పిఠాపురం: కౌజు పిట్టల పెంపకం చేపట్టి అభివృద్ధి బాటలో నడుస్తున్నాడు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు రామరాఘవపురానికి చెందిన దొడ్డి సురేంద్ర. వ్యవసాయ కుటుంబానికి చెందిన సురేంద్ర గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. కొంతకాలం చిన్నచిన్న ఉద్యోగాలు చేసాడు.
సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో కౌజు పిట్టల పెంపకం చేపట్టాడు. తక్కువ పెట్టుబడితో చిన్న కౌజు పిట్టల (క్వయిల్) ఫామ్ ప్రారంభించాడు. సొంత పొలంలోనే షెడ్లు వేసి 100 పిట్టల్ని పెంచడం ప్రారంభించాడు. రెండేళ్లలోనే ఆ ఫామ్ 10 వేల పిట్టల సామర్థ్యానికి పెరగ్గా.. మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.
ఐదారు వారాల్లోనే పెరుగుతాయి
భారతదేశంలో కౌజు పిట్టల పెంపకం, విక్రయం, వాటిని చంపడంపై నిషేధం ఉండటంతో జపాన్ నుంచి దిగుమతి చేసుకున్న కౌజు పిట్టల పెంపకం చేపడుతున్నారు రైతులు. ఒక కోడిని పెంచే స్థలంలో 8 కౌజు పిట్టలను పెంచవచ్చు. కొవ్వు తక్కువగా.. ప్రొటీన్లు, పోషకాలు ఎక్కువగా ఉండటంతో వీటిని తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు మాంసాహార ప్రియులు. ఐదు వారాల్లోనే ఇవి అమ్మకానికి సిద్ధమవడంతోపాటు గుడ్లు కూడా పెడతాయి. ఒక్కో కౌజు పిట్ట ఏడాదికి సుమారు 250 వరకు గుడ్లు పెడతాయి. వీటి మాంసం, గుడ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది.
తక్కువ పెట్టుబడితో ప్రారంభించాను
సొంతంగా వ్యాపారం చేయాలనేది నా కోరిక. నా స్నేహితుల ద్వారా కౌజు పిట్టల పెంపకం గురించి తెలుసుకుని మా పొలంలో చిన్న పాక వేసి వీటి పెంపకం ప్రారంభించాను. ఏడాదిలోనే వ్యాపారం పెరిగింది. నెలకు 10 వేల పిట్టల్ని అమ్మే విధంగా పెంపకం చేస్తున్నాను. కోరుకొండ నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి ఇక్కడ పెంచుతున్నాను. ఒకరోజు పిల్ల ఒక్కొక్కటి రూ.9కి దొరుకుతుంది.
ఒక్కొక్క పిల్ల పెంచడానికి రూ.20 వరకు ఖర్చవుతుంది. నెల రోజులు పెంచితే ఒక్కో పిట్ట రూ.45 నుంచి రూ.50 వరకు వస్తుంది. గుడ్లు పొదిగే యంత్రాలను కొనుగోలు చేసి సొంతంగా గుడ్లు కొని పిల్లల్ని ఇక్కడే తయారు చేయాలనుకుంటున్నాను. ఫంక్షన్లకు, డాబాలు, రెస్టారెంట్లకు వీటిని సరఫరా చేస్తున్నాం.
– దొడ్డి సురేంద్ర, కౌజు పిట్టల పెంపకందారు
డిమాండ్ బాగుంది
కౌజు పిట్టలకు డిమాండ్ బాగుంది. క్వయిల్ ఫామ్‌లు తక్కువగా ఉండటం వల్ల వీటికి డిమాండ్ ఎక్కువ ఉంది. వీటికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల పెద్దగా వైద్య అవసరాలు ఉండవు. మన వాతావరణంలో బాగా పెరుగుతాయి. కేవలం దాణా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
– డాక్టర్ హిమజ, పశు వైద్యాధికారి, గొల్లప్రోలు
Comments
Please login to add a commentAdd a comment