ఎంపీలదే భారం ఇప్పుడే మేల్కోవాలి | burden anyone now mp's | Sakshi
Sakshi News home page

ఎంపీలదే భారం ఇప్పుడే మేల్కోవాలి

Published Wed, Jun 4 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM

ఎంపీలదే భారం ఇప్పుడే మేల్కోవాలి

ఎంపీలదే భారం ఇప్పుడే మేల్కోవాలి

సాక్షి, హన్మకొండ : రైల్వే శాఖలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలకు ఒకేసారి పరిష్కారం లభించే అరుదైన అవకాశం వచ్చింది. వ్యాగన్ వర్క్‌షాప్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేటకు సబ్‌డివిజన్ హోదా వంటి పలు అభివృద్ధి పనులకు అనుమతులు... నిధులు సాధించేందుకు ఇదే అనువైన సమయం. రాష్ట్ర విభజన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విభజన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై నివేదిక ఇచ్చేం దుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని రైల్వే బోర్డు నియమించింది.

జూలైలో నిర్వహించనున్న బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ కమిటీ సిఫార్సులకనుగుణంగా దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మన ఎంపీలు అప్రమత్తమై కమిటీ ముందు కాజీపేటకు సంబంధించిన అంశాలను ప్రస్తావించి నిధులు సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

కసరత్తు ప్రారంభించిన రైల్వేబోర్డు
ఉత్తర, దక్షిణ భారతదేశాలకు గేట్‌వేగా ఉన్న కాజీపేట సబ్ డివిజన్ గడిచిన కొన్నేళ్లుగా నిరాదరణకు గురవుతోంది. ఇక్కడ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రతి రైల్వే బడ్జెట్ సమయంలో మన ఎంపీలు సమర్పించే వినతిపత్రాలు బుట్టదాఖలు కావడం మినహా కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా రూపొందించిన ముసాయిదా బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు తెలంగాణలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసే అంశాలను పరిశీలించాలంటూ కేంద్ర ప్రభుత్వం రైల్వేబోర్డుకు ఆదేశాలు జారీ చేసింది.

అందుకనుగుణంగా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటిని 2014 ఏప్రిల్ 15న రైల్వేబోర్డు నియమించింది. ఈ కమిటీ మూడు నెలల్లో తన నివేదికను రైల్వేబోర్డుకు సమర్పించాల్సి ఉంది. మే 16 వరకు దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉండడంతో ఈ కమిటీ క్రియాశీలకంగా పని చేయలేదు. ఇప్పటికే సగం సమయం గడిచిపోయింది. దీంతో అందుబాటులో ఉన్న 45 రోజుల్లో  ఈ కమిటీ తన నివేదికను రూపొందించనుంది.

 జూలైలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే మంత్రి సదానందగౌడ ఇప్పటికే ప్రకటించారు. రైల్వే బోర్డు నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రైల్వే బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి. ఈ నేపథ్యంలో మన ఎంపీలు తమ వంతు ప్రయత్నం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.


రికార్డు స్థాయిలో ఐదుగురు సభ్యులు
తెలంగాణలోని పది జిల్లాలలో ఏ జిల్లాకు రాని అరుదైన అవకాశం వరంగల్ జిల్లాకు వచ్చింది. ముగ్గురు రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి, రాపోలు ఆనంద భాస్కర్, గరికపాటి మోహన్‌రావు... ఇద్దరు ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీలకతీతంగా జిల్లా ప్రయోజనాలు, పారిశ్రామిక  అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వీరందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సి ఉంది.

కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, సబ్ డివిజన్ ఏర్పాటుకు అనుమతులు సాధించడంతోపాటు వ్యాగన్ వర్క్‌షాపునకు నిధుల కేటాయింపు వంటి అంశాలను అందరూ కలిసి సమష్టిగా రైల్వే బోర్డు నియమించిన కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని... కాజీపేట సబ్ డివిజన్‌ను అభివృద్ధి పట్టాలు ఎక్కించేందుకు ఇదే అనువైన సమయని రైల్వే కార్మిక సంఘాల నాయకులు  అభిప్రాయపడుతున్నారు.

దశాబ్దాల కల
మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు హయూంలో కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. అయితే రాజకీయ కారణాలతో ఆ ప్రాజెక్ట్ పంజాబ్‌కు తరలిపోయింది. ఆ తర్వాత దీని ఊసెత్తేవారే కరువయ్యారు. అదేవిధంగా... అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కాజీపేటకు ఇంతవరకు డివిజన్ హోదా దక్క లేదు. ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్ సమయంలో డిమాండ్ చేయడం.... ఆ తర్వాత మిన్నకుండిపోవడం మన నేతలకు షరామామూలుగా మారింది.

ఒకవేళ విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక జోన్‌ను కేటాయిస్తే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ మూడు జోన్లు మాత్రమే ఉంటాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో రైల్వేకు సంబంధించిన రెండు డివిజన్లు రాష్ట్ర రాజధానిలోనే ఉంటాయి.  ఈ నేపథ్యంలో పరిపాలన సౌల భ్యం కోసం సికింద్రాబాద్ డివిజన్‌ను విభజించి కాజీపేట కేంద్రంగా మరో డివిజన్ ఏర్పాటు చేసేం దుకు అస్కారం ఉంది. వ్యాగన్ వర్క్‌షాప్ నిర్మాణం అంటూ నాలుగేళ్లుగా బడ్జెట్లలో ప్రకటనలు తప్పితే.. ఇంతవరకు ఎటువంటి నిధులు కేటాయించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement