ఈఏపీ సెట్‌ షురూ | The first day of the TSEAP set was peaceful | Sakshi
Sakshi News home page

ఈఏపీ సెట్‌ షురూ

Published Wed, May 8 2024 5:08 AM | Last Updated on Wed, May 8 2024 5:08 AM

The first day of the TSEAP set was peaceful

తొలిరోజు ప్రశాంతం

తగ్గిన హాజరు..90 శాతమే పరీక్షకు 

కెమిస్ట్రీ మోడరేట్‌

బాటనీ, జువాలజీ ఈజీగానే ఉందన్న విద్యార్థులు

నేడు అగ్రి, ఫార్మసీ సెట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ (టీఎస్‌ఈఏపీ సెట్‌) మంగళవారం మొదలైంది. తొలి రోజు జరిగిన పరీక్షకు 90.41 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన సెట్‌ నిర్వహిస్తున్నారు. 

ఈ నెల 9 నుంచి 11 వరకూ ఇంజనీరింగ్‌ సెట్‌ ఉంటుంది. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి మొత్తం 1.43 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్‌ బేస్డ్‌గా జరిగిన ఈ పరీక్షను ఉదయం, సాయంత్రం నిర్వహించారు. ఈ రెండు పూటలకు కలిపి 33,500 మంది హాజరవ్వాల్సి ఉంది. అయితే, 30,280 (90.41%) మంది హాజరయ్యారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తొలిరోజు పరీక్ష  జరిగిందని ఈఏపీ సెట్‌ కో–కన్వీనర్‌ విజయకుమార్‌ రెడ్డి తెలిపారు. ఒక్క నిమిషం నిబంధన విధించినప్పటికీ విద్యార్థులకు ఇబ్బంది కలగలేదని వెల్లడించారు. వేసవి తీవ్రను దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించామని, అన్ని చోట్ల సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన సెట్‌ బుధవారం కూడా జరుగుతుంది.

ఫిజిక్స్‌ కాస్త టఫ్‌
ఈఏపీ సెట్‌లో ఫిజిక్స్‌ విభాగం నుంచి కఠిన ప్రశ్నలు వచ్చినట్టు విద్యార్థులు తెలిపారు. సిలబస్‌ నుంచే ఇచ్చినప్పటికీ సమాధానాలు డొంక తిరుగుడుగా ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి నీలేష్‌ తెలిపారు. కఠినమైన ఫిజిక్స్‌ చాప్టర్స్‌ నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయడానికి ఎక్కువ సమయం పట్టిందని, కొన్ని లెక్కలు వేయడం వల్ల ఇతర సబ్జెక్టులకు సమయం సరిపోలేదని వరంగల్‌కు చెందిన ప్రజ్ఞ చెప్పారు. 

కెమిస్ట్రీ పేపర్‌ మధ్యస్థంగా ఉన్నట్టు ఎక్కువ మంది విద్యార్థులు తెలిపారు. ఆర్గానిక్, ఇనార్గన్‌ చాప్టర్ల నుంచి కొంత ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వచ్చినా, ఇతర చాప్టర్లు తేలికగానే ఉన్నాయన్నారు. కాగా,  మూలకాల విశ్లేషణపై పట్టున్న విద్యార్థులకు కెమిస్ట్రీ తేలికగానే ఉంటుందని రసాయన శాస్త్ర నిపుణులు వినోద్‌ త్రిపాఠీ తెలిపారు. అయితే, ఆప్షన్స్‌లో సమాధానాలు ఒకదానితో ఒకటి పోలినట్టే ఉండటం వల్ల విద్యార్థులు సరైన ఆన్సర్‌ ఇవ్వడానికి కష్టపడాల్సి వచ్చిందని మరో రసాయన శాస్త్ర అధ్యాపకుడు బీరేందర్‌ వర్మ అభిప్రాయపడ్డారు. 

బాటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి ప్రిపేర్‌ అయిన ప్రశ్నలే వచ్చినట్టు మెజారిటీ విద్యార్థులు తెలిపారు. మొత్తం మీద జువాలజీ, బాటనీ సబ్జెక్టుల్లో ఎక్కువ స్కోర్‌ చేసే వీలుందని అధ్యాపకులు చెబుతున్నారు. గత ఐదేళ్ల ఎంసెట్‌ పేపర్లు ప్రిపరేషన్‌కు తీసుకుని ఉంటే ఎక్కువ మార్కులు సాధించే వీలుందని బాటనీ లెక్చరర్‌ శ్రుతి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement