
బెర్లిన్: ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు, విమాన విధ్వంసక వ్యవస్థలు, మందుగుండు సామగ్రి సహా సుమారు రూ.24 వేల కోట్ల విలువైన అదనపు సైనిక సాయం అందించాలని జర్మనీ నిర్ణయించింది. ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో తాము నిజాయితీతో ఉన్నామని రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ తెలిపారు.
రష్యాతో యుద్ధం మొదలయ్యాక మొట్ట మొదటిసారిగా జెలెన్‌స్కీ ఆదివారం జర్మనీకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే జర్మనీ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం. రష్యా ఇంధనంపై ఆధారపడిన జర్మనీని ఉక్రెయిన్ మొదటి నుంచి అనుమానిస్తోంది. అయితే, ఎంజెలా మెర్కెల్ స్థానంలో ఒలాఫ్ షోల్జ్ చాన్సెలర్‌గా బాధ్యతలు చేపట్టాక ఉక్రెయిన్–జర్మనీల మధ్య సంబంధాలు బలపడుతూ వస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు.