ప్రత్యేక కోర్టుకు నివేదించిన సీబీఐ
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తయిందని ప్రత్యేక కోర్టుకు సీబీఐ నివేదించింది. ఈ మేరకు సోమవారం కోర్టుకు రాతపూర్వకంగా నివేదిస్తామని తెలిపింది. కొన్ని అంశాల్లో దర్యాప్తు పెండింగ్‌లో ఉందని గతంలో సీబీఐ చెప్పిందని, దీంతో దర్యాప్తు పూర్తయ్యే వరకూ అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలంటూ గతంలో నిందితులు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్లపై కోర్టు వాదనలు విని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
అయితే శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చిన సమయంలో నిందితుల తరఫు న్యాయవాదులు... కొన్ని పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో దర్యాప్తు పురోగతిని స్పష్టం చేయాలని న్యాయమూర్తి సీబీఐ తరఫున న్యాయవాది సురేంద్రను ప్రశ్నించారు. ఈ కేసులో అన్ని అంశాల్లో దర్యాప్తు పూర్తయ్యిందని సురేంద్ర నివేదించారు. వాన్‌పిక్ కేసు సహా ఇతర అంశాల్లో ఎలాంటి అనుబంధ చార్జిషీట్లూ దాఖలుచేయబోమని చెప్పారు. అయితే ఇదే విషయంతో మెమోను కోర్టులో దాఖలు చేయాలని సురేంద్రకు న్యాయమూర్తి సూచించారు.