సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో ప్రీమియం కేటగిరీ రైళ్లుగా గుర్తింపు పొంది, దశాబ్దాలుగా విజయవంతంగా నడుస్తున్న శతాబ్ది, రాజధాని రైళ్లు త్వరలో కనుమరుగు కాబోతున్నాయి. కొత్తగా ప్రారంభమై సూపర్ సక్సెస్ అయిన వందేభారత్ రైళ్లను వాటి స్థానంలో నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది.
ప్రస్తుతం పగటి వేళ నడుస్తున్న చైర్‌కార్ కోచ్‌లతో కూడిన రెగ్యులర్ వందేభారత్ రైళ్లు శతాబ్ది స్థానాన్ని ఆక్రమించనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ రైళ్లను రాజధాని స్థానంలో నడపాలని ప్లాన్ చేస్తోంది. దీంతో ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది, రాజధాని రైళ్లు దశలవారీగా మాయం కానున్నాయి.
అదే వేగంతో..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు. వీలైనంత తొందరలో 400 వందేభారత్ రైళ్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే శాఖ వాటి తయారీపై దృష్టి సారించింది. చైర్‌కార్ కోచ్‌లతో ఉన్నందున వీటిని రాత్రి వేళ నడిపే వీలు లేదు. దీంతో ఉదయం నుంచి అర్ధరాత్రి లోపు గమ్యం చేరి, మళ్లీ సొంత స్టేషన్‌కు తిరిగి వచ్చేలా సమయాలను సెట్ చేశారు.
ప్రస్తుతం శతాబ్ది రైళ్లు కూడా ఇదే తరహాలో చైర్‌కార్ కోచ్‌లతో పగటి వేళ నడుస్తున్నాయి. భారత తొలి ప్రధాని నెహ్రూ శతజయంతికి గుర్తుగా శతాబ్ది (వందేళ్లు) పేరుతో 1988లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని ప్రారంభించింది.
వచ్చే మార్చికి స్లీపర్ రైళ్లు..
తక్కువ దూరం ఉన్న ప్రధాన నగరాల మధ్య తిరుగుతున్న వందేభారత్ రైళ్లను దూరప్రాంతాల మధ్యా ప్రవేశపెట్టాలని రైల్వే నిర్ణయించింది. ఇందుకోసం వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో దీనికి సంబంధించిన డిజైన్లు సిద్ధమవుతున్నాయి.
వచ్చే మార్చి నాటికి తొలి రైలు పట్టాలెక్కించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాజధాని నగరం ఢిల్లీకి, దేశంలోని ప్రధాన నగరాలకు మధ్య అనుసంధానంగా ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్థానంలో వీటిని నడపాలని భావిస్తోంది. 1969లో ఢిల్లీ–హౌరా మధ్య తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది.
ప్రస్తుతం 18 రాజధాని రైళ్లు తిరుగుతున్నాయి. రాజధానిని తేజస్ రైళ్లుగా మార్చాలని నిర్ణయించి, తేజస్ రాజధాని పేరుతో ఏడు రైళ్లను రైల్వే శాఖ ఇప్పటికే ప్రారంభించింది. తాజాగా వాటి స్థానంలో వందేభారత్ స్లీపర్ కోచ్‌లను నడపాలని
భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment