
డీఆర్వోకు నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి ఫిర్యాదు
అనకాపల్లి: నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించిన నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్రపై చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్ బి.సుబ్బలక్ష్మి డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా.. మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా పనిచేశారని మండిపడ్డారు. ఈమేరకు సుబ్బలక్ష్మి పలువురు కౌన్సిలర్లతో కలిసి అనకాపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌వో సత్యనారాయణకు గురువారం ఫిర్యాదు చేశారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప దినాల్లో కౌన్సిల్ సమావేశం నిర్వహిచడం సరికాదన్న ఉద్దేశంతో డిసెంబర్ 31న జరగాల్సిన సమావేశాన్ని జనవరి 2కు వాయిదా వేస్తున్నట్లు కమిషనర్‌కు చెప్పానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన నిర్ణయం, డిప్యూటీ చైర్మన్ నిర్ణయాన్ని కాదని స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో కౌన్సిల్ సమావేశం నిర్వహించడం చట్ట విరుద్ధమని చెప్పారు.
ఆ సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దళిత మహిళనైన తనపై కమిషనర్ వివక్ష చూపుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని, మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోకుంటే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.
మున్సిపల్ కమిషనర్ పరిధి దాటి విధులు నిర్వర్తిస్తున్నారని, త్వరలోనే ఆయన అక్రమాలను బయటపెడతానని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న కమిషనర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నర్సీపట్నం పట్టణ అధ్యక్షుడు ఏకా శివ డిమాండ్ చేశారు.