భట్టిప్రోలు: రాజస్తాన్‌లోని పాకిస్తాన్ బోర్డర్ జస్పల్‌మీర్ వద్ద విధి నిర్వహణలో మృతి చెందిన బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనకు చెందిన జవాన్ పురమా గోపరాజు (26)కు గురువారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. సోమవారం జస్పల్‌మీర్ వద్ద ప్రత్యేక కవాతు నిర్వహణలో భాగంగా రైఫ్లింగ్‌లో అకస్మాత్తుగా గోపరాజు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.
పార్థివదేహాన్ని బుధవారం సాయంత్రం స్వగ్రామమైన పల్లెకోనకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి మిలటరీ అధికారులు, గ్రామస్తులు సైనిక లాంఛనాలతో భట్టిప్రోలు స్మశానవాటికకు తరలించారు. రెండు సెంట్లస్థలాన్ని రెవెన్యూ అధికారులు అమరజవాన్‌కు స్థూపం కట్టేందుకు కేటాయించారు.
రాష్ట్ర సాంఘిక శాఖా మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున, బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో పాటు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ శేరు శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ బొల్లెద్దు రాజమ్మ ప్రతాప్ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. వీరి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి నాగార్జున, ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఆర్మీ జవాన్లు అమర జవాన్‌కు గౌరవ వందనం నిర్వహించిన అనంతరం 21 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment