రాజమహేంద్రవరం సిటీ: రైలు ప్రయాణంలో ప్రయాణికుల సమస్యలను పరిష్కరించడానికి రైల్వే శాఖ తాజాగా ‘రైల్ మదద్’ పేరిట ఓ యాప్ రూపొందించింది. దీని ద్వారా ప్రయాణ సమయంలో 35 రకాల సేవల్లో లోపాలపై ఫిర్యాదు చేయొచ్చు. సమస్యను వివరించడంతో పాటు సంబంధిత ఫొటోను అప్‌లోడ్ చేసేందుకు యాప్‌లో వీలు ఉంది. ఈ యాప్‌లో ఫిర్యాదు చేసే ప్రయాణికులు రిజర్వేషన్, జనరల్, ప్లాట్‌ఫామ్ టికెట్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా కలిగి ఉండాలి.
ఫిర్యాదు సమయంలో ఆ టికెట్ వివరాలు తెలియజేయాలి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి రైల్ మదద్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రయాణికుడి పేరు, ఫోన్ నంబర్ టైప్ చేస్తే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే యాప్‌లో ఫిర్యాదు చేసే పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ సూచించిన వివరాల మేరకు ఫిర్యాదు అప్‌లోడ్ చేయాలి.
ఈ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను జనరల్ మేనేజర్ (జీఎం), డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) నేరుగా పర్యవేక్షిస్తారు. ఫిర్యాదు స్థాయిని బట్టి సంబంధిత విభాగానికి చెందిన ముఖ్య అధికారికి చేరవేస్తారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలిస్తారు. ఫిర్యాదుపై అధికారుల స్పందనను బట్టి పరిష్కారానికి పట్టే సమయం, ఇతర వివరాలతో ఆయా ప్రయాణికుల ఫోన్‌కు మెసేజ్ పంపిస్తారు.
వేటిపై ఫిర్యాదు చేయొచ్చంటే..
♦ రిజర్వేషన్ చేసుకున్నా వెయిటింగ్ జాబితాలో ఉండటం.
♦ టీటీఈ, ఇతర సిబ్బంది అవినీతి
♦ నాణ్యత లేని ఆహారం
♦ మరుగుదొడ్లు, బోగీల అపరిశుభ్రత
♦ రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం, దురుసు ప్రవర్తన
♦ అనుమానాస్పద వ్యక్తుల సంచారం
♦ వస్తువులు మరచిపోవడం
♦ రైళ్ల రాకపోకల్లో ఆలస్యం
♦ జూదం, ధూమపానం చేసే ప్రయాణికుల వల్ల కలిగే అసౌకర్యం
♦ రైల్వే స్టేషన్‌లో నీరు, వెయిటింగ్ హాల్స్ కొరత
♦మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, ఈవ్ టీజింగ్
♦ అధిక ధరలకు తినుబండారాల అమ్మకం.
♦ ప్యాంట్రీ కార్ అపరిశుభ్రత
Comments
Please login to add a commentAdd a comment