
ముంబై: సాంకేతిక సమస్యతో ముంబై ఎయిర్‌పోర్టులో నిలిచిపోయిన ఎయిర్ మారిషస్ విమానంలో సుమారు 200 మంది ప్రయాణికులు ఐదు గంటల పాటు బందీలుగా మారారు. చివరికి ఆ విమానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎయిర్ మారిషస్‌కు చెందిన ఎంకే 749 విమానం శనివారం ఉదయం 4.30 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకోవాల్సి ఉంది. బయలుదేరాల్సిన సమయానికి విమానంలో సమస్య గుర్తించారు.
నిపుణులొచ్చి లోపాన్ని సరిచేసినా, ఫలితం లేకపోయింది. చివరికి ఉదయం 10 గంటల సమయంలో సర్వీసును రద్దు చేస్తున్నట్లు పైలట్ ప్రకటించారని బాధిత ప్రయాణికులు చెప్పారు. ఐదు గంటలపాటు తమను కిందికి కూడా దిగనివ్వలేదన్నారు. ఏసీ సరిగ్గా పనిచేయక ఆరోగ్య సమస్యలున్న వారు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఈ ఘటనపై ఎయిర్ మారిషస్ స్పందించలేదు.