వీర మరణం! | Another Tamil soldier was killed in the national service. | Sakshi
Sakshi News home page

వీర మరణం!

Published Mon, Aug 14 2017 5:26 AM | Last Updated on Sun, Sep 17 2017 5:31 PM

వీర మరణం!

వీర మరణం!

కాశ్మీర్‌లో ముష్కరులతో ఢీ
తమిళ సైనికుడి మృతి
విషాదంలో ఇలయాంకుడి


దేశ సేవలో మరో తమిళ సైనికుడు వీర మరణం పొందారు. కాశ్మీర్‌లో పాకిస్తానీ ముష్కరుల దాడుల్ని తిప్పి కొట్టే క్రమంలో తమిళ సైనికుడు ప్రాణ త్యాగం చేశారు. తమవాడు ఇక లేడన్న సమాచారం శివగంగై జిల్లా ఇలయాంకుడిలో విషాదాన్ని నింపింది.

సాక్షి, చెన్నై :  భారత ఆర్మీలో దేశ సేవకు అంకితమైన సైనికాధికారులు, జవాన్లలో తమిళనాడుకు చెందిన వాళ్లు ఎందరో ఉన్నారు. కశ్మీర్‌ లోయల్లో రేయింబవళ్లు శ్రమిస్తున్న జవాన్ల మీద మంచు దుప్పటి తన పంజాను అప్పుడప్పుడు విసురుతోంది.

అలాగే, పాకిస్తానీ ముష్కరులు దేశంలోకి చొరబడేందుకు చేస్తున్న తీవ్ర ప్రయత్నాల్ని తిప్పి కొట్టే పనిలో సైనికులు తమ ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. ఈ ఏడాది మాత్రం మంచు కారణంగా, ముష్కరుల్ని తరిమికొట్టే క్రమంలో తమిళనాడుకు చెందిన సైనికులు ఏడుగురు మరణించారు. ఈ ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఆయా కుటుంబాల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరో సైనికుడు వీర మరణం పొందారు.

ప్రాణ త్యాగం
కశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలోని జైన్‌ బోరా పరిసరాల్లో పాకిస్తాని ముష్కరుల చొరబాటును తిప్పికొట్టే విధంగా భారత సైన్యం శనివారం విరోచితంగా పోరాడింది. ఈ కాల్పుల్లో జవాన్లు పలువురు గాయపడ్డారు. వారిలో ముగ్గురు ప్రాణ త్యాగం చేశారు. ఇందులో తమిళనాడుకు చెందిన జవాన్‌ ఒకరు ఉన్న సమాచారం దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతి చెందిన జవాను ఇళయరాజాగా గుర్తించడంతో అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివగంగై జిల్లా ఇలయాంకుడి కండని గ్రామానికి చెందిన పెరియ స్వామి, మీనాక్షి దంపతుల కుమారుడు ఇళయరాజా.

నాలుగేళ్ల క్రితం భారత సైన్యంలో చేరారు. కశ్మీర్‌లోనే విధుల్ని నిర్వర్తిస్తూ వస్తున్న ఇళయరాజా గత ఏడాది  స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడకు వచ్చిన తనయుడికి ఆగమేఘాలపై కుటుంబీకులు వివాహ ఏర్పాట్లు చేశారు. సమీప ప్రాంతానికి చెందిన సెల్వితో వివాహం జరిగింది. ప్రస్తుతం సెల్వి గర్భిణి. త్వరలో స్వగ్రామానికి వస్తానన్న ఇళయరాజా కానరాని లోకాలకు వెళ్లడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచింది. ఆ గ్రామం అంతా తీవ్ర మనో వేదనలో మునిగింది. ఇళయరాజా మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరుకోనుంది. అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో సాగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement