సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో రూ.180 కోట్లతో నిర్మాణం
క్రాసింగ్ కోసం రైళ్లు నిలపాల్సిన అవసరం లేకుండా ఏర్పాటు
ఐదున్నర కిలోమీటర్ల అదనపు లైన్.. అందులో 1,400 మీటర్లు ఎలివేటెడ్ కారిడార్
సాక్షి, హైదరాబాద్: క్రాసింగ్ సమయంలో ఇతర రైళ్లను ఆపేయాల్సిన పరిస్థితి ఉండటాన్ని ఈ మధ్య సీరియస్‌గా తీసుకున్న రైల్వేశాఖ.. ‘రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి’ల నిర్మాణంపై దృష్టి సారించింది. గత ఏడాది దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని విజయవాడ సెక్షన్ పరిధిలో గూడురు–మనుబోలు మధ్య 2.2 కిలోమీటర్ల నిడివితో ఇలాంటి వంతెనను నిర్మించారు. తాజాగా సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో పగిడిపల్లి స్టేషన్ సమీపంలో ఈ తరహా బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి నడికుడి మీదుగా గుంటూరు వైపు వెళ్లే రైళ్లు.. కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసేచోట నిర్మించనున్నారు. వంతెన ఒక్కటే కాకుండా దానికి అనుసంధానంగా కొంత మేర అదనపు ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా రూ.180 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
రెండు మూడు మార్గాల సమస్య తీరేలా..
ప్రస్తుతం సికింద్రాబాద్–కాజీపేట మధ్య, నడికుడి మీదుగా సికింద్రాబాద్–గుంటూరు మధ్య నిత్యం 450 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో 150కిపైగా గూడ్స్ రైళ్లు ఉంటున్నాయి. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే రైళ్లు పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసి మళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏదైనా రైలు నడికుడి వైపు క్రాస్ చేయాలంటే.. సికింద్రాబాద్–కాజీపేట మార్గంలోని రైళ్లను ఎక్కడో ఓ స్టేషన్‌లో కాసేపు నిలిపేయాల్సి వస్తోంది. ఇక భవిష్యత్తులో సికింద్రాబాద్–గుంటూరు మార్గాన్ని రెండు లైన్లకు విస్తరించనున్నారు. ఆ మార్గంలో ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల సంఖ్య పెరగనుంది.
ఇది సికింద్రాబాద్–కాజీపేట, సికింద్రాబాద్–గుంటూరు లైన్లను అనుసంధానించే మార్గం కావటం విశేషం. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లకే పరిమితమైన ఈ మార్గంలో భవిష్యత్తులో ప్యాసింజర్ రైళ్లను తిప్పాలనే ప్రతిపాదన ఉంది. అప్పుడు పగిడిపల్లి వై జంక్షన్ వద్ద రైల్వే ట్రాఫిక్ బాగా పెరగనుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. క్రాసింగ్ వద్ద రైళ్లు జామ్ కాకుండా రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి (ఆర్‌ఓఆర్‌బీ)కి ప్లాన్ చేశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన రైల్ ఓవర్ రైలు బ్రిడ్జికి సంబంధించిన మార్గం మొత్తం ఐదున్నర కిలోమీటర్లు ఉంటుంది.
ఇది సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో బీబీనగర్ స్టేషన్ దాటిన తర్వాత.. పగిడిపల్లి స్టేషన్‌కు 600 మీటర్ల ముందు మొదలవుతుంది. ప్రస్తుత లైన్‌కు అదనంగా మరో లైన్ అక్కడ మొదలవుతుంది. అది పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత గుంటూరు వైపు మళ్లుతుంది. సికింద్రాబాద్–గుంటూరు లైన్‌లోని బొమ్మాయిపల్లి స్టేషన్ సమీపంలో ప్రధాన లైన్‌కు కలుస్తుంది. ఈ ఐదున్నర కిలోమీటర్ల లైన్‌లో 1,400 మీటర్ల మేర ఎలివేటెడ్ మార్గం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment