మేక్రాన్‌తో జెలెన్‌స్కీ
బ్రస్సెల్స్: రష్యాను ఎదుర్కొనేందుకు తమకు మరింత సైనిక సాయం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొమిదిర్ జెలెన్‌స్కీ కోరారు. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కలిసి యూరప్ బద్దవ్యతిరేకి అయిన రష్యాతో తలపడుతున్నాయని చెప్పారు. గురువారం ఆయన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని ఈయూ పార్లమెంట్‌నుద్దేశించి ప్రసంగించారు. ‘మనం కలిసి ఉన్నంత కాలం, మన యూరప్‌ను కాపాడుకున్నంత కాలం, మన యూరప్ జీవన విధానాన్ని పరిరక్షించుకున్నంత కాలం యూరప్ యూరప్‌గానే నిలిచి ఉంటుంది’అని జెలెన్‌స్కీ చెప్పారు.
యూరప్ జీవన విధానాన్ని నాశనం చేయాలని రష్యా కోరుకుంటోంది. కానీ, మనం అలా జరగనివ్వరాదు’అని చెప్పారు. అంతకుముందు ఈయూ ప్రతినిధులు ఆయనకు పార్లమెంట్ భవనంలోకి ఘనంగా స్వాగతం పలికారు. ప్రసంగం పూర్తయిన అనంతరం, ప్రొటోకాల్ ప్రకారం ఉక్రెయిన్ జాతీయ గీతం, యూరోపియన్ గీతం వినిపించారు. ఆ సమయంలో జెలెన్‌స్కీ ఈయూ జెండాను చేబూనారు. అనంతరం యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు రొబెర్టా మెట్సోలా మాట్లాడుతూ.. లాంగ్ రేంజ్ క్షిపణి వ్యవస్థలను, యుద్ధవిమానాలను సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్‌కు అందించే విషయం పరిశీలించాలని సభ్య దేశాలను కోరారు.
ఉక్రెయిన్‌కు రష్యాతో ఉన్న ముప్పునకు తగ్గట్లే చర్యలుండాలని సూచించారు. ఇది ఉక్రెయిన్ అస్తిత్వానికి సంబంధించిన విషయమన్నారు. ఈనెల 24వ తేదీతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి ఏడాదవుతోంది. ఈ సందర్భంగా దాడులను మరో విడత తీవ్రతరం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అదనపు సైనిక సాయం కోసం జెలెన్‌స్కీ మిత్ర దేశాల్లో పర్యటనలు చేస్తున్నారు. అంతకుముందు ఫ్రాన్సు పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు మేక్రాన్ ఆయన్ను లీజియన్ ఆఫ్ హానర్‌తో సన్మానించారు. బ్రస్సెల్స్‌లో ఈయూకు చెందిన 27 దేశాల నేతలతో జెలెన్‌స్కీ సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment