తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ :
రైళ్లలో చోరీలకు సంబంధించి ఏడాది కాలంలో 4.60 కిలోల బంగారు ఆభరణాలను రికవరీ చేసి బాధితు లకు అందజేసినట్లు ప్రభుత్వ రైల్వే పోలీసు రాజమండ్రి డివిజన్ డీఎస్పీ ఎస్‌వీవీ ప్రసాదరావు తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన తాడేపల్లిగూడెం రైల్వే పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాదరావు విలేకరులతో మాట్లాడారు. రైళ్లలో దొంగతాలను నిరోధించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నర్సాపురం, శేషాద్రి, గౌతమి, గోదావరి, రత్నాచల్, గరీభ్ధ్,్ర జన్మభూమి, ప్రశాంతి, కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, విశాఖ, విజయవాడ, గుంటూరు, భీమవరం పాసింజర్ రైళ్లలో ఎక్కువగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు.
ఏసీ రిజర్వేషన్ కంపార్టుమెంట్లలో అధికంగా చోరీలు జరుగుతున్నాయని, షటిలర్స్ ఎక్కువుగా ఉన్న హైద్రాబాద్, బెంగళూరు ప్రాంతాల నుంచి బయల్దేరే రైళ్లలోనే దొంగలు నేరాలు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. హర్యానా, బీహార్ ప్రాంతాలకు చెందిన ముఠాలు సాధారణ ప్రయాణికుల్లా రైళ్లలో ఎక్కి దోచుకుంటున్నారన్నారు. తణుకులో హర్యానా ముఠాను, నిడదవోలులో బీహార్ ముఠాను పట్టుకున్నట్లు చెప్పారు. హిందీ, ఇతర భాషల్లో మాట్లాడుతూ ఎవరైనా బోగీల్లో తచ్చాడుతూ కనిపిస్తే.. రైళ్లలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇటీవల రైళ్లలో చోరీలను అరికట్టేందుకు బెల్ హోలర్ అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టామని డీఎస్పీ తెలిపారు. రైళ్లు స్టేషన్లలో ఆగిన సమయంలో రైలు ఎక్కే ప్రయాణికులను సివిల్ దుస్తుల్లో ఉన్న సిబ్బంది గమనిస్తూ ఉంటారన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు రైలు ఎక్కితే ఒక లాంటి శబ్దం చేసే బెల్ హోలర్‌ను ఊదుతారని, రైల్వే పోలీసులు అప్రమత్తమై అనుమానితులను పట్టుకుంటారన్నారు. అంతేకాక బస్సుల్లో వెళ్లి స్టేషన్ లేని ప్రాంతంలో రైలును ఆకస్మికంగా నిలుపుదల చేసి తనిఖీలు చేపడ్తామన్నారు. రైళ్లు, రైల్వే స్టేషన్లలో లెసైన్సులు లేకుండా వ్యాపారాలు చేసేవారిని గుర్తించి పట్టుకోవడం వల్ల రైళ్లలో నేరాలు త గ్గాయని చెప్పారు. మహిళలు, బాలల అక్రమ రవాణా నిరోధానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి రైళ్లలో తనిఖీలకు శ్రీకారం చుట్టామన్నారు. రైల్వే పోలీసు స్టేషన్లలో సిబ్బంది కొరత
లేదన్నారు.
తాడేపల్లిగూడెం రైల్వే పోలీసు స్టేషన్ అవసరాల కోసం స్టేషన్ లో ఉన్న పాత ఆర్‌ఎంఎస్ కార్యాలయాన్ని వినియోగించుకోడానికి అనుమతి నివ్వాల్సిందిగా అధికారులకు ప్రతిపాదనలు పంపించామన్నారు. స్టేషన్ ఎస్సై ఎస్సై ఆర్‌ఎస్ శ్రీనివాసు పాల్గొన్నారు.
4.60 కిలోల బంగారం రికవరీ
Published Sat, Dec 7 2013 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement