24-Year-Old Nandyal Jawan Died In Jammu & Kashmir Terrorist Attack - Sakshi
Sakshi News home page

కుటుంబానికి పెద్ద దిక్కై.. దేశ సేవలో అమరుడై..

Published Wed, Aug 2 2023 9:44 AM | Last Updated on Wed, Aug 2 2023 3:16 PM

24 Years Old Nandyal Jawan Died In jammu Kashmir Terrorist attack - Sakshi

ఆ తల్లి కలలు చెదిరిపోయాయి. ఆ తండ్రి ఆశలు ఆవిరయ్యాయి. తమ కుమారుడు సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తున్నాడని గర్విస్తున్న తల్లిదండ్రులకు ఆనందం అంతలోనే ఆవిరైంది. మరో రెండు నెలల్లో సెలవులకు వస్తానని చెప్పిన రెండు రోజులకే విగతజీవిగా ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. దేశ సరిహద్దులో ఉగ్రవాదుల దాడిలో నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణానగర్‌కు చెందిన జవాన్‌ శిరిగిరి సురేంద్ర వీర మరణం పొందారు. నిన్న మొన్నటి వరకు కళ్లెదుట తిరగాడిన యువకుడు ఇక లేడనే చేదు నిజాన్ని ఆ గ్రామం జీర్ణించుకోలేకపోతుంది. 

నంద్యాల: దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో సురేంద్ర (ఆర్మీ నెం:15631599కే) నాలుగేళ్ల క్రితం సైన్యంలో చేరారు. ప్రస్తుతం బారాముల్లా ఆర్‌ఆర్‌ బెటాలియన్‌ యూనిట్‌ నెంబర్‌ 46లో విధులు నిర్వహిస్తూ జూలై 31వ తేదీ మధ్యాహ్నం జరిగిన మిలిటెంట్‌ ఆపరేషన్‌లో వీర మరణం పొందారు. సురేంద్ర సొంతూరు పాములపాడు మండలం మద్దూరు గ్రామ పంచాయతీలోని మజరా కృష్ణానగర్‌ గ్రామం. గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం.

కుమార్తెకు వివాహమైంది. ఎకరా పొలం సాగు చేసుకుంటూ ఇద్దరు కుమారులను బాగా చదివించారు. పెద్ద కుమారుడు సుమన్‌ బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా, చిన్న కుమారుడు సురేంద్ర 2019లో ఆర్మీలో చేరారు. నాలుగు నెలల క్రితం సెలవుపై గ్రామానికి వచ్చి రెండు నెలలు కుటుంబీకులతో ఆనందంగా గడిపాడు. తిరిగి వెళ్లిన రెండు నెలలకే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సురేంద్ర మృతితో విషాదం నెలకొంది.

ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని సోమవారం సాయంత్రం శ్రీనగర్‌కు చేర్చారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం శంషాబాద్‌కు విమానంలో తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి వాహనంలో అర్ధరాత్రి కృష్ణానగర్‌కు తరలించారు. విగతజీవిగా తిరిగి వచ్చిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. బుధవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తహసీల్దార్‌ రత్నరాధిక, ఎంపీడీఓ గోపీకృష్ణ, ఈఓపీఆర్డీ శ్రీనివాసనాయుడు గ్రామానికి చేరుకుని జవాన్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు.  
 
నాన్నకు డబ్బులు పంపి.. అన్నకు మెసేజ్‌ చేసి..  
ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన సురేంద్ర తరచూ కుటుంబీకులతో ఫోన్‌లో మాట్లాడుతూ ఇక్కడి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ అక్కడి విషయాలు పంచుకునేవారు. తల్లిదండ్రులతో వీడియో కాల్‌ చేసి మాట్లాడుతుండేవారు. ఈ విషాద ఘటనకు ముందు రోజు ఆదివారం తల్లి సుబ్బమ్మకు ఫోన్‌ చేసి సెలవులు మంజూరయ్యాయని, సెపె్టంబర్‌ నెలాఖరులో ఇంటికొస్తానని ఆనందంగా చెప్పారు.

అలాగే మరణానికి కొన్ని గంటల ముందు సోమవారం ఉదయం 9.30 గంటలకు తండ్రి సుబ్బయ్య బ్యాంక్‌ ఖాతాలో కొంత డబ్బు జమ చేశాడు. ఆ విషయాన్ని తన సోదరుడు సుమన్‌ సెల్‌కు మెసేజ్‌ ద్వారా తెలిపారు. ఆ తర్వాత మూడు గంటల్లోనే మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సుబ్బయ్యకు ఆర్మీ అధికారులు ఫోన్‌ చేసి కుమారుడి మరణం గురించి తెలపడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది.

తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జవాన్‌ సురేంద్ర 1 నుంచి 7వ తరగతి వరకు కృష్ణానగర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు పాములపాడు జెడ్పీ స్కూల్‌లో చదివారు. ఇంటర్మీడియట్ ఆత్మకూరు పట్టణంలోని ఆదిత్య జూనియర్‌ కళాశాలలో, డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్‌ వెలుగోడులో పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుకుగా ఉండే సురేంద్ర 2019 మార్చి 31న ఆర్మీలో చేరారు. కాగా సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అదే 31వ తేదీన వీర మరణం పొందడం విషాదం.   

మాజీ సైనికుల సంక్షేమ సంఘం సంతాపం 
కర్నూలు(అర్బన్‌): వీర జవాన్‌ సురేంద్ర మృతి పట్ల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షలు నర్రా పేరయ్య, కార్యదర్శి ఎం సుధాకర్, కోశాధికారి నజీర్‌అహమ్మద్‌ తదితరులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బుధవారం కృష్ణానగర్‌లో జరిగే అంత్యక్రియలకు జిల్లా సైని క సంక్షేమ అధికారిణి ఆర్‌ రత్నరూత్, ఎన్‌సీసీ గ్రూప్‌ నుంచి సుబేదార్‌ రవీంద్రసింగ్‌తో పాటు తాము కూడా హాజరవుతున్నట్లు తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement