'ఆర్కే కాళ్లకు గాయాలు.. లొంగిపోతే మంచిది'
మల్కన్గిరి: ఇప్పటికైనా మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే లొంగిపోయి సరైన వైద్యం చేయించుకోవాలని ఒడిశా పోలీసులు కోరారు. వైద్య సేవలు అందించేందుకు ఒడిశా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. అక్టోబర్ 24న జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఆర్కే గాయపడ్డారని, ఆయన కాళ్లకు గాయాలయ్యాయని, ఇప్పటికైనా లొంగిపోయి శస్త్ర చికిత్సలాంటివి చేయించుకోవచ్చని మల్కన్ గిరి ఎస్పీ మిత్రభాను మహాపాత్ర చెప్పారు. ప్రస్తుతం ఆయన ఒడిశా -ఆంధ్ర సరిహద్దులోని ఏదో గుర్తు తెలియన వైద్య శిబిరంలో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిసిందని అన్నారు.
ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ఆస్పత్రులన్నింటిలో అప్రమత్తత ప్రకటించినట్లు సమాచారం. ఏక్షణమైనా వైద్యం కోసం ఆర్కే వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అలా రాకుంటే ఆయనకు మెరుగైన వైద్యం అందే అవకాశం లేదని కూడా చెబుతున్నారు. కీలక సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతం నాటు వైద్యం పొందుతున్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఆర్కే తన కుమారుడు మున్నా, ఇతర బృందం మధ్యలో ఉన్నాడని, చాలా చాకచక్యంగా తప్పించుకున్నారని మహాపాత్ర తెలిపారు.