konark express
-
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. ఆకతాయిని పట్టుకున్న పోలీసులు
సాక్షి,మేడ్చల్: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబ్ ఉందని కాల్ చేసిన ఆకతాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఫేక్ కాల్ చేసింది గండిమైసమ్మ బహదూర్ పల్లికి చెందిన తోర్రి కార్తిక్ (19) గా పోలీసులు గుర్తించారు. ఆకతాయిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బాంబ్ ఉందని కాల్ చేస్తే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దామని కాల్ చేసినట్లు తెలిపాడు. కాగా రైల్వే, లోకల్ పోలిసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని పట్టుకున్నారు. కాగా బుధవారం కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కాల్ రావడంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు చర్లపల్లి రైల్వేస్టేషన్లో ట్రైన్‌ను నిలిపివేశారు. బాంబ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు అనంతరం ఫేక్ కాల్‌గా రైల్వే పోలీసులు తేల్చారు. చివరికి కాల్ చేసిన ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ నుంచి ముంబైకు వెళ్తోంది. -
నిర్లక్ష్యమే.. ప్రాణం తీస్తోంది..
సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం రాత్రి సిగడాం–చీపురుపల్లి సెక్షన్ బాతువ రైల్వే గేటు సమీపానికి వచ్చే సరికి ఎవరో చైను లాగడంతో ఆగిపోయింది. వెంటనే కొందరు ప్రయాణికులు రైలు దిగి వెళ్తుండగా పక్క ట్రాక్‌పై అదే సమయంలో భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్తున్న కోణార్క్ సూపర్ ఫాస్ట్ రైలు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు, రైల్వే ట్రాక్‌లు దాటేటప్పుడు సరైన జాగ్రత్తలు పాటించకుంటే నిండు ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. దీనికి ఉదాహరణే సిగడాం–చీపురుపల్లి సెక్షన్లో జరిగిన రైలు ప్రమాదం. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. రైళ్లలో ప్రయాణించేటప్పుడు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. సరైన కారణం లేకుండా చైన్ లాగకూడదు. రైల్వే ట్రాక్‌లు దాటకూడదు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద వేసిన గేటు కింద నుంచి వెళ్లకూడదు. ఈ నిబంధనలు పాటించడంతో ప్రయాణికుల నిర్లక్ష్యం కారణంగా.. నిండు ప్రాణాలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నాయి. – తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) రెల్వే ప్రమాదాలకు కారణం సరైన అవగాహన లేకపోవడమే. రైళ్లలో ప్రయాణించేటప్పుడు కొందరు అనవసరంగా.. ఏ కారణం లేకుండా అలారం చైన్ లాగుతుంటారు. కొన్ని సార్లు రైళ్లు ఏదైనా కారణాల వలన స్టేషన్లో కాకుండా మధ్యలో ఆగుతూ ఉంటాయి. ఆ సందర్భాల్లో ముఖ్యంగా జనరల్ ప్రయాణికులు రైలు దిగి, వేరే ట్రాక్‌లపైకి వెళ్లి కూర్చోవడం, ట్రాక్‌ల మీద తిరగడం చేస్తుంటారు. దీని వలన ఆ ట్రాక్‌పై వస్తున్న రైళ్లు గురించి తెలుసుకోలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేషన్లో కాకుండా మధ్యలో ఆగినపుడు.. రైలు నుంచి దిగొద్దని అధికారులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రయాణికులు ఆ హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నారు. ఏ కారణం లేకుండా చైన్ లాగడం వలన రైలు ఆలస్యం కావడంతో పాటు.. వెనుక వచ్చే రైళ్లు కూడా ఆలస్యమవుతాయి. నిర్మానుష్య ప్రదేశాల్లో చైన్ లాగడం వలన ప్రయాణికులు దోపిడీలకు గురయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కారణం లేకుండా అలారం చైన్ లాగడం రైల్వే చట్టం 141 సెక్షన్ ప్రకారం శిక్షార్హమైన నేరం. అలా చేసిన వారికి రూ.1000 జరిమానా లేదా ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అజాగ్రత్త.. సరదా.. రైలు ప్రమాదాలకు ప్రజల అజాగ్రత్త కూడా ఒక కారణం. రైల్వే ట్రాక్‌లను ప్రజలు, ప్రయాణికులు ఇష్టానుసారంగా వినియోగిస్తుంటారు. కొన్ని చోట్ల బహిర్భూమి కోసం.. కొందరైతే ఆటలాడుకునేందుకు.. మరికొందరు కాలకృత్యాలు తీర్చుకుంటుంటారు. ఈ విధంగా చేయడం ప్రమాదం అని తెలిసినా.. అజాగ్రత్త, నిర్లక్ష్యంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. కొందరు సెల్ఫోన్లలో మాట్లాడుతూ రైల్వే ట్రాక్‌లను దాటుతుంటారు. మరికొందరు ట్రాక్‌లపై సెల్ఫీలు తీసుకుంటూ..చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. రైల్వే ట్రాక్ పరిసర ప్రాంత వాసులు ట్రాక్‌లను దాటేటప్పుడు, లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. కొందరు ట్రాక్‌ల మీద నడుస్తూ ప్రయాణిస్తుంటారు. ఇది కూడా ప్రమాదమే. కరోనా లాక్డౌన్ సమయంలో పట్టాలు దాటుతున్న వలస కూలీలను గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన అప్పట్లో తీవ్రంగా కలచివేసింది. స్టేషన్లలో అవగాహన కార్యక్రమాలు రైళ్లలో ప్రయాణించేటపుడు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. సరైన కారణం లేకుండా చైన్ లాగకూడదు. రైల్వే ట్రాక్‌లు దాటకూడదు. అలా చేయడం శిక్షార్హమైన నేరమని వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి ప్రయాణికులను హెచ్చరించారు. డీఆర్ఎం ఆదేశాలతో మంగళవారం విశాఖపట్నం, విజయనగరం, దువ్వాడ, శ్రీకాకుళంరోడ్, జగదల్పూర్ వంటి స్టేషన్లలో బ్యానర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఏ కారణం లేకుండా చైన్ లాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఆర్ఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. భద్రత విషయమై వాల్తేర్ డివిజన్ అనేక చర్యలు చేపడుతోందని.. ప్రయాణికులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాల్తేర్ డివిజన్ భద్రత విభాగం, సెక్యూరిటీ, సివిల్ డిఫెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. పయాణ సమయంలో.. స్టేషన్లో రైలు కదులుతున్నప్పుడు..ఎక్కడం, దిగడం చేస్తుంటారు. మరికొందరు తలుపు దగ్గర నిల్చొని.. కూర్చొని ప్రయాణిస్తుంటారు. ఇది కూడా ఎంతో ప్రమాదకరం. ఇటువంటి ప్రమాదమే మంగళవారం అనకాపల్లి జిల్లాలోని నరసింగబిల్లి–యలమంచిలి స్టేషన్ల మధ్య జరిగింది. రైలు నుంచి జారి పడి బావ, బావమరిది దుర్మరణం చెందారు. రైళ్లలో సురక్షితంగా ప్రయాణించి గమ్యం చేరుకునేందుకు వీలుగా రైల్వే అధికారులు సూచించిన నిబంధనలు పాటించాలి. అత్యవసర సమయాల్లో రైల్వే భద్రతా దళం, గవర్నమెంట్ రైల్వే పోలీసుల సహా యం తీసుకోవచ్చు. రైల్వే హెల్ప్‌లైన్ 139ను సంప్రదించవచ్చు. -
మృతులు పరాయి రాష్ట్రమైనా సరే ఆదుకోండి: సీఎం జగన్ ఆదేశాలు
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. రైలు ప్రమాద ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ నివేదించిన తాజా వివరాలను అధికారులు సీఎంకు అందించారు. రైలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మరణించిన వారిని గుర్తింపు కార్డులు ఆధారంగా ఇద్దరు అసోం రాష్ట్రానికి చెందినవారుగా తేల్చారన్నారు. మిగిలిన ముగ్గురిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారు కూడా వేరే రాష్ట్రానికి చెందినవారై ఉంటారని, ఇదే విషయాన్ని అధికారులు తెలిపారని సీఎంకు వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ ఒక వ్యక్తిని అదే రైలులో శ్రీకాకుళం తీసుకు వచ్చారని, వెంటనే అతన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారని వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే స్థానిక ఆర్డీఓ ప్రమాద స్థలాన్ని సందర్శించి అవసరమైన చర్యలు తీసుకున్నారని వివరించారు. గాయపడ్డ వ్యక్తికి అందుతున్న వైద్యాన్ని కలెక్టర్ స్వయంగా రిమ్స్ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖకు తరలించారని, అక్కడ అందుతున్న వైద్యంపైనా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. మరణించిన వారు పరాయి రాష్ట్రం వారైనా, మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని ఆదేశాలు జారీచేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఇవ్వాలని, ఈ సహాయం వెంటనే అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చదవండి: (శ్రీకాకుళంలో ఘోర రైలు ప్రమాదం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి) -
శ్రీకాకుళంలో ఘోర రైలు ప్రమాదం.. సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, చీపురుపల్లి, జి.సిగడాం: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ రైల్వే గేటు సమీపంలో సో మవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీ కొని ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం పాలవ్వగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు.. సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బాతు వ రైల్వే గేటు సమీపానికి వచ్చేసరికి నిలిచిపోయిం ది. దీంతో బోగీల్లో ఉన్న కొందరు ప్రయాణికులు కిందకు దిగి పక్క ట్రాక్‌పైకి వెళ్లారు. అయితే అదే సమయంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ సూపర్ ఫాస్ట్ రైలు ట్రాక్‌పై ఉన్న ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రా ణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడగా.. జీఆర్పీ పోలీసులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిం చారు. మృతుల వద్ద దొరికిన ఆధార్ కార్డుల మేర కు అసోం, ఒడిశాగా గుర్తించినట్లు సమాచారం. ఎందుకు ఆగిందంటే..? రైలు బాతువ సమీపంలో ఆగిపోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చైను లాగడం వల్లే బండి ఆగిందని రైల్వే సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో చైను లాగారని.. బండి నుంచి దిగి పారిపోయే క్రమంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రైలు దిగిన వారంతా అసోం, ఒడిశాకు చెందిన వారు కావడం, స్థానికంగా దిగే అవసరం లేకపోవడంతో పొగల భయంతోనే చైను లాగి ఉంటారని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో నా లుగు గుర్తింపు కార్డులు లభించాయి. వీటిలో మూ డు అసోంకు చెందిన వారివి, ఒకటి ఒడిశాకు చెం దిన వ్యక్తిదిగా రైల్వే పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అసోంకు చెందిన జిత్తు అనే వ్యక్తిని ఆమదాలవలస రైల్వేస్టేషన్‌కు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించారు. ఘటనా స్థలంలో 4 గుర్తింపు కార్డుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మూడు కార్డులు ఉజుల్ బస్‌మంత్రి, బసిసర్ బస్‌మంత్రి, రసీదుల్లా ఇస్లామ్‌లకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. మరొకటి క్షతగాత్రుడు జిత్తూ నాయక్‌కు చెందినదిగా గుర్తించారు. కాగా రైలు ప్రమాదంపై శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎచ్చెర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ తక్షణం స్పందించారు. సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద రైలు ఢీకొని ఐదుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి మంచి వైద్య సేవలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారులను ఆదేశించారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు. గౌహతి వెళ్తున్న రైలు నిలిచిపోవడంతో కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారని చెప్పారు. అదే సమయంలో మరో రైల్వే ట్రాక్‌పై వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కిందకు దిగినవారిని ఢీకొట్టడంతో ఐదుగురు ప్రయాణికులు మరణించారని సీఎంకు వివరించారు. దీంతో గాయపడ్డవారికి మంచి వైద్య సేవలు అందించడంతోపాటు మృతుల కుటుంబీకులకు అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. చదవండి: అమ్మానాన్న అయ్యేదెప్పుడో! -
నిలిచిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్
సాక్షి, కాజీపేట : ముంబాయి నుంచి భువనేశ్వర్ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) చక్రాలకు సాంకేతిక సమస్య తలెత్తి బోల్టుస్టార్ కాయల్ స్ప్రింగ్ పగిలిపోయింది. దీంతో కాజీపేట జంక్షన్లో ఈ రైలు గంటన్నరపాటు నిలిచిపోయింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షాల కారణంగా ఉదయం 10 గంటలకు రావల్సిన కోణార్క్ సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంది. మార్గమధ్యలో ఇంజన్ నుంచి 7వ ఏసీ కోచ్ కింద రెండు చక్రాల మధ్య ఉన్న బోల్డుస్టార్ కాయల్ స్ప్రింగ్ పగిలిపోయింది. కాజీపేట రైల్వే స్టేషన్లోకి ప్రవేశిస్తున్న క్రమంలో రోలింగ్ ఇన్ క్యారియజ్ అండ్ వ్యాగన్ ఇన్స్పెక్షన్ స్టాఫ్ బోల్డుస్టార్ పగిలిపోయిన విషయాన్ని గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో కాజీపేటలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. అధికారులు, సిబ్బంది మరమ్మతు చేసి సాయంత్రం 5.35 గంటలకు పంపించారు. సకాలంలో సీ అండ్ డబ్ల్యూ సిబ్బంది గమనించి చూడటం వల్ల ఇబ్బంది లేకుండా పోయింది. లేదంటే మార్గమధ్యలో పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని సిబ్బంది చెబుతున్నారు. -
రైల్లోనే షాపింగ్!
న్యూఢిల్లీ: రైల్లో గంటల తరబడి ప్రయాణించడం విసుగ్గా ఉంటోందా.. అయితే, హాయిగా షాపింగ్ చేసుకోండి అంటోంది రైల్వే శాఖ. రైళ్లలో ‘ఆన్‌బోర్డ్ సేల్స్’ను అందుబాటులోకి తెచ్చేందుకు పశ్చిమ, మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట శతాబ్ది, కోణార్క్, చెన్నై ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో ఈ షాపింగ్ సదుపాయం కల్పిస్తారు. ప్రయాణికుల ఆదరణ ఆధారంగా మిగలిన రైళ్లలోనూ ప్రవేశపెడతారు. ఈ ఆన్‌బోర్డ్ సేల్స్‌లో సెంట్లు, బ్యాగులు, వాచీలు వంటి అనేక రకాల సామాన్లు అమ్ముతారు. సెప్టెంబర్‌లో దీనికి టెండర్లు పిలుస్తామని, డిసెంబర్ నుంచి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయోగాత్మకంగా అమ్మకాలు మొదలు పెడతామని పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు. అక్టోబర్ నుంచే కోణార్క్, దురంతో, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లలో అమ్మకాలు ప్రారంభిస్తామని మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ప్రయోజనం కలగడంతో పాటు తమకు అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు తెలిపారు. టికెట్ల అమ్మకం కాకుండా ఇతర మార్గాల ద్వారా ఏడాదికి రూ.1200 కోట్ల ఆదాయం సమకూర్చుకునేలా ఆలోచించాలని రైల్వేశాఖ అన్ని జోన్లకు సూచించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన రూపుదిద్దుకుంది. ప్రధాన రైల్వే స్టేషన్లలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కియోస్క్‌లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉందని, ప్రస్తుతం ఉన్న బరువు తూచే యంత్రాల స్థానంలో వీటిని పెట్టాలని భావిస్తున్నామని అధికారులు చెప్పారు. అలా గే, ఫుట్ మసాజ్ రోబోటిక్ చైర్లు, ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అల్యూమినియం బోగీలు ప్రస్తుతం ఉన్న ఇనుప బోగీల స్థానంలో అల్యూమినియంతో తయారు చేసిన బోగీలను ఉపయోగించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. రాయ్‌బరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తారు. అయితే, ఈ పరిజ్ఞానం మనకు అందుబాటులో లేనందున జపాన్, ఐరోపా దేశాల సాయం తీసుకోనున్నారు. ఈ దేశాలు 15 ఏళ్లుగా అల్యూమినియం బోగీలనే వాడుతున్నాయి. ప్రస్తుతం వాడుతున్న ఇనుప బోగీలు బరువు ఎక్కువగా ఉండటంతో వేగంగా వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.అంతే కాకుండా ఈ బోగీలు తుప్పు పడతాయి. అల్యూమినియం బోగీలు తేలిగ్గా ఉంటాయి. తుప్పు పట్టవు. కాబట్టి వీటి వాడకం వల్ల రైళ్ల వేగం పెరుగుతుంది. నిర్వహణ వ్యయం తగ్గుతుంది. మొదటి దశలో ఏటా 250 అల్యూమినియం బోగీలు తయారు చేయాలని ప్రతిపాదించారు. ఒక్కో బోగీ తయారీకి 150 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రైళ్లకూ స్వచ్ఛ గ్రేడ్లు! ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ల శుభ్రతకోసం చర్యలు తీసుకున్న రైల్వే శాఖ ఇప్పుడు రైళ్లలో శుభ్రతపై దృష్టి పెట్టింది. టాయ్లెట్లు సహా రైలు బోగీలు, సీట్ల శుభ్రత, హౌస్ కీపింగ్ వంటి అంశాలను పరిశీలించి రైళ్లకు శుభ్రతా గ్రేడ్లు ఇస్తారు. ఇందుకోసం 50 ఆడిట్ బృందాలను ఏర్పాటు చేశారు. వచ్చే రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా 200 రైళ్లను పరిశీలించి వాటికి గ్రేడ్లు ఇస్తుంది. శతాబ్ది, రాజధాని, దురం తో వంటి 72 ప్రీమియం రైళ్లు, కోణార్క్, జనశతాబ్ది, సంపర్క్ వంటి 128 రైళ్లలో తనిఖీలు చేపడతాయి. ఒక్కో ప్రీమియం రైలుకు సంబంధించి కనీసం 100 మంది, ఇతర రైళ్లకు సంబంధించి కనీసం 60 మం ది ప్రయాణికుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు ఈ బృంద సభ్యులు స్వయంగా రైళ్లను పరిశీలిస్తారు. -
కోణార్క్‌లో మరోసారి గంజాయి
వరంగల్ అర్బన్: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో మరోసారి గంజాయి పట్టుబడింది. రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని వరంగల్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ నుండి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో 82 కేజీల గంజాయిని వరంగల్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
కోణార్క్‌లో మరోసారి గంజాయి స్వాధీనం
మధిర: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైలులో 30 కేజీల గంజాయి తరలిస్తుండగా మధిర రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కాగా, పట్టుబడిన గంజాయి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కువగా గంజాయి స్వాధీనం చేసుకుంటున్న విషయం విదితమే. -
కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
వరంగల్: ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం పొగలు వచ్చాయి. ఆ విషయాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైలును వరంగల్ జిల్లా డోర్నకల్ స్టేషన్లో నిలిపి వేశారు. రైలులో పొగలు వస్తున్న ఎస్ 9, ఎస్12 బోగీలను పరిశీలించారు. లైనర్లు పట్టివేయడం వల్లే పొగలు కమ్ముకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మరమ్మతులు వేగవంతం చేశారు. -
భారీ ఎత్తున గంజాయి స్వాధీనం
♦ రైలులో తరలిస్తున్న గంజాయి పట్టివేత ♦ ఏడు బ్యాగుల్లో రూ. 20 లక్షలు విలువచేసే గంజాయి స్వాధీనం ♦ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో రవాణా! ♦ రైల్వే పోలీసుల అదుపులో ఒడిశా యువకులు ♦ రెండేళ్లలో ఇది మూడో ఘటన తాండూరు: భారీ ఎత్తున గంజాయిని రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో రైల్వే పోలీసులు పట్టుకున్నారు. రైలులో తరలిస్తుండగా సుమారు రూ. 20 లక్షలు విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒడిశాకు చెందిన ఏడుగురు యువకులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. భువనేశ్వర్-ముంబై వరకు నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తాండూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ రైలులో వచ్చినట్లుగా భావిస్తున్న ఒడిశాకు చెందిన ఏడుగురు యువకులు పెద్ద బ్యాగులతో తాండూరులో దిగారు. అందరూ ఫ్లాట్‌ఫామ్‌పై వేర్వేరుగా ఉన్నారు. ఓ యువకుడి తీరుతో అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు అతడి దగ్గరకు వెళ్లి వివరాలు అడిగితే తడబడ్డాడు. బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో రైల్వే పోలీసులందరూ అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇంకా కొందరు ఉన్నారని సమాధానం ఇచ్చాడు. పోలీసులు గాలించి అందరినీ అదుపులోకి తీసుకొని వారి నుంచి ఏడు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. తాండూరు నుంచి సాయంత్రం 5 గంటలకు రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో సూరత్ వెళుతున్నట్టు పోలీసుల విచారణలో యువకులు వెల్లడించారు. ఈ మేరకు ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే అవుట్ పోస్టు హెడ్ కానిస్టేబుల్ రాజు సికింద్రాబాద్‌లోని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎంత మేరకు గంజాయి పట్టుకున్నారు.. యువకుల వివరాలు వెల్లడించడానికి రైల్వే పోలీసులు సుముఖత చూపలేదు. తహసీల్దార్‌తోపాటు రైల్వే ఉన్నతాధికారులు వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని హెడ్‌కానిస్టేబుల్ రాజు చెప్పారు. గడిచిన రెండేళ్లలో గంజాయిని రైల్వే పోలీసులు పట్టుకోవడం ఇది మూడోసారి. గతంలో రెండుసార్లు ఇదే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ఎత్తున్న గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పట్టుకున్న గంజాయి ఇచ్చాపురం నుంచి రవాణా సాగిస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.20 లక్షలు ఉంటుందని సమాచారం. -
భువనగిరి వద్ద రైళ్ల రాకపోకలకు అంతరాయం
నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం సమీపంలోని ముత్తిరెడ్డిగూడెం గేటు వద్ద శుక్రవారం ఉదయం హైదరాబాద్ వైపు వెళ్లే అప్‌లైన్‌లో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. హెవీ లోడ్ కారణంగా సుమారు అరగంట సేపు ఆగిపోవడంతో పలు రైళ్ల రాకపోలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఆలేరు మండలంలోని వంగపల్లి వద్ద 10.10 గంటల నుంచి 10.30 గంటల వరకు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. ఆలేరు స్టేషన్లో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను సుమారు అరగంట సేపు నిలిపివేశారు. వేరే ఇంజన్‌ను తెప్పించి గూడ్స్ రైలును ముందుకు పంపించడంతో సమస్య తొలగిపోయింది. -
కోణార్క్ ఎక్స్‌ప్రెస్ లో 129 కేజీల గంజాయి
మహబూబాబాద్ : కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో అక్రమంగా తరలిస్తున్న 129 కేజీల గంజాయిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం వరంగల్ జిల్లా మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో విశాఖ నుంచి ముంబైకి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో రైల్వే పోలీసులు రైలు మహబూబాబాద్ స్టేషన్లో ఆగగానే తనిఖీలు నిర్వహించారు. నిందితులు మొత్తం 129 కేజీల గంజాయిని 8 భాగాలుగా విభజించి వేరు వేరు సంచుల్లో ఉంచి రవాణా చేస్తున్నారు. రైల్వే పోలీసులు 129 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రొఫెషనల్స్ టు సివిల్స్
కష్టతరమైన లక్ష్యాలు సాధించాలి తద్వారా ఇతరుకు మేలు చేయాలి ఐఏఎస్‌గా సవకు అవకాశాలు ఎక్కువ జిల్లాకు వచ్చిన ట్రైనీ ఐఏఎస్‌ల మనోగతం వాళ్లంతా నవ యువత.. బీటెక్ కొందరు... ఎంటెక్ మరికొందరు... ఎంబీబీఎస్ ఇంకొందరు పూర్తి చేశారు. వారిలో చాలామంది నెలకు ఆరంకెల జీతం సంపాదిస్తున్న వారూ ఉన్నారు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చునే సాఫ్ట్వేర్ రంగంకన్నా తాము కష్టపడుతూ ఇతరులకు చేసేసేవ దేశ భవిష్యత్‌కు పునాది వేస్తుం దని తలంచారు. అందుకే కఠోర శ్రమతో సివి ల్స్ రాసి మంచి ర్యాంకులతో ఎంపికయ్యారు. వారి శిక్షణ కాలం కొద్దిరోజుల్లో ముగియనుంది. ఆ తర్వాత అంతా ఐఏఎస్ హోదాతో విధుల్లో చేరుతారు. శిక్షణ చివరి అంకంలో భాగంగా భా రత్ దర్శన్ యాత్ర చేపట్టారు. అందులో భాగం గా గురువారం జిల్లాకు వచ్చారు. కలెక్టరేట్లో కలెక్టర్ కరుణ, జేసీ ప్రశాత్ పాటిల్‌తో సమావేశమయ్యారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిసంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ‘హరిత కాకతీయ’ హోటల్లో విడిది చేసిన వారు తమ లక్ష్యాలు.. ఆశయాలు.. కుటుంబ నేపథ్యం.. ప్రస్తుత పాల నా వ్యవస్థ తీరు తదితర అశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లో.. - హన్మకొండ అర్బన్ ట్రైనీ ఐఏఎస్‌లకు స్వాగతం మట్టెవాడ : ముస్సోరి నుంచి గురువారం కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్‌కు వచ్చిన 18 మంది ట్రెరుునీ ఐఏఎస్‌లకు వరంగల్ తహసీల్దార్ ఎన్.రవి రైల్వేస్టేషన్ వద్ద స్వాగతం పలికారు. ఈ నెల 8 వరకు స్టడీ టూర్లో భాగంగా వారు వరంగల్‌లో ఉంటారని తహసీల్దార్ వివరించారు. 18 మంది ఐఏఎస్‌లు ఒకేసారి వరంగల్‌కు రావడంంతో స్టేషన్ కళకళలాడింది. డాక్టర్‌గానే ఉండి పొమ్మన్నారు మాది కేరళ రాష్ట్రం ఐఏ ఎస్‌కు సెలక్ట్ కాక ముందు ఎంబీబీఎస్ పూర్తి చేశా. రెండేళ్లు ప్రాక్టీస్ కూడా చేశాను. నాన్న శ్రీహరికోటలో ఐబీఆర్ఓగా పనిచేశారు. ఇంట్లో మాత్రం డాక్టర్‌గా కంటిన్యూ కమ్మన్నారు. వాళ్లను కన్విన్స్ చేసి ఇటువైపు వచ్చాను. చిన్ననాటి నుంచి ఐఏఎస్ కావాలన్నది నాకలగా ఉండేది. నాకు చదువుతోపాటు పాటలు పాడటం, డ్యాన్స్ చాలా ఇష్టం. స్కూల్ స్థాయిలో పాల్గొన్న ప్రతి పోటీలో బహుమతులు గెలిచేదానిని. ఆ తర్వాత ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు ఇప్పించేవారు. అలాంటి ప్రముఖుల్లో ఎక్కువగా ఐఏఎస్ అధికారులే ఉండేవారు. అలా.. నేను కూడా ఓ ప్రముఖ స్థానంలో ఉండాలని. అందరికీ సేవ చేయాలని అనిపించేది. అందుకే ఎంబీబీఎస్ చదివినా ఐఏఎస్ లక్ష్యం మాత్రం మర్చిపోలేదు. యువత ఎవరైనా తమ ల క్ష్యాన్ని మరువొద్దు. - దివ్య అయ్యర్, కేరళ భారత్ దర్శన్ ఏన్నో నేర్పుతుంది క్లాస్ రూంలో ఉండి చదివే వాటికన్నా క్షేత్రస్థాయి పర్యటనలు చక్కని పాఠాలు నేర్పుతాయి. ప్రస్తుతం మాకు శిక్షణ కాలంలో భారత్ దర్శన్ యాత్ర చక్కటి అనుభూతిగా మిగులుతుంది. ఈ టూర్లో ఎన్నో నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా మన దేశంలో అవినీతి... బాధ్యతారాహిత్యం అన్నవి అతిపెద్ద సమస్యలు.. సవాళ్లుగా ఉన్నాయి. వాటిని ఏ ఒక్కరూ పూర్తిగా రూపుమాపలేరు. ఎవరికి వారు తమవంతుగా కృషి చేయాలి. ఈ అవకాశం పరిపాలనాపరంగా ఐఏఎస్ స్థాయి వారికి ఎక్కువగా ఉంటుంది. అందుకే అండమాన్, నికోబార్ వంటి ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ రంగంలో కొంతకాలం పనిచేశాక ఈ రూట్ ఎంచుకున్నా. ఏడేళ్ల కిత్రం రోడ్డు ప్రమాదంలో నాన్న చనిపోయారు. అన్నయ్య మా బాధ్యతలు తీసకుని దిశానిర్ధేశం చేశారు. అన్ని పరిస్థితులు చూసి లక్ష్యం సాధించాలని ముందుకు సాగా. - లోకేష్, బీటెక్ కంప్యూటర్స్, మధ్యప్రదేశ్ క్యాడర్ దేశం గొప్పగా ఉంది..పేదల పరిస్థితి దారుణంగా ఉంది మన దేశానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇతర దేశా ల్లో మనవాళ్లే ఎక్కు రంగా ల్లో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతా ల్లో.. మారుమూల పల్లెల్లో పరిస్థితులు, ప్రజల జీవన స్థితిమరీ దారుణంగా ఉంది. ఇంత తేడా ఉండటానికి బలమైన కారణం వ్యవస్థలో ఎక్కడో లోపం జరుగుతోంది. ఆ లోపం సరిచేయగలిగితే అభివృద్ధి అందరికీ సమానంగా అందుతుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం పరిపాలనాపరంగా ఐఏఎస్‌ల చేతిలో చాలా వరకు ఉంటుం ది. నేను ఎంటెక్ ఖరగ్‌పూర్ ఐఐటీలో చదివా. నాన్న రైల్వేస్‌లో పని చేసేవారు. మాది రాజస్థాన్ రాష్ట్రంలో ఒక చిన్నగ్రామం. అందుకే పేదలు, పేదరికం గురించి బాగా తెలుసు. మనం ఎంచుకున్న లక్ష్యం ముందు ఎలాంటి సమస్యలైనా చిన్నవే. లక్ష్యాన్ని సాధిస్తే మిగ తా సమస్యలన్నీ వాటంతటవే దూరమవుతాయి. - కులదీప్చౌదరి, రాజస్థాన్(జార్ఖండ్ క్యాడర్) గుడ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఉంటే.. సమస్యలు ఎత్తి చూపడం కన్నా... ఒక మంచి పరిపాలన అధికారిగా ఉంటే మన మే వాటిని సరిదిద్దే అవకాశం ఎక్కువగా ఉంటుం ది. ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో యూత్ ఎవరికివారు. సేఫ్ సైడ్ చూసుకుని వెళితే చివరికి మిగిలేది ఎవరు.. ఐఏఎస్ కన్నా ఎక్కువ సంపాదించాలంటే చాలా మార్గాలు.. రంగాలున్నాయి. కష్టపడకుండా కూడా సంపాదించే అవకాశాలు కాకుండా మనం కష్టపడుతూ సంపాదించే దాంట్లో సంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా దేశ స్థితిని మార్చేందుకు తోడ్పడే మార్గాలు ఎన్నుకోవాలి. మన యూత్ ఏంటో ఇతర దేశాల వాళ్లకి కూడా తెలుసు. అలాంటిది మన దేశ దిశ మార్చాలంటే అంకిత భావంతో పనిచేసే పాలనా యంత్రాంగం అవసరం యువత అవినీతరహితంగా పని చేసేందుకు ముందుకు రావాలి. అప్పుడే ఆశించిన మార్పును కాస్త ఆల్యంగా అయినా చూడగలం. - అమిత్ కుమార్పాండే, యూపీ(రాజస్థాన్ క్యాడర్) ప్రభుత్వ పాలసీలు మారాల్సి ఉంది డాక్టర్‌గా పని చేస్తే సామాజిక సేవ ఎంత చేయాలని ఉన్నా పరిమితులుంటాయి. ముఖ్యంగా హౌస్‌సర్జన్ చేసే సమయంలో చాలామంది పేషెంట్ల పరిస్థితి చూస్తే బాధగా అనిపించేది. డాక్టర్‌కు ఇచ్చే ఫీజు ఉండదు.. మందులు కొనే స్థోమత ఉండదు. ఒక డాక్టర్‌గా నేను వారికి ఉచితంగా వైద్యం, మందులు మాత్రమే అందించగలను. కానీ అదే ఒక ఐఏఎస్ అధికారిగా అయితే అంకిత భావంతో పనిచేసేవారికి చాలా అవకాశాలుం టాయి. ప్రభుత్వాలు పేదల కోసం చాలా రాష్ట్రాల్లో కొత్త పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. అయితే వాటిని అమలు చేసే విధానాల్లో మార్పు రావాల్సి ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే పేదలకు కేటాయించిన పథకాలు, నిధులు వారిని పూర్తిగా చేరడంలేదు. పరిపాలనాపరమైన లోపాలను సరి చేస్తే.. ఆశిం చిన లక్ష్యాలు నెరవేరుతాయి.మా నాన్న బీఎస్ఎన్ఎల్ త్రివేడ్రంలో ఉద్యోగి. అమ్మ హౌస్‌వైఫ్. - డాక్టర్ విలియం, కేరళ త్రివేడ్రం(గుజరాత్ క్యాడర్) ఐపీఎస్ శిక్షణ నుంచి వచ్చా మా ఇంట్లో నాన్న ప్రొఫెసర్. అమ్మ టీచర్. చదువు విషయంలో పూర్తి ప్రోత్సాహం ఉండేది. అందుకే ఆడపిల్లనైనా.. ముందు ఐపీఎస్‌కు ప్రిపేర్ అయి ఎంపికయ్యా. కేరళ క్యాడర్ ఐపీఎస్‌గా ఎంపికై కేరళలో 8 నెలలు శిక్షణ పొందా. ఇదే సమయంలో ఒకసారి ఐఏఎస్ కోసం ఇంకాస్త కష్టపడాలని నిర్ణయానికి వచ్చి ప్రయత్నించా. నా శ్రమ వృథా కాలే దు. అందుకే ఉన్నదాంతో తృప్తి పడకుండా యువత ఆశించింది సాధించే వరకు పట్టుదలతో కృషియాలి. ముఖ్యంగా సమాజానికి అందించాల్సింది విద్యా, ఆరోగ్యం ఈ రెండూ నాణ్యమైనవి అందిస్తే మిగతావాటిని ఆవే సృష్టిస్తాయి. దేశంలో పేదలకు ఆహార భద్రత అతిముఖ్యమైంది. ఈ విషయంలో ప్రభుత్వాలు కొన్ని మెరుగైన పాలసీలు తీసుకొస్తే పేదలకు మేలు జరుగుతుంది. ప్రసుత్తం మాకు భారత్ దర్శన్ ఒక మంచి అనుభూతిగా మిగులుతుంది. - శుభం చౌదరి, ఢిల్లీ(రాజస్థాన్ క్యాడర్), ఎంఏ(ఎకనామిక్స్) భారత్ దర్శన్‌తో దేశ పరిస్థితులు తెలుస్తాయి మాది కేరళ రాష్ట్రం. నేను కేరళ క్యాడర్ ఐఏఎస్‌గా ఎంపిక కావడం నిజంగా అదృష్టంగా భావిస్తాను. నాన్న ఆరోగ్యశాఖలో అధికారి. అమ్మ టీచర్‌గా పనిచేస్తుంది. ప్రస్తుతం మా స్టడీ లో భారత్ దర్శన్ పేరుతో ప్రస్తుతం చేస్తున్న యాత్ర కేరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమిటో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సమస్యలు తెలిస్తే వాటికి పరిష్కారాలు చూడొచ్చు. ప్రస్తుతం దేశంలో నక్సలిజం కొంత సమ్యగా ఉన్నప్పటికీ ప్రభుత్వాలు చేడపతున్న కార్యక్రమాల వల్ల నక్సలిజం కొంత తగ్గుముఖం పట్టింది. అయితే ఈ దిశగా మరింత ప్రయత్నాలు జరగాలి. అందులో భాగంగా ప్రజల సమస్యపరిష్కరించేందకు మంచి వేదిక ఐఏఎస్ హోదా. అందుకే ఉన్నత లక్ష్యాలతో ప్రయత్నించి ఈ రూట్‌కు వచ్చా. అంకిత భావంతో పనిచేస్తా. - చిత్ర, కేరళ(కేరళ క్యాడర్) ఫిబ్రవరి 20 నాటికి శిక్షణ పూర్తి ఎంతో ఉన్నత ఆశయాలు, లక్ష్యాలతో ఈ రూట్ ఎంచుని కష్టపడి ముందుకు వెళుతున్నాం. మా శిక్షణ ఫిబ్రవరి 20తో పూర్తవుతుంది. ఆ సమయం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. ఐఏఎస్ అధికారికి పరిపాలనాపరంగా సేవకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా ఉద్యోగాల్లో ఆదాయం ఉన్నా.. సమాజానికి పెద్దగా చేసేది ఉండదు. అందుకోసమే ఈ రూట్‌ను ఎంపిక చేసుకుని వచ్చా. బీటెక్ కంప్యూటర్స్ చదివా. ఉద్యోగ వేటలో కాకుండా సివిల్స్ ప్రిపేర్ అయ్యా. అనుకున్నట్లు సెల క్ట్ య్యా. ఇక చేయాల్సిందంతా ముందుంది. యువత తమకున్న లక్ష్యాలు సాధించేందుకు ఎంత కష్టాన్నయినా భరించి ముందుకు సాగాలి. అప్పుడే విక్టరీ విలువ తెలుస్తుంది. యశ్పాల్ మీనా, రాజస్థాన్ (బీమార్ క్యాడర్) -
వామ్మో.. బాంబు!
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: తాండూరు రైల్వే స్టేషన్లో నిల్చిఉన్న రైలులో బాంబు ఉన్నట్టు శుక్రవారం కలకలం రేగింది. దీంతో ప్రయాణికులు, పట్టణవాసులు భయకంపితులైనారు. అధికారులు పరుగు పరుగున స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే బాంబు కాదు, గంజాయి అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు సూట్‌కేసుల నిండా నింపిన 18 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ రైల్వే సీఐ సీతయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భువనేశ్వర్ నుంచి ముంబై వెళుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ ైరె ల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఎస్-6 బోగీలోకి ఎక్కిన కొందరు ప్రయాణికులు బెర్త్ నంబర్-31లో ఉన్న రెండు సూట్‌కేసులపై అనుమానం వచ్చి ఆరా తీశారు. వెంటనే టీటీఈకి సమాచారం ఇచ్చారు. సూట్‌కేసులు తమవి కాదని బోగీలోని ప్రయాణికులందరూ చెప్పడంతో రైల్వే స్పెషల్ బ్రాంచి పోలీసులకు టీటీఈ సమాచారం ఇచ్చారు. అప్పటికే రైలు బేగంపేట్ స్టేషన్ దాటింది. దీంతో ఎస్పీ కార్యాలయం నుంచి తాండూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నాలుగు నిమిషాల పాటు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను తాండూరులో నిలిపారు. అనుమానంగా ఉన్న సూట్‌కేసులను రైల్వే పోలీసులు మధ్యాహ్నం 2.30 గంటలకు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. పట్టణ సీఐ సుధీర్‌రెడ్డి, రైల్వే సీఐ సీతయ్య, వికారాబాద్ నుంచి బాంబు, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది తాండూరుకు చేరుకుని సూట్‌కేసులను పరిశీలించారు. వాటిని తెరవగా 9 ప్యాకెట్లలో 18 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. తాండూరు తహసీల్దార్ గోవిందరావు రైల్వే స్టేషన్‌కు చేరుకొని పంచనామా నిర్వహించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.50వేల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. గంజాయిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించనున్నట్లు రైల్వే సీఐ చెప్పారు. తనిఖీలు నిర్వహించిన వారిలో రైల్వే ఎస్సై తిరుపతి, తాండూరు రైల్వే పోలీసుస్టేషన్ ఇన్చార్జి ప్రసాద్‌రావు, వీరేశం, ఆర్ఐ షౌకత్ అలీ తదితరులు ఉన్నారు. గంజాయి తాండూరుకేనా? గంజాయి ప్యాకెట్లు ఉన్న సూట్‌కేస్‌లలో ఉన్న దినపత్రికల ఆధారంగా వాటిని విశాఖపట్టణం నుంచి తెస్తున్నట్టు తెలుస్తోంది. గతనెల 8వ తేదీన తాండూరు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై ఉన్న అనుమానాస్పద బ్యాగులను తనిఖీ చేయగా 43కిలోల గంజాయి పట్టుబడింది. ఈ నేపథ్యంలో తాజాగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయిని తాండూరు పట్టణానికే తరలిస్తున్నారా? లేదా మరెక్కడికైనా తరలిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పట్టుబడిన గంజాయిని ఆధారంగా చేసుకుంటే తాండూరుకే తరలిస్తున్నారేమోననే అనుమానాలు బలపడుతున్నాయి. -
4.60 కిలోల బంగారం రికవరీ
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : రైళ్లలో చోరీలకు సంబంధించి ఏడాది కాలంలో 4.60 కిలోల బంగారు ఆభరణాలను రికవరీ చేసి బాధితు లకు అందజేసినట్లు ప్రభుత్వ రైల్వే పోలీసు రాజమండ్రి డివిజన్ డీఎస్పీ ఎస్వీవీ ప్రసాదరావు తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన తాడేపల్లిగూడెం రైల్వే పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాదరావు విలేకరులతో మాట్లాడారు. రైళ్లలో దొంగతాలను నిరోధించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నర్సాపురం, శేషాద్రి, గౌతమి, గోదావరి, రత్నాచల్, గరీభ్ధ్,్ర జన్మభూమి, ప్రశాంతి, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, విశాఖ, విజయవాడ, గుంటూరు, భీమవరం పాసింజర్ రైళ్లలో ఎక్కువగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఏసీ రిజర్వేషన్ కంపార్టుమెంట్లలో అధికంగా చోరీలు జరుగుతున్నాయని, షటిలర్స్ ఎక్కువుగా ఉన్న హైద్రాబాద్, బెంగళూరు ప్రాంతాల నుంచి బయల్దేరే రైళ్లలోనే దొంగలు నేరాలు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. హర్యానా, బీహార్ ప్రాంతాలకు చెందిన ముఠాలు సాధారణ ప్రయాణికుల్లా రైళ్లలో ఎక్కి దోచుకుంటున్నారన్నారు. తణుకులో హర్యానా ముఠాను, నిడదవోలులో బీహార్ ముఠాను పట్టుకున్నట్లు చెప్పారు. హిందీ, ఇతర భాషల్లో మాట్లాడుతూ ఎవరైనా బోగీల్లో తచ్చాడుతూ కనిపిస్తే.. రైళ్లలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇటీవల రైళ్లలో చోరీలను అరికట్టేందుకు బెల్ హోలర్ అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టామని డీఎస్పీ తెలిపారు. రైళ్లు స్టేషన్లలో ఆగిన సమయంలో రైలు ఎక్కే ప్రయాణికులను సివిల్ దుస్తుల్లో ఉన్న సిబ్బంది గమనిస్తూ ఉంటారన్నారు. అనుమానాస్పద వ్యక్తులు రైలు ఎక్కితే ఒక లాంటి శబ్దం చేసే బెల్ హోలర్ను ఊదుతారని, రైల్వే పోలీసులు అప్రమత్తమై అనుమానితులను పట్టుకుంటారన్నారు. అంతేకాక బస్సుల్లో వెళ్లి స్టేషన్ లేని ప్రాంతంలో రైలును ఆకస్మికంగా నిలుపుదల చేసి తనిఖీలు చేపడ్తామన్నారు. రైళ్లు, రైల్వే స్టేషన్లలో లెసైన్సులు లేకుండా వ్యాపారాలు చేసేవారిని గుర్తించి పట్టుకోవడం వల్ల రైళ్లలో నేరాలు త గ్గాయని చెప్పారు. మహిళలు, బాలల అక్రమ రవాణా నిరోధానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి రైళ్లలో తనిఖీలకు శ్రీకారం చుట్టామన్నారు. రైల్వే పోలీసు స్టేషన్లలో సిబ్బంది కొరత లేదన్నారు. తాడేపల్లిగూడెం రైల్వే పోలీసు స్టేషన్ అవసరాల కోసం స్టేషన్ లో ఉన్న పాత ఆర్ఎంఎస్ కార్యాలయాన్ని వినియోగించుకోడానికి అనుమతి నివ్వాల్సిందిగా అధికారులకు ప్రతిపాదనలు పంపించామన్నారు. స్టేషన్ ఎస్సై ఎస్సై ఆర్ఎస్ శ్రీనివాసు పాల్గొన్నారు.