
వాషింగ్టన్ : పాకిస్తాన్‌కు అందిస్తున్న భారీ సైనిక సాయాన్ని నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్ధించారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్తాన్ చేసిందేమీలేదని దుయ్యబట్టారు. పాక్ ప్రభుత్వం తమ భూభాగంలో అల్‌ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ నివసించేందుకు సహకరించిందని ట్రంప్ ఆరోపించారు. పాక్‌లో లాడెన్ తలదాచుకున్న నివాసం ఎలాంటిదో మీకు తెలుసని ఫాక్స్ న్యూస్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
2011లో అమెరికన్ నావల్ స్పెషల్ వార్‌ఫేర్ దళాలు 2011లో హెలికాఫ్టర్ దాడుల్లో లాడెన్ నివాసాన్ని చుట్టుముట్టి ఆయనను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్‌లో సైనిక అకాడమీ పక్కనే లాడెన్ నివసించారన్నది పాక్‌లో ప్రతిఒక్కరికీ తెలుసన్నారు. పాకిస్తాన్‌కు తాము ఏటా వందల కోట్ల డాలర్ల నిధులు ఇచ్చామని, అయినా పాక్ అమెరికాకు ఎంతమాత్రం సహకరించకుండా లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిందని మండిపడ్డారు.
పాక్ దుశ్చర్యలతో ఆ దేశానికి సైనిక సాయం నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. గత ఏడాది ఆగస్ట్‌లో ట్రంప్ దక్షిణాసియా విధానం వెల్లడించిన అనంతరం అమెరికా, పాక్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment