల పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 1200 పోస్టులను భర్తీ చేశారు. పదో తరగతి పాసయిన స్థానిక మహిళలకే ఈ పోస్టులు కేటాయించాలి. కానీ ముంచింగిపుట్టు మండలంలో అక్రమాలు జరిగాయని, ఒక్కో పోస్టును రూ.20వేల నుంచి రూ.50వేలకు అమ్ముకున్నారని కొందరు కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. అలాగే డుంబ్రిగుడ మండలం రంగిలిసింగి పంచాయతీ మురలంక గ్రామానికి చెందిన కిల్లో ఉమ తనకు అన్ని అర్హతలు వున్నా లింక్ వర్కర్ పోస్టు ఇవ్వలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఐసీడీఎస్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కుజబంగికి చెందిన గుజ్జేల అమలుకి ఈ పోస్టు కట్టబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని జిల్లా మహిళా,శిశు అభివృద్ది సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్ ఏ.ఇ.రాబర్ట్స్ వద్ద ప్రస్తావించగా అసిస్టెంట్ కలెక్టర్ విచారణ అనంతరం జిల్లాకలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.