జమ్మూలో విధి నిర్వహణలో ఉండగా దుర్ఘటన
ల్యాండ్‌మైన్‌ను గుర్తించి తోటి జవాన్‌లు 30 మందిని దూరంగా పంపిన సుబ్బయ్య
అనంతరం దాని బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్
మృతుడి స్వగ్రామం ప్రకాశం జిల్లా రావిపాడులో విషాదం
కంభం/నార్పల: తోటి జవాన్‌లు 30 మందిని ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి కాపాడి.. తాను మాత్రం దాని బారిన బడి ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూలో నియంత్రణ రేఖ వద్ద సోమవారం విధి నిర్వహణలో ఉన్న ఆర్మీ జవాన్ ల్యాండ్‌మైన్ పేలి దుర్మరణం పాలయ్యాడు.
ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన వరికుంట్ల సుబ్బయ్య(45) జమ్మూలోని పూంచ్ జిల్లాలో 30 మంది జవానులతో కలిసి సరిహద్దు వద్ద కాపలా కాస్తున్నాడు. అంతలో అక్కడ ల్యాండ్‌మైన్ ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే తోటి జవాన్లను దూరంగా పంపించేసి తాను పొరపాటున దాని ఉచ్చులో చిక్కుకున్నాడు. అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ మేరకు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం ఇచ్చారు. అధికార లాంఛనాలు ముగించుకుని మృతదేహాన్ని బెంగళూరు వరకు విమానంలో.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తరలించనున్నట్లు సమాచారం. మృతుడి తండ్రి వెంకట సుబ్బయ్య కొన్నేళ్ల కిందట చనిపోగా, తల్లి గాలెమ్మ గ్రామంలోనే ఉంటోంది. కుమారుడు మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న ఆ తల్లి కుమారుడి ఫొటో పట్టుకుని గుండెలవిసేలా రోదిస్తోంది.
మృతుడి భార్య లీల స్వగ్రామం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం నార్పాల. ఇద్దరు పిల్లలతో ఆమె అక్కడే ఉంటోంది. మృతదేహాన్ని నార్పాల గ్రామానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం రావడంతో బంధువులు అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జవాన్ భౌతిక కాయానికి గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment