న్యూఢిల్లీ: రైల్లో గంటల తరబడి ప్రయాణించడం విసుగ్గా ఉంటోందా.. అయితే, హాయిగా షాపింగ్ చేసుకోండి అంటోంది రైల్వే శాఖ. రైళ్లలో ‘ఆన్‌బోర్డ్ సేల్స్’ను అందుబాటులోకి తెచ్చేందుకు పశ్చిమ, మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట శతాబ్ది, కోణార్క్, చెన్నై ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో ఈ షాపింగ్ సదుపాయం కల్పిస్తారు. ప్రయాణికుల ఆదరణ ఆధారంగా మిగలిన రైళ్లలోనూ ప్రవేశపెడతారు. ఈ ఆన్‌బోర్డ్ సేల్స్‌లో సెంట్లు, బ్యాగులు, వాచీలు వంటి అనేక రకాల సామాన్లు అమ్ముతారు. సెప్టెంబర్‌లో దీనికి టెండర్లు పిలుస్తామని, డిసెంబర్ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా అమ్మకాలు మొదలు పెడతామని పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు.
అక్టోబర్ నుంచే కోణార్క్, దురంతో, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లలో అమ్మకాలు ప్రారంభిస్తామని మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ప్రయోజనం కలగడంతో పాటు తమకు అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు తెలిపారు. టికెట్ల అమ్మకం కాకుండా ఇతర మార్గాల ద్వారా ఏడాదికి రూ.1200 కోట్ల ఆదాయం సమకూర్చుకునేలా ఆలోచించాలని రైల్వేశాఖ అన్ని జోన్లకు సూచించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంది. ప్రధాన రైల్వే స్టేషన్లలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కియోస్క్‌లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉందని, ప్రస్తుతం ఉన్న బరువు తూచే యంత్రాల స్థానంలో వీటిని పెట్టాలని భావిస్తున్నామని అధికారులు చెప్పారు. అలా గే, ఫుట్ మసాజ్ రోబోటిక్ చైర్లు, ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
అల్యూమినియం బోగీలు
ప్రస్తుతం ఉన్న ఇనుప బోగీల స్థానంలో అల్యూమినియంతో తయారు చేసిన బోగీలను ఉపయోగించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. రాయ్‌బరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తారు. అయితే, ఈ పరిజ్ఞానం మనకు అందుబాటులో లేనందున జపాన్, ఐరోపా దేశాల సాయం తీసుకోనున్నారు. ఈ దేశాలు 15 ఏళ్లుగా అల్యూమినియం బోగీలనే వాడుతున్నాయి. ప్రస్తుతం వాడుతున్న ఇనుప బోగీలు బరువు ఎక్కువగా ఉండటంతో వేగంగా వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అంతే కాకుండా ఈ బోగీలు తుప్పు పడతాయి. అల్యూమినియం బోగీలు తేలిగ్గా ఉంటాయి. తుప్పు పట్టవు. కాబట్టి వీటి వాడకం వల్ల రైళ్ల వేగం పెరుగుతుంది. నిర్వహణ వ్యయం తగ్గుతుంది. మొదటి దశలో ఏటా 250 అల్యూమినియం బోగీలు తయారు చేయాలని ప్రతిపాదించారు. ఒక్కో బోగీ తయారీకి 150 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
రైళ్లకూ స్వచ్ఛ గ్రేడ్‌లు!
ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ల శుభ్రతకోసం చర్యలు తీసుకున్న రైల్వే శాఖ ఇప్పుడు రైళ్లలో శుభ్రతపై దృష్టి పెట్టింది. టాయ్‌లెట్లు సహా రైలు బోగీలు, సీట్ల శుభ్రత, హౌస్ కీపింగ్ వంటి అంశాలను పరిశీలించి రైళ్లకు శుభ్రతా గ్రేడ్‌లు ఇస్తారు. ఇందుకోసం 50 ఆడిట్ బృందాలను ఏర్పాటు చేశారు. వచ్చే రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా 200 రైళ్లను పరిశీలించి వాటికి గ్రేడ్‌లు ఇస్తుంది. శతాబ్ది, రాజధాని, దురం తో వంటి 72 ప్రీమియం రైళ్లు, కోణార్క్, జనశతాబ్ది, సంపర్క్ వంటి 128 రైళ్లలో తనిఖీలు చేపడతాయి. ఒక్కో ప్రీమియం రైలుకు సంబంధించి కనీసం 100 మంది, ఇతర రైళ్లకు సంబంధించి కనీసం 60 మం ది ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు ఈ బృంద సభ్యులు స్వయంగా రైళ్లను పరిశీలిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment