అంగన్‌వాడీ పోస్టుల్లో అక్రమాలు | irregularities in anganwadi posts | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ పోస్టుల్లో అక్రమాలు

Published Wed, Sep 24 2014 3:59 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

irregularities in anganwadi posts

విశాఖపట్నం: జిల్లాలో లింక్‌వర్కర్‌పోస్టుల భర్తీ తీవ్ర దుమారం రేపుతోంది. పలు మండలాల్లో ఈ పోస్టుల నియామకాల్లో అంతులేని అక్రమాలు జరిగాయంటూ ఇటు ప్రజావాణి, అటు జిల్లా మహిళా,శిశు అభివృద్ధి సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  డుంబ్రిగుడ, ముంచంగిపుట్ మండలాల్లో అర్హులను పక్కనపెట్టి దొడ్డిదారిన నియామకాలు చేపట్టారంటూ జిల్లాకలెక్టర్‌కు పలువురు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

ఈమేరకు అసిస్టెంట్ కలెక్టర్ శుక్లాను విచారణ అధికారిగా నియమించారు. జిల్లాలో 11ఏజెన్సీ మండలాలు, నర్సీపట్నం, కోటవురట్ల,కశింకోట,వి.మాడుగుల ఐసీడీఎస్ ప్రాజెక్టులకు 1800 లింక్‌వర్కర్ పోస్టులు మంజూరయ్యాయి. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో ఆర్డీఓ కార్యాలయాల్లో ఆర్డీవో, జిల్లా మహిళా,శిశు అభివృద్ధి సంస్థ ఏపీడీ జి.చిన్మయిదేవి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, సీడీపీవో, అదనపు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి సభ్యులుగా గల కమిటీల పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు నిర్వహించారు.

1200 పోస్టులను భర్తీ చేశారు.  పదో తరగతి పాసయిన స్థానిక మహిళలకే ఈ పోస్టులు కేటాయించాలి. కానీ ముంచింగిపుట్టు మండలంలో అక్రమాలు జరిగాయని, ఒక్కో పోస్టును రూ.20వేల నుంచి రూ.50వేలకు అమ్ముకున్నారని కొందరు కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. అలాగే  డుంబ్రిగుడ మండలం రంగిలిసింగి పంచాయతీ మురలంక గ్రామానికి చెందిన కిల్లో ఉమ తనకు అన్ని అర్హతలు వున్నా లింక్ వర్కర్ పోస్టు ఇవ్వలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఐసీడీఎస్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కుజబంగికి చెందిన గుజ్జేల అమలుకి ఈ పోస్టు కట్టబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని జిల్లా మహిళా,శిశు అభివృద్ది సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్ ఏ.ఇ.రాబర్ట్స్ వద్ద ప్రస్తావించగా అసిస్టెంట్ కలెక్టర్ విచారణ అనంతరం జిల్లాకలెక్టర్ తగిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement