పాములపాడు: ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ సిరిగిరి సురేంద్ర (24) అంత్యక్రియలు ముగిశాయి. దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో సురేంద్ర నాలుగేళ్ల క్రితం సైన్యంలో చేరారు. కశ్మీర్లోని బారాముల్లా ఆర్మీ బెటాలియన్ యూనిట్ నంబర్ 46లో విధులు నిర్వహిస్తూ జూలై 31న జరిగిన మిలిటెంట్ ఆపరేషన్‌లో వీర మరణం పొందారు. మృతదేహాన్ని మంగళవారం అర్ధరాత్రి నంద్యాల జిల్లా కృష్ణానగర్‌కు తీసుకువచ్చారు.
బుధవారం కృష్ణానగర్ గ్రామానికి నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, తహశీల్దార్ రత్నరాధిక, ఎంపీడీవో గోపీకృష్ణ చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్మీ అధికారులు భౌతికకాయంపై జాతీయ పతాకాన్ని కప్పి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ రామాంజనాయక్ ఆధ్వర్యంలో ఏఆర్ బృందం 3 సార్లు గాల్లోకి కాల్పులు జరపగా సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు.
సురేంద్ర కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్థర్ తెలిపారు. దేశం కోసం తమ చిన్న కుమారుడు సురేంద్ర ప్రాణాలు వదిలాడని, తమను పోషించాల్సిన బాధ్యత పెద్ద కుమారుడిపై ఉందని, అతడికి ఉద్యోగం కలి్పంచాలని తల్లిదండ్రులు సుబ్బయ్య, సుబ్బమ్మ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment