భారీ ఎత్తున గంజాయి స్వాధీనం
♦ రైలులో తరలిస్తున్న గంజాయి పట్టివేత
♦ ఏడు బ్యాగుల్లో రూ. 20 లక్షలు విలువచేసే గంజాయి స్వాధీనం
♦ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో రవాణా!
♦ రైల్వే పోలీసుల అదుపులో ఒడిశా యువకులు
♦ రెండేళ్లలో ఇది మూడో ఘటన
తాండూరు: భారీ ఎత్తున గంజాయిని రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో రైల్వే పోలీసులు పట్టుకున్నారు. రైలులో తరలిస్తుండగా సుమారు రూ. 20 లక్షలు విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఒడిశాకు చెందిన ఏడుగురు యువకులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. భువనేశ్వర్-ముంబై వరకు నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తాండూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఈ రైలులో వచ్చినట్లుగా భావిస్తున్న ఒడిశాకు చెందిన ఏడుగురు యువకులు పెద్ద బ్యాగులతో తాండూరులో దిగారు. అందరూ ఫ్లాట్‌ఫామ్‌పై వేర్వేరుగా ఉన్నారు. ఓ యువకుడి తీరుతో అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు అతడి దగ్గరకు వెళ్లి వివరాలు అడిగితే తడబడ్డాడు. బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో రైల్వే పోలీసులందరూ అప్రమత్తమయ్యారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఇంకా కొందరు ఉన్నారని సమాధానం ఇచ్చాడు.
పోలీసులు గాలించి అందరినీ అదుపులోకి తీసుకొని వారి నుంచి ఏడు బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. తాండూరు నుంచి సాయంత్రం 5 గంటలకు రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌లో సూరత్ వెళుతున్నట్టు పోలీసుల విచారణలో యువకులు వెల్లడించారు. ఈ మేరకు ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే అవుట్ పోస్టు హెడ్ కానిస్టేబుల్ రాజు సికింద్రాబాద్‌లోని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎంత మేరకు గంజాయి పట్టుకున్నారు.. యువకుల వివరాలు వెల్లడించడానికి రైల్వే పోలీసులు సుముఖత చూపలేదు. తహసీల్దార్‌తోపాటు రైల్వే ఉన్నతాధికారులు వచ్చిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని హెడ్‌కానిస్టేబుల్ రాజు చెప్పారు. గడిచిన రెండేళ్లలో గంజాయిని రైల్వే పోలీసులు పట్టుకోవడం ఇది మూడోసారి. గతంలో రెండుసార్లు ఇదే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ఎత్తున్న గంజాయిని తరలిస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పట్టుకున్న గంజాయి ఇచ్చాపురం నుంచి రవాణా సాగిస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.20 లక్షలు ఉంటుందని సమాచారం.