shatabdi express
-
ప్రీమియం రైళ్ల స్థానంలో ‘వందేభారత్’
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వేలో ప్రీమియం కేటగిరీ రైళ్లుగా గుర్తింపు పొంది, దశాబ్దాలుగా విజయవంతంగా నడుస్తున్న శతాబ్ది, రాజధాని రైళ్లు త్వరలో కనుమరుగు కాబోతున్నాయి. కొత్తగా ప్రారంభమై సూపర్ సక్సెస్ అయిన వందేభారత్ రైళ్లను వాటి స్థానంలో నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం పగటి వేళ నడుస్తున్న చైర్‌కార్ కోచ్‌లతో కూడిన రెగ్యులర్ వందేభారత్ రైళ్లు శతాబ్ది స్థానాన్ని ఆక్రమించనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ రైళ్లను రాజధాని స్థానంలో నడపాలని ప్లాన్ చేస్తోంది. దీంతో ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది, రాజధాని రైళ్లు దశలవారీగా మాయం కానున్నాయి. అదే వేగంతో.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు. వీలైనంత తొందరలో 400 వందేభారత్ రైళ్లను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్న రైల్వే శాఖ వాటి తయారీపై దృష్టి సారించింది. చైర్‌కార్ కోచ్‌లతో ఉన్నందున వీటిని రాత్రి వేళ నడిపే వీలు లేదు. దీంతో ఉదయం నుంచి అర్ధరాత్రి లోపు గమ్యం చేరి, మళ్లీ సొంత స్టేషన్‌కు తిరిగి వచ్చేలా సమయాలను సెట్ చేశారు. ప్రస్తుతం శతాబ్ది రైళ్లు కూడా ఇదే తరహాలో చైర్‌కార్ కోచ్‌లతో పగటి వేళ నడుస్తున్నాయి. భారత తొలి ప్రధాని నెహ్రూ శతజయంతికి గుర్తుగా శతాబ్ది (వందేళ్లు) పేరుతో 1988లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని ప్రారంభించింది. వచ్చే మార్చికి స్లీపర్ రైళ్లు.. తక్కువ దూరం ఉన్న ప్రధాన నగరాల మధ్య తిరుగుతున్న వందేభారత్ రైళ్లను దూరప్రాంతాల మధ్యా ప్రవేశపెట్టాలని రైల్వే నిర్ణయించింది. ఇందుకోసం వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో దీనికి సంబంధించిన డిజైన్లు సిద్ధమవుతున్నాయి. వచ్చే మార్చి నాటికి తొలి రైలు పట్టాలెక్కించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాజధాని నగరం ఢిల్లీకి, దేశంలోని ప్రధాన నగరాలకు మధ్య అనుసంధానంగా ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్థానంలో వీటిని నడపాలని భావిస్తోంది. 1969లో ఢిల్లీ–హౌరా మధ్య తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైంది. ప్రస్తుతం 18 రాజధాని రైళ్లు తిరుగుతున్నాయి. రాజధానిని తేజస్ రైళ్లుగా మార్చాలని నిర్ణయించి, తేజస్ రాజధాని పేరుతో ఏడు రైళ్లను రైల్వే శాఖ ఇప్పటికే ప్రారంభించింది. తాజాగా వాటి స్థానంలో వందేభారత్ స్లీపర్ కోచ్‌లను నడపాలని భావిస్తోంది. -
ఇలాంటి కూతురు చచ్చినా పర్లేదు అనేవారు.. నాన్న చనిపోయాక..
ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం తలవంచక తప్పదు అంటున్నారు శతాబ్ది. దివ్యాంగురాలిగా మారిన తాను సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని సగర్వంగా చెబుతున్నారు. బ్యాంక్ మేనేజర్‌గా, క్రీడాకారిణిగా, సామాజిక కార్యకర్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ‘శతాబ్ది’ జీవన ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. అందుకే ఆ పేరు పెట్టారు.. చిన్నతనం నుంచే హైపర్ యాక్టివ్. ఒక్కచోట కూడా కాలు నిలవనే నిలవదు. ఎల్లప్పుడూ ఉరుకులూ.. పరుగులే. అందుకే.. వేగంగా ప్రయాణించే శతాబ్ది ఎక్స్‌ప్రెస్(రైలు) పేరిట.. తమ అమ్మాయికి శతాబ్ది అని నామకరణం చేశారు ఆ తల్లిదండ్రులు. గెంతులు వేస్తూ ఎప్పుడూ సందడి చేసే తమ బిడ్డను చూసుకుంటూ మురిసిపోయారు. కానీ... 21 ఏళ్ల వయస్సులో శతాబ్దికి జరిగిన ప్రమాదం వారి జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. మేడ మీది నుంచి జారిపడ్డ శతాబ్ది.. శాశ్వతంగా చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన పరిస్థితి. నా ప్రపంచం మొత్తం కుప్పకూలిపోయింది.. ‘‘ఆరోజు నా కేక విని అమ్మానాన్న పరిగెత్తుకుని వచ్చారు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సుమారు 5 గంటల తర్వాత నాకు స్పృహ వచ్చింది. నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయింది. ఇక జీవితంలో నేను నడవలేనని డాక్టర్లు చెప్పారు. అప్పుడే నా ప్రపంచం మొత్తం కూలిపోయినట్లు అనిపించింది. పూర్తిగా విషాదంలో మునిగిపోయాను. ఇతరుల సాయం లేకుండా కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితి. సిగ్గు అనిపించేది. భయం వేసేది. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అలాంటి సమయంలో బంధువులు తమ మాటలతో మరింత చిత్రవధ చేసేవారు. ఫొటో: హ్యూమన్స్ ఆఫ్ బాంబే చచ్చిపోవడమే మేలు అనేవారు.. ‘‘ఇలాంటి కూతురి వల్ల ఏం ప్రయోజనం. ఇంత ఘోరమైన పరిస్థితి అనుభవించే కంటే చచ్చిపోవడమే మంచిది’’ అని అమ్మానాన్నలను మరింతగా బాధపెట్టేవారు. అయితే, నా కుటుంబం నాకు అండగా నిలిచింది. ‘‘నా కూతురు కచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తుంది. తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని నాన్న వాళ్లకు సమాధానమిచ్చేవారు. ఆరేళ్లపాటు ఆస్పత్రే నాకు ఇల్లు. నాకు వైద్యం చేయించడానికి నా కుటుంబం చాలా కష్టపడింది. అమ్మ తన పెన్షన్ డబ్బుతో బిల్లు కట్టేది. ఇవన్నీ చూస్తూ నా మీదే నాకే జాలివేసేది. అప్పుడే బలంగా నిర్ణయించుకున్నాను. ‘‘ఈ దుర్ఘటనకు నా జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఇవ్వకూడదు. నాకంటూ గుర్తింపు కావాలి’’ అని అనుకున్నాను. మొదటి ప్రయత్నంలోనే... అందుకు అనుగుణంగానే బ్యాంకు ఉద్యోగం సాధించేలా అహర్నిశలు కృషి చేశాను. మొదటి ప్రయత్నంలోనే ఎగ్లామ్ పాసై జాబ్ తెచ్చుకున్నాను. ‘‘మేనేజర్ తండ్రిని’’ అంటూ నాన్న నన్ను చూసి గర్వపడేవారు. అప్పుడు నా ఆనందం అంతా ఇంతాకాదు. ఎవరైతే నన్ను చచ్చిపో అన్నారో వారికి గట్టిగా సమాధానం ఇచ్చినట్లయింది. కానీ విధికి నా సంతోషం చూడబుద్ధికాలేదేమో! ఆరు నెలల్లోనే నాన్న చనిపోయారు. నా గుండె పగిలింది. నేను మేడ మీది నుంచి కిందపడిపోయినపుడు కూడా అంతటి బాధను అనుభవించలేదు.ఆ బాధాకరమైన ఘటన నుంచి బయటపడేందుకు సామాజిక కార్యక్రమాల్లో భాగమవడం అలవాటు చేసుకున్నాను. ఆర్మీ ఆఫీసర్ అయి దేశానికి సేవ చేయాలన్న చిన్ననాటి కల ఎలాగో నెరవేరలేదు కాబట్టి... సమాజ సేవ చేయాలని ఫిక్సయ్యాను. ఫొటో: హ్యూమన్స్ ఆఫ్ బాంబే 31 వయస్సులో మళ్లీ అయితే, పారాలింపిక్స్‌లో దీపా మాలిక్‌ను చూసిన తర్వాత నాకు కూడా క్రీడల్లో పాల్గొనాలనిపించింది. 31 ఏళ్ల వయస్సులో కోచ్ సహాయంతో షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్‌త్రో ప్రాక్టీసు చేశాను. బరువులు ఎత్తిన ప్రతీసారీ ప్రాణం పోయినట్టు అనిపించేది. క్రమేణా.. అలవాటైపోయింది. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. మూడు విభాగాల్లోనూ స్వర్ణం సాధించాను. అమ్మ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. నాన్నే గనుక ఉండి ఉంటే ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. న్యూస్ పేపర్లలో నా గురించి కథనాలు చూసిన ప్రతిసారి నాన్నే గుర్తుకువస్తారు. ఇలాంటి కూతురి వల్ల ఏం ప్రయోజనం అన్న వారికి వీటిని సమాధానంగా చూపేవారు అనిపిస్తుంది. ప్రస్తుతం కామన్వెల్త్ క్రీడల కోసం సన్నద్ధమవుతున్నాను. కచ్చితంగా పసిడి సాధిస్తాను. ఆరేళ్ల పాటు నరకం అనుభవించిన నేను.. విధిరాత అని సరిపెట్టుకోకుండా ముందడుగు వేశాను కాబట్టే.. వీల్‌చైర్‌లో కూర్చునే నా కలలు నెరవేర్చుకున్నాను’’ అని తన జీవితంలోని విషాదాలు, వాటి నుంచి తేరుకుని ఎదిగిన విధానాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శతాబ్ది పంచుకున్నారు. -వెబ్‌డెస్క్ చదవండి: Shana Parmeshwar: అలాంటప్పుడు నాకు ఎదురయ్యే ప్రత్యేక సవాళ్లు ఏముంటాయి? -
శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
డెహ్రాడూన్: శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని కాన్స్రో సమీపం వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా సి-4 బోగీలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని వెంటనే గ్రహించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి అంతా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఈ బోగీలోని ప్రయాణికులందరిని సురక్షితం తరలించామని, వారికి ఎటువంటి గాయాలు సంభవించలేదని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. -
ధోతీ కట్టుకున్నాడని రైల్లోనుంచి దింపేశారు!
లక్నో : ధోతీ ధరించిన కారణంగా ఓ వృద్ధుడిని రైల్లోనుంచి కిందకు దింపేశారు సిబ్బంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎతవా నగరంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ బరబంకీకి చెందిన రామ్ అవధ్ దాస్(82) ఎతవా నుంచి ఘజియాబాద్ వెళ్లటానికి శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో టిక్కెట్ రిజర్వ్ చేసుకున్నాడు. గురువారం ఉదయం ఘజియాబాద్ వెళ్లటానికి ఎతవా రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌కు చేరుకోగానే అందులోకి ఎక్కాడు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆయనదగ్గరకు చేరుకున్న రైల్వే సిబ్బంది రామ్ అవధ్ దాస్ వేసుకున్న దుస్తులను, అతని వాలకాన్ని చూసి కిందకు దింపేశారు. వారి ప్రవర్తనతో కలత చెందిన పెద్దాయన కిందకు దిగి వేరే బోగిలోకి ఎక్కబోయేలోగా రైలు కదిలి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన రామ్ అవధ్ దాస్ సిబ్బంది ప్రవర్తనపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. రామ్ అవధ్ దాస్ మాట్లాడుతూ.. ‘‘ నాకు టిక్కెట్ ఉన్నా రైల్వే సిబ్బంది, టిక్కెట్ కలెక్టర్ నన్ను బోగిలోకి అనుమతించలేదు. వారి తీరుతో నాకు చాలా బాధకలిగింది. నేను వేసుకున్న (ధోతీ)దుస్తులు వారికి నచ్చకపోవటం వల్లే నన్ను కిందకు దించేశారు. మనం ఇంకా బ్రిటీష్ పాలనలో ఉన్నామా? అనిపించింద’’ని తెలిపారు. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు.. ‘‘అతడు పొరపాటున వేరే బోగిలోకి ఎక్కటం మూలానే సిబ్బంది అతన్ని కిందకు దింపేశారు. వాళ్లు అతన్ని కించపరచలేదు. అతడు వేరే బోగిలోకి ఎక్కే సమయంలో రైలు కదిలి వెళ్లిపోయింద’’ని వెల్లడించారు. -
శతాబ్ది.. సూపర్ క్లీన్!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైలుగా సికింద్రాబాద్ – పుణె మధ్య నడుస్తోన్న పుణె– సికింద్రాబాద్ శతాబ్ది రైలు నిలచింది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ ) నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.ఈ రైలు సెంట్రల్ రైల్వే జోన్ నుంచి దక్షిణ మధ్య రైల్వే కేంద్రాల మధ్య నడుస్తుంది.ఈ రైలు బయల్దేరేటపుడు తీసుకుంటున్న పరిశుభ్రతా చర్యలే దీనికి అరుదైన గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ ఘనత సాధించడం వెనుక దక్షిణమధ్య రైల్వే పాత్ర కూడా ఉంది. రైలు పుణె నుంచి బయల్దేరినా.. సికింద్రాబాద్ చేరాక.. ఇక్కడ కూడా రెండో నిర్వహణలో భాగంగా గంటపాటు రైలును మరోసారి శుభ్రపరిచి ప్రయాణానికి సిద్ధం చేస్తారు. దేశంలో నడుస్తోన్న మొత్తం 26 ప్రీమియం రైళ్లలో ఈ రైలు పరిశుభ్రతకే అధికశాతంమంది ప్రయాణికులు ఓటేయడం విశేషం. మొత్తం 1000 పాయింట్లకు గాను ఈ రైలు 916 పాయింట్లు సాధించింది దక్షిణ మధ్య రైల్వేకు ఆఖరి స్థానం.. స్వచ్ఛ్‌రైల్ స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా పురోగతి తెలుసుకునేందుకు, పరిశుభ్రత విషయంలో రైళ్ల మధ్య పోటీ పెంచేందుకు ఐఆర్సీటీసీ టోటల్ క్లీన్‌లైన్స్ పేరిట ఈ సర్వే నిర్వహించింది. మొత్తం 209 రైళ్లలో ప్రయాణికుల వద్ద అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వేలో జైపూర్ కేంద్రంగా నడిచే వాయవ్య రైల్వే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 1000 పాయింట్లకు 860 పాయింట్లు సాధించింది. ఈ సర్వేలో దక్షిణమధ్య రైల్వేకు 658 పాయింట్లతో ఆఖరు స్థానం దక్కింది. -
రైల్లోనే షాపింగ్!
న్యూఢిల్లీ: రైల్లో గంటల తరబడి ప్రయాణించడం విసుగ్గా ఉంటోందా.. అయితే, హాయిగా షాపింగ్ చేసుకోండి అంటోంది రైల్వే శాఖ. రైళ్లలో ‘ఆన్‌బోర్డ్ సేల్స్’ను అందుబాటులోకి తెచ్చేందుకు పశ్చిమ, మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట శతాబ్ది, కోణార్క్, చెన్నై ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో ఈ షాపింగ్ సదుపాయం కల్పిస్తారు. ప్రయాణికుల ఆదరణ ఆధారంగా మిగలిన రైళ్లలోనూ ప్రవేశపెడతారు. ఈ ఆన్‌బోర్డ్ సేల్స్‌లో సెంట్లు, బ్యాగులు, వాచీలు వంటి అనేక రకాల సామాన్లు అమ్ముతారు. సెప్టెంబర్‌లో దీనికి టెండర్లు పిలుస్తామని, డిసెంబర్ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా అమ్మకాలు మొదలు పెడతామని పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు. అక్టోబర్ నుంచే కోణార్క్, దురంతో, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లలో అమ్మకాలు ప్రారంభిస్తామని మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ప్రయోజనం కలగడంతో పాటు తమకు అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు తెలిపారు. టికెట్ల అమ్మకం కాకుండా ఇతర మార్గాల ద్వారా ఏడాదికి రూ.1200 కోట్ల ఆదాయం సమకూర్చుకునేలా ఆలోచించాలని రైల్వేశాఖ అన్ని జోన్లకు సూచించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంది. ప్రధాన రైల్వే స్టేషన్లలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కియోస్క్‌లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉందని, ప్రస్తుతం ఉన్న బరువు తూచే యంత్రాల స్థానంలో వీటిని పెట్టాలని భావిస్తున్నామని అధికారులు చెప్పారు. అలా గే, ఫుట్ మసాజ్ రోబోటిక్ చైర్లు, ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అల్యూమినియం బోగీలు ప్రస్తుతం ఉన్న ఇనుప బోగీల స్థానంలో అల్యూమినియంతో తయారు చేసిన బోగీలను ఉపయోగించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. రాయ్‌బరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తారు. అయితే, ఈ పరిజ్ఞానం మనకు అందుబాటులో లేనందున జపాన్, ఐరోపా దేశాల సాయం తీసుకోనున్నారు. ఈ దేశాలు 15 ఏళ్లుగా అల్యూమినియం బోగీలనే వాడుతున్నాయి. ప్రస్తుతం వాడుతున్న ఇనుప బోగీలు బరువు ఎక్కువగా ఉండటంతో వేగంగా వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అంతే కాకుండా ఈ బోగీలు తుప్పు పడతాయి. అల్యూమినియం బోగీలు తేలిగ్గా ఉంటాయి. తుప్పు పట్టవు. కాబట్టి వీటి వాడకం వల్ల రైళ్ల వేగం పెరుగుతుంది. నిర్వహణ వ్యయం తగ్గుతుంది. మొదటి దశలో ఏటా 250 అల్యూమినియం బోగీలు తయారు చేయాలని ప్రతిపాదించారు. ఒక్కో బోగీ తయారీకి 150 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రైళ్లకూ స్వచ్ఛ గ్రేడ్లు! ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ల శుభ్రతకోసం చర్యలు తీసుకున్న రైల్వే శాఖ ఇప్పుడు రైళ్లలో శుభ్రతపై దృష్టి పెట్టింది. టాయ్లెట్లు సహా రైలు బోగీలు, సీట్ల శుభ్రత, హౌస్ కీపింగ్ వంటి అంశాలను పరిశీలించి రైళ్లకు శుభ్రతా గ్రేడ్లు ఇస్తారు. ఇందుకోసం 50 ఆడిట్ బృందాలను ఏర్పాటు చేశారు. వచ్చే రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా 200 రైళ్లను పరిశీలించి వాటికి గ్రేడ్లు ఇస్తుంది. శతాబ్ది, రాజధాని, దురం తో వంటి 72 ప్రీమియం రైళ్లు, కోణార్క్, జనశతాబ్ది, సంపర్క్ వంటి 128 రైళ్లలో తనిఖీలు చేపడతాయి. ఒక్కో ప్రీమియం రైలుకు సంబంధించి కనీసం 100 మంది, ఇతర రైళ్లకు సంబంధించి కనీసం 60 మం ది ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు ఈ బృంద సభ్యులు స్వయంగా రైళ్లను పరిశీలిస్తారు. -
160 కి.మీ వేగం.. ఇండియా రైలు రెడీ..!!
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయంగా రూపుదిద్దుకున్న తొలి సెమీ హైస్పీడ్ రైలు త్వరలో పరుగులు తీయనుంది. గంటకు దాదాపు 160 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైలు ముఖ్య నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనుంది. సెమీ హైస్పీడ్ రైలుకు ప్రీమియం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌గా తీసుకురానున్నారు. రూ. 100 కోట్ల వెచ్చించి రూపొందించిన రైలు అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. మొత్తం 16 పెట్టెలు ఉండే ఈ రైల్లో ఒక్కొ కోచ్ నిర్మాణానికి రూ. 6 కోట్లు ఖర్చు చేశారు. వీటన్నింటిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)లో తయారు చేశారు. అచ్చూ ఇదే డిజైన్‌తో దిగుమతి చేసుకునే రైలు పెట్టెలకు వీటికంటే 40 శాతం తక్కువ ఖర్చు అవుతుందని ఐసీఎఫ్ జనరల్ మేనజర్ చెప్పారు. ఈ ఏడాది జూన్ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్ పేరుతో సెమీ హైస్పీడ్ రైలు పరుగులు పెడుతుందని వెల్లడించారు. -
శతాబ్ది రైలుకు మహిళా టీటీఈలు
న్యూఢిల్లీ: భారత రైల్వే మరో నూతన అధ్యాయానికి తెరతీయనుంది. ముంబై– అహ్మదాబాద్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో కేవలం మహిళా ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ల(టీటీఈ)నే నియమించాలని నిర్ణయించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. శతాబ్దిలో 30 మంది మహిళా టీటీఈల బృందం విధులు నిర్వహించనుంది. -
శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు ‘అనుభూతి’ బోగి!
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్–పుణే మధ్య తిరిగే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రత్యేక ఆకర్షణ తోడయింది. భారతీయ రైళ్లలో లగ్జరీ కోచ్‌లుగా పేరొందిన ‘అనుభూతి’బోగీని ఈ రైలుకు జత చేయనున్నారు. సోమవారం నుంచి ఒక అనుభూతి బోగీని శాశ్వత ప్రాతిపదికన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు జోడించనున్నారు. శతాబ్ది బోగీలతో పోలిస్తే ఇది చాలా విలాసంగా ఉంటుంది. ప్రతి సీటుకు ఎల్సీడీ మానిటర్లు ఉంటాయి. సీటుకు సీటుకు మధ్య కాళ్లు పెట్టుకునేందుకు విశాలమైన స్థలం, కిటికీ అద్దాలకు ప్రత్యేక తెర ఉంటుంది. శతాబ్ది ఏసీ–1 చైర్‌కార్‌లో 56 సీట్లుండగా.. ఈ లగ్జరీ బోగీలో 50 సీట్లు ఉంటాయి. ఏసీ–1 బోగీ టికెట్ ధర కంటే అనుభూతి టికెట్ ధర ఎక్కువగా ఉంటుంది. ఒక్కో బోగీ తయారీకి దాదాపు రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుండటంతో వీటిని తక్కువ సంఖ్యలో తయారు చేస్తున్నారు. సికింద్రాబాద్–పుణే శతాబ్దికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ లగ్జరీ బోగీని అనుసంధానిస్తున్నారు. -
రైలు ప్రయాణికులకు శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రైళ్లు అపరిశుభ్రంగా ఉండడానికి ప్రధాన కారణం.. టాయిలెట్లే. సరిగ్గా పనిచేయని టాయిలెట్లు, మురికి వాతావరణంతో రైలు మొత్తం చెత్తగా మారిపోతోంది. రైళ్లలో టాయిలెట్లను క్లీన్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటోందని సిబ్బంది కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని రైళ్లలోని టాయిలెట్లను పూర్తిగా ఆధునీకరించేందుకు రైల్వేశాఖ సమాయత్తం అవుతోంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రైళ్లలో బయో టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. విమానాళ్లో ఉపయోగించే బయో వ్యాక్యూమ్ టాయిలెట్లను రైళ్లలోనూ ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే శాఖ పేర్కొంది. తొలివిడతలో భాగంగా శతాబ్ది, రాజధాని రైళ్లలో వీటిని బయో వ్యాక్యూమ్ టాయిలెట్లను ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ప్రకించారు. -
రైల్వే మాజీ మంత్రికి రైలులో షాక్..
న్యూఢిల్లీ : రైలు ప్రయాణం చేసిన రైల్వేశాఖ మాజీ మంత్రి షాక్ తిన్నారు. హ్యాపీగా ఓ జ్యూస్ తాగుదామని ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని ఓపెన్ చేసి అందులో బూజు ఉండటంతో అవాక్కయ్యారు. వెంటనే మీడియాను పిలిచి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో రైల్వే శాఖ ఎంత దారుణంగా పనిచేస్తుందో ఇది ఒక ఉదాహరణ అని తెలిపారు. రైల్వేలో ప్రయాణీకులకు అందించే ఆహార పదార్థాలు ఏమాత్రం శుభ్రంగా లేవని, పరిశుభ్రత అనే రైళ్లల్లో కొరవడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత, రైల్వే శాఖ మాజీ మంత్రి దినేష్ త్రివేది శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి బయలుదేరారు. వెళుతూ మధ్యలో కొన్ని మంచినీళ్లు, నిమ్మరసం, జ్యూస్‌లాంటివి ఆర్డర్ చేశారు. అవి వచ్చాక ఓపెన్ చేసి చూడగా అందులో బూజు, బ్యాక్టీరియా కనిపించడంతో ఓ మీడియా చానెల్‌కు లైవ్‌లో చూపించారు. 'ఈ రోజు దసరా.. నేను నిమ్మరసం తాగుతామని ఓపెన్ చూశాను.. చూడండి లోపల ఏం ఉందో మీరే చూడండి.. ఇది మనం తాగేందుకు ఉపయోగించేది' అని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే టిక్కెట్ చార్జీలు పెంచడం తెలిసిన కేంద్ర ప్రభుత్వానికి పరిశుభ్రతను, నాణ్యమైన ఆహారపదార్థాలను అందించాలని తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
శతాబ్ది ఎక్స్ ప్రెస్ పై రాళ్ల దాడి
చండీగఢ్: ఢిల్లీ- చండీగఢ్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. హర్యానాలోని రతధనా-సోనీపేట రైల్వేస్టేషన్ల మధ్య నడుస్తున్న రైలుపై రాళ్లతో దాడి జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. దాడిలో రైలు అద్దాలు పగిలిపోయాయన్నారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రైళ్లపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని సమీప గ్రామాల్లో అధికారులు ప్రచారం చేయించారు. -
పట్టాలు తప్పిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్
చెన్నై: కోయంబత్తూరు నుంచి బయలుదేర వలసిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని ఐదు బోగీలు ఈ రోజు ఉదయం పట్టాలు తప్పాయని సధరన్ రైల్వే ఉన్నతాధికారులు శనివారం చెన్నైలో వెల్లడించారు. యార్డ్ నుంచి రైల్వే ప్లాట్ ఫామ్‌కు వస్తున్న క్రమంలో బెసిన్ బ్రిడ్జ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. సహాయక చర్యలు కోనసాగుతున్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో బోగీలో ప్రయాణీకులు ఎవరు లేరని చెప్పారు. అయితే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ కోయంబత్తూరు నుంచి శనివారం ఉదయం 7.15 గంటలకు కోయింబత్తురు నుంచి బయలుదేర వలసి ఉందన్నారు. కానీ మూడు గంటల ఆలస్యగా అంటే 10.30 గంటలకు ఈ రైలు బయలుదేరుతుందని సధరన్ రైల్వే ఉన్నతాధికారులు వివరించారు. -
శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
శంకర్పల్లి: పుణే నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు శంకర్పల్లి రైల్వేస్టేషన్ వద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం బొగ్గులోడుతో గూడ్స్ రైలు వికారాబాద్ వైపు వెళ్తుండగా అందులోని ఓ వ్యాగన్లో సమస్య తలెత్తింది. దీంతో దాన్ని శంకర్‌పల్లిలోని ప్లాట్‌ఫాంపై నిలిపేశారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ నుంచి 13 మంది సిబ్బంది ఓ మినీ రైలులో వచ్చి వ్యాగన్‌కు మరమ్మతులు చేస్తున్నారు. శంకర్పల్లి రైల్వేస్టేషన్ నాలుగు లైన్ల పట్టాలున్నాయి. నాలుగో నంబర్ పట్టాపై చెడిపోయిన వ్యాగన్, మూడో నంబర్ పట్టాపై సిబ్బంది వచ్చిన రైలు ఉన్నాయి. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు రెండో నంబర్ పట్టాలపై నుంచి వె ళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శంకర్పల్లి రైల్వేస్టేషన్ వద్దకు రాగానే మరమ్మతులు చేయడానికి వచ్చిన రైలు క్రేన్ కొనభాగం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు తగలడంతో సుమారు 3 ఏసీ బోగీల అద్దాలు పగిలిపోయాయి. ఆ సమయంలో రైలు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఉంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ అప్రమత్తమై రైలును కంట్రోల్‌చేసి నిలిపేశారు. ప్రయాణికులెవరూ గాయపడలేదు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని మరమ్మతు చేస్తున్న సిబ్బంది తెలిపారు. ఇరవై నిమిషాల తరువాత రైలు సికింద్రాబాద్ వెళ్లింది. -
శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం త్రుటిలో తప్పింది. పుణె నుంచి సికింద్రాబాద్ వస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను ప్రమాదవశాత్తు ఓ క్రేన్ ఢీకొంది. దాంతో రైలు అద్దాలు పగిలిపోయాయి. శంకర్పల్లి రైల్వేస్టేషన్లో సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా అక్కడ ఆ పనుల కోసం క్రేన్‌ను ఉంచారు. ఇదే రైలును ఢీకొంది. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అంతా సురక్షితంగా ఉన్నారు.