రైల్లో గంజాయి రవాణా | two arrested in Marijuana trafficking | Sakshi
Sakshi News home page

రైల్లో గంజాయి రవాణా

Published Sat, Jan 31 2015 9:18 AM | Last Updated on Tue, Oct 9 2018 2:23 PM

two arrested in Marijuana trafficking

పలాస: ఒడిశా నుంచి గుజరాత్‌కు ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్ రైల్లో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. పలాస రైల్వే జీఆర్‌పీ ఎస్‌ఐ ఎస్.ఎ. మునఫ్ కథనం ప్రకారం.. గురువారం రాత్రి ఒడిశాలోని గంజాం జిల్లా అస్కా గ్రామానికి చెందిన పింటు బెహర(24), బల్లు రెడ్డి(19) ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్ రైల్లో సూట్‌కేసుల్లో గంజాయి తీసుకెళ్తుండగా పలాస రైల్వే పోలీసులు అనుమానంతో వారిని వెంటాడారు.

దీన్ని గుర్తించిన వారు రైలు పలాస రైల్వేస్టేషన్‌లోకి  రాగానే గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో గంజాయితో సహా దిగి అదృశ్యమయ్యూరు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లడానికి ప్లాట్‌ఫారంపై ఉండగా రైల్వే పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. ఆ పెట్టెల్లో ఉన్న సుమారు రూ.2 లక్షల విలువైన 78 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలాస తహశీల్దార్ గన్నవరపు సత్యన్నారాయణ సమక్షంలో నిందితులపై కేసు నమోదు చేసి విశాఖపట్నం రైల్వే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ప్రత్యేక కోర్టుకు తరలించినట్లు జీఆర్‌పీ ఎస్‌ఐ ఎస్‌ఎ మునఫ్ చెప్పారు.

గతంలోనూ రైళ్లలో గంజాయి రవాణా
గతంలో పలు పర్యాయాలు రైళ్లలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలో సాక్షాత్తూ పలాసకు చెందిన ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ బి.ఎన్. సమంత కూడా కటకటాల పాలైన విషయం తెలిసిందే.

2012 అక్టోబరు 3న 103 కిలోల గంజాయి ఆర్‌పీఎఫ్ బ్యారక్‌లో లభించి అందరినీ ఆశ్చర్యపర్చింది. అప్పటి జీఆర్‌పీ ఎస్‌ఐ నవీన్‌కుమార్ ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐను అరెస్టు చేసి సంచలనం సృష్టించారు.
2012 జూన్ 21న పూరి-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ రైల్లో 35 కిలోల గంజాయిని జీఆర్‌పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరుుతే నిందితులు పరారయ్యారు.
2013 మే 10న పూరి-అహ్మదాబాద్ రైల్లోనే గంజాయితో పట్టుబడిన ముక్త చంద్రబెహర, మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. వారికి ఒక ఏడాది జైలు శిక్ష కూడా పడింది.

ఇప్పుడు కూడా పోయిన బంగారం కోసం ఎక్సైజ్ పోలీసులు గాలిస్తుండగా అనూహ్యరీతిలో ఈ అక్రమ గంజాయి రవాణాను పట్టుకొని నిందితులను అరెస్టు చేశారు. ఒడిశాలోని కొందమల అడవుల నుంచి గుజరాత్, బీహార్, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు పలాస మీదుగా రవాణా అవుతున్నట్లు ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement