tragic shadow
-
వీర మరణం!
► కాశ్మీర్లో ముష్కరులతో ఢీ ► తమిళ సైనికుడి మృతి ► విషాదంలో ఇలయాంకుడి దేశ సేవలో మరో తమిళ సైనికుడు వీర మరణం పొందారు. కాశ్మీర్లో పాకిస్తానీ ముష్కరుల దాడుల్ని తిప్పి కొట్టే క్రమంలో తమిళ సైనికుడు ప్రాణ త్యాగం చేశారు. తమవాడు ఇక లేడన్న సమాచారం శివగంగై జిల్లా ఇలయాంకుడిలో విషాదాన్ని నింపింది. సాక్షి, చెన్నై : భారత ఆర్మీలో దేశ సేవకు అంకితమైన సైనికాధికారులు, జవాన్లలో తమిళనాడుకు చెందిన వాళ్లు ఎందరో ఉన్నారు. కశ్మీర్ లోయల్లో రేయింబవళ్లు శ్రమిస్తున్న జవాన్ల మీద మంచు దుప్పటి తన పంజాను అప్పుడప్పుడు విసురుతోంది. అలాగే, పాకిస్తానీ ముష్కరులు దేశంలోకి చొరబడేందుకు చేస్తున్న తీవ్ర ప్రయత్నాల్ని తిప్పి కొట్టే పనిలో సైనికులు తమ ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. ఈ ఏడాది మాత్రం మంచు కారణంగా, ముష్కరుల్ని తరిమికొట్టే క్రమంలో తమిళనాడుకు చెందిన సైనికులు ఏడుగురు మరణించారు. ఈ ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఆయా కుటుంబాల్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరో సైనికుడు వీర మరణం పొందారు. ప్రాణ త్యాగం కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలోని జైన్ బోరా పరిసరాల్లో పాకిస్తాని ముష్కరుల చొరబాటును తిప్పికొట్టే విధంగా భారత సైన్యం శనివారం విరోచితంగా పోరాడింది. ఈ కాల్పుల్లో జవాన్లు పలువురు గాయపడ్డారు. వారిలో ముగ్గురు ప్రాణ త్యాగం చేశారు. ఇందులో తమిళనాడుకు చెందిన జవాన్ ఒకరు ఉన్న సమాచారం దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతి చెందిన జవాను ఇళయరాజాగా గుర్తించడంతో అతడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివగంగై జిల్లా ఇలయాంకుడి కండని గ్రామానికి చెందిన పెరియ స్వామి, మీనాక్షి దంపతుల కుమారుడు ఇళయరాజా. నాలుగేళ్ల క్రితం భారత సైన్యంలో చేరారు. కశ్మీర్‌లోనే విధుల్ని నిర్వర్తిస్తూ వస్తున్న ఇళయరాజా గత ఏడాది స్వగ్రామానికి వచ్చాడు. ఇక్కడకు వచ్చిన తనయుడికి ఆగమేఘాలపై కుటుంబీకులు వివాహ ఏర్పాట్లు చేశారు. సమీప ప్రాంతానికి చెందిన సెల్వితో వివాహం జరిగింది. ప్రస్తుతం సెల్వి గర్భిణి. త్వరలో స్వగ్రామానికి వస్తానన్న ఇళయరాజా కానరాని లోకాలకు వెళ్లడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచింది. ఆ గ్రామం అంతా తీవ్ర మనో వేదనలో మునిగింది. ఇళయరాజా మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరుకోనుంది. అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో సాగనున్నాయి. -
బీసీలంటే ప్రాణం
• మాజీ ఎంపీ విఠల్‌రావు ఇక లేరు.. • అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూత • వివిధ పార్టీల నాయకుల సంతాపం.. • స్వగ్రామమైన లగచర్లలో విషాదఛాయలు మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ దేవరకొండ విఠల్‌రావు(69) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొడంగల్ : మాజీ ఎంపీ విఠల్ రావుకు బీసీలంటే ప్రాణం. శనివారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారని తెలియడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన స్వస్థలం బొంరాస్‌పేట మండలం లగచర్ల గ్రామం. దేశ రాజకీయాల్లో బీసీ నేతగా పేరు పొందారు. నియోజకవర్గంలో ఎంతోమంది బీసీలకు రాజకీయ భవిష్యత్ కల్పించారు. 2004లో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచారు. 2009లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతిలో ఓడిపోయారు. 2014లో కొడంగల్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరీక్షలు చేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణంరాజు సంతాపం ప్రకటించారు. విఠల్‌రావు మృతి జీర్ణించుకోలేనిది... మహబూబ్‌నగర్ అర్బన్ : మాజీ ఎంపీ డి.విఠల్‌రావు ఆకస్మిర మృతి జిల్లాకు తీరనిలోటని, ఆయన లేడన్న వా స్తవాన్ని జీర్ణించుకోలేమని పలు వురు నాయకులు సంతాపం ప్రకటించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంతురెడ్డి, ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌కుమార్, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జగ దీశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, మున్సిపల్ చైర్పర్సన్ రాధాఅమర్, కాంగ్రెస్ నాయకులు రంగారావు, శ్రీనివాసాచారి, బుర్రి వెంకట్ రాంరెడ్డి, సత్తూరు చంద్రకుమార్‌గౌడ్, పటేల్ వెంకటేశ్, అంజయ్య, లక్ష్మీకాంత్, అల్తాఫ్ హుసేన్, హనీఫ్, మాజీ కౌన్సిలర్ బెనహర్ తదితరులు ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ’పేట’లో.. నారాయణపేట : మాజీ ఎంపీ డి.విఠల్‌రావు మృతి పట్ల ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ శశికళ, వివిధ పార్టీల నాయకులు కేశవర్దన్‌రెడ్డి, గందెరవి, సరఫ్రాజ్ ప్రధాన సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి, అభిమానులకు తీరని లోటని మార్కెట్ మాజీ చైర్మన్ సుధాకర్, మాజీ ఏజీపీ అబ్ధుల్ సలీం సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు జడ్చర్ల : మాజీ ఎంపి విఠల్‌రావు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మాజీ ఎంపీ మల్లురవి అన్నారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. లగచర్లలో విషాదఛాయలు బొంరాస్‌పేట : మాజీ ఎంపీ విఠల్‌రావు ఆకస్మికం మృతి ఆయన స్వగ్రామం లగచర్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మండలకేంద్రంతో పాటు నాందార్‌పూర్, లగచర్ల, పోలెపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. రేగడిమైలారంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిం చారు. కార్యక్రమాల్లో నాయకులు వెంకటస్వామి గౌడ్, గోవర్ధన్, గోవింద్‌రెడ్డి, బలిజ శేఖర్, విశ్వనాథం, కృష్ణయ్య, శివకేశవ యువజన సం ఘం, బీఎస్ప నాయకులు వెంకటయ్య, శేఖర్, సాయకుమార్ తదితరులు ఉన్నారు. -
కాటేసిన కరెంటు తీగెలు
విద్యుదాఘాతానికి అన్నదమ్ముల దుర్మరణం రక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వైనం యలమంచిలిలో విషాదఛాయలు యలమంచిలి : విధి బలీయమైనది.. మృత్యువు అతి కర్కశమైనది.. ఎవరిని ఎప్పుడు ఎలా కాటేస్తుందో ఊహించలేం.. విద్యుత్ షాక్‌తో విలవిలాడుతున్న ఒక కూలీ యువకుడిని రక్షించేం దుకు వెళ్లిన అన్నదమ్ములు బుద్దా సత్యనారాయణ (65), బుద్దా బాపునాయుడు (62)లను మృత్యు రాబంధు తన్నుకుపోయింది. మొదట విద్యుత్‌షాక్‌కు గురైన యువకుడు ప్రాణాలతో బయటపడగా, అతన్ని రక్షించేందుకు వెళ్లిన సోదరులిద్దరూ క్షణాల్లో అసువులు బాశారు. వీరిద్దరు విద్యుత్‌శాఖలో పనిచేసి రిటైరయ్యారు. యల మంచిలిలో భూలోకమాంబ అమ్మవారి ఆలయం వద్ద జరి గిన ఈ దుర్ఘటనను చూసినవారంతా కన్నీటిపర్యంతమవుతున్నారు. తులసీనగర్‌లో భూలోకమాంబ అమ్మవారి ఆలయానికి సమీపాన కాళ్ల సత్యనారాయణ తన ఇంటిపై మొదటి అంతస్తు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సుంకర ఛత్రపతి అనే యువకుడు ఇనుప ఊచలను ఇంటిపైకి తీసుకెళ్తుండగా సమీపంలో 11కెవి తీగలు తగి లాయి. దీంతో ఆ యువకుడు రక్షించమని గట్టిగా అరిచా డు. ఆ ఇంటికి ఎదురుగా ఉన్న బుద్దా సత్యనారాయణ (65), బుద్దా బాపునాయుడు (62) వెంటనే అక్కడికి వెళ్లా రు. ఆ సమయంలో విద్యుత్తీగలపైనే ఇనుప ఊచలుండ టం, విద్యుత్ ప్రవాహం ఉండటంతో గమనించని సోదరులిద్దరూ ఊచల్లో ఇరుక్కున్న ఛత్రపతిని బయటకు తీసే క్రమంలో వారు కూడా విద్యుదాఘాతానికి బలయ్యారు. ఈ సంఘటనలో ఛత్రపతి గాయాలతో బయటపడగా, రక్షించేందుకు వెళ్లిన సోదరులు మరణించారు. . ఇంటి బయట అరుగుపై ఉదయం టిఫిన్ చేసి మాట్లాడుకుంటున్న సోదరులిద్దరినీ కరెంట్ తీగలు తమ కౌగిట బంధించాయి. ఒకేదగ్గర ఉన్న అన్నదమ్ముల మృతదేహాలను చూసిన వారంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన కూలీ యువకుడు ఛత్రపతిని తోటి కూలీలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కు తరలించారు. పేరుకే సోదరులయినా మంచి స్నేహితుల్లా ఉండేవారు.. మృతిచెందిన ఇద్దరూ స్థానికులందరికీ తలలో నాలుకలాఉండేవారు. సత్యనారాయణకు కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ వివాహాలు అయ్యాయి. బాపునాయుడికి భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు శ్రీను, ఇద్దరు కుమార్తెలున్నారు. సత్యనారాయణ డ్రైవర్‌గా పనిచేసి పదవీ విరమణ చేయగా, బాపునాయుడు లైన్‌మన్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఈ ఇద్దరినీ ఒకేసారి మృత్యువు కబళించడం స్థానికులను కలచివేసింది. పట్టణ పోలీసులు, యలమంచిలి రూరల్ ఎస్ఐ సిహెచ్.వెంకట్రావు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. -
గ్రంథశిరిలో విషాద ఛాయలు
గ్రంథశిరి (అచ్చంపేట): ఆసరాగా ఉంటారనుకున్న కుమారులు అర్ధంతరంగా మృత్యుఒడికి చేరడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రంథశిరి గ్రామానికి చెందిన బలిజేపల్లి దివ్యరాజు (19) చిలకా కిరణ్‌కుమార్(19, చిలకా కాలేబు ముగ్గురు అన్నాచెల్లిళ్ల సంతానం. ఆదివారం అంబడిపూడిలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు హాజరయ్యారు. మధ్యాహ్నం సరదాగా నదికి వెళ్లివస్తామని బంధువులకు చెప్పి కృష్ణా నదికి వెళ్లారు. దివ్యరాజు, కిరణ్‌కుమార్ ఈత కొట్టేందుకు నదిలో దిగగా, కాలేబు మాత్రము ఒడ్డునే ఉన్నాడు. ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు కాంట్రాక్టర్లు నదిలో లోతుగా తీసిన గోతుల వద్దకు వెళ్లి వీరిద్దరూ మునిగిపోతూ రక్షించండి అని బిగ్గరగా అరవడంతో కాలేబు నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. సమీపంలోని డింగీ పడవలలో చేపలు పడుతున్నవారు గమనించి రక్షించేందుకు నదిలోకి దూకినా ప్రయోజనం లేకపోయింది. కొద్దిసేపు గాలించి మృత దేహాలను వెలికితీశారు. కాలేబు ద్వారా గ్రామంలోని బంధువులకు, వారి ద్వారా తల్లిదండ్రులకు విషయం చేరవేశారు. హుటాహుటిన నది దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులు కుమారుల మృతదేహాలను చూసి తల్లఢిల్లిపోయారు. కూలి చేసి కుమారులను చదివించామని, చేతికి అందివచ్చేంతలో ఇలా జరిగిపోయిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలను స్వగ్రామమైన గ్రంథశిరికి తరలించారు. ఇద్దరూ ఇంటికి పెద్ద కుమారులే.. బలిజేపల్లి బాబు, జాన్సీలకు ఇద్దరు సంతానం. అందులో దివ్యరాజు పెద్ద కుమారుడు. ఇంటర్ వరకు చదివి, రెండు సబ్జెక్టులు తప్పడంతో ఆ సబ్టెక్టులు మళ్లీ రాసేందుకు ప్రిపేరవుతున్న తరుణంలో ఈ దారుణం జరిగింది. అలాగే చిలకా మోహనరావు, మార్తమ్మ దంపతులకు ఇరువురు సంతానం. ఇద్దరిలో కిరణ్‌కుమార్ పెద్దవాడు. ఇంటర్ పూర్తి చేసి టీటీటీ (టీచర్ ట్రైనింగ్ కోర్సు) ఎంట్రన్స్ రాసి సీటు కోసం వేచి ఉన్న తరుణంలో మృత్యువు ఇలా కబళించింది. వీరి తల్లిదండ్రులకు సెంటు భూమిలేదు. కూలిపనే జీవనాధారం. పెద్దకుమారులు చదువుకుని తమకు ఆసరాగా నిలబడతారని కష్టపడి చదివించారు. ఈ దుర్ఘటన జరగడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.