వలస పక్షులు | short stories | Sakshi
Sakshi News home page

వలస పక్షులు

Published Sun, Feb 12 2017 1:11 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

వలస పక్షులు

వలస పక్షులు

‘‘ఎల్లుండే గదా అమ్మోరి జోతులు వూర్లో మొదులు. ఈ ఎనిమిదొందలు ఎత్తుకోని పోయి గుర్రంకొండలో అమ్మోరికి మంచి చీర కొనుక్కురండి నువ్వూ, నీ పెళ్లాము. తొలిపూజ మనదే గదా’’ కొడుకు సురేంద్ర చేతిలో డబ్బుపెట్టి చెప్పినాడు నారప్ప.‘‘మింగేదానికి మెతుకులే, మీసాలకు వాసన నూనె రాసినడంట ఎవడో. అట్లా వుంది మీ నాయనా కొడుకుల యవ్వారం’’ అని గొణుక్కుంటూ ఆ డబ్బులను ట్రంకుపెట్టె అడుగున దాచింది సరోజ. సరోజ ఏదో గొణుక్కుంటూ మధ్యాన్నం సంగటి, శనక్కాయల పచ్చడి చేయడానికి వంటింట్లోకి దూరింది. రెండు గదులుండే ఆ పెంకుటింట్లోంచి లయబద్ధంగా మగ్గం చప్పుడు వినిపిస్తోంది, రెండు మగ్గాల్లోంచి.చిత్తూరు జిల్లా కలకడ దగ్గరుండే కోన గ్రామంలో వందకు పైగా చేనేత మగ్గాలున్నాయి. వాటిల్లో ఎక్కువగా నూరో నెంబరు లుంగీలు, నూలు చీరలు తయారౌతున్నాయి. గుడియాత్రం నుండి పది రోజులకొకసారి వచ్చే అరవ ఆసాములు లుంగీలకు పడుగు ఇచ్చి, తయారైన లుంగీలను చేనేత పనివాళ్ల నుండి తీసుకొని, వాళ్లకు కూలీలిచ్చి వెళ్లిపోతూ వుంటారు. నూలు చీరలు కొందరు సమీపంలోని మదనపల్లెకు తీసుకెళ్లి అమ్ముకొస్తూ వుంటారు.నూకల నారప్ప కుటుంబం అనాదిగా ఆ గ్రామంలోనే చేనేత వృత్తిలో జీవనం సాగిస్తూ వుంది.

తండ్రి వేసిన పూరి గుడిసెను తొలగించి నారప్ప అదే జాగాలో చిన్న పెంకుటింటిని కట్టించాడు. అతని భార్య లచ్చిందేవి కూడా ఇంట్లో నూలు వడకడం, కండెలు చుట్టడం చేసేది. వారి ఇద్దరి కొడుకుల్లో పెద్దవాడు హరి తిరుమలలో సెక్యూరిటీ గార్డుగా కాంట్రాక్ట్‌ ఉద్యోగం చేస్తూ భార్యా పిల్లలతో తిరుపతిలో వుంటున్నాడు. సురేంద్ర పదో తరగతితో చదువు చాలించి అనువంశిక వృత్తిౖయెన చేనేత పనిలో దిగాడు. కొడుకు ఒక రేకుల షెడ్డు వేయించి, అందులోనే మగ్గం ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలంగా లచ్చిందేవి ఆస్తమాతో మంచం పడ్తే, ఇంట్లో పనంతా సురేంద్ర భార్య సరోజే చేస్తూ వుంది. లచ్చిందేవి మందులకూ, ఇన్‌హేలర్లకూ చాలా ఖర్చవుతూ వుంది నారప్పకు. అది తలకు మించిన భారమే అతనికి.ప్రతి ఉగాదికి ఆ గ్రామంలోని చౌడేశ్వరి దేవాలయంలో మూడు రోజులపాటు ఘనంగా చౌడేశ్వరీ జ్యోతులు అనే వుత్సవాలు జరుగుతాయి. అనాదిగా నారçప్ప వంశమే అమ్మవారికి తొలిపూజ చేసి చీర, సారె సమర్పించడం జరుగుతూ వుంది. ఉత్సవాల్లో భాగంగా జంతు బలులు, ఆటపాటలు కోలాహలంగా మూడు రోజులూ సాగుతూ వుంటాయి. ఆ జ్యోతులకే నారప్ప కొడుక్కు డబ్బులిచ్చి అమ్మవారికి మంచి చీర కొనుక్కొని రమ్మని చెప్పాడు.


‘‘ఇద్దో నిన్నే, ఈ వూర్లో వుండి నువ్వెంత బండ చాకిరీ చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే. మనకి ఇద్దురూ ఆడపిలకాయలే. రేపు వాళ్ల పెళ్లిళ్లకూ, కట్నాలకూ డబ్బులు జమ చేయాలి గదా! ఈ వూళ్లో వాళ్ల సదువులు అరాకొరగా వుండాయి. మదనపల్లెలో పట్టు మగ్గాలనేసేవోళ్లకు దండిగా అడ్వాన్సులిచ్చి పన్లో పెట్టుకుంటారు గదా. మజూరీలు అక్కడ శానా వుంటాదంట. రమక్క చెప్పింది. నా మాటిని మదనపల్లికి ఎలబారి ఆడ పన్లో చేరు. పిలకాయలనూ కాన్వెంట్లో ఎయ్యచ్చు. వాళ్ల సదువులకూ బంగారానికీ దుడ్లు ఎగేసి బాంకిలో ఏసుకోవచ్చు’’ భర్త సురేంద్రను పోరసాగింది సరోజ.‘‘కరెక్టే. కానీ అమ్మా నాయనలను ఒంటిగా వొదిలి...’’ నసుగుతూ అన్నాడు సురేంద్ర సందేహంగా.‘‘నీ మొహం! మీ అమ్మిప్పుడు లేచి బాగా తిరగతా వుండాది గదా. వంట గూడా చేస్తా వుండాది. వారానికొకసారొచ్చి మీ అమ్మ నాయనలను చూసి రావచ్చు’’ నిష్ఠూరంగా చెప్పింది సరోజ.‘‘సరే సరే. మనూరి పిలకాయలు కొందురాడ మగ్గం నేస్తా వుండారు. వాళ్లను పని గురించి అడిగి చూస్తా’’ భార్యను సముదాయించాడు సురేంద్ర.


‘‘సొంతూరినీ, సొంతింటినీ వదిలి ఆ టౌన్లో ఏమవస్థలు పడతావు నాయనా, ఈడనే అమ్మ నాయన్ను సూసుకుంటూ వుండిపోగూడదా’’ బీడీ దమ్ములాగి పొగ వదులుతూ అన్నాడు రామయ్య. ఆయన సురేంద్రకు మేనమామ వరస, నారప్ప పక్క ఇంట్లోనే వున్నాడు.‘‘ఈడుంటే ఎప్పటికీ పైకి రాలేము. పిలకాయలకు కాన్వెంటు చదూలు అవసరం గదా ఈ కాలానికి. మదనపల్లెలో ఇస్కూళ్లు బాగా వుంటాయి. మజూరీలు బాగుంటాయి’’ అన్నాడు సురేంద్ర.నులక మంచం మీదున్న నారప్ప ఇబ్బందిగా కదిలాడు. అతనికి, అతని భార్యకూ కొడుకు పరాయి వూరుకు పోయి పనిలో చేరడం ఎంత మాత్రం ఇష్టం లేదు.‘‘అది కాదురా, ఈ వూర్లో జ్యోతులకు మనదే తొలిపూజ గదా. వూరు వదిలితే వొంతు తప్పిపోతుందేమో. రేపు నాకేమైనా ఐతే, నువ్వే గదా ఆ పూజ చెయ్యాల’’ అన్నాడు నారప్ప, దిగాలుగా.‘‘పూజదేముండాది! ఆ టైముకొస్తే సరిపోతుంది. అన్నేమైనా ఈ వూర్లోనే పడుండాడా? పిలకాయలను తిరపతి కాన్వెంట్లో చదివిచ్చుకుంటా హాయిగా టౌన్లో వున్నాడు. మొన్న జోతులకూ రాలేదు’’ అన్నాడు సురేంద్ర.
‘‘సరే నీ ఇష్టం’’ అన్నాడు నారప్ప నిర్వికారంగా.

సురేంద్ర స్నేహితుడు, అదే వూరివాడైన నాగరాజు రెండేండ్లుగా మదనపల్లెలో మునస్వామి అనే ఆసామి దగ్గర పనిచేస్తూ వున్నాడు. మదనపల్లె శివార్లలో వున్న నీరు గట్టువారిపల్లెలో మూడు వేలకు పైగా కార్మికులు పట్టు మగ్గాలు నేస్తూ జీవనం కొనసాగిస్తూ వున్నారు. మునస్వామికి నీరుగట్టు పల్లెలో రెండు మగ్గాల షెడ్లున్నాయి. ఒక్కో షెడ్లో పన్నెండేసి పట్టుమగ్గాలున్నాయి. ఒక్కో పటు చీర నేసినందుకు ఎనిమిది వందల మజూరీ! నెలలో పన్నెండు చీరల సాపునేసి సులభంగా పదివేల దాక సంపాదించవచ్చు. ఇంకొంచెం కష్టపడేవాళ్లకు అదనపు ఆదాయం లభిస్తుంది.నాగరాజు యజమానితో సురేంద్ర పనితనం గురించి చాల పొగిడి, ‘‘పిలకాయలుండేవాడు, లక్ష రూపాయలైనా అడ్వాన్సు ఇప్పించండి. మదనపల్లెలో సంసారం పెట్టుకొని బతకాల’’ అన్నాడు.మునస్వామి నవ్వి, ‘‘మగ్గాల యాపారం ఇప్పుడేడ గిట్టుబాటవుతావుందిరా? రేషం రేట్లు అదిరిపోతా వుండాయి. జరీ, సప్పురీ అన్ని రేట్లు కొండెక్కి కూచోనుండాయి. రంగులద్దేవోళ్లకు, అల్లు పట్టేదానికీ, అచ్చులతికేవోళ్లకు నెలనెలా ఖర్చులౌతా వుండాయి భారీగా. పట్టుచీరల రేట్లు ఏమీ పెరగడం లే. యాభై వేలకు మించి ఈలేను. ఇష్టమైతే చేరమను, లేకపోతే లే’’ అన్నాడు కటువుగా.

సురేంద్ర, నాగరాజు ప్రాధేయపడితే, మగ్గాల ఆసామి మునస్వామి బాండు రాయించుకొని సురేంద్రకు అడ్వాన్సిచ్చేదానికి ఒప్పుకున్నాడు.‘‘ఈ యబ్బి ఈడేంటుంటాడు? మా బిల్డింగ్‌లోనే వుండమను. ఒక రూమెట్లా నెల లాస్టులో కాళీ జేతా వుండాది’’ వక్కపొడి నములుతూ చెప్పా మునస్వామి. మునస్వామికి పన్నెండు చిన్న పోర్షన్లుండే ఒక మూడంతస్థుల భవనం ఉంది. ఒక గది, వంట గది వుండే, అగ్గిపెట్టెల్లాంటి పోర్షన్లున్నాయి అందులో. ఆ ఇరుకు ఇళ్లలోనే అతని వద్ద మగ్గాలు నేసే పనివాళ్లు వుంటుంటారు.పిచ్చుక గూడులాంటి ఆ ఇంటిని చూశాక తాము నలుగురం కష్టం మీద ఆ ఇంట్లో సర్దుకోవచ్చనుకున్నాడు సురేంద్ర. కానీ ఆ ఇంటి బాడుగ నెలకు మూడు వేలని విన్నాక అతని గుండె గుభేలుమంది.‘‘ఈ టౌన్లో ఇంతకన్నా తక్కువ బాడిక్కి నీకు ఇల్లు దొరికేది కట్టమే. ఇది దొరికిందే లక్కు. నా మాటిని చేరిపో’’ అన్నాడు నాగరాజు.ఆ ఇంటికి ఐదు నెలల అడ్వాన్సు పదహైదు వేలు పట్టుకొని సురేంద్ర పనిలో చేరాక, అతనికి ముప్పై ఐదు వేల అడ్వాన్సు ముట్ట చెప్పాడు మగ్గాల ఆసామి మునస్వామి. మంచి రోజు చూసుకొని భార్య, పిల్లలను పల్లె నుండి తీసుకొని వచ్చి ఆ ఇంట్లో దిగాడు సురేంద్ర.

తండ్రితో కలసి వున్నప్పుడు ఖర్చులు తెలిసి రాలేదు సురేంద్రకు. వేరు కాపురం అంటే అన్ని వస్తువులు కొనాల్సిందే గదా. ఏది లేకపోయినా జరగదు అని అతనికి కొద్దికాలానికే తెలిసొచ్చింది.గ్యాసు కనెక్షన్‌కు మూడు వేలు, టీవీకి ఐదు వేలు, కుర్చీలు, పాత్రలు, బీరువా, మంచం, పిల్లలకు కాన్వెంట్లో ఫీజులు అన్నీ కలిపి ఇరవై రెండు వేల దాకా టకటకా ఖర్చులైపోయినాయి. మిగిలిన పదమూడు వేలు బ్యాంకిలో అకౌంటు తెరిచి వేసినాడు. కానీ పాలూ, బియ్యము, సరుకులు, కరెంటు బిల్లు, డిష్‌ బిల్లు, పిల్లలకు పుస్తకాలు, రీచార్జి ఇలా నెల తిరిగేసరికి ఖర్చులు తడిసి మోపెడౌతూ వుంది.ప్రతి శనివారం షావుకారు ఆ వారం తాలూకు మజూరీ ఇస్తూ వుంటాడు. కానీ ఆ డబ్బు వెంట వెంటనే ఖర్చైపోతూ వుంది. బుధవారానికి చేతిలో ఏమీ మిగలని పరిస్థితి దాపురిస్తూ వుంది.పల్లెలో ఐతే పాలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు అన్నీ తక్కువ రేట్లకు వచ్చేవి. కానీ మదనపల్లె లాంటి పట్టణంలో వాటి రేట్లు అదిరిపోయేలా వున్నాయి.అన్నిటికన్నా తీవ్రమైన సమస్య నీటి కొరత. మున్సిపాలిటీ కొళాయిల్లో వుప్పు నీళ్లు రోజుకో గంటసేపు వస్తాయి. ఆ నీళ్లు తాగేందుకు పనికి రావు. మున్సిపల్‌ టాంకరు నాలుగు రోజులకొకసారి వస్తుంది. ఆ టాంకర్లో నీళ్లు పట్టుకోవడానికి స్త్రీ పురుషులు చాంతాడంత క్యూలో నిలబడి, గంటసేపు కాచుకుంటే నాలుగు బిందెలు పట్టుకొనే అవకాశం వస్తుంది. ఆ నీళ్లు పొదుపుగా వాడుకోవాలి. లేకపోతే నీళ్ల కాన్లు కొనుక్కు రావలసి వుంటుంది. తాగేందుకు, స్నానానికీ అన్నిటికీ నీళ్లు రేషనే.సురేంద్ర పిల్లలిద్దరూ కొత్తగా చేరిన ఇంగ్లిషు మీడియంలో చదువులు అర్థంకాక అవస్థలు పడుతూ వుంటే, వాళ్లకు స్కూల్లోనే ట్యూషను పెట్టించాడు. అందుకు నెలకు మరొక నాలుగు వందలు అదనపు భారం అతనికి నెత్తిన పడింది.

రెండు జకార్డులున్న పట్టు మగ్గం నేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. చేతులతో వాటు వేసి వేసి, కాళ్లతో అణగతొక్కి సాయంత్రమయ్యేసరికి సురేంద్ర చేతులు, కాళ్లు విపరీతంగా లాగుతూ వుండేవి.ఆ శనివారం కూలీ డబ్బులు తీసుకున్నాక సురేంద్ర టీకొట్టు బెంచీపై అలసటగా కూర్చుని వుంటే నవ్వుతూ అతడి దగ్గరకు వచ్చాడు నాగరాజు.‘‘ఏందినా, అట్లా డల్‌గా కనిపిస్తా వుండావు. ఒంట్లో బాగాలేదా?’’ అన్నాడు నాగరాజు.‘‘ఒకటే కాళ్లు నొప్పి. అదీ కాకుండా, ఈ వారం కర్సులు తలుసుకుంటే గుండె ఢాం అంటా వుండాది’’ అని దిగులుగా చెప్పినాడు సురేంద్ర.‘‘కాళ్లనొప్పులు టీ తాగితే తగ్గుతాయా? దానికి మందు వేరే వుండాది’’అని సురేంద్ర వద్దంటున్నా వినకుండా అతణ్ని బ్రాందీ షాపుకు తీసుకుని పోయాడు నాగరాజు.‘‘డబ్బులు నేనే ఇస్తా, నువ్వేమీ ఇయ్యద్దులే’’ అని బలవంతంగా మందు తాగిపించాడు. తాగాక ఇద్దరూ ముంతాజ్‌ హోటల్‌కు పోయి బిరియాని తిన్నారు. దాని బిల్లు నాగరాజే ఇచ్చినాడు.ఒంట్లో మద్యం పడితే కాళ్లనొప్పులు తగ్గి, కొంచెం హుషారుగా అనిపించింది సురేంద్రకు. కానీ అతడినా స్థితిలో చూసి అతడి భార్య ముఖం తిప్పుకుంది.ఆ తరువాత రెండు, మూడు రోజులకొకసారి నాగరాజు, మిగిలిన సావాసగాళ్లతో కలసి తాగడం అలవాటు చేసుకున్నాడు సురేంద్ర. దానివల్ల అక్కడా ఇక్కడా అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులు తీర్చడానికి ఆదివారాలు, అమావాస్యల్లో కూడా మగ్గం పని చేస్తూ వున్నాడు.

కానీ ఆ అదనపు ఆదాయం కూడా ఏమీ చాలడం లేదు, అతని ఖర్చులు, విలాసాలకి.సరోజ ఇంటి పని, పిల్లల పనితో అలసిపోయి, సురేంద్ర ఇంటికి చేరేసరికి నిద్రపోతూ వుండేది కొన్నిసార్లు. పైగా భర్త కొత్తగా నేర్చుకున్న తాగుడు అలవాటును అసహ్యించుకుని అతడిని దగ్గరకు రానివ్వడం లేదామె. ఆమె ఎంత చెప్పినా సురేంద్రలో మార్పు రావడం లేదు. పడ్డ కష్టాన్ని మర్చిపోవాలంటే తాగుడొక్కటే మార్గం అని చాలామంది నేతగాళ్లు అనుకున్నట్లే అతనూ అనుకుంటున్నాడు. అతని వూరివాళ్లు ఒకరిద్దరు హితబోధ చెయ్యపోయినా వినిపించుకోలేదు.ఒకరోజు తాగుతూ మాట్లాడుతున్నప్పుడు భార్య తనను దగ్గరకు రానివ్వని విషయం నాగరాజుతో వాపోయాడు సురేంద్ర. నాగరాజు నవ్వి, ‘‘ఇంట్లో భోజనం దొరక్కపోతే, హోటల్లో భోం చేయమా? నాతో రా’’ అని తనతో టౌను శివార్లలో వున్న ఒక ప్రాంతానికి, సురేంద్రను తీసుకొని వెళ్లాడు నాగరాజు. అక్కడ ఓ పాత ఇంట్లో చాలామంది ఆడవాళ్లున్నారు. జిగేల్‌మనే చీర కట్టుకుని పాన్‌ పరాగ్‌ పరాగ్గా నములుతున్న ఒక నడి వయసు మహిళ నాగరాజుతో నవ్వుతూ బాగా పరిచయమున్నట్లు మాట్లాడింది. ఇంట్లో దొరకని సుఖం అక్కడ వెతుక్కున్నాడు సురేంద్ర. తరువాత తరచూ అక్కడకు వెళ్లేవాడు. ఇంట్లో దొరకని సుఖం బయట కొనుక్కుంటున్నానని అనుకున్నాడు గానీ ఆ సుఖమే తన ఒళ్లు గుల్ల చేస్తుందని తెలుసుకోలేకపోయాడు సురేంద్ర.

‘‘నీకసలు బుద్ధుందా? నీకు సిఫిలిస్‌ సోకింది. ఇట్లానే వదిలేస్తే ఎయిడ్స్‌ కూడా అంటుకుంటుంది. ఇంట్లో లక్షణమైన భార్యను పెట్టుకొని అడ్డమైన తిరుగుళ్లు తిరగడానికి నీకిదేం మాయరోగం?’’ డాక్టరు అడ్డమైన చీవాట్లు పెట్టాడు సురేంద్రను.సురేంద్ర తలవంచుకుని వింటున్నాడు. అంతకు కొన్ని రోజుల ముందే తరచూ వాంతులౌతూ వుంటే ఇంకొక డాక్టరు దగ్గరకు వెళ్లాడతను. ఆ డాక్టరు కొన్ని టెస్టులు రాసిచ్చి, అవి చేసుకొని రిపోర్ట్స్‌ తెమ్మన్నారు. తెచ్చాక వాటిని చూసి సురేంద్ర లివర్‌ బాగా పాడైందని, కొన్ని మందులు రాసిచ్చి, తాగుడు పూర్తిగా మానకపోతే సురేంద్రకు చావు తథ్యమని జోస్యం చెప్పాడు. దాంతో సురేంద్ర బ్రాందీ షాపుకు వెళ్లడం పూర్తిగా మానుకొన్నాడు. ఐనా ఆసరికే అతని ఒళ్లు చాలా పాడైంది.హాస్పిటల్‌ ఖర్చులు, టెస్టులు, మందులకు విపరీతంగా ఖర్చు అవుతూ వుంది. బ్యాంకులో వున్న కొద్దిపాటి బాలెన్సు, సరోజ మిగిల్చిన డబ్బూ ఇట్టే ఖర్చు అయిపోయింది. పిలకాయల స్కూలు ఫీజులు, పుస్తకాలు, ఇంటి బాడుగ అన్నీ కట్టాల్సి వుంది. సురేంద్రకేం చేయాలో పాలుపోలేదు. అప్పుకోసం షావుకారు దగ్గరకు వెళ్లాడు.

‘‘ఇట్టా తాగుడికి, తందనాలకి కర్సులు ఎడాపెడా పెట్టేస్తా వుంటే ఒళ్లే కాదు, ఇల్లు కూడా గుల్ల ఔతాది. ఎవడువాయ్‌ నిన్ను తాగి తలెత్తుకోమనింది?నువ్వే కాదు, ఈ మదనపల్లికొచ్చి చేరే మగ్గమోళ్లు శానా మంది ఇట్టానే సెడిపోతా వుండారు. కూలీలెక్కవని ఈడికి ఏడేడ నుండో వచ్చి సేరతా వుండారు. నాలుగు డబ్బులు చేతిలో పడే కొందికి అన్ని అలవాట్లు ఐతాయి. సంసారం సంకనాకి పోతుంది. రేషం రేట్లు సూస్తే కళ్లు తిరగతావుండాయి. జరీ, సప్పురీ, కలర్‌ ఫాక్రీ, అచ్చులు, పన్నీలు, డోళ్లు అన్నీ కర్సులే. యాపారం అంతంతగానే వుండాది. నీకేమీ ఈలేను. నువ్వు పని నిలిపేయాలనుకుంటే నిలిపేయచ్చు. కానీ నా కాడ తీసుకున్న అడవాన్సు యాభై వేలు నాకిచ్చి పో. వడ్డీ కూడా నిన్ను అడగడం లే’’ కఠినంగా చెప్పాడు మునస్వామి. సురేంద్రకు ఏమీ పాలుపోలేదు.

‘‘మీ అమ్మకి మళ్లీ ఆస్తమా తిరగబెట్టింది. మీ నాయన కూడా గసతోనే మంచం పట్టినాడు. పోయినతూరి మీ నాయన జోతులపుడు తొలిపూజ చేసినాడు. ఈసారి కడప మాను మోసి తొలిపూజ సేయలేడు. మంచం మీద మడిసి ఏం పూజ చేస్తాడు? నువ్వు మళ్లీ వూరు రావలసిందే’’ అన్నాడు రామయ్య మామ. మదనపల్లెలో వున్న కూతురు, ఇంటికి చుట్టపు చూపుగా వచ్చి, సురేంద్రను చూడ్డానికి వచ్చారాయన.సురేంద్ర ఏమీ మాట్లాడలేదు. సరోజ కూడా మౌనం వహించింది. రామయ్య మామ గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే సురేంద్ర లివర్‌ పాడై మంచం పట్టిన విషయం చెప్పింది సరోజ.‘‘సొంతూళ్లో కులం పని చేసుకోకుండా టౌనులో బాగా బతికేయచ్చని వలసలు పోతే ఇట్టనే జరగతాది. నేను మళ్లీ ఒక పెళ్లికి రెండు రోజుల్లో మదనపల్లి రావాల. మీ నాయనతో మాట్లాడి విషయం చెప్తాను’’ అన్నాడు రామయ్య మామ ముక్తసరిగా.

ఆ దంపతులిద్దరికీ ఏం చేయాలో తోచడం లేదు. ఒళ్లు పాడై సురేంద్ర కఠినమైన జకార్డు మగ్గం నేత నేయలేకుండా వున్నాడు. వూరికి తిరిగి వెళ్లాలంటే షావుకారు అప్పు, మిగిలిన బాకీలు తీర్చాలి. మందులకు, డాక్టర్లకు విపరీతంగా ఖర్చు అవుతావుంది. ఎట్ల లేదన్నా లక్షా లక్షన్నర చేతిలో పడితే గాని గట్టెక్కలేని గడ్డు పరిస్థితి! అన్నట్లుగానే రామయ్య మామ మూడు రోజుల్లో మళ్లీ వాళ్లింటికి వచ్చాడు. సరోజ ఆయనకు కాఫీ ఇచ్చి మర్యాద చేసింది.‘‘మీ నాయనతో మాట్లాడినా. మీ అమ్మకి పసుపు కుంకాల కింద వాళ్ల పెళ్లప్పుడు రెండెకరాలు మీ తాత ఇచ్చినాడంట. ఆ భూమిని మీ మామ సాగు చేస్తా వున్నేడిన్ని దినాలు. మీ వోళ్లకు దాంట్లో నించి ఏమీ ఇచ్చింది లే. ఇప్పుడు మీ మామ పిలకాయలు బాగా సదుకోని మంచి పొజిషన్ల వున్నారంట. ఆ భూమితో వాళ్లకు పన్లే. ఆ మడి అమ్మేసి మీ అప్పులు తీరుస్తామని చెప్పినాడు, మీ నాయన. నేనిప్పటికి ఒక డెబ్భై వేలు సర్దుబాటు సేస్తా వుండా. నీ అప్పులు తీర్చేసి ఇల్లు ఖాళీ చేసి పల్లెకొచ్చేయి. నీ జబ్బు గురించి మీ అమ్మ దిగులు పడతా వుండాది’’ అన్నాడు రెడ్డప్ప.సురేంద్ర ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. సరోజకి ఒళ్లు తెలీరాలేదు.వలస పక్షులు ఇంటి దారి పట్టినట్లు, మరో రెండు వారాల్లో వాళ్లు పట్నం కాపురానికి స్వస్తి పలికి, స్వగ్రామం చేరుకున్నారు.l

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement