Railway deapartment
-
పగిడిపల్లిలో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి!
సాక్షి, హైదరాబాద్: క్రాసింగ్ సమయంలో ఇతర రైళ్లను ఆపేయాల్సిన పరిస్థితి ఉండటాన్ని ఈ మధ్య సీరియస్‌గా తీసుకున్న రైల్వేశాఖ.. ‘రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి’ల నిర్మాణంపై దృష్టి సారించింది. గత ఏడాది దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని విజయవాడ సెక్షన్ పరిధిలో గూడురు–మనుబోలు మధ్య 2.2 కిలోమీటర్ల నిడివితో ఇలాంటి వంతెనను నిర్మించారు. తాజాగా సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో పగిడిపల్లి స్టేషన్ సమీపంలో ఈ తరహా బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి నడికుడి మీదుగా గుంటూరు వైపు వెళ్లే రైళ్లు.. కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసేచోట నిర్మించనున్నారు. వంతెన ఒక్కటే కాకుండా దానికి అనుసంధానంగా కొంత మేర అదనపు ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా రూ.180 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.రెండు మూడు మార్గాల సమస్య తీరేలా..ప్రస్తుతం సికింద్రాబాద్–కాజీపేట మధ్య, నడికుడి మీదుగా సికింద్రాబాద్–గుంటూరు మధ్య నిత్యం 450 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అందులో 150కిపైగా గూడ్స్ రైళ్లు ఉంటున్నాయి. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్లే రైళ్లు పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత కాజీపేట మార్గాన్ని క్రాస్ చేసి మళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏదైనా రైలు నడికుడి వైపు క్రాస్ చేయాలంటే.. సికింద్రాబాద్–కాజీపేట మార్గంలోని రైళ్లను ఎక్కడో ఓ స్టేషన్లో కాసేపు నిలిపేయాల్సి వస్తోంది. ఇక భవిష్యత్తులో సికింద్రాబాద్–గుంటూరు మార్గాన్ని రెండు లైన్లకు విస్తరించనున్నారు. ఆ మార్గంలో ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల సంఖ్య పెరగనుంది. ఇది సికింద్రాబాద్–కాజీపేట, సికింద్రాబాద్–గుంటూరు లైన్లను అనుసంధానించే మార్గం కావటం విశేషం. ప్రస్తుతం సరుకు రవాణా రైళ్లకే పరిమితమైన ఈ మార్గంలో భవిష్యత్తులో ప్యాసింజర్ రైళ్లను తిప్పాలనే ప్రతిపాదన ఉంది. అప్పుడు పగిడిపల్లి వై జంక్షన్ వద్ద రైల్వే ట్రాఫిక్ బాగా పెరగనుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. క్రాసింగ్ వద్ద రైళ్లు జామ్ కాకుండా రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి (ఆర్‌ఓఆర్‌బీ)కి ప్లాన్ చేశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన రైల్ ఓవర్ రైలు బ్రిడ్జికి సంబంధించిన మార్గం మొత్తం ఐదున్నర కిలోమీటర్లు ఉంటుంది. ఇది సికింద్రాబాద్–కాజీపేట మార్గంలో బీబీనగర్ స్టేషన్ దాటిన తర్వాత.. పగిడిపల్లి స్టేషన్‌కు 600 మీటర్ల ముందు మొదలవుతుంది. ప్రస్తుత లైన్‌కు అదనంగా మరో లైన్ అక్కడ మొదలవుతుంది. అది పగిడిపల్లి స్టేషన్ దాటిన తర్వాత గుంటూరు వైపు మళ్లుతుంది. సికింద్రాబాద్–గుంటూరు లైన్‌లోని బొమ్మాయిపల్లి స్టేషన్ సమీపంలో ప్రధాన లైన్‌కు కలుస్తుంది. ఈ ఐదున్నర కిలోమీటర్ల లైన్లో 1,400 మీటర్ల మేర ఎలివేటెడ్ మార్గం ఉంటుంది. -
‘వందేభారత్’లో టికెట్లేని ప్రయాణికులు.. స్పందించిన రైల్వే శాఖ
న్యూఢిల్లీ: భారత్ రైళ్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి వాటిపై రాళ్లదాడులు జరగడం సర్వ సాధారణమైపోయింది. వందేభారత్‌కు సంబంధించి రోజూ ఏదో ఒక వార్త ఎక్కడో ఒక చోట చూస్తుంటాం. అయితే తాజాగా లక్నో-డెహ్రాడూన్ వందేభారత్ రైలులో టికెట్లేని ప్రయాణికులు చాలా మంది ఎక్కి టికెట్ ఉన్న ప్రయాణికులకు ఇబ్బందులు కలుగజేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.ప్రీమియం రైలులో ఈ పరిస్థితి తలెత్తితే మిగిలిన రైళ్ల పరిస్థితి ఏంటని వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు బోగీలను కూడా పెంచాలని వారు రైల్వే శాఖను డిమాండ్ చేశారు.అయితే వందేభారత్ వీడియోపై రైల్వేశాఖ స్పందించింది. ఇది పాత వీడియో అని తెలిపింది. కొందరు రైతులు గతంలో బలవంతంగా రైలులోకి ఎక్కినపుడు తీసిన వీడియో అని వెల్లడించింది. ఇలాంటి పాత వీడియోలను మళ్లీ వైరల్ చేసి ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని కోరింది. -
ఐఆర్సీటీసీ సీఎండీగా సంజయ్ కుమార్
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సంజయ్ కుమార్ జైన్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇప్పటి వరకు సంజయ్ కుమార్ జైన్ నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా సేవలు అందించారు. ‘‘సీఎండీగా సంజయ్ కుమార్ జైన్ తక్షణ నియామకానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తేదీ 2026 డిసెంబర్ 31 వరకు లేదంటే తదుపరి ఆదేశాలు వెలవరించేంత వరకు.. వీటిల్లో ఏది ముందు అయితే అది అమలవుతుందని తెలిపింది. ఈ నెల 13న నార్తర్న్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ బాధ్యతల నుంచి తప్పుకున్న జైన్, మరుసటి రోజు ఐఆర్సీటీసీ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సరీ్వసెస్, 1990 బ్యాచ్ అధికారి అయిన జైన్, చార్టర్ అకౌంటెంట్ ఉత్తీర్ణులు. లోగడ భారత ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల వాణిజ్య వెంచర్లు, విధానాల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. -
సంక్రాంతి స్పెషల్.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్–తిరుపతి(07489/07490) స్పెషల్ ట్రైన్ ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుస టిరోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 30వ తేదీ రాత్రి 8.25కు బయలుదేరి ఉదయం 8.50కి హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–తిరుపతి (07449/07450) మరో స్పెషల్ ట్రైన్ ఈ నెల 27వ తేదీ సా. 6.10కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.45కు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 28వ తేదీ సాయంత్రం 5.15కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.30కు హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్–కాకినాడ (07451/07452) స్పెషల్ ట్రైన్ ఈ నెల 29న రాత్రి 8.30కు బయలుదేరి మరుసటిరోజు ఉ. 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 30వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉ.9కి హైదరాబాద్ చేరుకుంటుంది. ఇదీ చదవండి: 2023 సామాన్యునికి ఏమిచ్చింది? -
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి సీజన్లో ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1 నుంచి 29 వరకు ప్రతి సోమవారం పూర్ణ–తిరుపతి (07609), జనవరి 2 నుంచి 30 వరకు ప్రతి మంగళవారం తిరుపతి–పూర్ణ (07610), జనవరి 6 నుంచి 27 వరకు ప్రతి శనివారం హైదరాబాద్–నర్సాపూర్ (07631), జనవరి 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం నర్సాపూర్–హైదరాబాద్ (07632), ఈనెల 7 నుంచి 28 వరకు ప్రతి ఆదివారం తిరుపతి–సికింద్రాబాద్ (07481), జనవరి 8 నుంచి 29 వరకు ప్రతి సోమవారం సికింద్రాబాద్–తిరుపతి (07482), జనవరి 1 నుంచి 31 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో కాకినాడ పోర్టు–లింగంపల్లి (07445), జనవరి 2 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో లింగంపల్లి–కాకినాడ టౌన్ (07446) రైళ్లను నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఏజెన్సీలో హైవే -
కవచ్ మరింత భద్రం
సాక్షి, హైదరాబాద్: రెండు రైళ్లు ఒకే ట్రాక్‌మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీకొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా సొంతగా రూపొందించిన కవచ్ పరిజ్ఞానానికి మరింత పదును పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. పదేళ్ల పరీక్షలు, ట్రయల్స్ అనంతరం దాన్ని వినియోగించేందుకు గతేడాది రైల్వే బోర్డు అనుమతించిన విషయం తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వేలో దాదాపు 1,500 కి.మీ. మేర ఈ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసిన అధికారులు, దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఇటీవల టెండర్లు పిలిచారు. కానీ గత నెలలో ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన ఘోర రైలు దుర్ఘటన అనంతరం కవచ్ పనితీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ దుర్ఘటనలో ఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దేశ చరిత్రలో ఎన్నడూ ఈ తరహా ప్రమాదం చోటు చేసుకోలేదు. ఇప్పటివరకు చోటుచేసుకున్న ఘోర దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచే స్థాయిలో, 295 మంది వరకు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కవచ్ పరిజ్ఞానం ఆ మార్గంలో ఏర్పాటు చేసి ఉంటే, ఈ ప్రమాదం తప్పి ఉండేదంటూ అప్పట్లో కొందరు నేతలు వ్యాఖ్యానించారు. కానీ రైల్వే అధికారులు మాత్రం ‘ఆ మార్గంలో ఒకవేళ కవచ్ పరిజ్ఞానం ఏర్పాటై ఉన్నా.. ఈ ప్రమాదాన్ని నిలువరించే వీలుండేది కాదు..’అని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే కవచ్‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని స్పష్టమైంది. కవచ్ ఏర్పాటు ఇక వేగవంతం.. ట్రయల్స్ స్థానికంగా నిర్వహించినందున దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,500 కి.మీ. మేర కవచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీతో లింక్ అయి ఉన్న మార్గాల్లో కనీసం 4 వేల కి.మీ. మేర ఏర్పాటు చేయాలని గతేడాది నిర్ణయించినా అది సాధ్యం కాలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక దాని ఏర్పాటు పనులు వేగంగా పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సంవత్సరానికి కనీసం 8 వేల కి.మీ. పూర్తి చేసేలా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. రెండు వేర్వేరు టెండర్ల ద్వారా 12 వేల కి.మీ. ఏర్పాటుకు సిద్ధమైంది. వచ్చే పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా లక్ష కి.మీ. వరకు దాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. కొత్త అనుమానాలు.. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు చేరువగా వచ్చినా, బ్రేక్ కొట్టాల్సిన సమయంలో లోకో పైలట్ విస్మరించినా, సిగ్నల్‌ను లోకో పైలట్ పట్టించుకోకుండా రైలును ముందుకు పోనిచ్చినా.. లోకో పైలట్‌తో ప్రమేయం లేకుండా కవచ్ పరిజ్ఞానం పని ప్రారంభించి ప్రమాదం జరక్కుండా నిలువరిస్తుంది. ఇది కవచ్ పనితీరును పరిశీలించే క్రమం (ట్రయల్స్)లో స్పష్టమైంది. అంతవరకు దాని పనితీరును శంకించాల్సిన అవసరం లేదు. కానీ బాలాసోర్ ప్రమాదం కొత్త అనుమానాలను తెరపైకి తెచ్చింది. ఆరోజు.. మెయిన్‌లైన్‌లో గ్రీన్ సిగ్నల్ ఉంది. ఎక్స్‌ప్రెస్ రైలు ఆ మేరకు దూసుకుపోయింది. కానీ ట్రాక్ పాయింట్ మాత్రం లూప్లైన్తో అనుసంధానమై ఉంది. దీంతో 127 కి.మీ. వేగంతో వచ్చిన రైలు ఒక్కసారిగా లూప్లైన్లోకి వెళ్లి.. అక్కడికి కేవలం 100 మీటర్ల దూరంలో నిలిచి ఉన్న గూడ్సు రైలును ఎనిమిది సెకన్ల (లూప్లైన్లోకి ప్రవేశించాక) వ్యవధిలోనే ఢీకొంది. దీంతో కవచ్ ఉన్నా.. ట్రాక్ పాయింట్ లూప్లైన్తో అనుసంధానమై ఉందన్న విషయాన్ని ముందుగా గుర్తించేది కాదని నిపుణులంటున్నారు. గ్రీన్ సిగ్నల్ ఉండటం, ఎదురుగా ఆ ట్రాక్‌పై మరో రైలు లేకపోవటంతో కవచ్ మిన్నకుండిపోతుందని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఇదే కోణంలో కవచ్‌ను మరింత మెరుగ్గా తయారుచేసి, కొత్తగా పరీక్షలు నిర్వహించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. సిగ్నల్‌కు విరుద్ధంగా, పాయింట్ తప్పుగా మరో లైన్‌కు లింక్ అయి ఉంటే దాన్ని కూడా కవచ్ గుర్తించేలా మార్చబోతున్నారు. కవచ్ పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సనత్‌నగర్–వికారాబాద్–వాడీ సెక్షన్ల మధ్య ట్రయల్స్ చేసినందున.. తదుపరి పరీక్షలు కూడా ఇక్కడే చేసే అవకాశం ఉంది. -
ప్రీమియం రైళ్ల స్థానంలో ‘వందేభారత్’
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో ప్రీమియం కేటగిరీ రైళ్లుగా గుర్తింపు పొంది, దశాబ్దాలుగా విజయవంతంగా నడుస్తున్న శతాబ్ది, రాజధాని రైళ్లు త్వరలో కనుమరుగు కాబోతున్నాయి. కొత్తగా ప్రారంభమై సూపర్ సక్సెస్ అయిన వందేభారత్ రైళ్లను వాటి స్థానంలో నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం పగటి వేళ నడుస్తున్న చైర్‌కార్ కోచ్‌లతో కూడిన రెగ్యులర్ వందేభారత్ రైళ్లు శతాబ్ది స్థానాన్ని ఆక్రమించనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ రైళ్లను రాజధాని స్థానంలో నడపాలని ప్లాన్ చేస్తోంది. దీంతో ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది, రాజధాని రైళ్లు దశలవారీగా మాయం కానున్నాయి. అదే వేగంతో.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు. వీలైనంత తొందరలో 400 వందేభారత్ రైళ్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే శాఖ వాటి తయారీపై దృష్టి సారించింది. చైర్‌కార్ కోచ్‌లతో ఉన్నందున వీటిని రాత్రి వేళ నడిపే వీలు లేదు. దీంతో ఉదయం నుంచి అర్ధరాత్రి లోపు గమ్యం చేరి, మళ్లీ సొంత స్టేషన్‌కు తిరిగి వచ్చేలా సమయాలను సెట్ చేశారు. ప్రస్తుతం శతాబ్ది రైళ్లు కూడా ఇదే తరహాలో చైర్‌కార్ కోచ్‌లతో పగటి వేళ నడుస్తున్నాయి. భారత తొలి ప్రధాని నెహ్రూ శతజయంతికి గుర్తుగా శతాబ్ది (వందేళ్లు) పేరుతో 1988లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని ప్రారంభించింది. వచ్చే మార్చికి స్లీపర్ రైళ్లు.. తక్కువ దూరం ఉన్న ప్రధాన నగరాల మధ్య తిరుగుతున్న వందేభారత్ రైళ్లను దూరప్రాంతాల మధ్యా ప్రవేశపెట్టాలని రైల్వే నిర్ణయించింది. ఇందుకోసం వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో దీనికి సంబంధించిన డిజైన్లు సిద్ధమవుతున్నాయి. వచ్చే మార్చి నాటికి తొలి రైలు పట్టాలెక్కించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాజధాని నగరం ఢిల్లీకి, దేశంలోని ప్రధాన నగరాలకు మధ్య అనుసంధానంగా ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్థానంలో వీటిని నడపాలని భావిస్తోంది. 1969లో ఢిల్లీ–హౌరా మధ్య తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది. ప్రస్తుతం 18 రాజధాని రైళ్లు తిరుగుతున్నాయి. రాజధానిని తేజస్ రైళ్లుగా మార్చాలని నిర్ణయించి, తేజస్ రాజధాని పేరుతో ఏడు రైళ్లను రైల్వే శాఖ ఇప్పటికే ప్రారంభించింది. తాజాగా వాటి స్థానంలో వందేభారత్ స్లీపర్ కోచ్‌లను నడపాలని భావిస్తోంది. -
అగ్నివీర్లకు రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్!
న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో నాలుగు సంవత్సరాలు విధులు నిర్వర్తించాక త్రివిధ బలగాల్లో ఉద్యోగం నుంచి బయటికొచ్చిన అగ్నివీర్లకు తమ ఉద్యోగ భర్తీల్లో వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పిస్తామని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ వివరాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వేర్వేరు రైల్వే విభాగాల్లో నేరుగా రిక్రూట్మెంట్కు సంబంధించి నాన్–గెజిటెడ్ పోస్టుల్లో వారికి 15 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఆయా ఉద్యోగాలకు అర్హత వయసులో సడలింపు అవకాశం ఇవ్వనున్నారు. దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కల్పిస్తారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)లో అగ్నివీర్లకు రిజర్వేషన్ విధానాన్ని తెచ్చే యోచనలో ఉన్నారు. నాన్–గెజిటెడ్ పోస్టుల్లో లెవల్ 1లో 10 శాతం , లెవల్ 2లో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. దివ్యాంగులు, మాజీ సైనికులు, అప్రైంటీస్ల రెగ్యులరైజేషన్ విధానాలకు అనుగుణంగా వీరి నియామకం ఉంటుంది. తొలి బ్యాచ్ అగ్నివీర్లకు ఐదేళ్ల వయసు సడలింపు, రెండో బ్యాచ్ వారికైతే మూడేళ్ల వయోపరిమితి సడలింపు వర్తింపజేస్తారు. -
ఇక రైలు ప్రయాణంలో సమస్యలకు చెక్!.. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘రైల్ మదద్’
రాజమహేంద్రవరం సిటీ: రైలు ప్రయాణంలో ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడానికి రైల్వే శాఖ తాజాగా ‘రైల్ మదద్’ పేరిట ఓ యాప్ రూపొందించింది. దీని ద్వారా ప్రయాణ సమయంలో 35 రకాల సేవల్లో లోపాలపై ఫిర్యాదు చేయొచ్చు. సమస్యను వివరించడంతో పాటు సంబంధిత ఫొటోను అప్లోడ్ చేసేందుకు యాప్‌లో వీలు ఉంది. ఈ యాప్‌లో ఫిర్యాదు చేసే ప్రయాణికులు రిజర్వేషన్, జనరల్, ప్లాట్‌ఫామ్ టికెట్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఫిర్యాదు సమయంలో ఆ టికెట్ వివరాలు తెలియజేయాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి రైల్ మదద్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రయాణికుడి పేరు, ఫోన్ నంబర్ టైప్ చేస్తే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే యాప్‌లో ఫిర్యాదు చేసే పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ సూచించిన వివరాల మేరకు ఫిర్యాదు అప్లోడ్ చేయాలి. ఈ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను జనరల్ మేనేజర్ (జీఎం), డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) నేరుగా పర్యవేక్షిస్తారు. ఫిర్యాదు స్థాయిని బట్టి సంబంధిత విభాగానికి చెందిన ముఖ్య అధికారికి చేరవేస్తారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలిస్తారు. ఫిర్యాదుపై అధికారుల స్పందనను బట్టి పరిష్కారానికి పట్టే సమయం, ఇతర వివరాలతో ఆయా ప్రయాణికుల ఫోన్‌కు మెసేజ్ పంపిస్తారు. వేటిపై ఫిర్యాదు చేయొచ్చంటే.. ♦ రిజర్వేషన్ చేసుకున్నా వెయిటింగ్ జాబితాలో ఉండటం. ♦ టీటీఈ, ఇతర సిబ్బంది అవినీతి ♦ నాణ్యత లేని ఆహారం ♦ మరుగుదొడ్లు, బోగీల అపరిశుభ్రత ♦ రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం, దురుసు ప్రవర్తన ♦ అనుమానాస్పద వ్యక్తుల సంచారం ♦ వస్తువులు మరచిపోవడం ♦ రైళ్ల రాకపోకల్లో ఆలస్యం ♦ జూదం, ధూమపానం చేసే ప్రయాణికుల వల్ల కలిగే అసౌకర్యం ♦ రైల్వే స్టేషన్లో నీరు, వెయిటింగ్ హాల్స్ కొరత ♦మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, ఈవ్ టీజింగ్ ♦ అధిక ధరలకు తినుబండారాల అమ్మకం. ♦ ప్యాంట్రీ కార్ అపరిశుభ్రత -
వచ్చే10 రోజుల్లో 2,600 శ్రామిక్ రైళ్లు
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకురానున్న 10 రోజుల్లో 2,600 శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వీటి ద్వారా 36 లక్షల మంది వలస కార్మికులకు లాభం కలుగుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. ‘రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణసహా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి బయలుదేరే శ్రామిక్ రైళ్లలో ప్రయాణించే వారి కోసం ఇప్పటికే ఉన్న వెయ్యి టికెట్ కౌంటర్లకు అదనంగా మరికొన్నిటిని ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు. 80 శాతం ఆ రెండు రాష్ట్రాలకే.. శ్రామిక్ రైళ్లలో 80 శాతం ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకే వెళ్తున్నందున ఆ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోందని, దీనిని నివారించేందుకే కొన్ని రైళ్లను దూరమైనా సరే రద్దీలేని మార్గాలకు దారి మళ్లిస్తున్నామని యాదవ్ వెల్లడించారు. కోవిడ్ రోగుల కోసం రూపొందించిన 5,213 కోచ్‌లలో సగం వరకు ఈ రైళ్లలో వాడుతున్నామన్నారు. ప్రస్తుతానికి ఈ కోచ్‌లు ఖాళీగా ఉన్నాయనీ, కోవిడ్ బాధితుల కోసం రాష్ట్రాలు కోరితే అందజేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘రైల్వే శాఖకు చెందిన 17 ఆస్పత్రులను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాం. ఏప్రిల్ 1– మే 22వ తేదీల మధ్య 9.7 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను రైళ్ల ద్వారా తరలించాం. మార్చి 22 నుంచి ఇప్పటి వరకు 3,255 పార్శిల్ ప్రత్యేక రైళ్లను నడిపాం’ అని వీకే యాదవ్ పేర్కొన్నారు. ‘జూన్ 1వ తేదీ నుంచి నడిచే 200 స్పెషల్ రైళ్లలో ప్రస్తుతానికి రిజర్వేషన్ ఉన్న వారికే అవకాశం కల్పిస్తున్నాం ఈ రైళ్లలో 30 శాతం టికెట్లే రిజర్వు అయ్యాయి. ప్రయాణించదలచిన వారికి 190 రైళ్లలో సీట్లు ఖాళీగా ఉన్నాయి’అని వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో వివిధ పనుల్లో ఉన్న 4 కోట్ల మంది వలస కార్మికుల్లో ఇప్పటి వరకు 75 లక్షల మందిని సొంతూళ్లకు తరలించినట్లు హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ తెలిపారు. శ్రామిక్ రైళ్లలో 35 లక్షల మందిని సొంతూళ్లకు తరలించగా, మరో 40 లక్షల మంది బస్సుల్లో తమ గమ్య స్థానాలకు చేరుకున్నారని ఆమె అన్నారు. -
కరెంటు ఇచ్చారు..లైన్ మరిచారు!
సాక్షి, హైదరాబాద్: అది దగ్గరి దారి.. ఆ మార్గం గుండా వెళ్తే దాదాపు 80 కి.మీ. దూరం తగ్గుతుంది. ఫలితంగా సమయంతోపాటు ఖర్చూ ఆదా అవుతుంది. అలాంటప్పుడు ఎవరైనా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. గరిష్టంగా దాన్ని వినియోగించుకుని ఆదా చేసుకుంటారు. కానీ ఘనత వహించిన మన రైల్వే మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో నడికుడి మార్గం కీలకమైన వాటిల్లో ఒకటి. నగరం నుంచి వెళ్లేటప్పుడు బీబీ నగర్ దాటిన తర్వాత వచ్చే పగిడిపల్లి స్టేషన్ తర్వాత మార్గం రెండుగా విడిపోతుంది. ఎడమవైపు వెళ్తే వరంగల్, కుడివైపు వెళ్తే నడికుడి మార్గం వస్తుంది. వరంగల్ మార్గం డబుల్‌లైన్ కావటం, విద్యుదీకరణ ఉండటంతో ఇది ప్రధాన మార్గమైంది. కానీ నడికుడి మార్గం సింగిల్‌లైన్‌గా ఉండిపోవటంతో ఆ మార్గంలో కొన్ని రైళ్లే నడుస్తున్నాయి. పైగా ఇప్పటివరకు అది విద్యుదీకరణ పూర్తి కాకపోవటంతో డీజిల్ రైళ్లనే నడుపుతున్నారు. వరంగల్ మార్గంలో రైళ్ల ట్రాఫిక్ గరిష్ట పరిమితి దాటిపోవటంతో ప్రమాదకర పరిస్థితిలో దాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో దానికి ప్రత్యామ్నాయంగా నడికుడి మార్గాన్ని అభివృద్ధి చేయాలని గతంలోనే నిర్ణయించారు. రెండో లైన్ వేయటంతోపాటు విద్యుదీకరణ చేపట్టి కొన్ని రైళ్లను ఈ మార్గంలో మళ్లించాలనేది ఆలోచన. గుంటూరుకు వరంగల్ మీదుగా కంటే ఈ మార్గంలో వెళ్తే దాదాపు 80 కి.మీ. నిడివి తగ్గుతుంది. దీంతో ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయించారు. కరెంటు ఏర్పాటు చేసి తుస్సుమనిపించారు.. చేసిన ఆలోచనకు, చేపట్టిన కార్యాచరణకు పొంతన లేకపోవటంతో ఇప్పుడు ఈ మార్గంలో వింత పరిస్థితి ఎదురైంది. పగిడిపల్లి స్టేషన్ నుంచి గుంటూరు సమీపంలోని నల్లపహాడ్ వరకు తాజాగా విద్యుదీకరణ పూర్తి చేశారు. గుంటూరు నుంచి విజయవాడ మార్గంలో చాలా కాలం క్రితమే ఆ తంతు పూర్తయింది. గుంటూరు నుంచి అటు తెనాలి, ఇటు గుంతకల్ మార్గాల్లో కూడా ఇటీవలే విద్యుదీకరణ పూర్తి చేశారు. వెరసి కరెంటు ఇంజిన్లతో రైళ్లు నడిపేందుకు ఈ మార్గం సిద్ధమైందన్నమాట. ఇప్పటివరకు ఈ మార్గంలో కేవలం డీజిల్ రైళ్లనే నడిపేవారు. హైదరాబాద్ నుంచి డీజిల్ ఇంజిన్ రైలును గుంటూరు/తెనాలి వరకు లాక్కెళ్లేది. అక్కడ దాన్ని మార్చి రైలుకు విద్యుత్తు ఇంజిన్ అమర్చి పంపేవారు. దీంతో దాదాపు 20 నిమిషాల సమయం వృథా అయ్యేది. ఇప్పుడు విద్యుదీకరణ పూర్తి కావటంతో ఆ సమస్య లేకుండా కరెంటు ఇంజిన్లు అమర్చి రైళ్లను నడిపే అవకాశం కలిగింది. విజయవాడ, గుంటూరు, తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాలకు ఇది దగ్గరి దారిగా మారింది. ఇక వరంగల్ మార్గంపై భారం తగ్గించేందుకు కొన్ని రైళ్లను ఈ దారి గుండా నడపాల్సి ఉంది. కానీ ఇక్కడే చిక్కొచ్చి పడింది. ఈ మార్గాన్ని విద్యుదీకరించారు కానీ రెండో లైన్ (డబ్లింగ్) నిర్మించలేదు. ఫలితంగా పగిడిపల్లి నుంచి గుంటూరు వరకు ఇది సింగిల్ లైన్‌గానే ఉంది. దీంతో ఎక్కువ రైళ్లను నడిపే అవకాశం లేకుండా పోయింది. విద్యుదీకరించినా, ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు కరెంటు ఇంజిన్ ఏర్పాటు చేయడం తప్ప ఒక్క రైలు కూడా అదనంగా నడిపే అవకాశం దక్కలేదు. వెరసి భారీ వ్యయంతో విద్యుదీకరించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. గతంలోనే మంజూరు.. పనులే చేపట్టలేదు.. పగిడిపల్లి నుంచి నల్లపహాడ్ వరకు డబ్లింగ్ చేపట్టేందుకు రైల్వే శాఖ గతంలోనే అనుమతి మంజూరు చేసినా అది ముందుకు సాగలేదు. ఎంపీ నిలదీయంతో కొత్తగా మంజూరు చేస్తామని రైల్వే మంత్రి ప్రకటించారు. కానీ దాని ఊసేలేకుండా పోయింది. దాదాపు 200కి.మీ. మార్గాన్ని డబ్లింగ్ చేయకపోవటం వల్ల, విద్యుదీకరణ జరిగినా అదనంగా రైళ్లను నడిపే అవకాశం లేకుండా పోయింది. ఫలితం.. వరంగల్ మార్గంపై అదనపు భారం పడటం, 80 కి.మీ. ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి రావటం, అంతమేర కరెంటు ఖర్చు, సమయం వృథా.. ఇదీ పరిస్థితి. అటు విద్యుదీకరణ, ఇటు డబ్లింగ్ పనులు ఒకే సారి చేపట్టి ఉంటే.. రెండూ పూర్తయ్యేవి. రైల్వేకు, ప్రయాణికులకు ఎంతో మేలు జరిగేది. -
తత్కాల్ చార్జీల పెంపు
న్యూఢిల్లీ: తత్కాల్ టికెట్ల చార్జీలను డిసెంబర్ 25నుంచి పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నటు తెలిపింది. పెంపు ప్రకారం స్లీపర్ క్లాస్‌లో రూ.175 ఉన్న టికెట్ ధర రూ. 200కు, ఏసీ-3టైర్లో రూ.350 ఉన్న ధర రూ.400కు, ఏసీ-2టైర్‌ను రూ. 500 కు పెంచినట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రూ. 90 ఉన్న స్లీపర్ క్లాస్ కనీస తత్కాల్ ధరను రూ. 100కు, త్రీటైర్ ఏసీ కనీస ధరను కూడా రూ. 250 నుంచి రూ. 300కు పెంచనున్నారు. అయితే తత్కాల్లో సెకండ్ క్లాస్ టికెట్ల ధరలను పెంచటం లేదని అధికారులు తెలిపారు. -
అమ్మో.. నెల్లూరు రైల్వేస్టేషన్!
తొక్కిసలాట కేంద్రంగా గుర్తించిన రైల్వే శాఖ నెల్లూరు(సెంట్రల్) : నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న చెన్నై-కోల్‌కతా మార్గమధ్యంలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో నెల్లూరు ఒకటి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైల్వేశాఖ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో పండగ సందర్భాల్లో తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న కేంద్రాల్లో నెల్లూరు ఒకటని అధికారులు వెల్లడించారు. ఏటా నెల్లూరులో జరిగే రొట్టెల పండగ సందర్భంగా మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళల నుంచి లక్షల సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని రైల్వే అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి, వరంగల్‌లో జరిగే సమ్మక్క- సారలమ్మ జాతర, రొట్టెల పండగకు నెల్లూరు రైల్వేస్టేషన్ అత్యంత తొక్కిసలాట జరిగే ప్రాంతంగా రైల్వే అధికారులు గుర్తించారు. దీంతో తొక్కిసలాట జరగకుండా ఏఏ చర్యలు తీసుకుందాం అనే దానిపై కూడా నిపుణుల కమిటీని నియమించనున్నారు. నెల్లూరులో ప్రస్తుతం రైల్వే రాకపోకలకు నాలుగు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ కెపాసిటీ 10 వేల మంది మాత్రమే. సాధారణ రోజుల్లో 4 నుంచి 5 వేల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. అదే ఆదివారం, పండగ రోజుల్లో 10 వేలకు పైగా ఉంటారు. రొట్టెల పండగ సందర్భంగా దాదాపు 50 నుంచి 60 వేల మంది వస్తుంటారని అంచనా. అంటే స్టేషన్ కెపాసిటీకి ఐదు రెట్లు అధికంగా వస్తుంటారు. ఈ స్టేషన్ మౌలిక సదుపాయాలపై రైల్వే అధికారులు ప్రత్యేక పరిశీలన జరపనున్నారు. సౌత్స్టేషన్తో పోలిస్తే వేదాయపాళెం ప్లాట్‌ఫారాలు అనువుగా ఉన్నట్లు భావిస్తున్నారు. నెల్లూరు నగరం బుజబుజ నెల్లూరు వరకూ విస్తరించడంతో ప్రయాణికుల సౌకర్యార్థం వేదాయపాళెం రైల్వే స్టేషన్‌ను అబివృద్ధి చేయాల్సి ఉంది. పండగ సందర్భంగా సౌత్‌స్టేషన్‌లో కొన్ని రైళ్లను ఆపితే కొంత వరకు ప్రయోజనం ఉంటుందని పలువురు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే కమిటీ వేయనున్నట్లు సమాచారం. స్టేషన్లో ఏర్పాటు చేసిన ఎస్కలేటర్ సౌకర్యం రోజుకు 1220 యూనిట్లు వాడకం మాత్రమే. ఈ యూనిట్లు సంఖ్యకూడా పెంచాలని పలువురు కోరుతున్నారు. సౌకర్యాలు నిల్ బాంబ్‌స్క్వాడ్,మెటల్‌డిటెక్టర్,షిఫ్టుల వారిగా తనికీ సిబ్బం ది ఉండాలి. కాని నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్లో మాత్రం మెటల్‌డిటెక్టర్‌ను సిబ్బంది కొరతతో తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా స్టేషన్‌లోని ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇవి ఏర్పాటు చేయాలి. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి, సమ్మక్క-సారలమ్మ జాతరకు వరంగల్ జిల్లా, రొట్టెల పండగకు నెల్లూరు రైల్వేస్టేషన్ అత్యంత తొక్కిసలాట జరిగే ప్రాంతంగా రైల్వే అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: తొక్కిసలాట కేంద్రంగా గుర్తించారు. అందుకు అనువుగా ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే నిపుణుల కమిటీతో సమావేశం ఏర్పాటు చేయనున్నాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. - షాజహాన్, స్టేషన్ సూపరింటెండెంట్ -
వినాయక చవితికి 60 ప్రత్యేక రైళ్లు
♦ {పయాణికుల రద్దీని ద ృష్టిలో ఉంచుకునే: సెంట్రల్ రైల్వే ♦ నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం ముంబై : గణేశ్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 60 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఆదివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ 11 నుంచి 29వ తేదీ వరకు 01001 నంబర్ రైలు ముంబై సీఎస్టీ నుంచి అర్ధరాత్రి 12.20 బయలు దేరి మడ్గావ్కు మధ్యాహ్నం 2.30కు చేరుకుంటుంది. గురువారం మినహా ప్రతిరోజు ఈ సర్వీసు నడుస్తుంది. అలాగే రైలు నం 01002 మడ్గావ్ నుంచి మధ్యాహ్నం 2.40కి బయలుదేరి ఉదయం 4.25కు ముంబై సీఎస్టీ చేరుకుంటుంది. 01033 నంబరు రైలు సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 1 వరకు ప్రతి గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు ముంబై నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.30 కు మడ్గావ్ చేరుకుంటుంది. అలాగే 01034 నంబర్ రైలు మడ్గావ్ నుంచి మధ్యాహ్నం 3.25కి బయలుదేరి ముంబై సీఎస్టీకి ఉదయం 4.25కు చేరుకుంటుంది. సెప్టెంబర్ 11 నుంచి 29వ తేదీ వరకు దాదర్ నుంచి సావంత్వాడీకి, సెప్టెంబర్ 12 నుంచి 30వ తేదీ వరకు సావంత్‌వాడీ నుంచి దాదర్‌కు వారానికి మూడు రోజులపాటు ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నడపనున్నట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఆదివారం, మంగళవారం, శుక్రవారం 01095 నంబరు రైలు దాదర్ నుంచి సావంత్‌వాడీ బయలుదేరుతుంది. ఉదయం 7.50కి దాదర్ నుంచి బయలుదేరి సాయంత్రం 8.30కు సావంత్వాడీకి చేరుకుంటుంది. అలాగే సోమవారం, బుధవారం, శనివారం 01096 నంబరు రైలు సావంత్‌వాడీ నుంచి ముంబై బయలుదేరుతుంది. ఈ సేవలు నడుస్తాయి. సావంత్వాడీలో ఉదయం 4.50కి బయలుదేరి సాయంత్రం 3.50కి దాదర్ చేరుకుంటుంది. ఈ సేవలన్నీ స్పెషల్ చార్జీలతోటే నడుస్తాయని, బుకింగ్స్ 60 రోజుల పాటు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది. -
ఎంపీలదే భారం ఇప్పుడే మేల్కోవాలి
సాక్షి, హన్మకొండ : రైల్వే శాఖలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలకు ఒకేసారి పరిష్కారం లభించే అరుదైన అవకాశం వచ్చింది. వ్యాగన్ వర్క్‌షాప్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేటకు సబ్‌డివిజన్ హోదా వంటి పలు అభివృద్ధి పనులకు అనుమతులు... నిధులు సాధించేందుకు ఇదే అనువైన సమయం. రాష్ట్ర విభజన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విభజన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై నివేదిక ఇచ్చేం దుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని రైల్వే బోర్డు నియమించింది. జూలైలో నిర్వహించనున్న బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ కమిటీ సిఫార్సులకనుగుణంగా దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మన ఎంపీలు అప్రమత్తమై కమిటీ ముందు కాజీపేటకు సంబంధించిన అంశాలను ప్రస్తావించి నిధులు సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. కసరత్తు ప్రారంభించిన రైల్వేబోర్డు ఉత్తర, దక్షిణ భారతదేశాలకు గేట్వేగా ఉన్న కాజీపేట సబ్ డివిజన్ గడిచిన కొన్నేళ్లుగా నిరాదరణకు గురవుతోంది. ఇక్కడ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రతి రైల్వే బడ్జెట్ సమయంలో మన ఎంపీలు సమర్పించే వినతిపత్రాలు బుట్టదాఖలు కావడం మినహా కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా రూపొందించిన ముసాయిదా బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు తెలంగాణలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసే అంశాలను పరిశీలించాలంటూ కేంద్ర ప్రభుత్వం రైల్వేబోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటిని 2014 ఏప్రిల్ 15న రైల్వేబోర్డు నియమించింది. ఈ కమిటీ మూడు నెలల్లో తన నివేదికను రైల్వేబోర్డుకు సమర్పించాల్సి ఉంది. మే 16 వరకు దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉండడంతో ఈ కమిటీ క్రియాశీలకంగా పని చేయలేదు. ఇప్పటికే సగం సమయం గడిచిపోయింది. దీంతో అందుబాటులో ఉన్న 45 రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను రూపొందించనుంది. జూలైలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే మంత్రి సదానందగౌడ ఇప్పటికే ప్రకటించారు. రైల్వే బోర్డు నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రైల్వే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి. ఈ నేపథ్యంలో మన ఎంపీలు తమ వంతు ప్రయత్నం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. రికార్డు స్థాయిలో ఐదుగురు సభ్యులు తెలంగాణలోని పది జిల్లాలలో ఏ జిల్లాకు రాని అరుదైన అవకాశం వరంగల్ జిల్లాకు వచ్చింది. ముగ్గురు రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి, రాపోలు ఆనంద భాస్కర్, గరికపాటి మోహన్‌రావు... ఇద్దరు ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీలకతీతంగా జిల్లా ప్రయోజనాలు, పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వీరందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సి ఉంది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, సబ్ డివిజన్ ఏర్పాటుకు అనుమతులు సాధించడంతోపాటు వ్యాగన్ వర్క్‌షాపునకు నిధుల కేటాయింపు వంటి అంశాలను అందరూ కలిసి సమష్టిగా రైల్వే బోర్డు నియమించిన కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని... కాజీపేట సబ్ డివిజన్‌ను అభివృద్ధి పట్టాలు ఎక్కించేందుకు ఇదే అనువైన సమయని రైల్వే కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాల కల మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు హయూంలో కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. అయితే రాజకీయ కారణాలతో ఆ ప్రాజెక్ట్ పంజాబ్‌కు తరలిపోయింది. ఆ తర్వాత దీని ఊసెత్తేవారే కరువయ్యారు. అదేవిధంగా... అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కాజీపేటకు ఇంతవరకు డివిజన్ హోదా దక్క లేదు. ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్ సమయంలో డిమాండ్ చేయడం.... ఆ తర్వాత మిన్నకుండిపోవడం మన నేతలకు షరామామూలుగా మారింది. ఒకవేళ విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక జోన్‌ను కేటాయిస్తే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ మూడు జోన్లు మాత్రమే ఉంటాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో రైల్వేకు సంబంధించిన రెండు డివిజన్లు రాష్ట్ర రాజధానిలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో పరిపాలన సౌల భ్యం కోసం సికింద్రాబాద్ డివిజన్‌ను విభజించి కాజీపేట కేంద్రంగా మరో డివిజన్ ఏర్పాటు చేసేం దుకు అస్కారం ఉంది. వ్యాగన్ వర్క్‌షాప్ నిర్మాణం అంటూ నాలుగేళ్లుగా బడ్జెట్లలో ప్రకటనలు తప్పితే.. ఇంతవరకు ఎటువంటి నిధులు కేటాయించలేదు.