4వ యూనిట్‌లో విద్యుదుత్పత్తిని విజయవంతంగా ప్రారంభించిన జెన్‌కో డైరెక్టర్లు సచ్చి దానందం, వెంకటరాజం, ఇతర ఇంజనీర్లు
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: మూడేళ్ల కింద ఘోర అగ్నిప్రమాదంలో కాలిపోయిన 900 (6*150) మెగావాట్ల శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం.. ఎట్టకేలకు పూర్తి స్థాపిత సామర్థ్యాన్ని మళ్లీ అందిపుచ్చుకుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో లభ్యతగా ఉన్న జలాలతో శనివారం నాలుగో యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించగా.. సాయంత్రం 5.07 గంటలకు 145 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకున్నట్టు తెలంగాణ జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. టీఎస్ జెన్‌కో హైడల్ డైరెక్టర్ వెంకటరాజం పర్యవేక్షణలో కేంద్రం సీఈ సూర్యనారాయణ, ఎస్‌ఈ (ఓఅండ్‌ఎం) ఆదినారాయణ, ఎస్‌ఈ రవీంద్రకుమార్, సద్గుణ కుమార్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
900 మెగావాట్ల భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 యూనిట్లుండగా, 2020 ఆగస్టు 20న జరిగిన అగ్నిప్రమాదంలో యూనిట్లన్నీ కాలిపోయాయి. నాలుగో యూనిట్ మినహా మిగిలిన యూనిట్లను గతంలోనే పునరుద్ధరించారు. నాలుగో యూనిట్‌కి సంబంధించిన జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో పునరుద్ధరణలో జాప్యం జరిగింది. కేరళలోని ఓ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను తయారు చేయించడానికి రెండేళ్లు పట్టింది. గతేడాది ఫిబ్రవరిలో ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించి నాలుగో యూనిట్‌కు మరమ్మతులు పూర్తి చేశారు.
అయితే, ఈ యూనిట్‌కి సంబంధించిన సర్జ్‌పూల్‌లో ఓ భారీ గేటు విరిగి పడిపోవడంతోపాటు మరికొన్ని గేట్లు వరద ఉధృతికి దెబ్బతినడంతో అప్పట్లో విద్యుదుత్పత్తి సాధ్యం కాలేదు. సర్జ్‌పూల్ నీళ్లలో 75 మీటర్ల అడుగున ఉన్న గేటును బయటకు తీసే క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో అప్పట్లో ఉత్పత్తిని వాయిదా వేశారు. గత వేసవిలో జలాశయంలో నిల్వలు అడుగంటిపోయాక గేటును బయటకు తీసి మరమ్మతులు చేశారు. ప్రస్తుతం జూరాల నుంచి భారీ స్థాయిలో వరద వస్తుండటంతో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు సిద్ధం చేశారు.
విచారణ నివేదిక ఏమైంది?
2020 ఆగస్టు 20న శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు ఇంజనీర్లతో సహా మొత్తం 9 మంది మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదంపై టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ మూడేళ్లు గడిచినా విచారణ నివేదికను సమర్పించలేదు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా, ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment