తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
టాప్ టెన్ ర్యాంకులు సమానంగా పంచుకున్న తెలంగాణ, ఏపీ విద్యార్థులు
రెండు విభాగాల్లో ఫస్ట్ ర్యాంకులు మాత్రం ఏపీకే
గత రెండేళ్లతో పోలిస్తే తగ్గిన అర్హులు
వారం రోజుల్లో కౌన్సెలింగ్ షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఈఏపీ సెట్–2024) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 78.98 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.66 శాతం అర్హత సాధించారు. ర్యాంకుల్లో రెండు తెలుగు రాష్ట్రాలూ పోటీ పడ్డాయి. రెండు విభాగాల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తొలి 10 ర్యాంకులు సమానంగా వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రి, ఫార్మసీ విభాగంలో ఏపీకే చెందిన అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకొని టాప ర్లుగా నిలిచారు.
ఈ మేరకు ఈఏపీ సెట్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకటరమణ, మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, జేఎన్‌టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, సెట్ కనీ్వనర్ డీన్‌కుమార్, కో–కన్వీనర్ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు.
74.98 శాతానికి తగ్గిన అర్హులు
టీఎస్‌ఈఏపీ సెట్ ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరిగింది. ఇంజనీరింగ్ విభాగానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2,54,750 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,40,618 మంది సెట్‌కు హాజరయ్యారు. 1,80,424 మంది అర్హత సాధించారు. అగ్రి, ఫార్మా విభాగంలో రెండు రాష్ట్రాల నుంచి 1,00,432 మంది దరఖాస్తు చేస్తే 91,633 మంది పరీక్ష రాశారు. 82,163 మంది అర్హత సాధించారు. గత రెండేళ్ళతో పోలిస్తే సెట్ రాసిన వారి సంఖ్య పెరిగింది. కానీ అర్హత శాతం తగ్గింది. గత ఏడాది (2023) 3,01,789 మంది ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారు. 2,48,814 (86.31%) మంది అర్హత సాధించారు. ఈ ఏడాది (2024) 3,32,251 మంది రాస్తే, ఇందులో 2,62,587 (74.98%) మంది అర్హత సాధించారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కనీస అర్హత మార్కులు లేకపోవడంతో రాసిన అందరూ అర్హులయ్యారు.
ఆన్‌లైన్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ
రాష్ట్ర ఈఏపీ సెట్ ఫలితాలను వారం రోజుల్లో ప్రకటించడం అభినందనీయమని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడకుండా యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసే కాలేజీలపై చర్య తీసుకుంటామన్నారు. ఈ ఏడాది ఆన్‌లైన్ విధానం ద్వారా ఈ సీట్లను భర్తీ చేసే ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. అనుమతి లేకుండా విద్యార్థులను చేర్చుకున్న గురునానక్, శ్రీనిధి ప్రైవేటు యూనివర్సిటీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే..
మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం యరకరాయపురం. నాన్న మోహనరావు సాంఘిక సంక్షేమ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా, తల్లి హైమావతి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తెలంగాణ ఈఏపీసెట్‌లో మొదటి ర్యాంకు సాధించగలిగా.
–సతివాడ జ్యోతిరాదిత్య, ఫస్ట్ ర్యాంకర్ (ఇంజనీరింగ్)
ఐఐటీ బాంబేలో చదవడమే లక్ష్యం..
మా స్వస్థలం ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల. నాన్న సూర్యకుమార్ యాదవ్ కమ్యూనికేషన్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్నారు. నాకు జేఈఈ మెయిన్‌లో 311వ ర్యాంకు వచి్చంది. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చేయడమే నా లక్ష్యం.
– గొల్లలేఖ హర్ష, సెకండ్ ర్యాంకర్ (ఇంజనీరింగ్)
బాంబే ఐఐటీలో సీఎస్‌ఈ లక్ష్యం
ప్రతిరోజు 10 గంటల పాటు చదివేవాడిని. తండ్రి బి.రామసుబ్బారెడ్డి, తల్లి వి.రాజేశ్వరి ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. మాది ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని. ఇంజనీరింగ్‌లో 4వ ర్యాంకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ చేయడమే నా లక్ష్యం.
– సందేశ్, 4వ ర్యాంకు, ఇంజనీరింగ్, హైదరాబాద్
ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ చదువుతా
మాది ఏపీలోని కర్నూలు. నాన్న ఎం.రామేశ్వరరెడ్డి చిరు వ్యాపారి. అమ్మ గృహిణి. జేఈఈ మెయిన్‌లో 36వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 6వ ర్యాంకు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ చదవాలనుకుంటున్నా.
– మురసాని సాయి యశ్వంత్‌రెడ్డి, ఐదో ర్యాంకర్ (ఇంజనీరింగ్)
నాన్నలాగే అవ్వాలని అనుకుంటున్నా..
రోజుకు 16 గంటలు చదువుతున్నా. రాబోయే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటి ఐఐటీ బాంబేలో సీటు సాధిస్తా. మంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అవుతా. మెయిన్స్‌లో 5వ ర్యాంకు వచ్చింది. ఈఏపీ సెట్‌లో ర్యాంకు రావడంతో ఆనందంగా ఉంది. నా తండ్రి అనిల్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. దీంతో నాన్నలాగే అవ్వాలని చిన్నప్పట్నుంచీ అనుకునేవాడిని. తల్లి మమత ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు.
– విదిత్, 7వ ర్యాంక్, ఇంజనీరింగ్ (మణికొండ)
తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణం
తండ్రి రాజేశ్వరరావు పబ్బ, తల్లి లావణ్య పబ్బ, అక్క మానస పబ్బల సహకారం, ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించా. బాంబే ఐఐటీలో సీటు సాధించి గొప్ప ఇంజనీర్‌ను కావడమే నా లక్ష్యం.
– పబ్బ రోహన్ సాయి, 8వ ర్యాంకు, ఇంజనీరింగ్ (ఎల్లారెడ్డిగూడ)
అమ్మా నాన్నల ఆశలు నెరవేరుస్తా
మంచి కళాశాలలో బీటెక్, ఆ తర్వాత ఎంటెక్ చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. ఇంటర్మీడియెట్‌లో అధ్యాపకుల బోధన, కోచింగ్‌తోనే ఉత్తమ ర్యాంకు సాధించా. ముఖ్యంగా మా చదువు కోసమే అమ్మా నాన్న ఊరు విడిచి హైదరాబాద్‌కు వచ్చారు. వారు పడుతున్న కష్టాలు రోజూ చూస్తున్నా. మంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయ్యి మా తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తా. వారి ఆశలు నెరవేరుస్తా.
–కొంతం మణితేజ, 9వ ర్యాంకు, ఇంజనీరింగ్, వరంగల్
తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ర్యాంకులు
మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట. అమ్మా నాన్న సుశీల, శ్రీనివాసరావు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నాకు జేఈఈ మెయిన్‌లో261వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 35వ ర్యాంకు వచ్చాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహమే ర్యాంకులకు కారణం.
–ధనుకొండ శ్రీనిధి, పదో ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం)
గుండె వైద్య నిపుణురాలినవుతా..
మాది ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి. నాన్న శ్రీకర్ హోమియో మెడికల్ ప్రాక్టీషనర్‌గా, తల్లి కళ్యాణి ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అక్క సంవిధ కాగి్నజెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేసి వైద్యురాలిని కావడమే నా లక్ష్యం. కార్డియాక్ సర్జన్‌గా స్థిరపడాలన్నదే నా ఆకాంక్ష.
– ఆలూరు ప్రణీత, ఫస్ట్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా)
నా కష్టం ఫలించింది..
మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లి. అమ్మా నాన్న కృష్ణవేణి, నారాయణరావు వ్యవసాయం చేస్తున్నారు. మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో చదివా. నా కష్టం ఫలించింది.
– నగుడసారి రాధాకృష్ణ, సెకండ్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా)
డాక్టర్ కావడమే లక్ష్యం
మధ్య తరగతి కుటుంబం అయినప్పటికీ మా అమ్మానాన్న నా చదువు కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. డాక్టర్ కావాలన్న నా ఆకాంక్షను గుర్తించి హైదరాబాద్‌లోని కాలేజీలో చేర్పించారు. ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా చదువుపైనే దృష్టి పెట్టా. నీట్ పరీక్ష బాగా రాశా.
– గడ్డం శ్రీవర్షిణి, 3వ ర్యాంకు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ (హనుమకొండ)
వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తా
నా తల్లిదండ్రులు ఎండీ జమాలుద్దీన్, నుస్రత్ ఖాన్‌లు. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదగడమే నా లక్ష్యం. ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తా. కరోనా కష్ట కాలంలో అన్ని రంగాలూ కుదేలైనా వ్యవసాయ రంగమే మన దేశాన్ని ఆదుకుంది.
– అజాన్ సాద్, 6వ ర్యాంకు, అగ్రికల్చర్ ఫార్మసీ (నాచారం)
వైద్య వృత్తి అంటే ఇష్టం
నా తల్లిదండ్రులు జయశెట్టి సూర్యకాంత్, భాగ్యలక్ష్మి. నాకు వైద్య వృత్తిపై ఆసక్తి ఎక్కువ. సేవ చేయాలనే తపనతో నీట్ పరీక్ష రాశా. దాంతో పాటు ఈఏపీ సెట్ కూడా రాశా. ఈఏపీలో మంచి ర్యాంకు వచ్చింది. అదే విధంగా త్వరలో రానున్న నీట్ ఫలితాల్లో కూడా మంచి ర్యాంకు సాధిస్తానని ఆశిస్తున్నా.
– ఆదిత్య జయశెట్టి, 9వ ర్యాంకు, అగ్రి ఫార్మసీ (కూకట్‌పల్లి)
Comments
Please login to add a commentAdd a comment