
జీవన శైలి మార్చుకుంటే షుగర్‌ను రివర్స్ చేసుకోవచ్చు
చిరు ప్రాయంలోనే 20 శాతం మంది స్థూలకాయులు
అందుకే యువతలో పెరుగుతున్న మరణాలు
హోమా టెస్ట్‌తో భవిష్యత్‌లో వచ్చే వ్యాధుల గుర్తింపు
‘సాక్షి’తో ఇంటర్నల్ మెడిసిన్ ప్రొఫెసర్ సురేంద్ర నెహ్రూ
కర్నూలు (హాస్పిటల్): ‘ఇటీవలి కాలంలో చాలా మంది యువత అర్ధాంతరంగా మరణిస్తున్నారు. కొందరు నడుస్తూ.. మరికొందరు ఆడుతూ పాడుతూ, ఇంకొందరు జిమ్ చేస్తూ తనువు చాలిస్తున్నారు. దీనికంతటికీ కారణం వారిలో అంతర్లీనంగా కొవ్వు నిల్వలు పెరిగి పోవడమే. వారికి తెలియకుండానే బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) పెరిగిపోతోంది.
దీనికి చెక్ పెట్టకపోతే దేశంలో అధిక శాతం బీపీ, షుగర్, గుండె జబ్బులతో బాధపడే వారే కనిపిస్తారు’ అని హైదరాబాద్ గచ్చిబౌలిలోని కోమా హెల్త్‌కేర్ సెంటర్ ఇంటర్నల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.సురేంద్ర నెహ్రూ చెప్పారు. కర్నూలు మెడికల్ కాలేజి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎంఈ, ఆలుమ్ని మీట్‌కు హాజరైన ఆయన ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
తెలియకుండానే కొవ్వు నిల్వలు
సాధారణంగా మనిషి బరువెక్కితే పొట్ట భాగంతో పాటు కాళ్లు, చేతులు కూడా లావు కావాలి. కానీ పొట్ట మాత్రమే లావుగా ఉండి, కాళ్లూ.. చేతులు సన్నగా ఉంటున్నాయి. దీని కారణంగా పొట్ట చుట్టు కొలత పెరిగిపోతోంది. సాధారణంగా మనిషి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 18 లోపు ఉంటే తక్కువగా ఉన్నట్లు. 35 పైన ఉంటే హై, 45 పైన ఉంటే సివియర్ హైగా ఉన్నట్లు గుర్తించాలి. మన దేశంలో ఎక్కువ మంది 60–80 కిలోల బరువు ఉంటున్నారు. సగటు ఎత్తు 5.5 అడుగులు.
ఈ ఎత్తుకు ఆ బరువు ఎక్కువ. మన దేశంలో 1977కు ముందు ప్రతి వెయ్యి మందిలో ఇద్దరు మాత్రమే స్థూలకాయులుండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వంద మందిలో 20కి చేరింది. పొట్ట చుట్టు కొలత 33 ఇంచులు దాటితే వారికి భవిష్యత్‌లో బీపీ, షుగర్, గుండెపోటు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి ముందు కూడా మనవాళ్లు బియ్యమే అన్నం వండుకుని తిన్నా ఆరోగ్యంగా ఉన్నారు. అప్పట్లో దంపుడు బియ్యం ఎక్కువగా తినేవారు.
వరికి దిగుబడి తక్కువగా వచ్చేది. వరికి జీన్ మార్పిడి చేయడం వల్ల దిగుబడి పెరిగింది. ఇప్పుడు యంత్రాల ద్వారా పాలిష్ పట్టుకుని తింటున్నారు. దీనివల్ల బియ్యంలో నాణ్యత దెబ్బతింటోంది. దీనివల్లే స్థూలకాయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ కారణంగా ఒంట్లో కొవ్వు నిల్వలు పెరిగిపోయి భవిష్యత్‌లో బీపీ, షుగర్, గుండె జబ్బులు అధికం అవుతున్నాయి.
మందుల కంటే ఆహారమే ముఖ్యం
స్వాతంత్య్రానికి పూర్వం మనవాళ్లు రోజుకు వెయ్యి గ్రాముల ఫైబర్ తినేవారు. కానీ ఇప్పుడు 100 గ్రాములు కూడా తినడం లేదు. ఇప్పటి అవసరాలకు రోజుకు కనీసం 500 గ్రాములైనా ఫైబర్ తినాలి. ఒకప్పుడు రాయలసీమలో తినే ఆహారపు అలవాట్లు ఇప్పుడు ఎంతో మేలు చేస్తాయి. రాగుల ద్వారా చేసే సంకటి (రాగిముద్ద), సజ్జలు, కొర్ర బియ్యం, దంపుడు బియ్యం, దొడ్డు బియ్యంతో చేసిన ఆహారాలు వ్యాధులను తగ్గిస్తాయి. రోజుకు 7–8 గంటల నిద్రతోపాటు కనీసం నాలుగైదు కిలోమీటర్లు నడవాలి.
మోకాళ్ల నొప్పులున్న వారు స్విమ్మింగ్ ఫూల్‌లో నడిచినా, ఈత కొట్టినా సరిపోతుంది. ఇసుకలో చెప్పులు లేకుండా నడిస్తే మోకాళ్ల నొప్పులు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. షుగర్‌కు ఇప్పుడు కొత్త కొత్త మందులంటూ ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికం అవుతాయి. ముఖ్యంగా హోమియో స్టాసిస్ ఆఫ్ ఇన్సులిన్ అసెస్‌మెంట్ టెస్ట్ (హోమా) చేయించుకోవాలి. దీనివల్ల భవిష్యత్‌లో వచ్చే బీపీ, షుగర్, గుండె జబ్బుల గురించి ముందే తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment