ప్రయాగ్‌రాజ్/న్యూఢిల్లీ: 2006 నాటి నిఠారి వరుస హత్యల కేసులో నిందితులుగా మణీందర్ సింగ్ పంధేర్, పని మనిషి సురేంద్ర కోలీలకు అలహాబాద్ హైకోర్టు విముక్తి కల్పించింది. వారికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. నోయిడాలోని ఓ బంగ్లా వెనుక 8 మంది చిన్నారుల ఎముకలు కనిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఇద్దరూ కలిసి పలువురు బాలికలపై లైంగికదాడికి, దారుణ హత్యలకు పాల్పడటంతోపాటు నరమాంస భక్షకులుగా మారినట్లు కూడా ఆరోపణలొచ్చాయి.
అత్యాచారం, హత్య నేరాలకు పాల్పడిన వీరిద్దరికీ ఘజియాబాద్‌లోని సీబీఐ కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ పంధేర్, కోలీలు వేసిన పిటిషన్‌ను జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్‌హెచ్‌ఏ రిజ్విల ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎటువంటి సందేహాలకు తావు లేకుండా వీరిద్దరికీ వ్యతిరేకంగా కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు ధర్మాసనం పేర్కొంది.
అలహాబాద్ హైకోర్టు తాజా తీర్పుతో పంధేర్ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైందని ఆయన లాయర్ మనీషా భండారి చెప్పారు. అయితే, మరో కేసులో జీవిత ఖైదు శిక్షపడిన కోలీ మాత్రం జైలులోనే ఉంటాడని అన్నారు. తీర్పు ప్రతి అందాక తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.2007లో పంధేర్, కోలీలపై 19 కేసులు నమోదయ్యాయి. అయితే, సాక్ష్యాలు దొరకలేదంటూ మూడు కేసుల్లో మాత్రమే సీబీఐ అభియోగ పత్రాలు నమోదు చేయగలిగింది. మిగతా 16 కేసులకుగాను మూడు కేసుల నుంచి కోలీ బయటపడ్డాడు. ఒక కేసులో విధించిన మరణశిక్షను కోర్టు జీవిత ఖైదుగా మార్చింది.
కోలీకి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. తాజాగా అలహాబాద్ కోర్టు తీర్పుతో 12 కేసుల నుంచి అతడికి విముక్తి లభించింది. అదే సమయంలో, పంధేర్‌పై ఉన్న ఆరు కేసుల్లో, ఒకటి సీబీఐ వేసింది కాగా, మరో అయిదు బాధితుల కుటుంబాలవి. గతంలో సెషన్స్ కోర్టు అతడిపై ఉన్న మూడు కేసులను కొట్టివేసింది. మిగతా మూడింటిలో 2009లో ఒకటి, తాజాగా అలహాబాద్ కోర్టు తీర్పుతో రెండు కేసుల నుంచి పంధేర్ బయటపడినట్లయిందని అతడి లాయర్ చెప్పారు. కోలీ ఘజియాబాద్ కారాగారంలో, అతడి మాజీ యజమాని పంధేర్ నోయిడా జైల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment