తెలంగాణ ఈఏపీసెట్‌లో ఏపీ ప్రభంజనం | AP Students Tops In Telangana EAPCET | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఈఏపీసెట్‌లో ఏపీ ప్రభంజనం

Published Sun, May 19 2024 4:58 AM | Last Updated on Sun, May 19 2024 4:58 AM

సతివాడ జ్యోతిరాదిత్య, ఆలూరు ప్రణీత

సతివాడ జ్యోతిరాదిత్య, ఆలూరు ప్రణీత

ఇంజనీరింగ్, అగ్రి–ఫార్మా విభాగాల్లో టాప్‌ ర్యాంకులు కైవసం

ఇంజనీరింగ్‌లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన జ్యోతిరాదిత్యకు ఫస్ట్‌ ర్యాంక్‌ 

అగ్రి–ఫార్మాలో అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రణీతకు మొదటి ర్యాంక్‌ 

రెండు విభాగాల్లో టాప్‌ టెన్‌లో ఐదుగురు చొప్పున ఏపీ విద్యార్థులు 

వచ్చే వారం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

సాక్షి, హైదరాబాద్‌/కొమరాడ/పాలకొండ/బలిజిపేట/గుంటూరు ఎడ్యుకేషన్‌/కర్నూలు సిటీ: తెలంగాణలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు దుమ్ము లేపారు. ఇంజనీరింగ్, అగ్రి–ఫార్మా.. రెండు విభాగాల్లోనూ మొదటి ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇంజనీరింగ్‌ విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రికల్చర్‌–ఫార్మసీ విభాగంలో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత ఫస్ట్‌ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. రెండు విభాగాల్లోనూ టాప్‌ టెన్‌లో ఐదుగురు చొప్పున ఏపీ విద్యార్థులు ర్యాంకులు దక్కించుకోవడం విశేషం. తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాలను శనివారం ఆ రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు.  

ఆన్‌లైన్‌ ద్వారా సీట్ల భర్తీ!  
టీఎస్‌ ఈఏపీసెట్‌ ఈ నెల 7 నుంచి 11 వరకు జరిగింది. ఇంజనీరింగ్‌ విభాగానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2,54,750 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,40,618 మంది పరీక్ష రాయగా 1,80,424 మంది అర్హత సాధించారు. అలాగే అగ్రికల్చర్‌–ఫార్మా విభాగంలో రెండు రాష్ట్రాల నుంచి 1,00,432 మంది దరఖాస్తు చేస్తే 91,633 మంది పరీక్ష రాశారు. వీరిలో 82,163 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది రెండు విభాగాలు కలిపి 3,32,251 మంది రాస్తే.. ఇందులో 2,62,587 (74.98 శాతం) మంది అర్హత సాధించారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటిస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఏడాది ఆన్‌లైన్‌ ద్వారా సీట్లను భర్తీ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. 

మంచి ర్యాంకు సాధించడమే లక్ష్యంగా.. 
మాది పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లి. అమ్మానాన్న కృష్ణవేణి, నారాయణరావు వ్యవసాయం చేస్తున్నారు. మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో చదివా. నా కష్టం ఫలించింది. 
–నగుడసారి రాధాకృష్ణ, టీఎస్‌ ఈఏపీసెట్‌ సెకండ్‌ ర్యాంకర్‌ (అగ్రికల్చర్‌–ఫార్మా విభాగం)  

ఐఐటీ బాంబేలో చదవడమే నా లక్ష్యం.. 
మా స్వస్థలం కర్నూలు జిల్లా పంచలింగాల. నాన్న సూర్యకుమార్‌ యాదవ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్నారు. నేను 10వ తరగతిలో 9.2 జీపీఏ సాధించాను. ఇంటర్‌లో 951 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో అఖిల భారత స్థాయిలో 311వ ర్యాంకు వచి్చంది. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్‌ చేయడమే నా లక్ష్యం. 
– గొల్లలేఖ హర్ష, టీఎస్‌ ఈఏపీసెట్‌ సెకండ్‌ ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌ విభాగం)  

ఐఏఎస్‌ అధికారినవుతా.. 
మాది కర్నూలు జిల్లా ఆదోని. నాన్న రామసుబ్బారెడ్డి, అమ్మ రాజేశ్వరి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 8వ తరగతి నుంచి హైదరాబాద్‌లో చదువుతున్నా. నాకు ఇంటర్‌లో 987 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో 252వ ర్యాంకు వచి్చంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతా. తర్వాత సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ అధికారినవుతా. 
– భోగాలపల్లి సందేశ్, టీఎస్‌ ఈఏపీసెట్‌ నాలుగో ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌ విభాగం)  

ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ చదువుతా 
మాది కర్నూలు. నాన్న ఎం.రామేశ్వరరెడ్డి చిరు వ్యాపారి. అమ్మ గృహిణి. ఇంటర్‌లో నాకు 980 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో అఖిల భారత స్థాయిలో 36వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 6వ ర్యాంకు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో చదవాలనుకుంటున్నా.  
– మురసాని సాయి యశ్వంత్‌రెడ్డి, టీఎస్‌ ఈఏపీసెట్‌ ఐదో ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌ విభాగం)  

ర్యాంకుల శ్రీ‘నిధి’ 
మాది పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట. అమ్మానాన్న సుశీల, శ్రీనివాసరావు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నాకు జేఈఈ మెయిన్‌లో అఖిల భారత స్థాయిలో 261వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 35వ ర్యాంకు వచ్చాయి.   
–ధనుకొండ శ్రీనిధి, టీఎస్‌ ఈఏపీసెట్‌ పదో ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌ విభాగం)  

తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే.. 
మాది పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం యరకరాయపురం. నాన్న మోహనరావు సాంఘిక సంక్షేమ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా, అమ్మ హైమావతి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తెలంగాణ ఈఏపీసెట్‌లో మొదటి ర్యాంకు సాధించగలిగాను.  
– సతివాడ జ్యోతిరాదిత్య, టీఎస్‌ ఈఏపీసెట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ (ఇంజనీరింగ్‌ విభాగం) 

గుండె వైద్య నిపుణురాలినవుతా.. 
మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి. నాన్న శ్రీకర్‌ హోమియో మెడికల్‌ ప్రాక్టీషనర్‌గా, అమ్మ కల్యాణి ప్రైవేట్‌ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అక్క సంవిధ కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నాకు పదో తరగతిలో 600కి 589, ఇంటర్‌ బైపీసీలో 1000కి 982 మార్కులు వచ్చాయి. ఎయిమ్స్‌ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్‌ చేసి వైద్యురాలిని కావడమే నా లక్ష్యం. కార్డియాక్‌ సర్జన్‌గా స్థిరపడాలన్నదే నా ఆకాంక్ష.  
–ఆలూరు ప్రణీత, టీఎస్‌ ఈఏపీసెట్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ (అగ్రికల్చర్‌–ఫార్మా విభాగం)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement