కాటేసిన కరెంటు తీగెలు
విద్యుదాఘాతానికి అన్నదమ్ముల దుర్మరణం
రక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వైనం
యలమంచిలిలో విషాదఛాయలు
యలమంచిలి : విధి బలీయమైనది.. మృత్యువు అతి కర్కశమైనది.. ఎవరిని ఎప్పుడు ఎలా కాటేస్తుందో ఊహించలేం.. విద్యుత్ షాక్‌తో విలవిలాడుతున్న ఒక కూలీ యువకుడిని రక్షించేం దుకు వెళ్లిన అన్నదమ్ములు బుద్దా సత్యనారాయణ (65), బుద్దా బాపునాయుడు (62)లను మృత్యు రాబంధు తన్నుకుపోయింది. మొదట విద్యుత్‌షాక్‌కు గురైన యువకుడు ప్రాణాలతో బయటపడగా, అతన్ని రక్షించేందుకు వెళ్లిన సోదరులిద్దరూ క్షణాల్లో అసువులు బాశారు. వీరిద్దరు విద్యుత్‌శాఖలో పనిచేసి రిటైరయ్యారు. యల మంచిలిలో భూలోకమాంబ అమ్మవారి ఆలయం వద్ద జరి గిన ఈ దుర్ఘటనను చూసినవారంతా కన్నీటిపర్యంతమవుతున్నారు.
తులసీనగర్‌లో భూలోకమాంబ అమ్మవారి ఆలయానికి సమీపాన కాళ్ల సత్యనారాయణ తన ఇంటిపై మొదటి అంతస్తు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సుంకర ఛత్రపతి అనే యువకుడు ఇనుప ఊచలను ఇంటిపైకి తీసుకెళ్తుండగా సమీపంలో 11కెవి తీగలు తగి లాయి. దీంతో ఆ యువకుడు రక్షించమని గట్టిగా అరిచా డు. ఆ ఇంటికి ఎదురుగా ఉన్న బుద్దా సత్యనారాయణ (65), బుద్దా బాపునాయుడు (62) వెంటనే అక్కడికి వెళ్లా రు. ఆ సమయంలో విద్యుత్‌తీగలపైనే ఇనుప ఊచలుండ టం, విద్యుత్ ప్రవాహం ఉండటంతో గమనించని సోదరులిద్దరూ ఊచల్లో ఇరుక్కున్న ఛత్రపతిని బయటకు తీసే క్రమంలో వారు కూడా విద్యుదాఘాతానికి బలయ్యారు. ఈ సంఘటనలో ఛత్రపతి గాయాలతో బయటపడగా, రక్షించేందుకు వెళ్లిన సోదరులు మరణించారు. . ఇంటి బయట అరుగుపై ఉదయం టిఫిన్ చేసి మాట్లాడుకుంటున్న సోదరులిద్దరినీ కరెంట్ తీగలు తమ కౌగిట బంధించాయి. ఒకేదగ్గర ఉన్న అన్నదమ్ముల మృతదేహాలను చూసిన వారంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన కూలీ యువకుడు ఛత్రపతిని తోటి కూలీలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్‌కు తరలించారు.
పేరుకే సోదరులయినా మంచి స్నేహితుల్లా ఉండేవారు..
మృతిచెందిన ఇద్దరూ స్థానికులందరికీ తలలో నాలుకలాఉండేవారు. సత్యనారాయణకు కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ వివాహాలు అయ్యాయి. బాపునాయుడికి భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు శ్రీను, ఇద్దరు కుమార్తెలున్నారు. సత్యనారాయణ డ్రైవర్‌గా పనిచేసి పదవీ విరమణ చేయగా, బాపునాయుడు లైన్‌మన్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఈ ఇద్దరినీ ఒకేసారి మృత్యువు కబళించడం స్థానికులను కలచివేసింది. పట్టణ పోలీసులు, యలమంచిలి రూరల్ ఎస్‌ఐ సిహెచ్.వెంకట్రావు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు.