కీవ్‌లో జెలెన్‌స్కీతో షోల్జ్, మక్రాన్
కీవ్: ఉక్రెయిన్‌కు బాసటగా నిలుస్తామని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, రొమేనియా అధినేతలు మరోసారి స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ వెంటే ఉంటామని ఉద్ఘాటించారు. వారు గురువారం అనూహ్యంగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈయూలో చేరాలన్న ఉక్రెయిన్‌కు ఆకాంక్షకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ ఉజ్వల భవిష్యత్తు కోసం తాము చేయాల్సిందంతా చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ హామీ ఇచ్చారు. నాలుగు దేశాల అధినేతలు తొలుత రైల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకున్నారు. శివారులోని ఇర్పిన్‌లో పర్యటించారు.
రష్యా దాడుల్లో ఇర్పిన్‌లో జరిగిన విధ్వంసాన్ని చూసి చలించిపోయారు. రష్యా రాక్షసకాండను ఎవరూ మర్చిపోలేరని జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి యూరప్ దేశాలు సాయం అందిస్తాయని ఇటలీ అధినేత మారియో డ్రాఘీ చెప్పారు. ఈ మానవీయ విషాదాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదని రొమేనియా అధ్యక్షుడు క్లౌస్ ఐయోహన్నిస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కీవ్‌లో నేతలు హోటల్లో ఉండగా బయట ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించడం గమనార్హం. వారి పర్యటనతో నైతిక స్థైర్యం పెరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు.
యుద్ధక్షేత్రం సెవెరోడొనెట్‌స్క్
డోన్బాస్‌లోని సెవెరోడొనెట్స్‌క్ సిటీ వద్ద భీకర పోరు సాగుతోంది. నగరాన్ని 90 శాతం రష్యా సేనలు ఆక్రమించాయి. అజోట్ కెమికల్ ప్లాంట్‌లో 500 మంది పౌరులు, ఉక్రెయిన్ సైనికులు తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి అందుతున్న ఆయుధాలు, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం దాడులు సాగిస్తోంది. మరోవైపు పశ్చిమ లెవివ్‌లో జొలోచివ్ శివారులో నాటో దేశాలు సరఫరా చేసిన ఆయుధాల డిపోను లాంగ్–రేంజ్ క్షిపణులతో ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ ప్రకటించారు.
రెండేళ్ల దాకా ఉక్రెయిన్ ఉంటుందా?
కేవలం ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకోవడమే తమ లక్ష్యం కాదని, ఒకదేశంగా ఉక్రెయిన్‌ను పూర్తిగా తెరమరుగు చేయాలన్నదే అసలు ఉద్దేశమని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ చెప్పారు. పశ్చిమ దేశాల నుంచి సహజ వాయువు కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలని ఉక్రెయిన్ కోరుకోవడం, రెండేళ్లలో డబ్బు చెల్లించాలని భావిస్తుండడంపై మెద్వెదేవ్ స్పందించారు. రెండేళ్లలో ప్రపంచ పటంపై ఉక్రెయిన్ ఉంటుందని ఎవరు చెప్పగలరని ప్రశ్నించారు.
మరిన్ని ఆయుధాలు: నాటో
ఉక్రెయిన్‌కు సైనిక సాయం విషయంలో రష్యా హెచ్చరికలను నాటో దేశాలు లెక్కచేయడం లేదు. మరిన్ని లాంగ్–రేంజ్ ఆయుధాలు అందజేస్తామని తాజాగా ప్రకటించాయి. అదనంగా బిలియన్ డాలర్ల సైనిక సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అదనపు సాయానికి జర్మనీ కూడా అంగీకారం తెలిపింది. యుద్ధ రంగంలో తమ సేనలు వీరోచితంగా పోరాడుతున్నాయని జెలెన్‌స్కీ ప్రశంసించారు. 112 రోజులుగా సాగుతున్న యుద్ధంలో శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంటున్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment