
సాక్షి, కాజీపేట : ముంబాయి నుంచి భువనేశ్వర్ వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) చక్రాలకు సాంకేతిక సమస్య తలెత్తి బోల్టుస్టార్ కాయల్ స్ప్రింగ్ పగిలిపోయింది. దీంతో కాజీపేట జంక్షన్‌లో ఈ రైలు గంటన్నరపాటు నిలిచిపోయింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షాల కారణంగా ఉదయం 10 గంటలకు రావల్సిన కోణార్క్ సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంది. మార్గమధ్యలో ఇంజన్ నుంచి 7వ ఏసీ కోచ్ కింద రెండు చక్రాల మధ్య ఉన్న బోల్డుస్టార్ కాయల్ స్ప్రింగ్ పగిలిపోయింది. కాజీపేట రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న క్రమంలో రోలింగ్ ఇన్ క్యారియజ్ అండ్ వ్యాగన్ ఇన్‌స్పెక్షన్ స్టాఫ్ బోల్డుస్టార్ పగిలిపోయిన విషయాన్ని గమనించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో కాజీపేటలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. అధికారులు, సిబ్బంది మరమ్మతు చేసి సాయంత్రం 5.35 గంటలకు పంపించారు. సకాలంలో సీ అండ్ డబ్ల్యూ సిబ్బంది గమనించి చూడటం వల్ల ఇబ్బంది లేకుండా పోయింది. లేదంటే మార్గమధ్యలో పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని సిబ్బంది చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment