heroic death
-
30మందిని కాపాడి ఆర్మీ జవాన్ వీరమరణం
కంభం/నార్పల: తోటి జవాన్లు 30 మందిని ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి కాపాడి.. తాను మాత్రం దాని బారిన బడి ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూలో నియంత్రణ రేఖ వద్ద సోమవారం విధి నిర్వహణలో ఉన్న ఆర్మీ జవాన్ ల్యాండ్‌మైన్ పేలి దుర్మరణం పాలయ్యాడు. ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య(45) జమ్మూలోని పూంచ్ జిల్లాలో 30 మంది జవానులతో కలిసి సరిహద్దు వద్ద కాపలా కాస్తున్నాడు. అంతలో అక్కడ ల్యాండ్‌మైన్ ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే తోటి జవాన్లను దూరంగా పంపించేసి తాను పొరపాటున దాని ఉచ్చులో చిక్కుకున్నాడు. అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. అధికార లాంఛనాలు ముగించుకుని మృతదేహాన్ని బెంగళూరు వరకు విమానంలో.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తరలించనున్నట్లు సమాచారం. మృతుడి తండ్రి వెంకట సుబ్బయ్య కొన్నేళ్ల కిందట చనిపోగా, తల్లి గాలెమ్మ గ్రామంలోనే ఉంటోంది. కుమారుడు మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న ఆ తల్లి కుమారుడి ఫొటో పట్టుకుని గుండెలవిసేలా రోదిస్తోంది. మృతుడి భార్య లీల స్వగ్రామం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం నార్పాల. ఇద్దరు పిల్లలతో ఆమె అక్కడే ఉంటోంది. మృతదేహాన్ని నార్పాల గ్రామానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో బంధువులు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జవాన్ భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. -
కుటుంబానికి పెద్ద దిక్కై.. దేశ సేవలో అమరుడై..
ఆ తల్లి కలలు చెదిరిపోయాయి. ఆ తండ్రి ఆశలు ఆవిరయ్యాయి. తమ కుమారుడు సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తున్నాడని గర్విస్తున్న తల్లిదండ్రులకు ఆనందం అంతలోనే ఆవిరైంది. మరో రెండు నెలల్లో సెలవులకు వస్తానని చెప్పిన రెండు రోజులకే విగతజీవిగా ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. దేశ సరిహద్దులో ఉగ్రవాదుల దాడిలో నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణానగర్‌కు చెందిన జవాన్ శిరిగిరి సురేంద్ర వీర మరణం పొందారు. నిన్న మొన్నటి వరకు కళ్లెదుట తిరగాడిన యువకుడు ఇక లేడనే చేదు నిజాన్ని ఆ గ్రామం జీర్ణించుకోలేకపోతుంది. నంద్యాల: దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో సురేంద్ర (ఆర్మీ నెం:15631599కే) నాలుగేళ్ల క్రితం సైన్యంలో చేరారు. ప్రస్తుతం బారాముల్లా ఆర్ఆర్ బెటాలియన్ యూనిట్ నెంబర్ 46లో విధులు నిర్వహిస్తూ జూలై 31వ తేదీ మధ్యాహ్నం జరిగిన మిలిటెంట్ ఆపరేషన్‌లో వీర మరణం పొందారు. సురేంద్ర సొంతూరు పాములపాడు మండలం మద్దూరు గ్రామ పంచాయతీలోని మజరా కృష్ణానగర్ గ్రామం. గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కుమార్తెకు వివాహమైంది. ఎకరా పొలం సాగు చేసుకుంటూ ఇద్దరు కుమారులను బాగా చదివించారు. పెద్ద కుమారుడు సుమన్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా, చిన్న కుమారుడు సురేంద్ర 2019లో ఆర్మీలో చేరారు. నాలుగు నెలల క్రితం సెలవుపై గ్రామానికి వచ్చి రెండు నెలలు కుటుంబీకులతో ఆనందంగా గడిపాడు. తిరిగి వెళ్లిన రెండు నెలలకే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సురేంద్ర మృతితో విషాదం నెలకొంది. ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని సోమవారం సాయంత్రం శ్రీనగర్‌కు చేర్చారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం శంషాబాద్‌కు విమానంలో తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి వాహనంలో అర్ధరాత్రి కృష్ణానగర్‌కు తరలించారు. విగతజీవిగా తిరిగి వచ్చిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. బుధవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తహసీల్దార్ రత్నరాధిక, ఎంపీడీఓ గోపీకృష్ణ, ఈఓపీఆర్డీ శ్రీనివాసనాయుడు గ్రామానికి చేరుకుని జవాన్ కుటుంబసభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. నాన్నకు డబ్బులు పంపి.. అన్నకు మెసేజ్ చేసి.. ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన సురేంద్ర తరచూ కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడుతూ ఇక్కడి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ అక్కడి విషయాలు పంచుకునేవారు. తల్లిదండ్రులతో వీడియో కాల్ చేసి మాట్లాడుతుండేవారు. ఈ విషాద ఘటనకు ముందు రోజు ఆదివారం తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి సెలవులు మంజూరయ్యాయని, సెపె్టంబర్ నెలాఖరులో ఇంటికొస్తానని ఆనందంగా చెప్పారు. అలాగే మరణానికి కొన్ని గంటల ముందు సోమవారం ఉదయం 9.30 గంటలకు తండ్రి సుబ్బయ్య బ్యాంక్ ఖాతాలో కొంత డబ్బు జమ చేశాడు. ఆ విషయాన్ని తన సోదరుడు సుమన్ సెల్‌కు మెసేజ్ ద్వారా తెలిపారు. ఆ తర్వాత మూడు గంటల్లోనే మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సుబ్బయ్యకు ఆర్మీ అధికారులు ఫోన్ చేసి కుమారుడి మరణం గురించి తెలపడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జవాన్ సురేంద్ర 1 నుంచి 7వ తరగతి వరకు కృష్ణానగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు పాములపాడు జెడ్పీ స్కూల్లో చదివారు. ఇంటర్మీడియట్ ఆత్మకూరు పట్టణంలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో, డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ వెలుగోడులో పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుకుగా ఉండే సురేంద్ర 2019 మార్చి 31న ఆర్మీలో చేరారు. కాగా సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అదే 31వ తేదీన వీర మరణం పొందడం విషాదం. మాజీ సైనికుల సంక్షేమ సంఘం సంతాపం కర్నూలు(అర్బన్): వీర జవాన్ సురేంద్ర మృతి పట్ల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షలు నర్రా పేరయ్య, కార్యదర్శి ఎం సుధాకర్, కోశాధికారి నజీర్‌అహమ్మద్ తదితరులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బుధవారం కృష్ణానగర్‌లో జరిగే అంత్యక్రియలకు జిల్లా సైని క సంక్షేమ అధికారిణి ఆర్ రత్నరూత్, ఎన్సీసీ గ్రూప్ నుంచి సుబేదార్ రవీంద్రసింగ్‌తో పాటు తాము కూడా హాజరవుతున్నట్లు తెలిపారు. -
ఒడిశా పోలీసుకు అశోకచక్ర
న్యూఢిల్లీ: నక్సల్స్‌తో పోరాడుతూ వీరమరణం పొందిన ఒడిశా పోలీసు అధికారి ప్రమోద్‌కుమార్ సత్పతికి కేంద్రం అశోకచక్ర అవార్డు ప్రకటించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేసిన సత్పతి 2008, ఫిబ్రవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. సత్పతి ధైర్యసాహసాలు గుర్తిస్తూ ఆయనకు మరణానంతరం అశోకచక్రను ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఆదివారం వెల్లడించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రాణత్యాగం చేసిన పోలీసుల జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక స్థూపంపై సత్పతి పేరును కూడా చేర్చనున్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21న ఈ స్మారకాన్ని ఆవిష్కరించనున్నారు. నాడు నక్సల్స్ వీరంగం.. 2008, ఫిబ్రవరి 15న సుమారు 500 మందికి పైగా సాయుధులైన మావోయిస్టులు ఒడిశాలో వీరంగం సృష్టించారు. నయాగఢ్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసు శిక్షణ కేంద్రం, సమీపంలో ఉన్న మరో రెండు పోలీస్ స్టేషన్లు, నయాగడ్ ఔట్‌పోస్ట్, గంజాం జిల్లాలోని ఒక ఔట్‌పోస్ట్, పోలీస్ స్టేషన్లపై ఏకకాలంలో దాడికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్‌ల నుంచి వచ్చిన నక్సలైట్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొని 1200కు పైగా అధునాతన ఆయుధాలను కొల్లగొట్టారు. వారిని నిలువరించే క్రమంలో 14 మంది పోలీసులు, ఒక పౌరుడు చనిపోయారు. ఆ తరువాత మావోయిస్టులు పోలీసుల వాహనాల్లోనే సమీపంలోని గంజాం, ఫూల్బాని అడవుల్లోకి పారిపోయారు. అనంతరం, ఎస్ఓజీ, ఒడిశా స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్, సీఆర్పీఎఫ్ బృందాలు.. మావోయిస్టులు దాక్కున్న ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. సత్పతి నేతృత్వంలోని బృందం మావోలపై దాడిని తీవ్రతరం చేసింది. కానీ నక్సల్స్ వద్ద ఉన్న ఆయుధాల ముందు భద్రతా దళాలు నిలవలేకపోయాయి. ఇరువర్గాల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో సత్పతి మరణించారు. -
వీర మరణం!
► కాశ్మీర్లో ముష్కరులతో ఢీ ► తమిళ సైనికుడి మృతి ► విషాదంలో ఇలయాంకుడి దేశ సేవలో మరో తమిళ సైనికుడు వీర మరణం పొందారు. కాశ్మీర్లో పాకిస్తానీ ముష్కరుల దాడుల్ని తిప్పి కొట్టే క్రమంలో తమిళ సైనికుడు ప్రాణ త్యాగం చేశారు. తమవాడు ఇక లేడన్న సమాచారం శివగంగై జిల్లా ఇలయాంకుడిలో విషాదాన్ని నింపింది. సాక్షి, చెన్నై : భారత ఆర్మీలో దేశ సేవకు అంకితమైన సైనికాధికారులు, జవాన్లలో తమిళనాడుకు చెందిన వాళ్లు ఎందరో ఉన్నారు. కశ్మీర్ లోయల్లో రేయింబవళ్లు శ్రమిస్తున్న జవాన్ల మీద మంచు దుప్పటి తన పంజాను అప్పుడప్పుడు విసురుతోంది. అలాగే, పాకిస్తానీ ముష్కరులు దేశంలోకి చొరబడేందుకు చేస్తున్న తీవ్ర ప్రయత్నాల్ని తిప్పి కొట్టే పనిలో సైనికులు తమ ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. ఈ ఏడాది మాత్రం మంచు కారణంగా, ముష్కరుల్ని తరిమికొట్టే క్రమంలో తమిళనాడుకు చెందిన సైనికులు ఏడుగురు మరణించారు. ఈ ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఆయా కుటుంబాల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరో సైనికుడు వీర మరణం పొందారు. ప్రాణ త్యాగం కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలోని జైన్ బోరా పరిసరాల్లో పాకిస్తాని ముష్కరుల చొరబాటును తిప్పికొట్టే విధంగా భారత సైన్యం శనివారం విరోచితంగా పోరాడింది. ఈ కాల్పుల్లో జవాన్లు పలువురు గాయపడ్డారు. వారిలో ముగ్గురు ప్రాణ త్యాగం చేశారు. ఇందులో తమిళనాడుకు చెందిన జవాన్ ఒకరు ఉన్న సమాచారం దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతి చెందిన జవాను ఇళయరాజాగా గుర్తించడంతో అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివగంగై జిల్లా ఇలయాంకుడి కండని గ్రామానికి చెందిన పెరియ స్వామి, మీనాక్షి దంపతుల కుమారుడు ఇళయరాజా. నాలుగేళ్ల క్రితం భారత సైన్యంలో చేరారు. కశ్మీర్‌లోనే విధుల్ని నిర్వర్తిస్తూ వస్తున్న ఇళయరాజా గత ఏడాది స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడకు వచ్చిన తనయుడికి ఆగమేఘాలపై కుటుంబీకులు వివాహ ఏర్పాట్లు చేశారు. సమీప ప్రాంతానికి చెందిన సెల్వితో వివాహం జరిగింది. ప్రస్తుతం సెల్వి గర్భిణి. త్వరలో స్వగ్రామానికి వస్తానన్న ఇళయరాజా కానరాని లోకాలకు వెళ్లడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచింది. ఆ గ్రామం అంతా తీవ్ర మనో వేదనలో మునిగింది. ఇళయరాజా మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరుకోనుంది. అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో సాగనున్నాయి.