పాకిస్తాన్‌కు అమెరికా ఝలక్
వాషింగ్టన్: ఉగ్రవాదంపై పోరు కోసం పాకిస్తాన్‌కు అందిస్తున్న నిధుల్లో కోత విధించాలని ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. సంకీర్ణ కూటమి నిధుల్లో(సీఎస్‌ఎఫ్) 100 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.645 కోట్లు) మేర కోత విధించాలని నిర్ణయించింది. తదుపరి ఆర్థిక సంవత్సరం 900 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.5,800 కోట్లు)కు బదులు 800 మిలియన్ డాలర్ల(దాదాపు 5,160 కోట్లు)ను మాత్రమే ఇవ్వాలని బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఉగ్రవాదంపై పోరాడే మిత్రపక్ష దేశాలకు అమెరికా ప్రభుత్వం కొన్నేళ్లుగా సాయమందిస్తూ వస్తోంది. అలా అమెరికా నుంచి సాయం పొందుతున్న దేశాల్లో పాక్ ముందు వరుసలో ఉంది.
2002 నుంచి ఇప్పటివరకూ పాక్‌కు అమెరికా 14 బిలియన్ డాలర్లు(రూ.90 లక్షల కోట్లు) అందజేసింది. అయితే గత రెండు సంవత్సరాల్లో యూఎస్ కాంగ్రెస్ ఈ నిధులపై పలు ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో పలు దేశాలకు అందిస్తున్న సాయంలో ట్రంప్ సర్కార్ కోత విధిస్తోంది. కాగా, అమెరికా రక్షణ విభాగ ప్రతినిధి(పాక్, అప్ఘానిస్తాన్, మధ్య ఆసియా) ఆడమ్ స్టంప్ మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గానూ పాక్‌కు సీఎస్‌ఎఫ్ నిధి కింద 800 మిలియన్ డాలర్లు అందించాలని ప్రతిపాదనలు రూపొందించినట్లు చెప్పారు.