తాండూరు టౌన్, న్యూస్‌లైన్: తాండూరు రైల్వే స్టేషన్‌లో నిల్చిఉన్న రైలులో బాంబు ఉన్నట్టు శుక్రవారం కలకలం రేగింది. దీంతో ప్రయాణికులు, పట్టణవాసులు భయకంపితులైనారు. అధికారులు పరుగు పరుగున స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే బాంబు కాదు, గంజాయి అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు సూట్‌కేసుల నిండా నింపిన 18 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ రైల్వే సీఐ సీతయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భువనేశ్వర్ నుంచి ముంబై వెళుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ ైరె ల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఎస్-6 బోగీలోకి ఎక్కిన కొందరు ప్రయాణికులు బెర్త్ నంబర్-31లో ఉన్న రెండు సూట్‌కేసులపై అనుమానం వచ్చి ఆరా తీశారు. వెంటనే టీటీఈకి సమాచారం ఇచ్చారు. సూట్‌కేసులు తమవి కాదని బోగీలోని ప్రయాణికులందరూ చెప్పడంతో రైల్వే స్పెషల్ బ్రాంచి పోలీసులకు టీటీఈ సమాచారం ఇచ్చారు. అప్పటికే రైలు బేగంపేట్ స్టేషన్ దాటింది.
దీంతో ఎస్పీ కార్యాలయం నుంచి తాండూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నాలుగు నిమిషాల పాటు కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను తాండూరులో నిలిపారు. అనుమానంగా ఉన్న సూట్‌కేసులను రైల్వే పోలీసులు మధ్యాహ్నం 2.30 గంటలకు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. పట్టణ సీఐ సుధీర్‌రెడ్డి, రైల్వే సీఐ సీతయ్య, వికారాబాద్ నుంచి బాంబు, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది తాండూరుకు చేరుకుని సూట్‌కేసులను పరిశీలించారు. వాటిని తెరవగా 9 ప్యాకెట్లలో 18 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. తాండూరు తహసీల్దార్ గోవిందరావు రైల్వే స్టేషన్‌కు చేరుకొని పంచనామా నిర్వహించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.50వేల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. గంజాయిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించనున్నట్లు రైల్వే సీఐ చెప్పారు. తనిఖీలు నిర్వహించిన వారిలో రైల్వే ఎస్సై తిరుపతి, తాండూరు రైల్వే పోలీసుస్టేషన్ ఇన్‌చార్జి ప్రసాద్‌రావు, వీరేశం, ఆర్‌ఐ షౌకత్ అలీ తదితరులు ఉన్నారు.
గంజాయి తాండూరుకేనా?
గంజాయి ప్యాకెట్లు ఉన్న సూట్‌కేస్‌లలో ఉన్న దినపత్రికల ఆధారంగా వాటిని విశాఖపట్టణం నుంచి తెస్తున్నట్టు తెలుస్తోంది. గతనెల 8వ తేదీన తాండూరు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపై ఉన్న అనుమానాస్పద బ్యాగులను తనిఖీ చేయగా 43కిలోల గంజాయి పట్టుబడింది. ఈ నేపథ్యంలో తాజాగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయిని తాండూరు పట్టణానికే తరలిస్తున్నారా? లేదా మరెక్కడికైనా తరలిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో పట్టుబడిన గంజాయిని ఆధారంగా చేసుకుంటే తాండూరుకే తరలిస్తున్నారేమోననే అనుమానాలు బలపడుతున్నాయి.
వామ్మో.. బాంబు!
Published Sat, Dec 14 2013 1:18 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement