సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి: ఎస్‌డీ శిబులాల్‌ | Infosys Co-founder And Former CEO Sd Shibulal Interview With Sakshi, Says Youth Should Follow The Principle Of '4C' | Sakshi
Sakshi News home page

సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలి: ఎస్‌డీ శిబులాల్‌

Published Thu, Jan 30 2025 4:40 AM | Last Updated on Thu, Jan 30 2025 11:22 AM

Infosys co-founder and former CEO SD Shibulal interview with Sakshi

నేటి యువత ‘4సీ’ సూత్రాన్ని పాటించాలి

ఏ రంగంలోనైనా కాలానుగుణంగా మార్పులు సహజం.. మార్పులు, సవాళ్లు ఎదుర్కొనేందుకు యువత సిద్ధంగా ఉండాలి 

ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకుంటూ ముందుకుసాగాలి 

ఇన్ఫోసిస్‌ కూడా 20 ఏళ్లు సాదాసీదా కంపెనీగానే కొనసాగింది .. ఐటీలో నిరంతర కొత్త నైపుణ్యాలు దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి 

ఏఐతో ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఏ మాత్రం సరికాదు

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు,మాజీ సీఈఓ ఎస్‌డీ శిబులాల్‌

డి.ఎస్‌.పవన్‌కుమార్, సాక్షి ఎడ్యుకేషన్‌ డెస్క్‌: మారుతున్న పరిస్థితుల్లో ఏ రంగంలోనైనా కాలానుగుణంగా మార్పులు సహజమని, వీటిని ఎదుర్కొనేందుకు యువత సిద్ధంగా ఉండాలని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ సీఈఓ ఎస్‌డీ శిబులాల్‌ చెప్పారు. అవసరమైనప్పుడల్లా కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు, కెరీర్‌లో ముందుకు సాగేందుకు కృషి చేయాలని అన్నారు. ఇన్ఫోసిస్‌ లాంటి అగ్రశ్రేణి సంస్థ కూడా తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, పాతికేళ్లు సాధారణ ఐటీ సంస్థగానే ఉందని తెలిపారు. 

వ్యక్తులకైనా, సంస్థలకైనా సవాళ్లు సహజం అంటూ, వాటిని ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యాన్నిసొంతం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత సహనం, ప్రణాళికలతో అడుగులు వేయాలని చెప్పారు. శిబులాల్‌ కుటుంబం ఫిలాంత్రఫిక్‌ ఇనిషియేటివ్స్‌ పేరుతో ఓ ఎన్‌జీఓను నెలకొల్పింది. ‘విద్యాధన్‌’ పేరుతో.. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకోసం హైదరాబాద్‌కు వచి్చన శిబులాల్‌తో.. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.. 

సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం వల్లే టాప్‌లోకి.. 
ఇన్ఫోసిస్‌ తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులకు గురైంది. ముఖ్యంగా క్లయింట్స్‌కు ఐటీ ఆవశ్యకతను వివరించడం, వారిని మెప్పించడం, వాటికి మా సంస్థ ద్వారా సేవలకు అంగీకరింపజేయడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. పాతికేళ్ల సంస్థ చరిత్రలో దాదాపు 20 ఏళ్లు సాదాసీదా కంపెనీగానే ఉంది. కానీ అన్ని సవాళ్లను ఎదుర్కోగలిగే సమర్థవంతమైన బృందంగా పని చేయడం వల్ల ఇప్పుడు టాప్‌ కంపెనీగా గుర్తింపు పొందుతోంది ఇప్పుడు మనం చూస్తున్న ఇన్ఫోసిస్‌ ప్రస్థానాన్ని ఇన్ఫోసిస్‌ 2.0గా చెప్పొచ్చు. 

మార్పులు ఆహ్వానించాలి 
– ఒకే సంస్థలో ఉన్నా హోదా మారే కొద్దీ విధుల్లో మార్పులు, కొత్త సవాళ్లు, కొత్త అంశాలను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత సహజం. దీన్ని నేటి యువత గుర్తించాలి.  
– ఇన్ఫోసిస్‌లో మూడేళ్లకోసారి నా హోదా మారేది. అలా మారినప్పుడల్లా ఆ హోదాకు తగినట్లుగా విధులు నిర్వర్తించేందుకు వీలుగా కొత్త అంశాలు నేర్చుకున్నా.  
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌.. నాట్‌ ఫర్‌ ఎవ్రిబడీ 
– ప్రస్తుతం దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సంస్కృతి పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే నా ఉద్దేశంలో ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఈజ్‌ నాట్‌ ఫర్‌ ఎవ్రిబడీ’. ఈ మాట ఎందుకు అంటున్నానంటే..  

– సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలంటే అత్యంత కీలకమైన లక్షణం సహనం. నేటి యువతలో అది లోపిస్తోంది.  
– చాలామంది ఇన్‌స్టంట్‌ ఫలితాలు ఆశిస్తున్నారు. అందుకే పలు వెంచర్స్‌.. ఫెయిల్యూర్‌ వెంచర్స్‌గా మారుతున్నాయి.  
– మా రోజుల్లో ఫండింగ్‌ సంస్థలు లేవు. కానీ ఇప్పుడు పదుల సంఖ్యలో ఏంజెల్‌ ఇన్వెస్టర్స్‌.. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ప్రొడక్ట్స్‌ను అందించే స్టార్టప్స్‌కు ఫండింగ్‌ ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కానీ స్టార్టప్‌ ఔత్సాహికుల్లో సహనం ఉండట్లేదు. సరైన ప్రణాళిక ఉండట్లేదు. 

ఏఐతో కొత్త ఉద్యోగాలు: 
– ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలు పోతాయనే ఆందోళన ఏ మాత్రం సరికాదు. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని పొందితే లక్షల ఉద్యోగాలు లభిస్తాయని గుర్తించాలి.  
– ఐటీలో నిరంతరం కొత్త టెక్నాలజీల ఆవిష్కరణ అనేది దశాబ్దాలుగా జరుగుతోంది. ఉదాహరణకు కంప్యూటర్స్‌నే పరిగణనలోకి తీసుకుంటే మొదట్లో కంప్యూటర్స్‌ అంటే కేవలం డేటా సేకరణకే వినియోగించారు. తర్వాత అవి.. డేటా క్రియేషన్, డేటా ఇంటర్వెన్షన్‌ ఇలా ఎన్నో విభాగాలకు విస్తరించింది.  
– ఐటీలో కూడా కంప్యూటర్‌ ఆపరేషన్స్‌తో మొదలై.. ఇప్పుడు కోడింగ్, ప్రోగ్రామింగ్‌లు ఎంత ముఖ్యంగా మారాయో మనం చూస్తున్నాం.  

4‘సీ’స్‌ సూత్రాన్ని పాటించాలి 
– నేటి తరం యువత కెరీర్‌లో ముందుకు సాగేందుకు 4సీ సూత్రాన్ని (కరేజ్, కేపబిలిటీ, కెపాసిటీ, కమిట్‌మెంట్‌) అమలు చేసుకోవాలి.  
– మానసికంగా ఈ లక్షణాలు ఉంటే వృత్తి పరంగా ఎలాంటి నైపుణ్యాలనైనా ఇట్టే సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది.  
– దేశంలో కెరీర్‌ పరంగా ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ 80 శాతం మంది ఎంప్లాయర్స్‌ జాబ్‌ రెడీ స్కిల్స్‌ ఉన్న యువత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ స్కిల్స్‌ను సొంతం చేసుకుంటే.. ఉద్యోగ రేటు వృద్ధి చెందుతుంది. 

గ్లోబల్‌ లాంగ్వేజ్‌ ఇంగ్లిష్‌పై పట్టు ముఖ్యం 
– ప్రస్తుత విద్యా వ్యవస్థలో బేసిక్‌ సైన్సెస్‌ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. పాఠశాల స్థాయి నుంచే దీన్ని ఆచరణలో పెట్టాలి. ఫలితంగా విద్యార్థులకు సైన్స్‌పై ఆసక్తి పెరిగి, భవిష్యత్తులో పరిశోధనలు, ఆవిష్కరణలకు దారి తీస్తుంది.   
– నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లోని ఫ్లెక్సిబుల్‌ లెర్నింగ్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, స్కిల్‌ ట్రైనింగ్‌ వంటి అంశాలు పరిశీలిస్తే.. ఈ విధానం మన యువతకు ఎంతో అవసరం అనేది అవగతం అవుతుంది. ఇంగ్లిష్‌ మీడియం అనేది గ్లోబల్‌ లాంగ్వేజ్‌. దానిపై పట్టు సాధించడం నేటి పరిస్థితుల్లో ఎంతో ముఖ్యం. 

సైన్స్‌ అంటే ఇష్టం.. కానీ కంప్యూటర్స్‌లోకొచ్చా.. 
వాస్తవానికి నాకు బేసిక్‌ సైన్స్‌ అంటే ఇష్టం. మా నాన్న మాత్రం నన్ను డాక్టర్‌ చేయాలనుకున్నారు. అయినా నా ఇష్టాన్ని కాదనలేదు. కేరళ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ చేశా. వెంటనే అప్పటి బాంబే ఎలక్ట్రిసిటీ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగ విధులు మాత్రం కంప్యూటర్స్‌కు సంబంధించినవి. నా జీవితంలో నాకు ఏమైనా సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి అంటే నా తొలి ఉద్యోగంలోనే. 

వాటిని తట్టుకోవాలనే సంకల్పంతో, కంప్యూటర్‌ సైన్స్‌ భవిష్యత్తు ఆవశ్యకతను గుర్తించి అందులో పీజీ చదవడానికి సిద్ధమయ్యా. బోస్టన్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్‌ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశా. పత్ని కంప్యూటర్స్‌లో సిస్టమ్స్‌ ఇంజనీర్‌గా అడుగు పెట్టా. అక్కడే నారాయణమూర్తితో పరిచయం ఏర్పడడం, ఇన్ఫోసిస్‌ స్థాపనలో పాలుపంచుకోవడం జరిగింది. ఇలా కెరీర్‌ అవసరాలకు అనుగుణంగా తమను తాము మలచుకోవడం నేటి యువతకు ఎంతో ముఖ్యం. అప్పుడే ఉన్నత స్థానాలు, కోరుకున్న హోదాలు లభిస్తాయి.  

సంపాదనలో కొంత సమాజ సేవకు 
కేరళలో పుట్టి పెరిగిన నాకు.. చిన్నప్పటి నుంచి చదువు విషయంలో, ఇతర విషయాల్లో ఎందరో తోడ్పాటు అందించారు. అదే స్ఫూర్తితో మా సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు, అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలకు కేటాయించాలని భావించాం. అందుకే 1998లో శిబులాల్‌ ఫ్యామిలీ ఫిలాంత్రఫిక్‌ ఇనిషియేటివ్స్‌ (ఎస్‌ఎఫ్‌పీఐ) పేరుతో ప్రత్యేక సంస్థను నెలకొల్పి విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. విద్యార్థులకు తోడ్పాటునందిస్తే.. వారితోపాటు, దేశం కూడా వృద్ధి చెందుతున్న ఆలోచనతో విద్యా రంగాన్ని ఎంచుకున్నాం. ప్రస్తుతం పది వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. 

డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించమే ప్రధాన లక్ష్యం 
11, 12 తరగతుల స్థాయిలో డ్రాప్‌ అవుట్స్‌ను తగ్గించడమే మా లక్ష్యం. 1990లలో భారత గ్రామీణ ప్రాంతంలోని తల్లిదండ్రులు..పదో తరగతి పూర్తయ్యాక మగ పిల్లలను పనికి తీసుకెళ్లాలని, ఆడ పిల్లలైతే పెళ్లి చేయాలనే ధోరణితో ఉండేవారు. ఇదే కొనసాగితే భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఉండరనే ఉద్దేశంతోనే ఎస్‌ఎఫ్‌పీఐని ప్రారంభించాం. 11, 12 తరగతుల విద్యార్థులకు ప్రోత్సాహకం అందిస్తున్నాం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement