కుప్వారాలో అప్రమత్తంగా భద్రతాబలగాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బుధవారం ఐదుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగంలో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌వోజీ)కు చెందిన మొహమ్మద్ యూసుఫ్, దీపక్ పండిట్‌లతో పాటు ఆర్మీలోని 160వ బెటాలియన్‌కు చెందిన మొహమ్మద్ అష్రఫ్, నాయక్ రంజిత్ సింగ్, మరో జవాన్ ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయినట్లు ఆ రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాలతో పాటు పారా కమెండోలు కూడా పాల్గొన్నారన్నారు. బుధవారం రాత్రివరకూ సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల్ని హతమార్చామనీ, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
మృతులంతా విదేశీయులేనని ఆయన స్పష్టం చేశారు. ఘటనాస్థలం నుంచి ఏకే–47 తుపాకులతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నియంత్రణ రేఖ(ఎల్వోసీ) దాటి కుప్వారాలోని హల్మత్‌పొరా ప్రాంతానికి మంగళవారం చేరుకున్న ఉగ్రవాదులు అక్కడ మద్దతుదారులతో కలసి విందులో పాల్గొన్నారన్నారు. అనంతరం వీరు కుప్వారా పట్టణానికి బయలుదేరుతుండగా పోలీస్ గస్తీ బృందం ఎదురుపడిందన్నారు. దీంతో ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారని వెల్లడించారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరుపుతూ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment