Surendra
-
Nithari Killings: నిఠారి వరుస హత్యల కేసులో దోషులకు విముక్తి
ప్రయాగ్‌రాజ్/న్యూఢిల్లీ: 2006 నాటి నిఠారి వరుస హత్యల కేసులో నిందితులుగా మణీందర్ సింగ్ పంధేర్, పని మనిషి సురేంద్ర కోలీలకు అలహాబాద్ హైకోర్టు విముక్తి కల్పించింది. వారికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. నోయిడాలోని ఓ బంగ్లా వెనుక 8 మంది చిన్నారుల ఎముకలు కనిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఇద్దరూ కలిసి పలువురు బాలికలపై లైంగికదాడికి, దారుణ హత్యలకు పాల్పడటంతోపాటు నరమాంస భక్షకులుగా మారినట్లు కూడా ఆరోపణలొచ్చాయి. అత్యాచారం, హత్య నేరాలకు పాల్పడిన వీరిద్దరికీ ఘజియాబాద్‌లోని సీబీఐ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ పంధేర్, కోలీలు వేసిన పిటిషన్‌ను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్హెచ్ఏ రిజ్విల ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎటువంటి సందేహాలకు తావు లేకుండా వీరిద్దరికీ వ్యతిరేకంగా కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు ధర్మాసనం పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు తాజా తీర్పుతో పంధేర్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైందని ఆయన లాయర్ మనీషా భండారి చెప్పారు. అయితే, మరో కేసులో జీవిత ఖైదు శిక్షపడిన కోలీ మాత్రం జైలులోనే ఉంటాడని అన్నారు. తీర్పు ప్రతి అందాక తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.2007లో పంధేర్, కోలీలపై 19 కేసులు నమోదయ్యాయి. అయితే, సాక్ష్యాలు దొరకలేదంటూ మూడు కేసుల్లో మాత్రమే సీబీఐ అభియోగ పత్రాలు నమోదు చేయగలిగింది. మిగతా 16 కేసులకుగాను మూడు కేసుల నుంచి కోలీ బయటపడ్డాడు. ఒక కేసులో విధించిన మరణశిక్షను కోర్టు జీవిత ఖైదుగా మార్చింది. కోలీకి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. తాజాగా అలహాబాద్ కోర్టు తీర్పుతో 12 కేసుల నుంచి అతడికి విముక్తి లభించింది. అదే సమయంలో, పంధేర్‌పై ఉన్న ఆరు కేసుల్లో, ఒకటి సీబీఐ వేసింది కాగా, మరో అయిదు బాధితుల కుటుంబాలవి. గతంలో సెషన్స్ కోర్టు అతడిపై ఉన్న మూడు కేసులను కొట్టివేసింది. మిగతా మూడింటిలో 2009లో ఒకటి, తాజాగా అలహాబాద్ కోర్టు తీర్పుతో రెండు కేసుల నుంచి పంధేర్ బయటపడినట్లయిందని అతడి లాయర్ చెప్పారు. కోలీ ఘజియాబాద్ కారాగారంలో, అతడి మాజీ యజమాని పంధేర్ నోయిడా జైల్లో ఉన్నారు. -
దిశా కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: దిశా కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ అధికారిగా పనిచేసిన పోలీసు అధికారి సురేంద్ర స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వీఆర్ఎస్ కోసం డీజీపీ అంజనీ కుమార్ యాదవ్‌కు దరఖాస్తు సమర్పించారు. ఇటీవల తరుచూ బదిలీలపై అసంతృప్తితో ఉన్నాయన వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా దిశా నిందితుల ఎన్కౌంటర్ సమయంలో సురేంద్ర షాద్ నగర్ ఏసీపీగా ఉన్నారు. దిశ కేసు విచారణ అధికారిగా పనిచేశారు. తరువాత ట్రాన్స్‌కో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా పనిచేశారు. సురేంద్రను ఇటీవలె సైబరాబాద్ కమాండర్ కంట్రోల్ విభాగానికి ఏసీపీగా బదిలీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన స్వచ్చంద పదవీ విమరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించారు. అయితే వీఆర్ఎస్కు వ్యక్తిగత కారణాలను చూపుతున్నప్పటికీ.. తరచుగా బదిలీలు, లూప్ లైన్ పోస్టింగ్‌లు పొందడం పట్ల సురేందర్ కలత చెందినట్టుగా తెలుస్తోంది. ఇక సురేందర్‌కు మరో మూడేళ్ల సర్వీసు ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. చదవండి: మంచిర్యాల: పీఎస్‌లో కుప్పకూలిన నిందితుడు -
అమర జవాన్‌కు ఆఖరి వందనం
పాములపాడు: ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ సిరిగిరి సురేంద్ర (24) అంత్యక్రియలు ముగిశాయి. దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో సురేంద్ర నాలుగేళ్ల క్రితం సైన్యంలో చేరారు. కశ్మీర్‌లోని బారాముల్లా ఆర్మీ బెటాలియన్ యూనిట్ నంబర్ 46లో విధులు నిర్వహిస్తూ జూలై 31న జరిగిన మిలిటెంట్ ఆపరేషన్‌లో వీర మరణం పొందారు. మృతదేహాన్ని మంగళవారం అర్ధరాత్రి నంద్యాల జిల్లా కృష్ణానగర్‌కు తీసుకువచ్చారు. బుధవారం కృష్ణానగర్ గ్రామానికి నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, తహశీల్దార్ రత్నరాధిక, ఎంపీడీవో గోపీకృష్ణ చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్మీ అధికారులు భౌతికకాయంపై జాతీయ పతాకాన్ని కప్పి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ రామాంజనాయక్ ఆధ్వర్యంలో ఏఆర్ బృందం 3 సార్లు గాల్లోకి కాల్పులు జరపగా సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. సురేంద్ర కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్థర్ తెలిపారు. దేశం కోసం తమ చిన్న కుమారుడు సురేంద్ర ప్రాణాలు వదిలాడని, తమను పోషించాల్సిన బాధ్యత పెద్ద కుమారుడిపై ఉందని, అతడికి ఉద్యోగం కలి్పంచాలని తల్లిదండ్రులు సుబ్బయ్య, సుబ్బమ్మ కోరారు. -
కుటుంబానికి పెద్ద దిక్కై.. దేశ సేవలో అమరుడై..
ఆ తల్లి కలలు చెదిరిపోయాయి. ఆ తండ్రి ఆశలు ఆవిరయ్యాయి. తమ కుమారుడు సైన్యంలో చేరి దేశానికి సేవ చేస్తున్నాడని గర్విస్తున్న తల్లిదండ్రులకు ఆనందం అంతలోనే ఆవిరైంది. మరో రెండు నెలల్లో సెలవులకు వస్తానని చెప్పిన రెండు రోజులకే విగతజీవిగా ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. దేశ సరిహద్దులో ఉగ్రవాదుల దాడిలో నంద్యాల జిల్లా పాములపాడు మండలం కృష్ణానగర్‌కు చెందిన జవాన్ శిరిగిరి సురేంద్ర వీర మరణం పొందారు. నిన్న మొన్నటి వరకు కళ్లెదుట తిరగాడిన యువకుడు ఇక లేడనే చేదు నిజాన్ని ఆ గ్రామం జీర్ణించుకోలేకపోతుంది. నంద్యాల: దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో సురేంద్ర (ఆర్మీ నెం:15631599కే) నాలుగేళ్ల క్రితం సైన్యంలో చేరారు. ప్రస్తుతం బారాముల్లా ఆర్ఆర్ బెటాలియన్ యూనిట్ నెంబర్ 46లో విధులు నిర్వహిస్తూ జూలై 31వ తేదీ మధ్యాహ్నం జరిగిన మిలిటెంట్ ఆపరేషన్‌లో వీర మరణం పొందారు. సురేంద్ర సొంతూరు పాములపాడు మండలం మద్దూరు గ్రామ పంచాయతీలోని మజరా కృష్ణానగర్ గ్రామం. గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కుమార్తెకు వివాహమైంది. ఎకరా పొలం సాగు చేసుకుంటూ ఇద్దరు కుమారులను బాగా చదివించారు. పెద్ద కుమారుడు సుమన్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉండగా, చిన్న కుమారుడు సురేంద్ర 2019లో ఆర్మీలో చేరారు. నాలుగు నెలల క్రితం సెలవుపై గ్రామానికి వచ్చి రెండు నెలలు కుటుంబీకులతో ఆనందంగా గడిపాడు. తిరిగి వెళ్లిన రెండు నెలలకే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సురేంద్ర మృతితో విషాదం నెలకొంది. ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని సోమవారం సాయంత్రం శ్రీనగర్‌కు చేర్చారు. అక్కడి నుంచి మంగళవారం ఉదయం శంషాబాద్‌కు విమానంలో తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి వాహనంలో అర్ధరాత్రి కృష్ణానగర్‌కు తరలించారు. విగతజీవిగా తిరిగి వచ్చిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. బుధవారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తహసీల్దార్ రత్నరాధిక, ఎంపీడీఓ గోపీకృష్ణ, ఈఓపీఆర్డీ శ్రీనివాసనాయుడు గ్రామానికి చేరుకుని జవాన్ కుటుంబసభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు. నాన్నకు డబ్బులు పంపి.. అన్నకు మెసేజ్ చేసి.. ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన సురేంద్ర తరచూ కుటుంబీకులతో ఫోన్లో మాట్లాడుతూ ఇక్కడి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ అక్కడి విషయాలు పంచుకునేవారు. తల్లిదండ్రులతో వీడియో కాల్ చేసి మాట్లాడుతుండేవారు. ఈ విషాద ఘటనకు ముందు రోజు ఆదివారం తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి సెలవులు మంజూరయ్యాయని, సెపె్టంబర్ నెలాఖరులో ఇంటికొస్తానని ఆనందంగా చెప్పారు. అలాగే మరణానికి కొన్ని గంటల ముందు సోమవారం ఉదయం 9.30 గంటలకు తండ్రి సుబ్బయ్య బ్యాంక్ ఖాతాలో కొంత డబ్బు జమ చేశాడు. ఆ విషయాన్ని తన సోదరుడు సుమన్ సెల్‌కు మెసేజ్ ద్వారా తెలిపారు. ఆ తర్వాత మూడు గంటల్లోనే మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సుబ్బయ్యకు ఆర్మీ అధికారులు ఫోన్ చేసి కుమారుడి మరణం గురించి తెలపడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జవాన్ సురేంద్ర 1 నుంచి 7వ తరగతి వరకు కృష్ణానగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు పాములపాడు జెడ్పీ స్కూల్లో చదివారు. ఇంటర్మీడియట్ ఆత్మకూరు పట్టణంలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో, డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ వెలుగోడులో పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుకుగా ఉండే సురేంద్ర 2019 మార్చి 31న ఆర్మీలో చేరారు. కాగా సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అదే 31వ తేదీన వీర మరణం పొందడం విషాదం. మాజీ సైనికుల సంక్షేమ సంఘం సంతాపం కర్నూలు(అర్బన్): వీర జవాన్ సురేంద్ర మృతి పట్ల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షలు నర్రా పేరయ్య, కార్యదర్శి ఎం సుధాకర్, కోశాధికారి నజీర్‌అహమ్మద్ తదితరులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. బుధవారం కృష్ణానగర్‌లో జరిగే అంత్యక్రియలకు జిల్లా సైని క సంక్షేమ అధికారిణి ఆర్ రత్నరూత్, ఎన్సీసీ గ్రూప్ నుంచి సుబేదార్ రవీంద్రసింగ్‌తో పాటు తాము కూడా హాజరవుతున్నట్లు తెలిపారు. -
రేబిస్‌తో ఉన్మాదిగా మారి చంపి తిన్నాడు!
జైపూర్: రాజస్తాన్‌లో ఒళ్లు జలదరించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వృద్ధురాలిని చంపి, ఆమె మాంసం తిన్నాడు. ముంబైలో ఉండే సురేంద్ర ఠాకూర్(24) ఇటీవలే తన సొంత పాలి జిల్లా సెండ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరధనా గ్రామానికి వచ్చాడు. పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్న అతడు శుక్రవారం పొలంలో పశువులు మేపుకుంటూ ఉన్న శాంతిదేవి(65)ని బండరాయితో మోది చంపేశాడు. అనంతరం ఆమె మాంసం తిన్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని అతికష్టమ్మీద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హత్య, నరమాంసభక్షణ నేరం కింద పోలీసులు కేసు పెట్టారు. ఠాకూర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. రేబిస్ వ్యాధి(హైడ్రోఫోబియా) బాధితుల్లో వ్యాధి ముదిరితే చివరి దశలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. -
డిగ్రీ చదివి చిన్నచిన్న ఉద్యోగాలు.. కౌజు పిట్టల పెంపకంతో లాభాలు
పిఠాపురం: కౌజు పిట్టల పెంపకం చేపట్టి అభివృద్ధి బాటలో నడుస్తున్నాడు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు రామరాఘవపురానికి చెందిన దొడ్డి సురేంద్ర. వ్యవసాయ కుటుంబానికి చెందిన సురేంద్ర గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. కొంతకాలం చిన్నచిన్న ఉద్యోగాలు చేసాడు. సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కౌజు పిట్టల పెంపకం చేపట్టాడు. తక్కువ పెట్టుబడితో చిన్న కౌజు పిట్టల (క్వయిల్) ఫామ్ ప్రారంభించాడు. సొంత పొలంలోనే షెడ్లు వేసి 100 పిట్టల్ని పెంచడం ప్రారంభించాడు. రెండేళ్లలోనే ఆ ఫామ్ 10 వేల పిట్టల సామర్థ్యానికి పెరగ్గా.. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఐదారు వారాల్లోనే పెరుగుతాయి భారతదేశంలో కౌజు పిట్టల పెంపకం, విక్రయం, వాటిని చంపడంపై నిషేధం ఉండటంతో జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న కౌజు పిట్టల పెంపకం చేపడుతున్నారు రైతులు. ఒక కోడిని పెంచే స్థలంలో 8 కౌజు పిట్టలను పెంచవచ్చు. కొవ్వు తక్కువగా.. ప్రొటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉండటంతో వీటిని తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు మాంసాహార ప్రియులు. ఐదు వారాల్లోనే ఇవి అమ్మకానికి సిద్ధమవడంతోపాటు గుడ్లు కూడా పెడతాయి. ఒక్కో కౌజు పిట్ట ఏడాదికి సుమారు 250 వరకు గుడ్లు పెడతాయి. వీటి మాంసం, గుడ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించాను సొంతంగా వ్యాపారం చేయాలనేది నా కోరిక. నా స్నేహితుల ద్వారా కౌజు పిట్టల పెంపకం గురించి తెలుసుకుని మా పొలంలో చిన్న పాక వేసి వీటి పెంపకం ప్రారంభించాను. ఏడాదిలోనే వ్యాపారం పెరిగింది. నెలకు 10 వేల పిట్టల్ని అమ్మే విధంగా పెంపకం చేస్తున్నాను. కోరుకొండ నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి ఇక్కడ పెంచుతున్నాను. ఒకరోజు పిల్ల ఒక్కొక్కటి రూ.9కి దొరుకుతుంది. ఒక్కొక్క పిల్ల పెంచడానికి రూ.20 వరకు ఖర్చవుతుంది. నెల రోజులు పెంచితే ఒక్కో పిట్ట రూ.45 నుంచి రూ.50 వరకు వస్తుంది. గుడ్లు పొదిగే యంత్రాలను కొనుగోలు చేసి సొంతంగా గుడ్లు కొని పిల్లల్ని ఇక్కడే తయారు చేయాలనుకుంటున్నాను. ఫంక్షన్లకు, డాబాలు, రెస్టారెంట్లకు వీటిని సరఫరా చేస్తున్నాం. – దొడ్డి సురేంద్ర, కౌజు పిట్టల పెంపకందారు డిమాండ్ బాగుంది కౌజు పిట్టలకు డిమాండ్ బాగుంది. క్వయిల్ ఫామ్‌లు తక్కువగా ఉండటం వల్ల వీటికి డిమాండ్ ఎక్కువ ఉంది. వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల పెద్దగా వైద్య అవసరాలు ఉండవు. మన వాతావరణంలో బాగా పెరుగుతాయి. కేవలం దాణా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. – డాక్టర్ హిమజ, పశు వైద్యాధికారి, గొల్లప్రోలు -
వలస పక్షులు
‘‘ఎల్లుండే గదా అమ్మోరి జోతులు వూర్లో మొదులు. ఈ ఎనిమిదొందలు ఎత్తుకోని పోయి గుర్రంకొండలో అమ్మోరికి మంచి చీర కొనుక్కురండి నువ్వూ, నీ పెళ్లాము. తొలిపూజ మనదే గదా’’ కొడుకు సురేంద్ర చేతిలో డబ్బుపెట్టి చెప్పినాడు నారప్ప.‘‘మింగేదానికి మెతుకులే, మీసాలకు వాసన నూనె రాసినడంట ఎవడో. అట్లా వుంది మీ నాయనా కొడుకుల యవ్వారం’’ అని గొణుక్కుంటూ ఆ డబ్బులను ట్రంకుపెట్టె అడుగున దాచింది సరోజ. సరోజ ఏదో గొణుక్కుంటూ మధ్యాన్నం సంగటి, శనక్కాయల పచ్చడి చేయడానికి వంటింట్లోకి దూరింది. రెండు గదులుండే ఆ పెంకుటింట్లోంచి లయబద్ధంగా మగ్గం చప్పుడు వినిపిస్తోంది, రెండు మగ్గాల్లోంచి.చిత్తూరు జిల్లా కలకడ దగ్గరుండే కోన గ్రామంలో వందకు పైగా చేనేత మగ్గాలున్నాయి. వాటిల్లో ఎక్కువగా నూరో నెంబరు లుంగీలు, నూలు చీరలు తయారౌతున్నాయి. గుడియాత్రం నుండి పది రోజులకొకసారి వచ్చే అరవ ఆసాములు లుంగీలకు పడుగు ఇచ్చి, తయారైన లుంగీలను చేనేత పనివాళ్ల నుండి తీసుకొని, వాళ్లకు కూలీలిచ్చి వెళ్లిపోతూ వుంటారు. నూలు చీరలు కొందరు సమీపంలోని మదనపల్లెకు తీసుకెళ్లి అమ్ముకొస్తూ వుంటారు.నూకల నారప్ప కుటుంబం అనాదిగా ఆ గ్రామంలోనే చేనేత వృత్తిలో జీవనం సాగిస్తూ వుంది. తండ్రి వేసిన పూరి గుడిసెను తొలగించి నారప్ప అదే జాగాలో చిన్న పెంకుటింటిని కట్టించాడు. అతని భార్య లచ్చిందేవి కూడా ఇంట్లో నూలు వడకడం, కండెలు చుట్టడం చేసేది. వారి ఇద్దరి కొడుకుల్లో పెద్దవాడు హరి తిరుమలలో సెక్యూరిటీ గార్డుగా కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ భార్యా పిల్లలతో తిరుపతిలో వుంటున్నాడు. సురేంద్ర పదో తరగతితో చదువు చాలించి అనువంశిక వృత్తిౖయెన చేనేత పనిలో దిగాడు. కొడుకు ఒక రేకుల షెడ్డు వేయించి, అందులోనే మగ్గం ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలంగా లచ్చిందేవి ఆస్తమాతో మంచం పడ్తే, ఇంట్లో పనంతా సురేంద్ర భార్య సరోజే చేస్తూ వుంది. లచ్చిందేవి మందులకూ, ఇన్హేలర్లకూ చాలా ఖర్చవుతూ వుంది నారప్పకు. అది తలకు మించిన భారమే అతనికి.ప్రతి ఉగాదికి ఆ గ్రామంలోని చౌడేశ్వరి దేవాలయంలో మూడు రోజులపాటు ఘనంగా చౌడేశ్వరీ జ్యోతులు అనే వుత్సవాలు జరుగుతాయి. అనాదిగా నారçప్ప వంశమే అమ్మవారికి తొలిపూజ చేసి చీర, సారె సమర్పించడం జరుగుతూ వుంది. ఉత్సవాల్లో భాగంగా జంతు బలులు, ఆటపాటలు కోలాహలంగా మూడు రోజులూ సాగుతూ వుంటాయి. ఆ జ్యోతులకే నారప్ప కొడుక్కు డబ్బులిచ్చి అమ్మవారికి మంచి చీర కొనుక్కొని రమ్మని చెప్పాడు. ‘‘ఇద్దో నిన్నే, ఈ వూర్లో వుండి నువ్వెంత బండ చాకిరీ చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే. మనకి ఇద్దురూ ఆడపిలకాయలే. రేపు వాళ్ల పెళ్లిళ్లకూ, కట్నాలకూ డబ్బులు జమ చేయాలి గదా! ఈ వూళ్లో వాళ్ల సదువులు అరాకొరగా వుండాయి. మదనపల్లెలో పట్టు మగ్గాలనేసేవోళ్లకు దండిగా అడ్వాన్సులిచ్చి పన్లో పెట్టుకుంటారు గదా. మజూరీలు అక్కడ శానా వుంటాదంట. రమక్క చెప్పింది. నా మాటిని మదనపల్లికి ఎలబారి ఆడ పన్లో చేరు. పిలకాయలనూ కాన్వెంట్లో ఎయ్యచ్చు. వాళ్ల సదువులకూ బంగారానికీ దుడ్లు ఎగేసి బాంకిలో ఏసుకోవచ్చు’’ భర్త సురేంద్రను పోరసాగింది సరోజ.‘‘కరెక్టే. కానీ అమ్మా నాయనలను ఒంటిగా వొదిలి...’’ నసుగుతూ అన్నాడు సురేంద్ర సందేహంగా.‘‘నీ మొహం! మీ అమ్మిప్పుడు లేచి బాగా తిరగతా వుండాది గదా. వంట గూడా చేస్తా వుండాది. వారానికొకసారొచ్చి మీ అమ్మ నాయనలను చూసి రావచ్చు’’ నిష్ఠూరంగా చెప్పింది సరోజ.‘‘సరే సరే. మనూరి పిలకాయలు కొందురాడ మగ్గం నేస్తా వుండారు. వాళ్లను పని గురించి అడిగి చూస్తా’’ భార్యను సముదాయించాడు సురేంద్ర. ‘‘సొంతూరినీ, సొంతింటినీ వదిలి ఆ టౌన్లో ఏమవస్థలు పడతావు నాయనా, ఈడనే అమ్మ నాయన్ను సూసుకుంటూ వుండిపోగూడదా’’ బీడీ దమ్ములాగి పొగ వదులుతూ అన్నాడు రామయ్య. ఆయన సురేంద్రకు మేనమామ వరస, నారప్ప పక్క ఇంట్లోనే వున్నాడు.‘‘ఈడుంటే ఎప్పటికీ పైకి రాలేము. పిలకాయలకు కాన్వెంటు చదూలు అవసరం గదా ఈ కాలానికి. మదనపల్లెలో ఇస్కూళ్లు బాగా వుంటాయి. మజూరీలు బాగుంటాయి’’ అన్నాడు సురేంద్ర.నులక మంచం మీదున్న నారప్ప ఇబ్బందిగా కదిలాడు. అతనికి, అతని భార్యకూ కొడుకు పరాయి వూరుకు పోయి పనిలో చేరడం ఎంత మాత్రం ఇష్టం లేదు.‘‘అది కాదురా, ఈ వూర్లో జ్యోతులకు మనదే తొలిపూజ గదా. వూరు వదిలితే వొంతు తప్పిపోతుందేమో. రేపు నాకేమైనా ఐతే, నువ్వే గదా ఆ పూజ చెయ్యాల’’ అన్నాడు నారప్ప, దిగాలుగా.‘‘పూజదేముండాది! ఆ టైముకొస్తే సరిపోతుంది. అన్నేమైనా ఈ వూర్లోనే పడుండాడా? పిలకాయలను తిరపతి కాన్వెంట్లో చదివిచ్చుకుంటా హాయిగా టౌన్లో వున్నాడు. మొన్న జోతులకూ రాలేదు’’ అన్నాడు సురేంద్ర. ‘‘సరే నీ ఇష్టం’’ అన్నాడు నారప్ప నిర్వికారంగా. సురేంద్ర స్నేహితుడు, అదే వూరివాడైన నాగరాజు రెండేండ్లుగా మదనపల్లెలో మునస్వామి అనే ఆసామి దగ్గర పనిచేస్తూ వున్నాడు. మదనపల్లె శివార్లలో వున్న నీరు గట్టువారిపల్లెలో మూడు వేలకు పైగా కార్మికులు పట్టు మగ్గాలు నేస్తూ జీవనం కొనసాగిస్తూ వున్నారు. మునస్వామికి నీరుగట్టు పల్లెలో రెండు మగ్గాల షెడ్లున్నాయి. ఒక్కో షెడ్లో పన్నెండేసి పట్టుమగ్గాలున్నాయి. ఒక్కో పటు చీర నేసినందుకు ఎనిమిది వందల మజూరీ! నెలలో పన్నెండు చీరల సాపునేసి సులభంగా పదివేల దాక సంపాదించవచ్చు. ఇంకొంచెం కష్టపడేవాళ్లకు అదనపు ఆదాయం లభిస్తుంది.నాగరాజు యజమానితో సురేంద్ర పనితనం గురించి చాల పొగిడి, ‘‘పిలకాయలుండేవాడు, లక్ష రూపాయలైనా అడ్వాన్సు ఇప్పించండి. మదనపల్లెలో సంసారం పెట్టుకొని బతకాల’’ అన్నాడు.మునస్వామి నవ్వి, ‘‘మగ్గాల యాపారం ఇప్పుడేడ గిట్టుబాటవుతావుందిరా? రేషం రేట్లు అదిరిపోతా వుండాయి. జరీ, సప్పురీ అన్ని రేట్లు కొండెక్కి కూచోనుండాయి. రంగులద్దేవోళ్లకు, అల్లు పట్టేదానికీ, అచ్చులతికేవోళ్లకు నెలనెలా ఖర్చులౌతా వుండాయి భారీగా. పట్టుచీరల రేట్లు ఏమీ పెరగడం లే. యాభై వేలకు మించి ఈలేను. ఇష్టమైతే చేరమను, లేకపోతే లే’’ అన్నాడు కటువుగా. సురేంద్ర, నాగరాజు ప్రాధేయపడితే, మగ్గాల ఆసామి మునస్వామి బాండు రాయించుకొని సురేంద్రకు అడ్వాన్సిచ్చేదానికి ఒప్పుకున్నాడు.‘‘ఈ యబ్బి ఈడేంటుంటాడు? మా బిల్డింగ్‌లోనే వుండమను. ఒక రూమెట్లా నెల లాస్టులో కాళీ జేతా వుండాది’’ వక్కపొడి నములుతూ చెప్పా మునస్వామి. మునస్వామికి పన్నెండు చిన్న పోర్షన్లుండే ఒక మూడంతస్థుల భవనం ఉంది. ఒక గది, వంట గది వుండే, అగ్గిపెట్టెల్లాంటి పోర్షన్లున్నాయి అందులో. ఆ ఇరుకు ఇళ్లలోనే అతని వద్ద మగ్గాలు నేసే పనివాళ్లు వుంటుంటారు.పిచ్చుక గూడులాంటి ఆ ఇంటిని చూశాక తాము నలుగురం కష్టం మీద ఆ ఇంట్లో సర్దుకోవచ్చనుకున్నాడు సురేంద్ర. కానీ ఆ ఇంటి బాడుగ నెలకు మూడు వేలని విన్నాక అతని గుండె గుభేలుమంది.‘‘ఈ టౌన్లో ఇంతకన్నా తక్కువ బాడిక్కి నీకు ఇల్లు దొరికేది కట్టమే. ఇది దొరికిందే లక్కు. నా మాటిని చేరిపో’’ అన్నాడు నాగరాజు.ఆ ఇంటికి ఐదు నెలల అడ్వాన్సు పదహైదు వేలు పట్టుకొని సురేంద్ర పనిలో చేరాక, అతనికి ముప్పై ఐదు వేల అడ్వాన్సు ముట్ట చెప్పాడు మగ్గాల ఆసామి మునస్వామి. మంచి రోజు చూసుకొని భార్య, పిల్లలను పల్లె నుండి తీసుకొని వచ్చి ఆ ఇంట్లో దిగాడు సురేంద్ర. తండ్రితో కలసి వున్నప్పుడు ఖర్చులు తెలిసి రాలేదు సురేంద్రకు. వేరు కాపురం అంటే అన్ని వస్తువులు కొనాల్సిందే గదా. ఏది లేకపోయినా జరగదు అని అతనికి కొద్దికాలానికే తెలిసొచ్చింది.గ్యాసు కనెక్షన్‌కు మూడు వేలు, టీవీకి ఐదు వేలు, కుర్చీలు, పాత్రలు, బీరువా, మంచం, పిల్లలకు కాన్వెంట్లో ఫీజులు అన్నీ కలిపి ఇరవై రెండు వేల దాకా టకటకా ఖర్చులైపోయినాయి. మిగిలిన పదమూడు వేలు బ్యాంకిలో అకౌంటు తెరిచి వేసినాడు. కానీ పాలూ, బియ్యము, సరుకులు, కరెంటు బిల్లు, డిష్ బిల్లు, పిల్లలకు పుస్తకాలు, రీచార్జి ఇలా నెల తిరిగేసరికి ఖర్చులు తడిసి మోపెడౌతూ వుంది.ప్రతి శనివారం షావుకారు ఆ వారం తాలూకు మజూరీ ఇస్తూ వుంటాడు. కానీ ఆ డబ్బు వెంట వెంటనే ఖర్చైపోతూ వుంది. బుధవారానికి చేతిలో ఏమీ మిగలని పరిస్థితి దాపురిస్తూ వుంది.పల్లెలో ఐతే పాలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు అన్నీ తక్కువ రేట్లకు వచ్చేవి. కానీ మదనపల్లె లాంటి పట్టణంలో వాటి రేట్లు అదిరిపోయేలా వున్నాయి.అన్నిటికన్నా తీవ్రమైన సమస్య నీటి కొరత. మున్సిపాలిటీ కొళాయిల్లో వుప్పు నీళ్లు రోజుకో గంటసేపు వస్తాయి. ఆ నీళ్లు తాగేందుకు పనికి రావు. మున్సిపల్ టాంకరు నాలుగు రోజులకొకసారి వస్తుంది. ఆ టాంకర్లో నీళ్లు పట్టుకోవడానికి స్త్రీ పురుషులు చాంతాడంత క్యూలో నిలబడి, గంటసేపు కాచుకుంటే నాలుగు బిందెలు పట్టుకొనే అవకాశం వస్తుంది. ఆ నీళ్లు పొదుపుగా వాడుకోవాలి. లేకపోతే నీళ్ల కాన్లు కొనుక్కు రావలసి వుంటుంది. తాగేందుకు, స్నానానికీ అన్నిటికీ నీళ్లు రేషనే.సురేంద్ర పిల్లలిద్దరూ కొత్తగా చేరిన ఇంగ్లిషు మీడియంలో చదువులు అర్థంకాక అవస్థలు పడుతూ వుంటే, వాళ్లకు స్కూల్లోనే ట్యూషను పెట్టించాడు. అందుకు నెలకు మరొక నాలుగు వందలు అదనపు భారం అతనికి నెత్తిన పడింది. రెండు జకార్డులున్న పట్టు మగ్గం నేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. చేతులతో వాటు వేసి వేసి, కాళ్లతో అణగతొక్కి సాయంత్రమయ్యేసరికి సురేంద్ర చేతులు, కాళ్లు విపరీతంగా లాగుతూ వుండేవి.ఆ శనివారం కూలీ డబ్బులు తీసుకున్నాక సురేంద్ర టీకొట్టు బెంచీపై అలసటగా కూర్చుని వుంటే నవ్వుతూ అతడి దగ్గరకు వచ్చాడు నాగరాజు.‘‘ఏందినా, అట్లా డల్‌గా కనిపిస్తా వుండావు. ఒంట్లో బాగాలేదా?’’ అన్నాడు నాగరాజు.‘‘ఒకటే కాళ్లు నొప్పి. అదీ కాకుండా, ఈ వారం కర్సులు తలుసుకుంటే గుండె ఢాం అంటా వుండాది’’ అని దిగులుగా చెప్పినాడు సురేంద్ర.‘‘కాళ్లనొప్పులు టీ తాగితే తగ్గుతాయా? దానికి మందు వేరే వుండాది’’అని సురేంద్ర వద్దంటున్నా వినకుండా అతణ్ని బ్రాందీ షాపుకు తీసుకుని పోయాడు నాగరాజు.‘‘డబ్బులు నేనే ఇస్తా, నువ్వేమీ ఇయ్యద్దులే’’ అని బలవంతంగా మందు తాగిపించాడు. తాగాక ఇద్దరూ ముంతాజ్ హోటల్‌కు పోయి బిరియాని తిన్నారు. దాని బిల్లు నాగరాజే ఇచ్చినాడు.ఒంట్లో మద్యం పడితే కాళ్లనొప్పులు తగ్గి, కొంచెం హుషారుగా అనిపించింది సురేంద్రకు. కానీ అతడినా స్థితిలో చూసి అతడి భార్య ముఖం తిప్పుకుంది.ఆ తరువాత రెండు, మూడు రోజులకొకసారి నాగరాజు, మిగిలిన సావాసగాళ్లతో కలసి తాగడం అలవాటు చేసుకున్నాడు సురేంద్ర. దానివల్ల అక్కడా ఇక్కడా అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులు తీర్చడానికి ఆదివారాలు, అమావాస్యల్లో కూడా మగ్గం పని చేస్తూ వున్నాడు. కానీ ఆ అదనపు ఆదాయం కూడా ఏమీ చాలడం లేదు, అతని ఖర్చులు, విలాసాలకి.సరోజ ఇంటి పని, పిల్లల పనితో అలసిపోయి, సురేంద్ర ఇంటికి చేరేసరికి నిద్రపోతూ వుండేది కొన్నిసార్లు. పైగా భర్త కొత్తగా నేర్చుకున్న తాగుడు అలవాటును అసహ్యించుకుని అతడిని దగ్గరకు రానివ్వడం లేదామె. ఆమె ఎంత చెప్పినా సురేంద్రలో మార్పు రావడం లేదు. పడ్డ కష్టాన్ని మర్చిపోవాలంటే తాగుడొక్కటే మార్గం అని చాలామంది నేతగాళ్లు అనుకున్నట్లే అతనూ అనుకుంటున్నాడు. అతని వూరివాళ్లు ఒకరిద్దరు హితబోధ చెయ్యపోయినా వినిపించుకోలేదు.ఒకరోజు తాగుతూ మాట్లాడుతున్నప్పుడు భార్య తనను దగ్గరకు రానివ్వని విషయం నాగరాజుతో వాపోయాడు సురేంద్ర. నాగరాజు నవ్వి, ‘‘ఇంట్లో భోజనం దొరక్కపోతే, హోటల్లో భోం చేయమా? నాతో రా’’ అని తనతో టౌను శివార్లలో వున్న ఒక ప్రాంతానికి, సురేంద్రను తీసుకొని వెళ్లాడు నాగరాజు. అక్కడ ఓ పాత ఇంట్లో చాలామంది ఆడవాళ్లున్నారు. జిగేల్మనే చీర కట్టుకుని పాన్ పరాగ్ పరాగ్గా నములుతున్న ఒక నడి వయసు మహిళ నాగరాజుతో నవ్వుతూ బాగా పరిచయమున్నట్లు మాట్లాడింది. ఇంట్లో దొరకని సుఖం అక్కడ వెతుక్కున్నాడు సురేంద్ర. తరువాత తరచూ అక్కడకు వెళ్లేవాడు. ఇంట్లో దొరకని సుఖం బయట కొనుక్కుంటున్నానని అనుకున్నాడు గానీ ఆ సుఖమే తన ఒళ్లు గుల్ల చేస్తుందని తెలుసుకోలేకపోయాడు సురేంద్ర. ‘‘నీకసలు బుద్ధుందా? నీకు సిఫిలిస్ సోకింది. ఇట్లానే వదిలేస్తే ఎయిడ్స్ కూడా అంటుకుంటుంది. ఇంట్లో లక్షణమైన భార్యను పెట్టుకొని అడ్డమైన తిరుగుళ్లు తిరగడానికి నీకిదేం మాయరోగం?’’ డాక్టరు అడ్డమైన చీవాట్లు పెట్టాడు సురేంద్రను.సురేంద్ర తలవంచుకుని వింటున్నాడు. అంతకు కొన్ని రోజుల ముందే తరచూ వాంతులౌతూ వుంటే ఇంకొక డాక్టరు దగ్గరకు వెళ్లాడతను. ఆ డాక్టరు కొన్ని టెస్టులు రాసిచ్చి, అవి చేసుకొని రిపోర్ట్స్ తెమ్మన్నారు. తెచ్చాక వాటిని చూసి సురేంద్ర లివర్ బాగా పాడైందని, కొన్ని మందులు రాసిచ్చి, తాగుడు పూర్తిగా మానకపోతే సురేంద్రకు చావు తథ్యమని జోస్యం చెప్పాడు. దాంతో సురేంద్ర బ్రాందీ షాపుకు వెళ్లడం పూర్తిగా మానుకొన్నాడు. ఐనా ఆసరికే అతని ఒళ్లు చాలా పాడైంది.హాస్పిటల్ ఖర్చులు, టెస్టులు, మందులకు విపరీతంగా ఖర్చు అవుతూ వుంది. బ్యాంకులో వున్న కొద్దిపాటి బాలెన్సు, సరోజ మిగిల్చిన డబ్బూ ఇట్టే ఖర్చు అయిపోయింది. పిలకాయల స్కూలు ఫీజులు, పుస్తకాలు, ఇంటి బాడుగ అన్నీ కట్టాల్సి వుంది. సురేంద్రకేం చేయాలో పాలుపోలేదు. అప్పుకోసం షావుకారు దగ్గరకు వెళ్లాడు. ‘‘ఇట్టా తాగుడికి, తందనాలకి కర్సులు ఎడాపెడా పెట్టేస్తా వుంటే ఒళ్లే కాదు, ఇల్లు కూడా గుల్ల ఔతాది. ఎవడువాయ్ నిన్ను తాగి తలెత్తుకోమనింది?నువ్వే కాదు, ఈ మదనపల్లికొచ్చి చేరే మగ్గమోళ్లు శానా మంది ఇట్టానే సెడిపోతా వుండారు. కూలీలెక్కవని ఈడికి ఏడేడ నుండో వచ్చి సేరతా వుండారు. నాలుగు డబ్బులు చేతిలో పడే కొందికి అన్ని అలవాట్లు ఐతాయి. సంసారం సంకనాకి పోతుంది. రేషం రేట్లు సూస్తే కళ్లు తిరగతావుండాయి. జరీ, సప్పురీ, కలర్ ఫాక్రీ, అచ్చులు, పన్నీలు, డోళ్లు అన్నీ కర్సులే. యాపారం అంతంతగానే వుండాది. నీకేమీ ఈలేను. నువ్వు పని నిలిపేయాలనుకుంటే నిలిపేయచ్చు. కానీ నా కాడ తీసుకున్న అడవాన్సు యాభై వేలు నాకిచ్చి పో. వడ్డీ కూడా నిన్ను అడగడం లే’’ కఠినంగా చెప్పాడు మునస్వామి. సురేంద్రకు ఏమీ పాలుపోలేదు. ‘‘మీ అమ్మకి మళ్లీ ఆస్తమా తిరగబెట్టింది. మీ నాయన కూడా గసతోనే మంచం పట్టినాడు. పోయినతూరి మీ నాయన జోతులపుడు తొలిపూజ చేసినాడు. ఈసారి కడప మాను మోసి తొలిపూజ సేయలేడు. మంచం మీద మడిసి ఏం పూజ చేస్తాడు? నువ్వు మళ్లీ వూరు రావలసిందే’’ అన్నాడు రామయ్య మామ. మదనపల్లెలో వున్న కూతురు, ఇంటికి చుట్టపు చూపుగా వచ్చి, సురేంద్రను చూడ్డానికి వచ్చారాయన.సురేంద్ర ఏమీ మాట్లాడలేదు. సరోజ కూడా మౌనం వహించింది. రామయ్య మామ గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే సురేంద్ర లివర్ పాడై మంచం పట్టిన విషయం చెప్పింది సరోజ.‘‘సొంతూళ్లో కులం పని చేసుకోకుండా టౌనులో బాగా బతికేయచ్చని వలసలు పోతే ఇట్టనే జరగతాది. నేను మళ్లీ ఒక పెళ్లికి రెండు రోజుల్లో మదనపల్లి రావాల. మీ నాయనతో మాట్లాడి విషయం చెప్తాను’’ అన్నాడు రామయ్య మామ ముక్తసరిగా. ఆ దంపతులిద్దరికీ ఏం చేయాలో తోచడం లేదు. ఒళ్లు పాడై సురేంద్ర కఠినమైన జకార్డు మగ్గం నేత నేయలేకుండా వున్నాడు. వూరికి తిరిగి వెళ్లాలంటే షావుకారు అప్పు, మిగిలిన బాకీలు తీర్చాలి. మందులకు, డాక్టర్లకు విపరీతంగా ఖర్చు అవుతావుంది. ఎట్ల లేదన్నా లక్షా లక్షన్నర చేతిలో పడితే గాని గట్టెక్కలేని గడ్డు పరిస్థితి! అన్నట్లుగానే రామయ్య మామ మూడు రోజుల్లో మళ్లీ వాళ్లింటికి వచ్చాడు. సరోజ ఆయనకు కాఫీ ఇచ్చి మర్యాద చేసింది.‘‘మీ నాయనతో మాట్లాడినా. మీ అమ్మకి పసుపు కుంకాల కింద వాళ్ల పెళ్లప్పుడు రెండెకరాలు మీ తాత ఇచ్చినాడంట. ఆ భూమిని మీ మామ సాగు చేస్తా వున్నేడిన్ని దినాలు. మీ వోళ్లకు దాంట్లో నించి ఏమీ ఇచ్చింది లే. ఇప్పుడు మీ మామ పిలకాయలు బాగా సదుకోని మంచి పొజిషన్ల వున్నారంట. ఆ భూమితో వాళ్లకు పన్లే. ఆ మడి అమ్మేసి మీ అప్పులు తీరుస్తామని చెప్పినాడు, మీ నాయన. నేనిప్పటికి ఒక డెబ్భై వేలు సర్దుబాటు సేస్తా వుండా. నీ అప్పులు తీర్చేసి ఇల్లు ఖాళీ చేసి పల్లెకొచ్చేయి. నీ జబ్బు గురించి మీ అమ్మ దిగులు పడతా వుండాది’’ అన్నాడు రెడ్డప్ప.సురేంద్ర ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. సరోజకి ఒళ్లు తెలీరాలేదు.వలస పక్షులు ఇంటి దారి పట్టినట్లు, మరో రెండు వారాల్లో వాళ్లు పట్నం కాపురానికి స్వస్తి పలికి, స్వగ్రామం చేరుకున్నారు.l -
గోదావరిలో దూకిన యువకుడు
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ మండలంలో ఉన్న గోదావరి నదిలోకి దూకిన యువకుడు గల్లంతయ్యాడు. కొవ్వూరు రూరల్ మండలం చిడిపి గ్రామానికి చెందిన పామెళ్ల సురేంద్ర(29) అనే యువకుడు కుటుంబకలహాల కారణంగా జీవితంపై విరక్తిచెంది మంగళవారం మధ్యాహ్నం గోదావరి నదిలో దూకాడు. గట్టుపై ద్విచక్రవాహనం ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతని ఆచూకి ఇంతవరకూ తెలియలేదు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వేగంగా వెళ్తున్న టిప్పర్ ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదం కృష్ణాజిల్లా అవనిగడ్డ కోర్టు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న దాసి సురేంద్ర(28) పెయింటర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బైక్‌పై పనికి వెళ్తుండగా.. వెనుక నుంచి వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంతో సురేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనకు కారణమైన టిప్పర్ డ్రైవర్ కనీసం వాహనాన్ని అక్కడ ఆపకుండా వెళ్లిపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు తమ రక్షక్ వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా పెట్టి టిప్పర్ ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ
నిందితులు నలుగురూ యువతీయువకులే {పేమ, ఆర్థిక వ్యవహారాలే కారణం భీమడోలు : ఓ యువకుడిని హత్య చేసిన ఘటనలో నలుగురు నిందితులను శుక్రవారం రాత్రి భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అరెస్టైన వారిలో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. మండలంలోని ఆగడాలలంక గ్రామానికి చెందిన యువకుడు యాళ్ల వినయ్సుధీర్ (28)ను జూలై 12న పోలసానిపల్లి పేరయ్యకోనేరు చెరువు వద్ద హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసు వివరాలను భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సీఐ విలేకరులకు తెలిపారు. ఆర్థిక పరమైన, ప్రేమ వ్యవహారాలే హత్యకు కారణమని ఆయన సృష్టం చేశారు. రాజమండ్రిలోని కొంతమూరుకు చెందిన అన్నాచెల్లెళ్లు లింగంపల్లి రమేష్ (22), లింగంపల్లి సునీత (19)తో పాటు కొవ్వలి సురేంద్ర (22), కుమారి రాజ్యలక్ష్మి పథకం ప్రకారం యాళ్ల వినయ్సుధీర్ను కాళ్లు కట్టి కర్రలతో కొట్టి అతికిరాతకంగా చంపారన్నారు. వినయ్సుధీర్కు కొంతకాలం క్రితం ఓ రాంగ్ కాల్ చేయడంతో కృష్ణాజిల్లా కైకలూరుకు చెందిన లింగంపల్లి సునీత పరిచయమైందన్నారు. వారిద్దరి ఫోన్ పరిచయం ప్రేమగా మారింది. ఈతరుణంలోనే రెండేళ్ల క్రితం లింగంపల్లి సునీత కుటుంబం రాజమండ్రి మకాం మారింది. సునీత, సుధీర్ మధ్య సంబంధం కొనసాగింది. వీరిద్దరూ తరుచుగా పోలసానిపల్లిలో కలిసేవారు. వినయ్ సుధీర్ సునీత వద్ద కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. ఇదిలావుండగా అదే గ్రామంలో ఉంటున్న సునీత ద్వారా రాజ్యలక్ష్మి అనే మహిళ సుధీర్‌కు పరిచయమైంది. రాజ్యలక్ష్మి నుంచి కూడా సుధీర్ కొంత సొమ్ము అప్పు తీసుకున్నాడు. ఇదిలావుండగా.. సునీత తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, వెంటనే తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. పెళ్లి విషయాన్ని సుధీర్ వాయిదా వేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం గత నెల 12న సాయంత్రం సునీత సుధీర్‌కు ఫోన్‌చేసి పోలసానిపల్లి రమ్మంది. ఆమె స్కూటర్‌పై అక్కడికి వెళ్లగా, మిగిలిన ముగ్గురు కొంతమూరు నుంచి ఆటోలో వచ్చారు. బైక్‌పై వచ్చిన సుధీర్‌తో సునీత మాట్లాడుతుండగా అప్పటికే అక్కడ ఉన్న ముగ్గురు కర్రలతో సుధీర్ మర్మాంగంపై కొట్టారు. కాళ్లు కట్టేశారు. అనంతరం హతమార్చి వెళ్లిపోయారు. నిందితుడు లింగంపల్లి రమేష్ విలేకరులతో మాట్లాడుతూ సుధీర్‌ను భయపెట్టాలకున్నామే తప్ప ఇలా జరుగుతుందని ఊహించలేదన్నాడు. విలేకరుల సమావేశంలో సమావేశంలో ఎస్సైలు బి.వెంకటేశ్వరరావు (భీమడోలు), సీహెచ్ సతీష్‌కుమార్ (ద్వారకాతిరుమల), ఎం.సుభాష్ (దెందులూరు), హెచ్‌సీ అమీర్ పాల్గొన్నారు. -
సైకిల్‌ను ఢీకొన్న లారీ: ఒకరి మృతి
రేణిగుంట (చిత్తూరు): చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వెదలచెరువు వద్ద లారీ, సైకిల్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్‌పై ప్రయాణిస్తున్న సురేంద్ర అనే యువకుడు అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేణిగుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైఎస్ జగన్ కేసులోదర్యాప్తు పూర్తి
ప్రత్యేక కోర్టుకు నివేదించిన సీబీఐ సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తయిందని ప్రత్యేక కోర్టుకు సీబీఐ నివేదించింది. ఈ మేరకు సోమవారం కోర్టుకు రాతపూర్వకంగా నివేదిస్తామని తెలిపింది. కొన్ని అంశాల్లో దర్యాప్తు పెండింగ్‌లో ఉందని గతంలో సీబీఐ చెప్పిందని, దీంతో దర్యాప్తు పూర్తయ్యే వరకూ అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలంటూ గతంలో నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్లపై కోర్టు వాదనలు విని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో నిందితుల తరఫు న్యాయవాదులు... కొన్ని పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో దర్యాప్తు పురోగతిని స్పష్టం చేయాలని న్యాయమూర్తి సీబీఐ తరఫున న్యాయవాది సురేంద్రను ప్రశ్నించారు. ఈ కేసులో అన్ని అంశాల్లో దర్యాప్తు పూర్తయ్యిందని సురేంద్ర నివేదించారు. వాన్‌పిక్ కేసు సహా ఇతర అంశాల్లో ఎలాంటి అనుబంధ చార్జిషీట్లూ దాఖలుచేయబోమని చెప్పారు. అయితే ఇదే విషయంతో మెమోను కోర్టులో దాఖలు చేయాలని సురేంద్రకు న్యాయమూర్తి సూచించారు.